Sunday, October 18, 2009

వన్స్ మోర్


చలనచిత్ర రంగంలో టాకీలు మొదలైన తర్వాత కొంతకాలం వరకూ పౌరాణికాలే రాజ్యమేలాయి. దానికి కారణం అప్పటికింకా చిత్ర రంగంపైన నాటకరంగ ప్రభావం ఉండటమే! దాంతో సహజంగానే రంగస్థల నటులు రాజ్యమేలారు. అలా రంగస్థలం మీద ప్రసిద్ధుడై చిత్ర రంగలోకి వచ్చి విలక్షణ నటుడుగా ప్రఖ్యాతి గాంచిన వ్యక్తి సి.యస్.ఆర్. ఆంజనేయులు. శకుని పాత్రలో పరకాయప్రవేశం చేసి ప్రేక్షకుల మనస్సులో నిలిచిపోయాడు. అయితే చిత్ర రంగానికి వచ్చిన తొలి రోజులనాటికి రంగస్థలం మీద కృష్ణుడి పాత్రలో ప్రసిద్దుడవడం వలన ఆయనకి అప్పట్లో ఆ పాత్రలే వచ్చేవి. రంగస్థలం మీద కృష్ణుడిగా సి.యస్.ఆర్. పద్యం పాడితే జనం వన్స్ మోర్ కొట్టే వారు. దాంతో మళ్ళీ పద్యం పాడక తప్పేదికాదాయనకు. 1936 లో వచ్చిన ' ద్రౌపదీ వస్త్రాపహరణం ' చిత్రంలో సి.యస్.ఆర్. కృష్ణుడుగా నటించాడు. ఆ సినిమా ను చూస్తున్న ప్రేక్షకులు సి.యస్.ఆర్. పద్యం పాడటం అవగానే అలవాటు ప్రకారం వన్స్ మోర్ కొట్టేవారు. థియేటర్ వాళ్లు పట్ట్జించుకోకుండా ప్రదర్శన కొనసాగిస్తే ప్రేక్షకులు ఊరుకునేవారు కాదు. దాంతో ఆపరేటర్లకు రీలు వెనక్కి తిప్పి మళ్ళీ ప్రదర్శించాల్సి వచ్చేది. మళ్ళీ 1944 లో సి.యస్.ఆర్. కృష్ణుడుగా నటించిన ' భీష్మ ' చిత్రం విషయంలో కూడా ఇదే పరిస్థితి పునరావృత్తమైంది. అదీ చిత్ర రంగ తొలినాళ్ళ పరిస్థితి.

1 comment:

  1. జిలేబీ గారూ !
    చాలా ఆలస్యంగా మీ వ్యాఖ్య చూసాను. సారీ ! సుదర్శన్ బాబు గారు మీ సందేహం తీర్చారు కదా ! ఆయనకు నా తరఫున కృతజ్ఞతలు. మీ కాంప్లిమెంట్స్ కు కూడా కృతజ్ఞతలు.

    ReplyDelete