Showing posts with label ప్రముఖుల విశేషాలు. Show all posts
Showing posts with label ప్రముఖుల విశేషాలు. Show all posts

Monday, November 1, 2010

కర్తవ్యం

కీర్తిశేషులు భోగరాజు పట్టాభిసీతారామయ్య గారు, కృష్ణాపత్రిక సంపాదకులు ముట్నూరి కృష్ణారావు గారు చాలా సన్నిహితులు. ఇద్దరి మధ్యా అంతులేని ఆత్మీయత ఉండేది.  విలువలు పాటించే ఆ రోజుల్లో కర్తవ్యానికి స్నేహం అడ్డు రాకూడదని నమ్మిన వారు.

ఓసారి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఎన్నికలు జరుగుతున్నాయి. సుభాష్ చంద్రబోస్ కు పోటీగా గాంధీగారి అభ్యర్థిగా పట్టాభిగారు నిలబడ్డారు. ఆ సందర్భంలో ముట్నూరి కృష్ణారావు గారు తన పత్రికలో పట్టభిగారిని ఘాటుగా విమర్శిస్తూ సంపాదకీయం రాసారు. ఈ విషయం తెలిసి తనకు అత్యంత ఆత్మీయుడు, తన గురించి సంపూర్ణంగా తెలుసున్న మిత్రుడు కృష్ణారావు గారు అలా రాసినందుకు పట్టభిగారు చాలా బాధపడ్డారు.

వారిద్దరికీ ఆత్మీయులైన కొందరు ఈ విషయాన్ని ముట్నూరి వారి దగ్గర చెప్పారు. అప్పుడాయన  తన తల మీద వున్న తలపాగాను తీసి బల్ల మీద పెట్టారు.
" ఇప్పుడు పట్టాభిని ఎవరైనా పల్లెత్తు మాటన్నా చీల్చి చెండాడేస్తాను " అన్నారు ముట్నూరివారు.

తలపాగా వృత్తి చిహ్నం. వృత్తి ధర్మం ఆయన చేత పట్టాభిగారిపై విమర్శలు చేయించింది.
స్నేహం వ్యక్తిగతం. ఆ స్నేహం ఆయన చేత మిత్రునికి రక్షణ కల్పించింది.

కర్తవ్యం వేరు......... వ్యక్తిగతం వేరు.........

................ అవీ అప్పటి పత్రికారంగ విలువలు.

Vol. No. 02 Pub. No. 048

Thursday, October 21, 2010

పరామర్శ

సంజీవదేవ్ ప్రముఖ చిత్రకారుడు. ఒకసారి ఆయనింట్లో దొంగలు పడ్డారు. నగలూ, నట్రా పోయాయి. ఈ విషయం ఆయన మిత్రుడైన రచయిత చలం గారికి తెలిసింది. సంజీవదేవ్ గారిని పరామర్శిస్తూ ఆయన ఓ ఉత్తరం రాసారు.

' దొంగలు పడ్డారని తెలిసింది. చారుదత్తుడిలాగ మీరు ఆ దొంగలు వేసిన కన్నం దగ్గర కూర్చుని వారి హస్త లాఘవాన్ని మెచ్చుకోవడం లేదు కదా ! 

  ఏమేం పోయాయి ? నగా నట్రా అయితే ఫర్వాలేదు. కానీ మీ దగ్గరున్న పుస్తకాలు, ఉత్తరాలు, చిత్రాలు భద్రంగా వున్నాయి కదా ! ఎందుకంటే అవి అన్నిటికంటే విలువైనవి కదా !  '

........... ఇలా సాగింది ఆ పరామర్శ.

నిజమే కదా ! నగలూ, నగదూ అయితే మళ్ళీ సంపాదించుకోవచ్చు. కానీ విజ్ఞాన బాంఢాగారాలైన పుస్తకాలు వగైరా పోతే మళ్ళీ సంపాదించుకోవడం సులువు కాదు కదా ! అయినా వాటికంటే నగలూ, నట్రా విలువైనవి అంటారా ?

Vol. No. 02 Pub. No. 041

Tuesday, August 31, 2010

కలిపిన ' విడదీసే రైలు బళ్ళు '


నువ్వెక్కవలసిన రైలు బండి జీవితకాలం లేటు అన్నారు ప్రముఖ తెలుగు రచయిత ఆరుద్ర. కానీ ఆయన విషయంలో ఆది నిజం కాలేదు.

అలాగే ' విడదీసే రైలు బళ్ళు ' అని రాసిన ప్రముఖ రచయిత్రి కె. రామలక్ష్మి విషయంలో ఇదీ నిజం కాలేదు. అందుకేనేమో  వారిద్దరూ జీవితకాలం లేటు కాకుండా కలిసారు.


 భాగవతుల సదాశివశంకర శాస్త్రి అనే అసలు పేరు కల ఆరుద్ర కవిత్వంలో అప్పుడప్పుడే ప్రసిద్ధి చెందుతున్న కాలంలో అంటే 1950 వ దశకం తొలినాళ్ళలో రామలక్ష్మి ' స్వతంత్ర ' పత్రికలో పనిచేసేవారు. అప్పటికి ఆవిడకు దేవులపల్లి, శ్రీశ్రీ లాంటి వాళ్ళే కవులుగా తెలుసు. ఆరుద్ర పేరు, ఆయన కవిత్వం ఆ పత్రికలోనే ఆవిడకు పరిచయమయ్యారు. ఆయన కవిత్వం నచ్చింది. ఆయనా నచ్చారు. రామలక్ష్మి తన తొలి కథల సంపుటి ' విడదీసే రైలు బళ్ళు ' కు ముందుమాట రాయాల్సిందిగా ఆరుద్ర గారిని కోరారు. అమ్మాయి అడిగిందిగదాని అర్జెంటుగా రాసిచ్చేయలేదాయన. ఆర్నెల్లపాటు అడిగించుకుని మొహమాటం లేకుండా , పొగడ్తలు వగైరా లేకుండా సూటిగా తన అభిప్రాయాన్ని రాసిచ్చారు. అలా ఆ ' విడదీసిన రైలు బళ్ళు ' వాళ్ళని 1955 లో కలిపింది.
నిన్న ( 31 ఆగష్టు ) ఆరుద్రగారి జన్మదినం. ఆ సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ........



Vol. No. 02 Pub. No. 017

Wednesday, August 25, 2010

బొచ్చుకుక్కా ? ఒట్టి కుక్కా ?

 అధికారానికి సృజనాత్మకతకు సరిపడదేమో !
లలిత కళలు, వాటికి సంబంధించిన విభాగాలు ప్రభుత్వాధీనంలో వుంటే వాటి పరిస్థితి ఏమిటో వేరేగా చెప్పనక్కరలేదు. అధికారం, అలసత్వం, అవినీతి, బంధుప్రీతి వగైరా అవలక్షణాలన్నీ చెరుకుకు పట్టిన చెదల్లా లలిత కళల్లో వున్న తీపిని పీల్చేసి మనకి పిప్పిని మిగులుస్తాయి. గతంలో ప్రభుత్వ అకాడెమిలు, వాటి పనితీరు తెలిసిన వాళ్ళందరికీ ఇది అనుభవమే ! అలాగే ప్రభుత్వ సంస్థలైన ఆకాశవాణి, దూరదర్శన్ విషయం చెప్పనక్కర్లేదు. అందరూ ఇదే పద్ధతిలో ఉంటారని చెప్పలేం గానీ ఆ విభాగాల అధికారులలో  చాలామంది తమ అలసత్వానికి, అవినీతికి ప్రభుత్వ నియమనిబంధనలను అడ్డు పెట్టుకుంటారు. కొంతమందికి సృజనాత్మకత లేకపోయినా ఇతర కారణాలవలన ఆ స్థానానికి చేరుకుని యాంత్రికంగా విధులు నిర్వహిస్తుంటారు. కానీ ఈ విభాగాల్లో సృజనాత్మకత తప్ప యాంత్రికత పనికిరాదు.

అలాంటి యాంత్రికత, నియమ నిబంధనలు సృజనాత్మకతకు ఎలా అడ్డు వస్తాయి అనేదానికి ఒక ఉదాహరణ.......


ప్రముఖ రచయిత దేవరకొండ బాలగంగాధర తిలక్ ఒకసారి ఆకాశవాణికి ఒక కవిత పంపించారు. అందులో ఒక పంక్తిలో ' ఒడిలో బొచ్చుకుక్క పిల్ల ' అంటూ రాసారట. ఆ కవితలో  ' బొచ్చు ' అనే పదం ఆ రేడియో కేంద్ర అధికారులకు అభ్యంతరకరంగా తోచింది. అందుకని ఆ మాట తీసేయ్యమన్నారట. తిలక్ గారికి అందులో అభ్యంతరమేమిటో అర్థం కాలేదు.
" బొచ్చు కుక్క పిల్లను బొచ్చు కుక్క పిల్ల అనక ఒట్టి కుక్కపిల్ల అంటారా ?  "
అని చిరాకు పడ్డారట.


Vol. No. 02 Pub. No. 013

Monday, August 2, 2010

నటరత్నం ' బళ్ళారి రాఘవ '

బళ్ళారి రాఘవ -  ఆధునికాంధ్ర నాటక రంగం కలకాలం గుర్తుంచుకోవలసిన  పేరు.

అప్పటివరకూ పౌరాణిక పద్యనాటకాలలో రాగాలు సాహిత్యాన్ని, ఒక్కోసారి పాత్ర ఔచిత్యాన్ని మింగేస్తూ ఉండేవి. ఆ సమయంలో పద్యాలలో రాగాలకంటే సాహిత్యాన్ని వినబడేటట్లు చెయ్యాల్సిన అవసరాన్ని గుర్తించి అమలులో పెట్టి విజయం సాధించిన వారు బళ్ళారి రాఘవ.

 అంతేకాదు. పౌరాణిక నాటకాల హోరులో కొట్టుకుపోతున్న తెలుగు నాటక రంగాన్ని సాంఘిక నాటకాలవైపు మళ్ళించడానికి ఎనలేని కృషి చేశారు రాఘవ. సమకాలీన సమస్యలను ప్రతిబించే నాటకాలు రావాలని కోరుకుని ఎన్నో సాంఘిక నాటకాల్ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు.

అనంతపురం జిల్లా తాడిపత్రిలో 1880 ఆగష్టు 2 వ తేదీన నరసింహాచార్యులు, శేషమ్మ దంపతులకు జన్మించారు రాఘవ. మద్రాసు లా కళాశాల నుండి న్యాయవాద పట్టా పొంది మద్రాసులో న్యాయవాద వృత్తి చేపట్టి ప్రఖ్యాతి పొందారు. ఆ రంగంలో ఆయన ఘనతను గుర్తించి అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నియమించి ' రావు బహద్దూర్ ' బిరుదుతో సత్కరించింది.

న్యాయవాదం ఆయన వృత్తి అయితే నాటకం ఆయన ప్రవృత్తి.  పన్నెండవ ఏటనే రంగస్థలం ఎక్కిన రాఘవ బళ్లారిలో షేక్స్పియర్ క్లబ్ స్థాపించి ఆయన నాటకాలు ప్రదర్శించేవారు. తర్వాత బెంగళూర్ లోని కోలాచలం శ్రీనివాసరావు బృందంతో కలసి చాలా నాటకాల్లో ముఖ్య పాత్రలు ధరించారు. తెలుగు నాటకాన్ని విశ్వవ్యాప్తం చేసిన కళాతపస్వి బళ్ళారి రాఘవ.  మహాత్మాగాంధీ, రవీంద్రనాథ్ టాగోర్ లాంటి ప్రముఖుల ప్రశంసలు పొందిన మహానటుడు బళ్ళారి రాఘవ.

1936 లో ' ద్రౌపదీ మానసంరక్షణ ' లో దుర్యోధనుడి పాత్రతో చలనచిత్ర రంగ ప్రవేశం చేసినా ఎక్కువ కాలం అక్కడ ఇమడలేకపోయారు.

హరిశ్చంద్ర, ప్రహ్లాద, పాదుకాపట్టాభిషేకం, సావిత్రి, రామదాసు, తప్పెవరిది, సరిపడని సంగతులు మొదలైన పౌరాణిక, సాంఘిక నాటకాలలో ప్రధాన పాత్రలు పోషించారు.

బందా కనకలింగేశ్వరరావు, బసవరాజు అప్పారావు, కొమ్మూరి పద్మావతి, కొప్పరపు సరోజినీ లాంటి శిష్యులెందరినో తయారు చేశారు. ఆయన సంస్మరణార్థం నాటక రంగంలో విశిష్ట సేవలందించిన ప్రముఖులకు ' బళ్ళారి రాఘవ పురస్కారం ' ఏర్పాటు చెయ్యబడింది.


తెలుగు నాటక రంగానికి జీవితాంతం విశిష్టమైన సేవలందించిన ఆ మహానటుడి జయంతి సందర్భంగా ఆయన నటించిన ' భక్తప్రహ్లాద ' నాటకం రికార్డులను
టాలీ నేషన్ - స్వర నీరాజనం ద్వారా వినండి.







Vol. No. 01 Pub. No. 361

Thursday, July 8, 2010

శిధిల శిల్పం

 తెలుగు నాటక ప్రియులకు చిరపరిచితమైన పేరు బళ్ళారి రాఘవ. రంగస్థల నటుడిగా ఆయన అధిరోహించిన కీర్తిశిఖరాలు మహోన్నతమైనవి.

బళ్ళారి రాఘవాచార్యులు గారి వృద్ధాప్యంలో ఆయనకు అభినందన సభ ఏర్పాటయింది. ఆ సభకు ప్రముఖ కవులు, రచయితలు తల్లావఝుల శివశంకర శాస్త్రి, దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ లాంటి మహామహులు హాజరయ్యారు. ఆ సందర్భంగా వీరందరూ రాఘవ గారింట్లోనే బస చేశారు. సభ విజయవంతంగా జరిగింది. ఆ ఆనందం పంచుకోవడానికి వీరందరూ మరో నాలుగైదు రోజులు అక్కడే వుండి పోయారు. వారు తిరుగు ప్రయాణానికి తయారవుతుంటే బళ్ళారి రాఘవగారు .......

" ఎలాగూ ఇంత దూరం వచ్చారు. ఇక్కడకి దగ్గరలోనే హంపి వుంది. అక్కడ శిధిలాలు చూసి పోదురుగాని " అన్నారు.

ఆది విని మాటల శ్లేషల శ్రీశ్రీ  " మిమ్మల్ని చూస్తున్నాంగా...... "  అన్నారు, అప్పటికే శిధిల శిల్పంలా మారిన రాఘవగారిని చూస్తూ !
  
Vol. No. 01 Pub. No. 343

Monday, July 5, 2010

తెలుగు మన్రో

 ఆంగ్లేయ పాలకుల ప్రధాన లక్ష్యం మన దేశంలో వున్న అపారమైన సంపదను కొల్ల గోట్టడమే ! అలాంటి వారికి ప్రజల సంక్షేమం ఎలా పడుతుంది. అయితే దీనికి భిన్నంగా తెలుగువారి సంక్షేమానికి, తెలుగు భాష వికాసానికి, తెలుగు నేల వికాసానికి అవిరళ కృషి చేసిన ఆంగ్ల అధికారులలో చెప్పుకోదగ్గవారు సర్ ఆర్థర్ కాటన్, మెకంజీ, చార్లెస్ ఫిలిప్ బ్రౌన్, థామస్ మన్రో లు.

దత్త మండలాలుగా రాయలసీమ ప్రాంత అభివృద్ధికి కృషి చేసిన థామస్ మన్రో 183 వ వర్థంతి ఈ రోజు.  ఆయన్ని స్మరించుకుంటూ ఆయనపై ఈ రోజు ' సాక్షి ' దిన పత్రికలో వచ్చిన సమగ్ర వ్యాసం 
సీమవాసుల దత్తపుత్రుడు థామస్ మన్రో చదవండి.

vol. No. 01 Pub. No. 340

Thursday, July 1, 2010

రిలాక్ ' సింగ్ '

మిల్కాసింగ్ - ఫ్లయింగ్ సింగ్ 

దేశ విభజన సమయంలో జరిగిన అల్లర్లలో తల్లిదండ్రుల ఊచకోత కళ్ళారా చూసి భయంతో ప్రాణాలను అరచేత పెట్టుకుని తాను పుట్టిన పాకిస్తాన్ నుంచి భారత్ వైపు పరుగెత్తుకుంటూ రావడంతో ఆయన పరుగు జీవితం ప్రారంభమైంది.


ఆ పరుగే తర్వాత ఆయన వృత్తి అయింది. భారత అథ్లెటిక్ చరిత్రను తిరగరాసింది. ప్రపంచ అథ్లెటిక్ పోటీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన క్రీడాకారుడు మిల్కాసింగ్.

1958 లో కటక్ లో జరిగిన జాతీయ క్రీడల్లో మిల్కాసింగ్ ప్రతిభ వెలుగులోకి వచ్చింది. అందులో 200 మీటర్ల, 400 మీటర్ల రికార్డు సృష్టించాడు. అదే సంవత్సరం అదే విభాగాల్లో టోక్యో ఆసియా క్రీడల్లో సరికొత్త రికార్డులు నెలకొల్పాడు. అదే సంవత్సరం కార్డిఫ్ లో జరిగిన కామన్ వెల్త్ క్రీడల్లో స్వర్ణ పతకం దక్కించుకున్నాడు.

రెండు సంవత్సరాల తర్వాత 1960 లో జరిగిన రోమ్ ఒలింపిక్స్ లో అద్భుతమైన ప్రావీణ్యాన్ని ప్రదర్శించి విజయకేతనాన్ని ఎగురవేశారు.  అద్భుతమైన ప్రతిభ కనబరిచినా చివరి క్షణంలో తీసుకున్న ఒక నిర్ణయం కారణంగా ప్రథమ స్థానాన్ని కోల్పోవలసి వచ్చింది. తాను మరీ వేగంగా పరుగెడుతున్నానని భావించిన మిల్కాసింగ్ ఒక్క క్షణం రిలాక్స్ అవడం దీనికి కారణం. అయినా ఫోటో ఫినిష్ ఫలితం రావడం విశేషం. 44.8 సెకండ్లు ప్రథమ స్థానం కాగా మిల్కాసింగ్ 45.6 సెకండ్లలో పూర్తి చేసి నాలుగో స్థానంలోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత 38 సంవత్సరాల వరకూ ఆ రికార్డుని ఏ భారత అథ్లెట్ అధిగమించలేదు.

మిల్కాసింగ్ ' రిలాక్సింగ్ ' గురించి ఆయనే చెప్పిన ఓ జోకు .........

మిల్కాసింగ్ కు అప్పట్లో ఇంగ్లీష్ అంతగా రాదు. 1960 ఒలింపిక్స్ లో పోటీ పూర్తయ్యాక ఆయాసం తీర్చుకోవడానికి నేలపైన పడుకుండి పోయాడు. అతనితో ఇంటర్వ్యూ చెయ్యడానికి ఒక మహిళా జర్నలిస్ట్ వచ్చింది. తనదే తొలి ఇంటర్వ్యూ కావాలని ఆమె ఆత్రుత. హడావిడిగా ప్రశ్నలడగడం మొదలు పెట్టింది. అసలే ఇంగ్లీష్. ఆపై ఖంగారు. మన సింగ్ గారికేమో ఆయాసం. ఆవిడ ప్రశ్నలు వేస్తోంది. అతనికి అర్థం కావడం లేదు. సమాధానాలు లేకపోవడంతో ఆవిడ ప్రశ్నలాపి,
' మిస్టర్ ! ఆర్ యూ రిలాక్సింగ్ ! ' అనడిగింది. 
ఈ ప్రశ్న మాత్రం మిల్కాసింగ్ కి అర్థమైనట్లనిపించింది.  దీనికైనా సమాధానం చెప్పకపోతే బాగోదనుకున్నాడేమో వెంటనే లేచి కూర్చుని
' నో ! నో ! ఐయాం మిల్కాసింగ్ ! ' అన్నాడు హుషారుగా !

Vol. No. 01 Pub. No. 335

Monday, June 21, 2010

నిజమైన అక్షరాస్యతా ఉద్యమం

http://www.kidsone.in/telugu/images/alphabet-learning/letters.pngఅన్ని రంగాల్లో అభివృద్ధి సాదిస్తున్నామనుకున్నా మన దేశం అక్షరాస్యత విషయంలో ఇంకా వెనుకబడే వుంది. స్వాతంత్ర్యం వచ్చిన దగ్గరనుంచి ఎన్నో రకాల పథకాలు మన ప్రభుత్వాలు రూపొందించాయి. కొంత కాలం క్రితం వరకూ  ప్రజల నుంచి కూడా ఈ విషయంలో స్పందన బాగానే ఉండేది. ఇన్ని పథకాలు అమలులోవున్నా, ప్రజల భాగస్వామ్యం వున్నా స్వాతంత్ర్యం వచ్చిన 63 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా అక్షరాస్యత పూర్తి స్థాయిలో లేకపోవడం శోచనీయం.  దీనికి కారణం పథకాల అమలులో ప్రభుత్వానికి, అధికారులకు చిత్తశుద్ధి లోపించడం. ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహం లేకపోవడం ప్రజల ఉదాశీనతకు కారణమై ఉండవచ్చు. అయితే స్వాతంత్ర్యం వచ్చిన తొలి దశకంలో గాంధీజీ బోధనల ప్రభావం ఎక్కువగా వున్న రోజుల్లో ఇదొక ఉద్యమంగా రూపుదిద్దుకుంది. గాంధీజీ ఎంతమందినో ఈ ఉద్యమంలో భాగస్వాముల్ని చేశారు. ముఖ్యంగా విదేశీయులెందరో ఈ ఉద్యమాన్ని చేపట్టి మన దేశంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టి చాలామందిని అక్షరాస్యుల్ని చేశారు. దీనికో ఉదాహరణ........

1952 ప్రాంతంలో వెల్త్ ఫిషర్ అనే అమెరికన్ మహిళ తన భర్త మరణం తర్వాత మన దేశానికి వచ్చింది. అంతకుముందు ఏదో సందర్భంలో గాంధీజీ ఆవిడ సేవా దృక్పథాన్ని గమనించి ఆమెతో  " మీరు గనుక భారత దేశానికి వస్తే పల్లెల్లో మీ సేవా కార్యక్రమాలు కొనసాగించవచ్చు "  అన్నారు. ఆ స్పూర్తితో ఆమె 73 సంవత్సరాల వయసులో మన దేశానికి వచ్చింది. ఆ వయసులో అలహాబాద్ విశ్వవిద్యాలయానికి చెందిన మరో 43 మంది విద్యార్థులతో కలిసి సైకిల్ మీద గ్రామాలకు వెళ్ళేది. తమతో కూడా చిన్న చిన్న పెట్టెల్లో కొన్ని పుస్తకాలు, పలకలు, బలపాలు, బ్లాకు బోర్డులు, కిరోసిన్ దీపాలు వగైరా తీసుకెళ్ళేవారు. గ్రామాల్లోని ప్రజలకు విద్య యొక్క ఆవశ్యకతను బోధించేవారు. వాళ్లకు ఇదేమీ అర్థం కాక ఆమెను అనుమానంగా చూసేవారు. హిందీలో మాట్లాడి వాళ్ళలో తనపైన నమ్మకాన్ని పెంచి ఆకట్టుకునేది. వారు ప్రధానంగా 14 నుండి 40 సంవత్సరాల వయసు వారికి విద్యాబోధన చేసేవారు. తమ పేరు తాము రాసుకోవడం ఆ నిరక్షరాస్యులను ఫిషర్ బోధనల పట్ల ఆకర్షితులను చేసేది. ఫలితంగా అనేకమంది విద్యావంతులుగా మారారు. ఒక జీపులో గ్రంధాలయాన్ని ఏర్పాటు చేసి కొంతమంది ఔత్సాహికులైన ఉపాధ్యాయులతో కలసి వారానికి సుమారు 150 గ్రామాల్లో తిరుగుతూ సుమారు 15 సంవత్సరాలు  అక్షరాస్యతా ఉద్యమం కొనసాగించింది.  ప్రపంచంలో అంత లేటు వయసులో అక్షరాస్యతా ఉద్యమాన్ని చేపట్టిన తొలి మహిళ వెల్త్ ఫిషర్ అని చెప్పుకోవచ్చేమో !

సంకల్పం వుంటే సాధించలేనిది ఏమీ ఉండదని నిరూపించిన వ్యక్తి ఫిషర్. దురదృష్టవశాతూ దేశవ్యాప్తంగా ఈ విషయానికి విస్తృతంగా ప్రచారం జరుగలేదు. జరిగుంటే ఆమె పేరు కూడా ప్రముఖ వ్యక్తుల జాబితాలో చోటు చేసుకునేదేమో ! ఆమె కార్యక్రమాలనుంచి కొంతమందైనా స్పూర్తి పొందేవారేమో ! ! 


Vol. No. 01   Pub. No. 328

Sunday, June 6, 2010

విరాళం పెంచిన వ్యాపారం

బెనారస్ హిందూ యూనివర్సిటీ ( కాశీ విశ్వ విద్యాలయం ) స్థాపకుడు పండిట్ మదనమోహన్ మాలవ్యా. ఆ విశ్వవిద్యాలయ స్థాపనకు ఆయన అవిరళ కృషి చేశారు. అందులో భాగంగా విరాళాల సేకరణ కూడా ఆయనే స్వయంగా చేసేవారు. ఆ పని మీద ఒకసారి ఆయన ఒక బ్యాంకు అధిపతి దగ్గరకు వెళ్ళారు. అప్పుడు ఆ బ్యాంకు ఆర్ధిక సంక్షోభంలో వుంది. అందువల్ల విరాళమియ్యలేని తన అశక్తతను మాలవ్యా దగ్గర వ్యక్త పరచాడు ఆ బ్యాంకు అధిపతి.

మదనమోహన్ మాలవ్యా కొద్దిసేపు ఆలోచించారు. ఆయనకో ఉపాయం తట్టింది. " ఒక పని చేద్దాం ! మొదట అయిదు లక్షల రూపాయలకు ఒక చెక్కు రాసివ్వండి. దాంతో మీ వ్యాపారం కూడా బాగుపడుతుంది " అన్నారు.

ఆ బ్యాంకు అధిపతికి ఏమీ అర్థం కాలేదు. అసలే నా వ్యాపారం బాగులేదంటే ఈయన అయిదు లక్షలకు చెక్కు ఇమ్మంటారేమిటీ ? అనుకున్నాడు. అదే విషయం మాలవ్యా గారికి చెప్పాడు. ఆయన వెంటనే " అదేం కాదు. ముందు నేను చెప్పినట్లు చెయ్యండి. తర్వాత విషయం నేను చూసుకుంటాను "

మాలవ్యా గారి మీద గురి, గౌరవం వున్న ఆ బ్యాంకు అధిపతి ఇంకేమీ మాట్లాడకుండా అయిదులక్షలకు చెక్కు రాసి ఇచ్చాడు. అంతే ! మర్నాడు వార్తాపత్రికల్లో ఫలానా బ్యాంకు కాశీ విశ్వవిద్యాలయానికి అయిదు లక్షల విరాళం ఇచ్చినట్లు వచ్చింది. దాంతో ప్రజల్లో అప్పటివరకూ ఆ బ్యాంకు మీద వున్న అపోహలు, సందేహాలు అన్నీ తొలగిపోయి మళ్ళీ డిపాజిట్లు ఇవ్వడం ప్రారంభించారు. అలా బ్యాంకు ఆర్ధిక పరిస్థితి గాడిన పడింది. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి విరాళం దక్కింది.


Vol. No. 01 Pub. No.311

Saturday, April 3, 2010

దటీజ్ మదర్ !!

అదొక అద్భుతమైన, అపురూపమైన సన్నివేశం. 1969 జూలై 20 వ తేదీన మానవుడు చంద్రమండలాన్ని జయించాడు. తొలిసారిగా నీల్ అర్మ్ స్ట్రాంగ్ చంద్రుడి పై కాలు పెట్టాడు. ప్రపంచమంతా పండుగ చేసుకుంది. అదొక సంచలనం.

అందరిలాగే కలకత్తాలోని మదర్ థెరిస్సా అనాదాశ్రమంలోని వారందరూ కూడా సంతోషం పట్టలేక పోయారు. వెంటనే మదర్ దగ్గరికి వెళ్లి ఈ విషయం చెప్పారు. ఆవిడ కూడా ఎంతో సంతోషించారు.

అందులో ఒకామె మదర్ తో " మీరెప్పుడైనా చంద్రమండలానికి వెళ్ళే అవకాశం వుందా మదర్ ? " అని అడిగింది.

దానికి మదర్ తన సహజ ధోరణిలో " అక్కడ కూడా నిరుపేదలు, దిక్కులేని వారు వున్నారంటే తప్పకుండా వారి సేవలకోసం వెడతాను. నేనే కాదు. మిమ్మల్ని కూడా తీసుకేడతాను " అన్నారట. దటీజ్ మదర్ !!

Vol. No. 01 Pub. No. 242

Saturday, March 13, 2010

నిజాయి ' టీ '

ఈరోజుల్లో రాజకీయనాయకులకు అందినకాడికి దండుకుని పదవి ఉండగానే ఇల్లు / ఇళ్ళు చక్కబెట్టుకోవడం వెన్నతో పెట్టిన విద్య. మరీ పాత తరం కాకపోయినా 60 వ దశకం వరకూ స్వాతంత్ర్య స్ఫూర్తి ఇంకా మిగిలి వుండడంవల్లనో ఏమో కానీ రాజకీయ నాయకులు అవినీతే లక్ష్యంగా వుండేవారు కాదు. వారిలో మాజీ ప్రధాని స్వర్గీయ లాల్ బహదూర్ శాస్త్రి ప్రథములని చెప్పుకోవచ్చు.

ఐన్ స్టీన్ గాంధీ గారి గురించి చెప్పినట్లు లాల్ బహదూర్ నిజాయితీని గురించి చెబితే భావితరాలు నమ్మకపోవచ్చు.
చెప్పిన వాణ్ని అజ్ఞానిగా జమ కట్టవచ్చు. కానీ ఇది నిజం. దానికి నిదర్శనంగా ఒక సంఘటన.

కేంద్ర రైల్వే మంత్రిగా వున్న రోజుల్లో 1956 లో మహబూబ్ నగర్ దగ్గర జరిగిన రైలు ప్రమాదంలో 112 మంది మరణించినందుకు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. తర్వాత 1957 లో జరిగిన ఎన్నికలలో నెగ్గి తొలుత సమాచార, రవాణాశాఖ మంత్రిగా ఆ తర్వాత వాణిజ్య, భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు.

కొన్ని సంవత్సరాల తర్వాత ఓ రోజు అనుకోకుండా ఒక మిత్రుడు ఆయన ఇంటికి వచ్చాడు. ఆ మిత్రునికి మంచి రుచి గల టీ ఇచ్చారు శాస్త్రి. ఆ రుచి చూసి ఆశ్చర్యంతో ఆ మిత్రుడు ' ఇంత రుచి గల టీ నేనెక్కడా తాగలేదు. ఈ రుచి ఎలా వచ్చింది ? ' అని అడిగాడు.

దానికి శాస్త్రి గారు నవ్వుతూ ' ఈ పొడి మీకు బజారులో ఎక్కడా దొరకదు. విదేశాలకు మాత్రమే ఎగుమతి చేసేది. నేను కేంద్ర పరిశ్రమల శాఖకు మంత్రిగా వున్నపుడు టీ బోర్డు వారు బహుకరించారు ' అన్నారు.

దానికా మిత్రుడు ' మీరు ఆ శాఖను నిర్వహించి చాలా కాలమైంది కదా ? ఇన్నాళ్ళదాకా వచ్చిందంటే వాళ్ళు చాలా డబ్బాలు ఇచ్చుండాలి ' అన్నాడు.

' అవును. చాలానే ఇచ్చారు. మొత్తం మూడు డబ్బాలు. రెండు అప్పుడే మా ఆఫీసు వాళ్లకిచ్చాను. ఒకటి నేను దాచుకున్నాను. ఈ టీ అంతే నాకిష్టం. అందుకే దాచుకుని అప్పుడప్పుడు మాత్రమే తాగుతాను ' అన్నారట లాల్ బహదూర్ శాస్త్రి గారు.

Vol. No. 01 Pub. No. 224

Saturday, March 6, 2010

సమాధి మీద రాత

మనకి సమాధి మీద రాతలతో పరిచయం తక్కువ. ఎక్కువగా మన దేశంలోని సమాదులమీద జనన మరణ తేదీలనే రాస్తారు కానీ పాశ్చాత్య దేశాలలో అలా కాదు. సమాధి మీద చనిపోయిన వ్యక్తికి సంబంధించిన లేదా ఆ వ్యక్తికి నచ్చిన వాక్యాలు రాయడం పరిపాటి.

ఆంగ్ల చిత్ర ప్రియులకు 1939 లో వచ్చిన GONE WITH THE WIND చిత్రం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. హాలీవుడ్ ఆణిముత్యాలుగా పిలువబడే చిత్రాలలో ఇది కూడా ఒకటి. పది ఆస్కార్ అవార్డులు సాధించి సంచలనం సృష్టించిన చిత్రం. మరో ఇరవై సంవత్సరాలదాకా ఆ రికార్డును ఏ చిత్రం కూడా అధిగమించ లేకపోయింది. హాలీవుడ్ చిత్రాలలో మణిపూసగా నిలిచిన ఆ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించి ఆస్కార్ కు నామినేట్ అయిన ' హాలీవుడ్ రారాజు ( King of Hollywood ) ' అని పిలిపించుకున్న నటుడు క్లార్క్ గేబుల్ ( Clark Gable ).

నటుడు కావడానికి ఎన్నో కష్టాలు పడ్డాడు. నాటక రంగంనుంచి సినిమా రంగానికి వచ్చాడు. చేటంత చెవులతో అతనొక కోతిలా ఉన్నాడని ప్రఖ్యాత నిర్మాణ సంస్థ వార్నెర్ బ్రదర్స్ ప్రతినిథి వెటకారం చేసాడు. అయినా పట్టుదలతో ప్రయత్నించి MGM సంస్థలో చేరి 1931 లో Dance, Fools, Dance చిత్రంతో నిలదొక్కుకున్నాడు.

అందరిలాగే క్లార్క్ గేబుల్ కూడా తన మరణం తర్వాత తన సమాధి మీద రాయడానికి ఓ వాక్యాన్ని, జీవించి వుండగానే సిద్ధం చేసుకున్నాడు. ఆ వాక్యం ఏమిటంటే...........

క్లార్క్ గేబుల్ నవంబర్ 16 వ తేదీ 1960 న మరణించాడు.

Vol. No. 01 Pub. No. 215

Wednesday, March 3, 2010

నాయకుడికి నిజమైన నిర్వచనం

నాయకుడంటే ఒక గుంపుకో, ఒక ప్రజా సమూహానికో దిశా నిర్దేశకుడు. అతనిని అనుసరించే వాళ్ళు సహజంగానే అతడు తమను సరైన మార్గంలో నడిపించాలనుకుంటారు. తమకు నాయకుడు మంచి చేస్తాడని, తమ ప్రయోజనాలను కాపాడతాడని నమ్ముతారు.

మనది అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. ప్రజల్ని నియోజకవర్గాలవారిగా విడదీసి ఒక్కొక్క నియోజక వర్గానికీ ఒక్కొక్క నాయకుడు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అతడు ఆ నియోజకవర్గ ప్రజల సంక్షేమానికి పాటు పడాలి. సాంకేతికంగా, రాజ్యాంగపరంగా ఇదే నిజమనుకుంటాను. కానీ ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడైనా ముందు ఆలోచించేది ప్రజల సంక్షేమం కాదు. తన, తనవాళ్ళ క్షేమం. ప్రజల ఓట్ల అండతో పదవిలోకొచ్చాక ఆలోచించేది తనకా స్థితి కల్పించిన ప్రజల్ని ఎలా దోచుకోవచ్చా అనే విషయమే ! అందుకే వాళ్ళు మంత్రి పదవి దక్కే అవకాశం వస్తే కాసులు కురిపించే శాఖ కావాలనుకుంటారే కానీ ప్రజలకు సేవ చేసే శాఖ కావాలని కోరుకుంటారా ? ప్రజలకు సేవ చేస్తే ఏం రాలుతుంది.... బూడిద !! ఒకవేళ ఎవరైనా అలా కోరుకుంటే వాళ్ళను పిచ్చివాళ్ళనుకుంటారు. కానీ అలా సేవ చెయ్యాలనుకునే వాళ్ళు కూడా వుంటారు. ఈ రోజుల్లో కాకపోవచ్చు. గతవైభవమే కావచ్చు. అయినా అలాంటి వాళ్ళను ఒక్కసారైనా తలుచుకుంటే ప్రస్తుత రాజకీయనాయకుల అవినీతి విన్యాసాలనుంచి కొంచెం ఉపశాంతి. అలాంటి ఓ ఉదంతం.

గత కాబినెట్ లో పశుసంవర్థక శాఖా మంత్రిగా పనిచేసిన మండలి బుద్ధ ప్రసాద్ గారి పేరు వినే వుంటారు. ఆయన తండ్రిగారు మండలి వెంకట కృష్ణారావు గారు కూడా ఒకప్పుడు మంత్రిగా పనిచేసినవారే ! ఆయనకు మొదటిసారి మంత్రి పదవి లభించింది పి.వి.నరసింహారావు గారి హయాంలో. పి.వి. గారు మంత్రివర్గానికి శాఖల కేటాయింపులు చేస్తూ సహచరులను శాఖల మీద వాళ్ళ ఆసక్తిని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలో మండలి వెంకట కృష్ణారావు గారి వంతు వచ్చింది. పి.వి. గారు అడిగారు మీకేం శాఖ కావాలని. తనకు సాంఘిక సంక్షేమ శాఖను కేటాయించమన్నారు. పి.వి. గారు ఆశ్చర్యపోయారు. ఆయన ఎందుకు ఆశ్చర్యపోయారో అప్పట్లో అజ్ఞానులైన ఓటర్లకు అర్థం కాకపోయి వుండవచ్చుగానీ, తెలివి మీరినా నిస్సహాయులైన ఇప్పటి ఓటర్లకు అర్థమవుతుంది. ఇదివరలో ప్రభుత్వోద్యోగులకు పనిష్మెంట్ ట్రాన్స్ఫెర్ అంటే ఏ శ్రీకాకుళమో, ఆదిలాబాదో పంపిచేయ్యడం. అదే ఇప్పటి నాయకుల దృష్టిలో సాంఘిక సంక్షేమ శాఖ ఇవ్వడమంటే అలాంటిదే ! రాజకీయాలు వ్యాపారమైపోయిన ఈ రోజుల్లో ఆశాఖలో తమ పెట్టుబడి గిట్టుబాటు కాదని వారి ప్రగాఢ విశ్వాసం. అందుకే వాళ్ళు దాని జోలికి పోరు. ఇక ఆఖరు వరుసలో వున్న వారు మాత్రం ( బంగారు ) భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తప్పనిసరై వప్పుకుంటారు.

అందుకే పి.వి. గారికి కూడా అనుమానం వచ్చింది. ఈయన ఈ శాఖను ఎందుకు కోరుకుంటున్నారా అని. ఆ విషయమే అడిగారు అందరూ వద్దనుకునే శాఖనే మీరెందుకు కోరుకుంటున్నారని. దానికి మండలి వెంకట కృష్ణారావు గారిచ్చిన సమాధానం ఏమిటంటే పేదప్రజలకు దగ్గరగా వుంటూ సేవ చేసే అవకాశం సాంఘిక సంక్షేమ శాఖలోనే వుందని, అందుకని ఆ శాఖనే తనకు కేటాయించవలసినదిగా ముఖ్యమంత్రిని కోరారు. పిచ్చివాడు కాకపోతే పేద ప్రజలకు సాయం చెయ్యడమేమిటి ? సొంత లాభం చూసుకోక ! అలా కాదు కాబట్టే మనం ఇప్పుడు కూడా వాళ్ళను తలచుకోవడం జరుగుతోంది. ఈ విషయాన్ని స్వయంగా పి.వి. గారే ఒక సదస్సులో చెప్పి మండలి వారి గొప్పతనాన్ని ప్రశంసించారట.

ఈ రోజుల్లో కూడా ఇలాంటి నిస్వార్థ రాజకీయ నాయకులు వుండాలని కోరుకోవడం అత్యాశ అవుతుందేమోగానీ నిజమైన నాయకుడికి నిజమైన నిర్వచనం మాత్రం ఇదేనేమో !



Vol. No. 01 Pub. No. 213

Monday, February 8, 2010

నిద్రాభంగం

అత్యున్నత స్థానానికి ఎదగాలంటే కృషి, పట్టుదలతో బాటు అంకితభావం కావాలి. వాటి విలువ తెలుసుకుని ప్రపంచంలోనే ప్రముఖ స్థానంలో నిలిచిన వ్యక్తి దగ్గర పనిచేసేటపుడు మనం కూడా ఆ లక్షణాలను అలవర్చుకోవడానికి కొంచెమైనా ప్రయత్నం చే్స్తే అంత కాకపోయినా కొంతవరకైనా ఎదుగుతాయేమో ! కానీ అవేమీ పట్టించుకోకపోతే........

   
Vol. No. 01 Pub. No. 190

Saturday, February 6, 2010

ప్రజాస్వామ్య నిర్వచనం

 ఈనాడు ప్రపంచమంతా చెప్పుకునే ప్రజాస్వామ్య నిర్వచనం నేపథ్యం.....................


Vol. No. 01 Pub. No. 188

Wednesday, January 20, 2010

ఉక్కు మనిషి

సర్దార్ వల్లభాయ్ పటేల్ అనగానే భారతీయులకు ' ఉక్కు మనిషి ' గా గుర్తుకొస్తారు.

తెలుగువారికి నిజాం చేతుల్నుంచి, రజాకార్ల దౌష్ట్యాల నుంచి హైదరాబాద్ సంస్థానాన్ని మిలటరీ చర్యతో విడిపించిన నాయకుడు గుర్తుకొస్తాడు.

ఈరోజుల్లో దేశం, రాష్ట్రం అనేవి తమ స్వంత జాగీరుల్లాగా, కంపెనీల లాగ చూసుకుంటూ, దానికి తమ తదనంతరం తమ పిల్లల్ని, బంధువుల్ని వారసులుగా తయారు చెయ్యడానికి ప్రజలను పావులుగా వాడుకుంటున్న నాయకులే అడుగడుగునా కనిపిస్తారు. వాళ్ళు, వాళ్ళని గుడ్డిగా నమ్మే వాళ్ళు ఈ విషయం నమ్ముతారో లేదో తెలియదు కానీ రాజకీయాల్లోను, రాజకీయ నాయకుల్లోనూ విలువలు మిగిలున్న రోజుల్లో జరిగిన సంగతి కనుక ఇది నిజంగా నిజం

పటేల్ గారికి ఒక కుమార్తె - మణిబెన్ పటేల్. ఒక్కడే సుపుత్రుడు దహ్యాభాయ్ పటేల్. సర్దార్ పటేల్ గారు భారత ఉప ప్రధానమంత్రిగా ఉన్న రోజుల్లో వారి పుత్రుడు బొంబాయిలో ప్రఖ్యాత పారిశ్రామిక వేత్త. తండ్రి ఎంత నిజాయితీపరుడో కొడుకు అంత అవినీతి పరుడు. తండ్రికి తెలియకుండా ఆయన పదవిని అడ్డుపెట్టుకుని అనేక అక్రమాలకు పాల్పడేవాడు.

పటేల్ గారికి ఈ విషయం తెలిసింది. వెంటనే అప్పటి పరిశ్రమల శాఖ మంత్రికి ఒక లేఖ రాసారు. అందులో విషయం చదివితే సర్దార్ పటేల్ నిజాయితీ ఏమిటో, నాయకుడంటే ఎలా ఉండాలో తెలుస్తుంది. ఆ లేఖలో......

' నా కుమారుని పరిశ్రమల గురించి గానీ, అతని ప్రవర్తన గురించి గానీ నాకు ఎంతమాత్రం సంబంధం లేదు. ప్రభుత్వ పరంగా అతని మీద గానీ, అతని పరిశ్రమల విషయంలో గానీ ఏ రకమైన చర్యలు తీసుకోవడానికైవా మీరేమీ వెనుకాడననక్కరలేదు. మీరే చర్యలు తీసుకున్నా నేనేమీ కలుగజేసుకోను. '

ఇదీ ఆ లేఖ సారాంశం. ఇప్పటి వాళ్ళకు ఇదీ ఒక ప్రచారం కోసం చేసే జుమ్మిక్కుగా కనిపిస్తే ఆశ్చర్యపోనక్కరలేదు. ఎందుకంటే మనం రోజూ చూసేవి ఇలాంటి జిమ్మిక్కులే కనుక. కానీ ఆయన నిజాయితీని, నిబద్ధతనీ శంకించేవాళ్ళకు కొసమెరుపు ఏమిటంటే సర్దార్ వల్లభాయి పటేల్ అవినీతిని సహించలేక, తన ఏకైక పుత్రుడి మొహం చూడడానికి కూడా ఇష్టపడక చివరి రోజులు తన మిత్రుడి ఇంటిలో గడిపి అక్కడే కన్నుమూసారు. ఈ రోజుల్లో అలాంటి రాజకీయ నాయకుల్ని ఊహించగలమా ?

Vol. No. 01 Pub. No. 164

Thursday, December 3, 2009

నిజాయితీ విలువ


ఎడమ ఫోటోలో ఉన్నది ప్రముఖ రచయిత భమిడిపాటి కామేశ్వర రావు గారు . కుడిప్రక్క ఫోటోలో ఉన్నది ఆయన కుమారుడు , మరో ప్రముఖ రచయిత భమిడిపాటి రాధాకృష్ణ .

చదువుకునే రోజులు పోయి చదువు' కొనే ' రోజులు వచ్చాయని అడ్మిషన్ రోజుల్లో తల్లిదండ్రులందరూ వాపోవడం పరిపాటే ! అయినా తమ పిల్లలకు సీట్ కోసం అన్ని రకాల దారుల్లో ప్రయత్నం మానరు. తమ పిల్లల ప్రతిభను పెంచే కంటే వాళ్లకు ఎలాగో అలా డిగ్రీ సంపాదించడమే లక్ష్యంగా ఉన్న ఈ రోజుల్లో ఈ రచయితల ఉదంతం వింతగా ఉండొచ్చు. విలువలు కాస్తో, కూస్తో మిగిలున్న ఆ రోజుల్లో ఇలాంటివి మామూలే !

రాధాకృష్ణ గారు డిగ్రీ పూర్తిచేశాక ఇంజనీరింగ్ చదవాలనే కోరికతో ఎలాగో కష్టపడి ఇంజనీరింగ్ సీట్ సంపాదించారు. ఆ విషయం కామేశ్వర రావు గారికి తెలియదు. కానీ ఎలాగో ఆయనకు ఈ సమాచారం చేరింది. వెంటనే ఆయన ఆ కాలేజీకి వెళ్లి మెరిట్ లో రాని తన కుమారుడికి ఆ సీట్ ఇవ్వవద్దని, అర్హత గల మరో విద్యార్థికి ఇవ్వమని ఆ సీట్ రద్దు చేయించారట ! ఈ రోజుల్లో ఇలా ప్రవర్తించే తల్లిదండ్రులున్నారంటారా ?

ఈ సందర్భంలో ఒక విషయం. 1972-73 సంవత్సరాల్లో ప్రత్యేక ఆంధ్రోద్యమం ఉధృతంగా సాగింది. అప్పటికి నేను ఇంటర్మీడియట్ రెండో సంవత్సరంలో ఉన్నాను. నా గ్రూప్ బి. పి. సి. ఇప్పటిలా ప్రతి సంవత్సరం కాకుండా రెండు సంవత్సరాలకు కలిపి పరీక్షలుండేవి. మొదటి సంవత్సరం మొదటి శ్రేణిలో సాగిన మా చదువు ఆర్నెల్ల ఉద్యమం ఉద్యమం పుణ్యమాని కొండెక్కింది. కంపార్ట్మెంట్ లో పాసైన నాకు మెడిసిన్ కి వెళ్ళే అవకాశం పోయింది. అప్పటికి ఎంసెట్ లు వగైరా లేవులెండి ! పోనీ బి.ఎస్సీ. లో చేరుదామనుకున్నాను. అడ్మిషన్లకు ఇంటర్వూలు జరుగుతున్నాయి. ప్రిన్సిపాల్ మా నాన్నగారిని అడిగారు (ఆయన ఆ కాలేజీలోనే సీనియర్ లెక్చరర్. పైగా ఆ అడ్మిషన్ కమిటిలో సభ్యులు ) మీ వాణ్ని బి.ఎస్సీ . లో కాకుండా బి.కాం. లో ఎందుకు చేరుస్తున్నారు ? అని. ఆ కమిటీలో ఉన్న మిగిలిన లెక్చరర్ లందరికీ నా సంగతి తెలుసు. వాళ్లు కూడా ఉద్యమ ప్రభావం వలన ఈ పరిస్థితి వచ్చింది కానీ లేకపోతే మీ వాడి ఫలితాలు బాగానే ఉండేవి అన్నారు. మా నాన్నగారు మాత్రం కారణమేదైనా వాడికొచ్చిన మార్కులకి మెరిట్ లో బి.ఎస్సీ. సీట్ ఇవ్వలేం కదా ! మెరిట్ లిస్టు ప్రకారం బి. కాం. లోనే ఇవ్వగలం !! అందుకని వాడికి బి.కాం. లోనే సీట్ ఇవ్వండి అని నాకు ఏమాత్రం ఆసక్తి లేని బీకాం లోనే చేర్చారు. దాంతో సాహిత్యం, నాటకం, సాంస్కృతిక కార్యక్రమాల వైపు నా దృష్టి మళ్ళింది. అలా చదువులని త్యాగం చేసిన ప్రత్యేక ఆంధ్రోద్యమాన్ని నాయకులు నిర్వీర్యం చేసేసారు. అప్పట్లో మాకు భవిష్యత్తు గురించిన ఆలోచించే శక్తి లేదు. అదే ఆ నాయకులకు పెట్టుబడి అయింది. ఏదేమైనా ఆ ఉద్యమం నాకు లోకాన్ని తెలియజేసింది. లేకపోతే నూతిలో కప్పలాగా ఉండిపోయేవాడినేమో !

Vol. No. 01 Pub. No. 124

Saturday, November 28, 2009

అపర భగీరథుడు

ఒకామె తన కూతురు, చిన్న కొడుకులతో నడుచుకుంటూ వెడుతోంది. రోడ్డు ప్రక్కన ప్రవహిస్తున్న మురుగు కాలవలో నీళ్లు రక్తం రంగులో ఎర్రగా కనిపించాయి. అది చూసి వాళ్లు ఆశ్చర్య పోయారు. నీళ్ళకు రంగెలా వచ్చిందో వారికి అర్థం కాలేదు. అకస్మాత్తుగా చిన్నబాబు అదృశ్యమయ్యాడు. కొన్ని గంటల తర్వాత ఇంటికి తిరిగొచ్చిన పిల్లవాడు తన పరిశోధన విశేషాలు వివరించాడు, మురుగు కాలవలో నీటికి రంగు రావడానికి కారణం అక్కడకు కొద్ది దూరంలో ఉన్న రంగుల అద్దకం పరిశ్రమ అని.
అక్షరాలు నేర్చుకుంటున్న వయస్సులో తినడానికిచ్చిన రొట్టెను గట్లుగా పేర్చి తాగడానికిచ్చిన పాలను వాటిలో పోస్తూ ఆడుకునేవాడు. అదేమిటని అడిగితే కాలవలు కడుతున్నానని సమాధానం.
వర్షం కురుస్తున్న రోజుల్లో బయిటకు వెడితే తన దగ్గరున్న చేతికర్రతో రోడ్డుమీద ప్రవహిస్తున్న వర్షపు నీటిని సక్రమంగా మురుగునీటి కాలవలోకి ప్రవహించేటట్లు దారి చేస్తుండేవాడు.
పువ్వు పుట్టగానే పరిమళించినట్లు చిన్నప్పుడే నీటి పారుదల పైన అవగాహన పెంచుకున్న ఆ పిల్లవాడు మన ఆంధ్ర దేశాన్ని సస్యశ్యామలం చేసిన అపర భగీరథుడు జనరల్ సర్ ఆర్థర్ కాటన్. సమాజహితాన్ని కోరేవారికి దేశం, ప్రాంతం, భాష, జాతి, మతం, కులం లాంటివేవీ అద్దంకి కాదని నిరూపించిన మహనీయుడు. వృధాగా సముద్రం పాలవుతున్న నదీజలాలకు అడ్డుకట్ట కట్టి వాటిని పొలాల్లోకి మళ్ళించి లక్షలాది ఎకరాల భూముల్ని సస్యశ్యామలం చేసిన కాటన్ ను భారత నీటి పారుదలా వ్యవస్థ పితామహుడిగా పేర్కొంటారు.
1844 లో రాజమండ్రికి చర్చి నిర్మాణం నిమిత్తం వచ్చిన కాటన్ అక్కడ గోదావరి పరీవాహక ప్రాంతాల పరిస్థితిని చూసి ఆ నదీజలాలను సరైన పద్ధతిలో వాడుకుంటే వచ్చే ప్రయోజనాలను గుర్తించాడు. దాని మీద ఒక సమగ్ర నివేదిక రూపొందించి గోదావరి నదిపైన ఆనకట్ట ఆవశ్యకతను ప్రభుత్వానికి తెలియజేసాడు. దీని వలన రైతులు సగం ఖర్చు, శ్రమ తోనే రెట్టింపు ప్రయోజనాలు పొందవచ్చనేది ఆయన వాదన. బ్రిటిష్ ప్రభుత్వాదికారుల్ని వప్పించి ధవళేశ్వరం దగ్గర ఆనకట్ట నిర్మించాడు. దానికి అనుబంధంగా అనేక కాలవలు, రోడ్లు, వరదనష్టాల్ని తగ్గించడానికి ఏటిగట్లు పటిష్ట పరచడం లాంటి ఎన్నో ప్రజోపయోగ కార్యక్రమాలు చేసాడు. అప్పటివరకూ పరీవాహక ప్రాంతాల ప్రజలకు దు:ఖదాయనిగా ఉన్న గోదావరి అన్నపూర్ణగా మారిపోయింది. అప్పటివరకూ అది రాజమండ్రి జిల్లా ! అప్పటినుంచి గోదావరి జిల్లాగా మారిపోయింది !! గోదావరి డెల్టా వాసులకు అతడు ఆరాధ్య దైవం. అందుకే వారికి అతడు కాటన్ కాదు, కాటన్న. కోనసీమలోని ప్రతి ఉళ్లోనూ కాటన్నలున్నారు. అతడు కృష్ణానది పరీవాహక ప్రాంతానికి చేసిన సేవ కూడా అనుపమానమైనదే ! బెజవాడలోనకట్ట నిర్మాణం ఆయన చలవే ! ఈనాడు ఆంధ్ర దేశం అన్నపూర్ణ గా ఖ్యాతిగాంచడానికి కాటన్ కారకుడనడంలో సందేహం లేదు. సముద్రం పాలవుతున్న నదీ జలాలను పొలాల్లోకి మళ్లించిన అపర భగీరథుడు సర్ ఆర్థర్ కాటన్.
( సర్ ఆర్థర్ కాటన్ మునిమనమడు రాబర్ట్ చార్లెస్ కాటన్ దంపతులు మన రాష్ట్రంలో పర్యటిస్తున్న సందర్భంగా...... )

Vol. No. 01 Pub. No. 121

Thursday, November 12, 2009

సుస్వర సుసర్ల

మధురమైన, మనోహరమైన గీతాల స్వరకర్త సుసర్ల దక్షిణామూర్తి. ఆయన గీతాలు ఇప్పటికీ శ్రవణ ప్రియాలే ! ఆటా, పాటా కూడు పెడతాయా అనేవారు మనకి తరచుగా కనబడుతూనే ఉంటారు. దానికి జవాబు ఈ సంఘటన .
ఒకసారి సుసర్ల దక్షిణామూర్తి గారు రైలులో ప్రయాణం చేస్తున్నారు. రద్దీగా ఉంది. కాసేపటికి అందులో ' సంసారం ! సంసారం ! ప్రేమ సుధా పూరం ! ' అంటు సుసర్ల వారు స్వరపరచిన పాట వినబడింది. అందరు మైమరచి ఆ పాట వినసాగారు. సుసర్ల వారు కూడా ఆనందంగా ఆ పాట విన్నారు. పాట అయిపోయాక ఆ పాట పాడుతున్న బిచ్చగాడు అందరితో బాటు సుసర్ల గారి దగ్గరకు కూడా వచ్చాడు. అప్పటికే ఆయన్ని గుర్తుపట్టిన తోటి ప్రయాణికులు ఆ బిచ్చగాడితో ఆ పాట ఆయనదేనని చెప్పారు. అంతే వాడు చాలా ఆనందపడ్డాడు. ' మీ పాటలతో రొజూ పదిరూపాయిలు సంపాదించుకుంటున్నాను బాబయ్యా ! మీరు, మీ కుటుంబం చల్లగా ఉండాలి ' అన్నాడు. తనకు ఇంతకంటే గొప్ప సన్మానం జీవితంలో ఉండదని పొంగిపోయారు దక్షిణామూర్తి గారు.
ఆయన స్వరకల్పనలో వచ్చిన ఆణిముత్యాల్లోంచి ఏరిన నాలుగు ముత్యాలు మీకోసం.....................