Sunday, June 6, 2010

విరాళం పెంచిన వ్యాపారం

బెనారస్ హిందూ యూనివర్సిటీ ( కాశీ విశ్వ విద్యాలయం ) స్థాపకుడు పండిట్ మదనమోహన్ మాలవ్యా. ఆ విశ్వవిద్యాలయ స్థాపనకు ఆయన అవిరళ కృషి చేశారు. అందులో భాగంగా విరాళాల సేకరణ కూడా ఆయనే స్వయంగా చేసేవారు. ఆ పని మీద ఒకసారి ఆయన ఒక బ్యాంకు అధిపతి దగ్గరకు వెళ్ళారు. అప్పుడు ఆ బ్యాంకు ఆర్ధిక సంక్షోభంలో వుంది. అందువల్ల విరాళమియ్యలేని తన అశక్తతను మాలవ్యా దగ్గర వ్యక్త పరచాడు ఆ బ్యాంకు అధిపతి.

మదనమోహన్ మాలవ్యా కొద్దిసేపు ఆలోచించారు. ఆయనకో ఉపాయం తట్టింది. " ఒక పని చేద్దాం ! మొదట అయిదు లక్షల రూపాయలకు ఒక చెక్కు రాసివ్వండి. దాంతో మీ వ్యాపారం కూడా బాగుపడుతుంది " అన్నారు.

ఆ బ్యాంకు అధిపతికి ఏమీ అర్థం కాలేదు. అసలే నా వ్యాపారం బాగులేదంటే ఈయన అయిదు లక్షలకు చెక్కు ఇమ్మంటారేమిటీ ? అనుకున్నాడు. అదే విషయం మాలవ్యా గారికి చెప్పాడు. ఆయన వెంటనే " అదేం కాదు. ముందు నేను చెప్పినట్లు చెయ్యండి. తర్వాత విషయం నేను చూసుకుంటాను "

మాలవ్యా గారి మీద గురి, గౌరవం వున్న ఆ బ్యాంకు అధిపతి ఇంకేమీ మాట్లాడకుండా అయిదులక్షలకు చెక్కు రాసి ఇచ్చాడు. అంతే ! మర్నాడు వార్తాపత్రికల్లో ఫలానా బ్యాంకు కాశీ విశ్వవిద్యాలయానికి అయిదు లక్షల విరాళం ఇచ్చినట్లు వచ్చింది. దాంతో ప్రజల్లో అప్పటివరకూ ఆ బ్యాంకు మీద వున్న అపోహలు, సందేహాలు అన్నీ తొలగిపోయి మళ్ళీ డిపాజిట్లు ఇవ్వడం ప్రారంభించారు. అలా బ్యాంకు ఆర్ధిక పరిస్థితి గాడిన పడింది. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి విరాళం దక్కింది.


Vol. No. 01 Pub. No.311

6 comments:

  1. అందుకే అందరూ మదన్ మోహన్ మాలవ్యా (యం.యం.యం) ను మనీ మేకింగ్ మిషన్ అన్నారు.

    ReplyDelete
  2. * మధురవాణి గారూ !
    * శంకరయ్య గారూ !

    ధన్యవాదాలు

    ReplyDelete
  3. మాధురి గారూ !
    ధన్యవాదాలు

    ReplyDelete
  4. రవిచంద్ర గారూ !
    ధన్యవాదాలు

    ReplyDelete