Monday, June 21, 2010

నిజమైన అక్షరాస్యతా ఉద్యమం

http://www.kidsone.in/telugu/images/alphabet-learning/letters.pngఅన్ని రంగాల్లో అభివృద్ధి సాదిస్తున్నామనుకున్నా మన దేశం అక్షరాస్యత విషయంలో ఇంకా వెనుకబడే వుంది. స్వాతంత్ర్యం వచ్చిన దగ్గరనుంచి ఎన్నో రకాల పథకాలు మన ప్రభుత్వాలు రూపొందించాయి. కొంత కాలం క్రితం వరకూ  ప్రజల నుంచి కూడా ఈ విషయంలో స్పందన బాగానే ఉండేది. ఇన్ని పథకాలు అమలులోవున్నా, ప్రజల భాగస్వామ్యం వున్నా స్వాతంత్ర్యం వచ్చిన 63 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా అక్షరాస్యత పూర్తి స్థాయిలో లేకపోవడం శోచనీయం.  దీనికి కారణం పథకాల అమలులో ప్రభుత్వానికి, అధికారులకు చిత్తశుద్ధి లోపించడం. ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహం లేకపోవడం ప్రజల ఉదాశీనతకు కారణమై ఉండవచ్చు. అయితే స్వాతంత్ర్యం వచ్చిన తొలి దశకంలో గాంధీజీ బోధనల ప్రభావం ఎక్కువగా వున్న రోజుల్లో ఇదొక ఉద్యమంగా రూపుదిద్దుకుంది. గాంధీజీ ఎంతమందినో ఈ ఉద్యమంలో భాగస్వాముల్ని చేశారు. ముఖ్యంగా విదేశీయులెందరో ఈ ఉద్యమాన్ని చేపట్టి మన దేశంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టి చాలామందిని అక్షరాస్యుల్ని చేశారు. దీనికో ఉదాహరణ........

1952 ప్రాంతంలో వెల్త్ ఫిషర్ అనే అమెరికన్ మహిళ తన భర్త మరణం తర్వాత మన దేశానికి వచ్చింది. అంతకుముందు ఏదో సందర్భంలో గాంధీజీ ఆవిడ సేవా దృక్పథాన్ని గమనించి ఆమెతో  " మీరు గనుక భారత దేశానికి వస్తే పల్లెల్లో మీ సేవా కార్యక్రమాలు కొనసాగించవచ్చు "  అన్నారు. ఆ స్పూర్తితో ఆమె 73 సంవత్సరాల వయసులో మన దేశానికి వచ్చింది. ఆ వయసులో అలహాబాద్ విశ్వవిద్యాలయానికి చెందిన మరో 43 మంది విద్యార్థులతో కలిసి సైకిల్ మీద గ్రామాలకు వెళ్ళేది. తమతో కూడా చిన్న చిన్న పెట్టెల్లో కొన్ని పుస్తకాలు, పలకలు, బలపాలు, బ్లాకు బోర్డులు, కిరోసిన్ దీపాలు వగైరా తీసుకెళ్ళేవారు. గ్రామాల్లోని ప్రజలకు విద్య యొక్క ఆవశ్యకతను బోధించేవారు. వాళ్లకు ఇదేమీ అర్థం కాక ఆమెను అనుమానంగా చూసేవారు. హిందీలో మాట్లాడి వాళ్ళలో తనపైన నమ్మకాన్ని పెంచి ఆకట్టుకునేది. వారు ప్రధానంగా 14 నుండి 40 సంవత్సరాల వయసు వారికి విద్యాబోధన చేసేవారు. తమ పేరు తాము రాసుకోవడం ఆ నిరక్షరాస్యులను ఫిషర్ బోధనల పట్ల ఆకర్షితులను చేసేది. ఫలితంగా అనేకమంది విద్యావంతులుగా మారారు. ఒక జీపులో గ్రంధాలయాన్ని ఏర్పాటు చేసి కొంతమంది ఔత్సాహికులైన ఉపాధ్యాయులతో కలసి వారానికి సుమారు 150 గ్రామాల్లో తిరుగుతూ సుమారు 15 సంవత్సరాలు  అక్షరాస్యతా ఉద్యమం కొనసాగించింది.  ప్రపంచంలో అంత లేటు వయసులో అక్షరాస్యతా ఉద్యమాన్ని చేపట్టిన తొలి మహిళ వెల్త్ ఫిషర్ అని చెప్పుకోవచ్చేమో !

సంకల్పం వుంటే సాధించలేనిది ఏమీ ఉండదని నిరూపించిన వ్యక్తి ఫిషర్. దురదృష్టవశాతూ దేశవ్యాప్తంగా ఈ విషయానికి విస్తృతంగా ప్రచారం జరుగలేదు. జరిగుంటే ఆమె పేరు కూడా ప్రముఖ వ్యక్తుల జాబితాలో చోటు చేసుకునేదేమో ! ఆమె కార్యక్రమాలనుంచి కొంతమందైనా స్పూర్తి పొందేవారేమో ! ! 


Vol. No. 01   Pub. No. 328

2 comments:

  1. ramnarsimha గారు, నాకు గాంధీ గారు నడిపిన అక్షరాస్యత మూవ్మెంట్ వివరాలు "మరువం" బ్లాగులో ఇవ్వగలరా? ఇక్కడే ఇచ్చినా సరే. నా తెలుగుబడి పిల్లలతో పోయిన వారమ్ నుంచే గాంధీ [తాత] గారి మీద అధ్యయనం మొదలుపెట్టాను, అప్పుడే కాస్త అర్థం అయింది, నేను కాస్త కాస్త మరపు నేస్తానికి తోడవుతున్నానని. మామాలుగా ఇద్దరం శత్రువులమే గాని.

    SRRao గారు, ఈ వివరాలకి థాంక్స్. మీరిచ్చే క్విజ్ లకి సమాధానాలు లేక జవాబులు రాయను..:)

    ReplyDelete
  2. * రామనరసింహ గారూ !
    ధన్యవాదాలు. వెల్త్ ఫిషర్ కి కూడా గాంధీజీయే స్పూర్తి.

    * ఉష గారూ !
    ధన్యవాదాలు. నా బ్లాగులో క్విజ్ లు తక్కువేనండీ ! మిగిలిన అంశాలు చాలా రాస్తున్నాను. ఏమైనా నా బ్లాగు దర్శిస్తున్నందుకు ధన్యవాదాలు.

    ReplyDelete