Sunday, October 25, 2009

హరిశ్చంద్ర

కళా తపస్వి కె. విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన " జననీ జన్మభూమి " చిత్రంలో ' హరిశ్చంద్ర ' నాటకం లోని కాటి సీను లోని కొన్ని భాగాలు ఉపయోగించారు. ఆ నాటకాన్ని తెలుగులో తొలుత కీ. శే . బలిజేపల్లి లక్ష్మీకాంత కవి రాసారు. అనంతరం కీ.శే . గుర్రం జాషువ కూడా మరో రచన చేశారు. ఈ చిత్రంలోని భాగంలో ఇద్దరి రచనల్లోని పద్యాలూ వాడటం జరిగింది. సాధారణంగా రంగస్థల కళాకారులు కూడా తమ ప్రదర్శనలలో ఇలాగే కలిపి వాడటం జరుగుతుంటుంది.
శ్రీ భ్రమరాంబికా ఫిలిమ్స్ పతాకం మీద కీ.శే. కె.కేశవరావు గారు నిర్మించిన ఈ చిత్రంలో బాలకృష్ణ, శంకరాభరణం రాజ్యలక్ష్మి, సుమలత వగైరా నటించారు. రాజ్యలక్ష్మి తండ్రి రంగస్థల కళాకారుడు. అతను ఈ సన్నివేశంలో నటిస్తూ ఉద్వేగానికి లోనై గుండెపోటుకు గురవుతాడు. ఈ సన్నివేశంలో తెనాలికి చెందిన రంగస్థల కళాకారులే నటించారు. వారిచేతనే ఆ పద్యాలను పాడించి రికార్డు చెయ్యడం జరిగింది. అందులోంచి కొన్నిటిని ఉపయోగించుకోవడం జరిగింది. చిత్రం విజయవంతం కాకపోవడం చేత ఈ విషయం చాలా మందికి చేరలేదు. మన సంస్కృతీ, కళలంటే మక్కువ కలిగిన గురువర్యులు విశ్వనాథ్ గారు ఈసారి నాటక ప్రక్రియను ఈ చిత్రంలో ఉపయోగించారు. సహజత్వంకోసం సినిమా నటులు కాక అసలైన రంగస్థల కళాకారులనే ఉపయోగించారు. వారి నటనకు ముగ్దులయి వారి టైటిల్స్ ప్రత్యేక కార్డుగా వెయ్యాలని షూటింగ్ సమయంలోనే చెప్పటం జరిగింది. మరుగున పడిపోతున్నాయనుకున్న కళలను సజీవం చెయ్యడంలో విశ్వనాథ్ గారి కృషి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అయితే ఈ చిత్ర పరాజయంతో ఈ విషయం మరుగున పడిపోయింది. పరాజయానికి ఇతరత్రా కారణాలు చాలా ఉన్నాయి. కానీ ఈ సన్నివేశం మాత్రం ఆ చిట్టాలోకి రాదు. ఏమైనా చాలా చిత్రాల్లో మన నాటకాల్ని అపభ్రంశం చేసి హాస్యానికి వాడుకున్నారుగానీ ( కొన్ని చిత్రాల్లో ప్రత్యేకమైన నాటక సన్నివేశాలు తప్ప ) ఇలా సన్నివేశపరంగా ఉపయోగించే ప్రయత్నం చెయ్యలేదు. చిత్రం విజయం సాధించి ఉంటే శంకరాభరణం, సాగర సంగమంల లాగా ప్రేక్షకుల మీద ప్రభావం చూపించి ఉండేదేమో ! ఆ సన్నివేశాన్ని చూడండి.




.

No comments:

Post a Comment