Tuesday, October 20, 2009

జల సూత్రం

           జల సూత్రం రుక్మిణీనాధ శాస్త్రి అంటే చాలామందికి తెలియక పోవచ్చు. జరుక్ శాస్త్రి లేదా    పేరడీ శాస్త్రి అంటే  టక్కున గుర్తు పట్టేస్తారు. హాస్యం, వ్యంగ్యం ఆయన రచనల్లో ప్రధాన వస్తువు. 
 అవి ఆయన మాటల్లో కూడా తొణికిసలాడేవి. ఆ రోజుల్లో ప్రముఖ కవులందరి రచనల మీదా 
 ఆయన రాసిన పేరడీలు చాలా ప్రాచుర్యాన్ని పొందాయి.
  " మీ ఇంటిపేరు తమాషాగా ఉందండీ ! " అని ఎవరో ఆయనతో అంటే " అదా ! నీటి ఫార్ములా  H 2 O కదా ? అది మావాళ్ళే కనిపెట్టారట. అందుకే మా ఇంటి పేరు జలసూత్రం అయింది' అన్నారు.
* ' మధుకీల ' అనే కావ్యాన్ని మల్లవరపు విశ్వేశ్వర రావు అనే కవి రచించారు.  దానికి ముందుమాట కృష్ణశాస్త్రి గారు రాసారు. అందులో ' విశ్వేశ్వరరావూ ! నీవు కవివయ్యా ! నేను ఎవరితోనూ ఇలా అనను.విశ్వేశ్వర రావు నిజంగా కవి '; అని రాసారు. దీనికి జరుక్ శాస్త్రి గారి పేరడీ...... ' సుబ్బారావూ ! నువ్వింకా క్షవరం చేయించులోవాలయ్యా ! నీ తల మాసిందయ్యా ! నేను ఎవరితోనూ ఇలా అనను. సుబ్బారావు నిజంగా తలమాసిన వాడు "

* " అసలీ పేరడీలు ఎవరి దగ్గర నేర్చుకున్నారు? " అని ఆయన్ని ఎవరో అడిగారు. " మా తండ్రి గారి దగ్గర " అన్నారు టక్కున.  వాళ్ళు షాక్ నుంచి తేరుకున్నాక తాపీగా " నిజానికి నాకూ కృష్ణశాస్త్రికీ పెద్దగా తేడా ఏమీ లేదు. మా తండ్రి గారు నాక్కూడా కృష్ణశాస్త్రి అని పేరు పెట్టి ఉండొచ్చు. కానీ బెంగాలీలను పేరడీ చేసి తెలుగు వాళ్ళలో ఎవరికీ లేని పేరు పెట్టలేదూ ! " అన్నారట.  
ఇదండీ ఆయన వరస.....ఇంతేనా ? ఇంతేనా అంటే ఇంకా చాలా ఉన్నాయి . మీకూ , నాకూ కాంప్రమైజేషన్ కుదిరాక చెప్తాను . సరేనా !

1 comment:

  1. మీ దగ్గర చాలా సాహిత్య కబుర్లు ఉన్నాయండీ. త్వర త్వరగా పంచండి.

    ReplyDelete