Saturday, June 12, 2010

'ఆటా'డిస్తా !

ఈ రోజు రియాల్టీ షోల మీద మానవ హక్కుల కమిషన్ తీర్పు వచ్చింది. సహజంగానే విస్తృతంగా, వాడిగా, వేడిగా చర్చలు జరుగుతున్నాయి. ప్రజా సంఘాల వారు హర్షం వ్యక్తం చేస్తుంటే, ఆ షోలలో పాల్గొనే పిల్లల తల్లితండ్రులు, పిల్లలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాదు చేయిస్తున్నారు. దీనికి కూడా తెరవెనుక దర్శకత్వం స్పష్టంగా కనిపిస్తోంది. దీనికంతటికీ వీళ్ళందర్నీ 'ఆటా' డిస్తున్నది ' డబ్బే ' ! ఎవరు అవునన్నా కాదన్నా ఇది నిజం.

ఈ రోజు ఒక ఛానల్లో జరుగుతున్న చర్చల్లో  పెద్దలతో వాదిస్తున్న ఒక బాలుడి వాదన వెనుక స్క్రిప్ట్, దర్శకత్వం ఎవరివో తెలుసుకోలేనంత అజ్ఞానంలో ప్రేక్షకులు లేరనుకుంటాను. కాకపోతే అందరిలోనూ సహజంగానే ఉండే ఉదాసీనత వలన కావలసినంత నిరసన రావడంలేదు. సరైన నిరసన వస్తే ఇలాంటి ' ఆట ' లు సాగవేమో ! ఇప్పుడు ఈ తీర్పు వచ్చాకా మనందరం కాసేపు ఆవేశపడిపోతున్నాం ! తర్వాత మన పనుల్లో మనం మునిగిపోతాం ! వాళ్లకి చట్టంలోనూ, న్యాయ వ్యవస్థలలోను, రాజ్యాంగంలోను వున్న లొసుగులు తెలుసు. లేదా తెలుసుకుంటారు. లొసుగులు లేకపోతే ఉన్నవాటికి వారికి అనుకూలమైన అర్థాలు అన్వయిస్తారు. పై కోర్ట్ లకి వెడతారు. లేదా డబ్బుతో బాధితుల్ని తమకి అనుకూలంగా తిప్పుకుంటారు.

దీనికి నిదర్శనం ఈ రోజు ఛానల్లో వాదించిన కుర్రవాడు నిర్వాహకుల్ని సమర్థించిన తీరు , మరో ఛానల్లో ఒక తల్లి వాదనలు వింటే అర్థమవుతోంది. డబ్బు కోసం మేం పిల్లల్ని హింసించడం లేదని వాదిస్తున్న ఆ తల్లికి, మిగిలిన తల్లిదండ్రులకి నాకు తెలిసిన విషయం ఒకటి చెబుతాను. రెండు సంవత్సరాల క్రితం ఆ కుర్రవాడి  పరిస్థితి విజయవాడలో చాలామందికి తెలుసు. అప్పట్లో ఆ కుర్రవాడిని వెంటబెట్టుకుని అతని తల్లి నగరంలోని పెద్దల దగ్గరికి, సంస్థల కార్యాలయాలకి ప్రతినెలా మొదటి వారంలో ఎక్కే గుమ్మంగా, దిగే గుమ్మంగా తిరగడం నాకు బాగా తెలుసు. ఆ కుర్రవాడిలో టాలెంట్ నచ్చి , అతని భవిష్యత్తుకు ఆర్ధిక ఇబ్బందులు ఆటకం కాకూడదని కొందరు ప్రతినెలా ఇచ్చే డబ్బుకోసమే అలా తిరిగేవారు. ఇలా ఇంకా ఎంతోమంది ఈ స్థాయి పిల్లల తల్లిదండ్రులు ఈ ఉచ్చులో చిక్కుకుంటున్నారు. సొంత పిల్లలనే బలిచేస్తున్నారు.

ఈ షోల పుణ్యమాని పిల్లలు అంగడి సరుకులై పోయారు. తల్లిదండ్రులు వారిని అమ్ముకుంటున్నారు. నిర్వాహకులు కొనుక్కుని తమకు కోట్లు సంపాదించి పెట్టే సరుకుగా తయారుచేసి  ప్రేక్షకుల మీద వదులుతున్నారు. డబ్బు కోసం పిల్లల్ని ఇలా తయారు చెయ్యడం కొంతమంది చేస్తుంటే, మరో రకం తమ పిల్లలు తెర మీద కనబడాలని, ఉన్నతమైన స్థానంలో చూడాలనే పిచ్చితో ఎదురు పెట్టుబడి పెట్టే వాళ్ళు కూడా లేకపోలేదు. ఏ రకమైన తల్లిదండ్రులైనా నలిగిపోతున్నది మాత్రం పిల్లలే !


ఒక ప్రక్క  తీర్పు వచ్చింది. మరోప్రక్క వేడిగా చర్చ జరుగుతోంది. ఆ సమయంలోనే మరో ఛానల్ అలాంటి కార్యక్రమమే  ప్రసారం చేస్తోంది. త్వరలోనే నిషేధించిన కార్యక్రమం పాత వేషం తీసేసి  కొత్త రూపంతో, కొత్త పేరుతో వస్తుంది. నిరసన తెలియజేసే మానవతావాదుల్ని పరిహసిస్తూ తల్లిదండ్రులందరూ నిర్వాహకుల పక్షమే జేరుతున్నారు. డబ్బెవరికి చేదు ?

ఈ ఫీట్లన్నీ ఎందుకంటే బ్రహ్మ పదార్ధం లాంటి టి. ఆర్. పి. రేటింగుల కోసమే ! అవేమో కొంతమంది జేబులో ఇరుక్కు పోయాయి మరి. తమ జేబులోకి రావాలంటే ఇలాంటి జిమ్మిక్కులు తప్పదు. దానికోసం, ఆది తెచ్చే డబ్బు కోసం  పిల్లల్ని, తల్లిదండ్రుల్నీ, ప్రేక్షకుల్నీ, నిరసనకారుల్నీ ఇలాంటి  కార్యక్రమాల నిర్వాహకులు 'ఆటా' డిస్తూనే వుంటారు. 



Vol. No. 01 Pub. No.319

3 comments:

  1. "......డబ్బెవరికి చేదు ?.........."సరిగ్గా చెప్పారు రావ్ గారూ. అదే మరి డబ్బెవరికి చేదు!!

    ReplyDelete
  2. Waow ! Good comment. I agree with Shiva garu.

    Its surpising that not so many bloggers wrote about this. I have expected an uproar here. :D

    annattu mee post lable chala bavundi.

    ReplyDelete
  3. మాధురి గారూ !
    సుభాషణ్ రెడ్డి గారి తీర్పును వేరెవరో నీరుకార్చరు. ఆ పిల్లల తల్లిదండ్రులు నిర్వాహకుల సాయంతో ఆ పని చేస్తారు. రక్తం రుచి మరిగిన పులులు వాళ్ళు.

    ReplyDelete