Monday, June 7, 2010

సంగీతమయం సమస్తం



చిత్తూరు వి. నాగయ్య గారి కాలం తెలుగు సినిమా సంగీతానికి స్వర్ణయుగం. ఆయన రేణుకా పిక్చర్స్ కార్యాలయం సంగీత సరస్వతి నిలయం. సంగీత సామ్రాట్టులు, సాహితీ స్రష్టలతో నిత్యం ఆ కార్యాలయం కళకళలాడేది. విద్వద్గోష్టులు జరుగుతుండేవి. ఒకటేమిటి... సమస్తం సంగీతమయంగా వుండేది.



  త్యాగయ్య  చిత్ర నిర్మాణ కాలంలో  ఆ కార్యాలయంలో సంగీత వైభవం మరింతగా వుండేది. అప్పటి ప్రముఖ సంగీత విద్వాంసులందరూ అక్కడే వుండేవారు. కాబట్టి ఆ ప్రాంగణంలో నిత్యం జరిగే మామూలు సంభాషణలు కూడా సంగీతమయంగానే వుండేవి.  వాటినుంచి కొన్ని..........

* ప్రముఖ సంగీత విద్వాంసులు చెంబై వైద్యనాథ భాగవతార్ కూడా ఆ సమయంలో నాగయ్య గారి వద్దకు వచ్చేవారు. ఆయన్ని నాగయ్యగారు ఓసారి " అయ్యా ! మీ వయసెంతో తెలుసుకోవచ్చా ? " అని అడిగారు. దానికి సమాధానంగా ఆయన
" షణ్ముఖ ప్రియ " అన్నారట.
షణ్ముఖ ప్రియ 65 వ మేళకర్త రాగం. అంటే వైద్యనాథ భాగవతార్ గారి జవాబుకి అర్థం ఆయన వయస్సు 65 సంవత్సరాలు అని.

* చిత్తూరు సుబ్రహ్మణ్య పిళ్ళై అని మరో విద్వాంసుణ్ణి " మీ ఇల్లు ఎంత దూరం ? " అని అడిగితే " మా ఇల్లు ఇక్కడికి దగ్గరే ! మాయామాళవగౌళ గజాలకన్నా ఎక్కువ వుండదు " అన్నారట.
మాయామాళవగౌళ 15 వ మేళకర్త రాగం. అంటే ఆయన ఇల్లు 15 గజాలకన్నా ఎక్కువ వుండదు.

* నాగయ్య గారు తమ కార్యాలయానికి ఎవరొచ్చినా కాఫీ పలహారాదులు, భోజనాలు చేసి వెళ్ళే ఏర్పాటు చేసేవారు. ఇందుకోసం కార్యాలయంలోనే మెస్ నడిపేవారు. ఒకసారి ఒక సంగీత విద్వాంసుడు ఆ మెస్ లో ఫలహారం కానిచ్చి " ఇడ్లీకి పక్కవాయిద్యాలు భలే వున్నాయి " అన్నాడట. ఇడ్లీకి పక్కవాయిద్యాలంటే దానితో బాటు ఇచ్చిన సాంబారు, చెట్నీ, కారప్పొడి.
ఆ విద్వాంసుడే కాఫీ త్రాగబోతూ " అరే ! కాఫీ ఇంత వేడిగా వుందేమిటి ? " అన్నాడట. అక్కడే వున్న నాగయ్య గారు " ఏముందీ ! ఆ లోటాలోంచి ఈ లోటాలోకి ఆరోహణ, అవరోహణ చెయ్యండి " అని సంగీత పరిభాషలోనే సలహా ఇచ్చారట.   

................. ఇలా సాగేవి నాగయ్యగారి కొలువులో సంగీత సరస్వతి స్వేచ్చా విహారాలు.



Vol. No. 01 Pub. No.312

4 comments:

  1. bhale vishayaalu sekaristaaru meeru. abhinandanalu.

    ReplyDelete
  2. మాధురి గారూ !
    నా దగ్గరున్నవి గతకాలపు పుస్తకాలు, పత్రికలూ, కాసేట్లూ, సీడీలు కొన్ని మాత్రమేనండీ ! అవే నాకు మిగిలిన పెన్నిధి. దాన్ని పదిమందికీ పంచాలనే ఈ బ్లాగు ప్రారంభించాను. ఏమైనా ఇన్నాళ్ళకు మీ తెలుగింగ్లీష్ చూసి సంతోషమేసింది. త్వరలో ఈ తెలుగుని తెలుగులోనే చూడగలనని నమ్మకంగా వుంది. ధన్యవాదాలు.

    ReplyDelete
  3. మాధురి గారూ !
    నా రాతలకు మీరు inspire అయ్యారో, లేదో గానీ మీ అబ్బాయి inspire అవడం చాలా, చాలా సంతోషంగా వుంది. దానికి మీరు ప్రోత్సహించడం మరీ బాగుంది. మీకు బద్ధకం వుందంటే నేనొప్పుకోను. ప్రతీరోజూ, ప్రతీ బ్లాగు క్షుణ్ణంగా చదివి, శ్రద్ధగా విశ్లేషించి వ్యాఖ్యలు రాయడానికి కూడా చాలా శ్రమ పడాలి. బద్ధకిస్తే ఇదెలా సాధ్యం ?
    చి. వినయ్ ని మీరు చెబుతున్న తెలుగు కథల్ని అతని శైలిలో రాయమనండి. వాటిలో భాషలో వచ్చే దోషాలు మీరు సరిచేసి ప్రచురించండి. తెలుగు పూతి స్థాయిలో చదవలేకపోయినా గూగుల్ లో ప్రయత్నిస్తున్నాడంటున్నారు కనుక తెలుగులోనే రాసే ప్రయత్నం చేయించండి. తెలుగు చదవడం కూడా అలవాటు చెయ్యండి. మొదట mixed ( ఇంగ్లీష్ + తెలుగు ) భాషలో రాయించడం ప్రారంభిస్తే మెల్లగా అతనే పూర్తీ స్థాయిలో తెలుగులో రాయగలుగుతాడు. బ్లాగు ప్రారంభించే పధ్ధతి మీకు తెలిస్తే సరే ! లేకపోతే నాకు మెయిల్ చెయ్యండి. వివరంగా రాస్తాను. నా ప్రొఫైల్ లో మెయిల్ లింక్ వుంది.

    ReplyDelete