Showing posts with label ఛలోక్తులు. Show all posts
Showing posts with label ఛలోక్తులు. Show all posts

Monday, November 8, 2010

సి. యస్. ఆర్. హస్త సాముద్రికం

 తెలుగు చిత్ర రంగంలో కొన్ని పాత్రల గురించి ప్రస్తావన వస్తే కొంతమంది నటులు ప్రత్యేకంగా గుర్తుకువస్తారు. భారతంలోని శకుని పాత్ర పేరు చెబితే మొదటగా గుర్తుకు వచ్చేది చిలకలపూడి సీతారామాంజనేయులు. సి. యస్. ఆర్. గా ప్రసిద్ధుడైన ఈయన రంగస్థలం నుండి చిత్రరంగానికోచ్చిన వారే ! 1930 దశకంలో కథానాయకుడిగా వెలిగిన ఈయన 1950 దశకంలో క్యారెక్టర్ నటుడిగా మారారు. దేవదాసులో పార్వతిని పెళ్ళాడిన జమిందారు పాత్రలో ఆయన నటన ఎవరూ మర్చిపోలేరు. ఆ చిత్ర నిర్మాణ సమయంలో జరిగిన ఓ సంఘటన ఆయన మాటల చమత్కారానికి నిదర్శనం.

దేవదాసు షూటింగ్ విరామ సమయంలో సెట్ బయిట కూర్చున్న సావిత్రితో సి. యస్. ఆర్.
" అమ్మాయీ ! ఏదీ నీ చెయ్యి చూపించు " అన్నారు.

సావిత్రి  తన చెయ్యి చూపించి ఆయన ఏం చెబుతారా అని కుతూహలంగా చూస్తోంది . కాసేపు తదేకంగా ఆ చెయ్యిని పరిశీలించిన సి. యస్. ఆర్.
" నీకు మూడు ముఖ్యమైన విషయాలు చెబుతాను. అవి
ఒకటి నిన్నెవరూ సరిగా అర్థం చేసుకోరు.
రెండు నీ ప్రతిభకు తగ్గ వేషం దొరకడానికి ఇంకా కొంత కాలం పట్టవచ్చు
మూడు నీకు అప్పుడప్పుడూ స్టమక్ ట్రబుల్ వస్తూంటుంది " అన్నారు.

సావిత్రి ఆశ్చర్యపోయి " ఇంత కరెక్ట్ గా ఎలా చెప్పగలిగారు ? " అని అడిగింది.

దానికి సి. యస్. ఆర్. నవ్వుతూ " ఇందులో ఆశ్చర్యపోవడానికేముంది. ఎవరి చెయ్యి చూసినా ఈ మూడు విషయాలు మాత్రం సులువుగా చెప్పెయ్యొచ్చు . ఇవి అందరికీ అన్వయించే విషయాలే ! " అన్నారు. 

Vol. No. 02 Pub. No. 052

Saturday, November 6, 2010

భమిడిపాటి వారి ' దీపావళి '

నిన్న దీపావళి. ఈ దీపావళి పండుగ చిన్నతనంలోని చిలిపి జ్ఞాపకాలను వెలికి తెచ్చింది. అవన్నీ ఒక మాలగా గుదిగుచ్చి అందిద్దామని ప్రయత్నిస్తుండగా గతంలో చదివిన హాస్యబ్రహ్మ భమిడిపాటి కామేశ్వరరావు గారి ' దీపావళి ' వ్యాసం గుర్తుకొచ్చింది. నా అనుభవాలని గుర్తు చేసే ఆ వ్యాసంలోని కొంత బాగం ఇక్కడ అందిస్తున్నాను. గిలిగింతలు పెట్టే ఆ భాగాన్ని అందుకుని ఆస్వాదించండి.








దీపావళిలో ‘ దీపం ‘ వేసి చూడకుండానే కొందరు మాట్టాడతారు. వెనక ఒక రాక్షసుడు చచ్చిపోయాడు గనుక వాడి నిమిత్తం మనం పిండివంటల్తో భోంచెయ్యాలనీ, దీపావళి నాటికి వాన్లు వెనకట్టడం జరుగుతుంది గనుక లోగడ పుట్టిపెరిగిన క్రిమి కీటకాదులు ( నలకలడయోరభేధ: ) సమూలంగా నశించడానికి దేశం అంతా తలంట్లుపోసుగుని బాణాసంచా కాల్చాలనీ, అల్లుళ్ళని పిలవడానికి ఆదే సందర్భంగనుక వాళ్ళ ముఖతేజం ఎక్కువ చేసే నిమిత్తం మతాబాలు కాల్పించాలనీ, మొదలైన పూర్వగాథలకి తడుముకోనూ లేదు. 

దీపావళి కాల్పులికి దరిద్రుడూ, ధనికుడూ వివక్షత లేదు, గానీ పిన్నా పెద్ద వివక్షతా, ఖర్చూ బేఖర్చూ వివక్షతా, కసీ బేకసీ వివక్షతా ఉన్నాయి. పిన్నలకి ఏదో ఇంత తగలేయ్యాలనీ, పెద్దలకి ఖర్చులేకుండా ఉంటే సరి ఇంకా తగలెయ్యమనీ ! దరిద్రుడైనా సరే కసి ఉంటే తల తాకట్టేట్టయినా సరే నరకాసురుణ్ణి దహనం చేస్తాడు. ఇంతవరకింకా దీపావళిలో దీపంసంగతి అప్రధానం అయిందే కానీ, ఆరిపోలేదు. 

ప్రధాన విషయం చప్పుడు ! ఎంత గొప్పచప్పుడు చేస్తే అంతా గొప్ప దీపావళి యోధుడు. దరిద్రుడు కాగితపు టపాకాయను పేల్చడం, ( సంచీ లామడిచి, ఒకవైపు చిల్లు చేసి, గాలి పోరించి, అది పొంగిన తరవాత నేల మీద పెట్టి ఒకటిచ్చుగుంటే ఠప్పుమనేవి ), ఖాళీ డబ్బాలు వాయించడం, డబ్బాలోరాళ్లేసి వేళ్లాడ గట్టి రెండు మూడు రకాల కర్రల్తో బాదడం - తరవాత తాటాకు టపాకాయలు ! ఇవేనా లేకుండా ఎవరూ ? ఇవి క్రమేపీ చౌకఅవడం కద్దు. మేఘదర్శనం అయేసరికి ఇవి కాళ్ళుపారజాచేస్తాయి. మరీ నాసిరకం పేలకపోయినా నాలిక గీసుకోవచ్చని కొందరు కొనడం. ఇవి పెల్తే ఒట్టి పేలుడే ! కానీ ఎడా పెడా ఎడా పెడా వాయించినట్టు పేలే సీమటపాకాయలు. ఎల్లానూ సీమ సీమే ! కొందరికి కసి ఆగక రెండుమూడు సీమటపాకాయల గుత్తులు కిరసనాయలు డబ్బాలోపడేసి అవి చెడామడా క్షోభపడిపోతోంటే ' వెయ్ వెయ్ ' అని కేకలేస్తూ డబ్బాని చావగొట్టడం ! 
గోడటపాకాయలని కూడా వస్తుండేవి  అరుగులమీద పరధ్యానంగా కూచున్న వాళ్ళు ఉలిక్కిపడేటట్లు ఒక్ఖటి గోడనిబాదేసి, దీపావళివీరుడు పరక్షోభగురించి నవ్వుకుంటూ పోతుండేవాడు. అవే నేల్నెట్టి జబ్బనేప్పెట్టేలాగా కొట్టేవాళ్లు కొందరు.వీట్లని మించిపోయినవి ఔట్లు. ఔట్లు పేల్చేవాళ్లు మహాధ్వనికారుల్లో జమ.ఒక దీపావళి రౌతు ఒక ముసలాయనతో చెప్పకుండా ఔటు పేల్చేసరికి ఆయనగుండే ఆగిపోయింది. అది ఆగిపోవడంవల్ల తెలిసింది గాని లేకపోతే ఆయనకి గుండె ఉన్నసంగతి తేలకపోయేదిగదా అన్నాడు ఆ రౌతు. 
వెలుగు గురించిన ఆరాధనలో మతాబాలు సార్థకం అయినా, అవి కాల్చడం అనేదాన్లో పౌరషం లేదు పొమ్మన్నారు. ఎందుకంటే - ప్రతి సందర్భంలోనూ ప్రతీవాళ్లూ మతాబా కాల్చగలరు గనుక ! కాల్చడంలో ఒకచోటనుంచి మరోచోటుదాకా వెళ్ళి ఇతరుల్ని బాధపెట్టే బాపతైన తూటాల వంటి వాట్లకి ఘరానాఎక్కువ. ఎడంచేత్తో అంటించిన తూటా పట్టుగుని ఇటూ అటూ రవ్వలు చిమ్ముతూ, ఒకవేళ చీదినా, అరిచెయ్యి దానిమ్మకాయ పగిలినట్టు పగిలినా, కిక్కురుమనకుండా చివరదాకా నిల్చేవాళ్లూ, 'బాబోయ్ ' అని తోకముడిచేవాళ్లూ ఉండేవాళ్ళు. కానీ, ఎంత ఎత్తుకి వేడితే అంత గొప్పవాడు అనేది దీపావళిలోనూ నిజమే. దీపావళి భటుడి అసలు అస్త్రం జువ్వ.అతడు జువ్వల రంగడు. జువ్వవదలడం కొత్తగా నేర్చుగునేవాళ్ళు తాటాకు చూర్లకీ చుట్టుపక్కజనానికీ భయకారణంగా ఉండేవాళ్లు. ఆరి తేరిన వాళ్ళు అల్లాంటిపన్లు చెయ్యక, ఊరవతలకిపోయి పాతిగముఫ్ఫై గజాల్లో ఎదరేదరగా నుంచుని, జువ్వలు నేలబారుగా వదిలి, పోటీ చేసుగునేవాళ్లు. దెబ్బలు తగిలినవాళ్ళని తక్కిన వాళ్ళు ఇంటికి మోసుకెళ్ళేవాళ్లు. అవీ ఇనీ కొనడంకంటే మనమే కట్టుగుంటే సొమ్ముకిమించిన సరుకొస్తుంది అనేగడుసుదనంతో వ్యవహరించి, యథాశక్తిగా కాళ్ళూ, వేళ్లూ, చేతులూ, చర్మమూ, వొళ్లూ, ఇల్లూ, ప్రాణమూ ధారపోసిన దీపావళి మత భక్తులుంటుంటారు - సంస్థ స్థాపించిన వాళ్ళ ఉద్దేశం ఈభక్తి కాదేమో అనితోస్తుంది. ఏమిటో, చెప్పలేం ! కొంత పిరికి తనం, కొంత దారిద్ర్యం, కొంత ఇతరులకి బాధ గలిగి దెబ్బలాట కోస్తారనే భయం - ఇవన్నీ ఉండడంవల్ల, నేను ఏ మతాబా అగ్గిపుల్లేనా కాల్చి ఉంటాను, గాని ఒకటోరకమైన మతాబాయేనా కాల్చినట్టు జ్ఞాపకంలేదు.
ఇదో రకం : 
" బాణాసంచా అంటే చెవి కోసుగుంటారు. సూర్యాస్తమయాలు చూసి ఆనందించలేరు కొందరుజనం " అంటాడు ఒక కవి.

 


Vol. No. 02 Pub. No. 051

Tuesday, October 26, 2010

నవలక్ష్ములు

అష్టలక్ష్ముల గురించి అందరికీ తెలుసు. మరి తొమ్మిదవ లక్ష్మి ఎవరు ? తెలుసుకోవాలనుందా ? అయితే .......

నటరత్న నందమూరి తారకరామారావు గారి వారసుడు బాలకృష్ణ నటుడిగా ఈ తరం ప్రేక్షకులకు తెలుసు. కానీ గత తరం ప్రేక్షకులకు హాస్యనటుడు బాలకృష్ణ గుర్తుండే వుంటారు. ' పాతాళ భైరవి ' అంజిగాడు అంటే చాలామంది సులువుగా గుర్తు పట్టేస్తారు. ఈ బాలకృష్ణ ఎన్టీరామారావు గారికి అభిమాన నటుడు కూడా !

బాలకృష్ణది చాలా జాలిగుండె. సెట్లో వున్నపుడు ఎవరైనా దిగులుగా కనిపిస్తే దగ్గరకు వెళ్ళి పలుకరించి ఓదార్చేవాడు. ఓసారి ఓ జూనియర్ ఆర్టిస్ట్ సెట్ బయిట దిగులుగా కూర్చుని వుండడం చూసి ........

" ఏంటి బాబాయ్ ! దిగాలుగా కూర్చున్నావు ? " అని అడిగారు.

దానికా నటుడు
" ఏం చెప్పమంటావ్ బాబాయ్ ? మాకు ఇప్పటికి ఎనిమిదిమంది ఆడపిల్లలు. ఇప్పుడు మళ్ళీ నా భార్య గర్భవతి. అదే నా దిగులు " అన్నాడు.

" ఓహో ! మళ్ళీ ఆడపిల్ల పుడితే ఇంకా ఖర్చు పెరుగుతుందనా నీ దిగులు ? " అని అడిగారు బాలకృష్ణ.

దానికా నటుడు
" ఖర్చు గురించి నాకు దిగులు లేదు. ఏదో తెర మీద కనిపించాలనే దురదతో ఈ ఫీల్డ్ లోకి వచ్చి ఈ ఎక్స్ ట్రా వేషాల బారిన పడ్డాను గానీ మీ దయవల్ల మా వూళ్ళో కావలసినంత ఆస్తి వుంది " అన్నాడు.

" మరింక దేనికయ్యా నీ దిగులు ? " అనడిగాడు బాలకృష్ణ

" ఇప్పటివరకూ నా ఎనిమిదిమంది కూతుళ్ళకూ ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, భాగ్యలక్ష్మి...... ఇలా అష్టలక్ష్ముల పేర్లు పెట్టేసాను. మళ్ళీ ఆడపిల్ల పుడితే ఏం పేరు పెట్టాలా అనేదే నా దిగులు " అని తన దిగులుకి కారణం తేల్చాడా నటుడు.

దానికి బాలకృష్ణ కొంచెం అలోచించి
" ఏముంది ? ఈసారి జ్యోతిలక్ష్మి అని పెట్టేయ్యి. సరిపోతుంది " అనేసి అక్కడనుంచి తప్పుకున్నాడు.

తోటరాముడు, నేపాళ మాంత్రికుడు, డింగరి లతో 'అంజి ' గాడిని ఈ పాటలో చూడండి....



  
Vol. No. 02 Pub. No. 044

Friday, October 22, 2010

మీసం చేసిన మోసం

 రంగస్థలం మీద నటునికి ముందుగా కావాల్సింది ధారణ శక్తి . ఎంత పెద్ద డైలాగ్ నైనా, ఎన్ని పేజీలున్నా తడుముకోకుండా సహజరీతిలో చెప్పాల్సివుంటుంది. జ్ఞాపకశక్తి అంతగా లేని నటుడు రంగస్థలం మీద రాణించడం కష్టమే !
సినిమాలో అయితే ఆ అవసరం తక్కువ. గతంలోనైతే ముందుగా పక్కాగా స్క్రిప్ట్ తయారయ్యేది, దాన్ని షూటింగ్ కి వెళ్లక ముందే నటీనటులకు పంపడం జరిగేది. వాళ్ళు బాగా చదువుకుని, హావభావాలు సాధన చేసి మరీ షూటింగ్ కి వచ్చేవారు. అందువలన దర్శకుడు ఇచ్చే సూచనలను బాగా అర్థం చేసుకుని నటించడానికి వీలయ్యేది. సెట్ మీద అప్పడికప్పుడు డైలాగ్ లు రాసుకుని, అసలు డైలాగ్ షీట్ అవసరం లేకుండా సీన్ చెబితే చాలు నటీనటులు ఎవరికి తోచిన డైలాగ్ లు వారే చెప్పుకునే స్థాయికి ఎదిగిన ఈరోజుల్లో ఈ సంగతి చాలామందికి తెలియక పోవచ్చు....తెలిసినా తెలియనట్లు నటించొచ్చు, లేదా అంత శ్రమ పడడం శుద్ధ దండగ అని కొట్టి పడేయ్యవచ్చు. 

ఎంత పెద్ద పేరున్న నటుడైనా ఎప్పుడైనా తడబడతాడేమో గానీ ఎంత పెద్ద డైలాగ్ ఇచ్చినా ఒక్క అక్షరం పొల్లు పోకుండా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసాడా అన్నట్లు నటించే నటుడు సాక్షి రంగారావు. ఆయన సంభాషణా ప్రవాహానికి ఒక ఉదాహరణ ' నటనలో జీవించిన సాక్షి ' అనే టపాలో గతంలో వివరించాను.

అయితే ఎంత గొప్పవారికైనా, ఎంత జాగ్రత్త తీసుకున్నా ఒక్కోసారి తప్పటడుగు పడే సందర్భం వస్తుంది. అంతటి ధారణాశక్తి కలిగిన సాక్షి రంగారావు గారికి కూడా అలాంటి పరిస్థితి ఒకసారి ఎదురయింది. అయితే దాన్నుంచి ఆయన ఎలా బయిట పడ్డారో చూద్దాం.......

ప్రకృతి వైపరీత్యాలు ఎదురైనపుడు బాధితుల సహాయం కోసం చలనచిత్ర నటులు సాంస్కృతిక ప్రదర్శనలివ్వడం ద్వారా ధన సేకరణ చెయ్యడం ఆనవాయితీ. అలా ఓసారి కరువు బాధితుల సహాయం కోసం సూపర్ స్టార్ కృష్ణ తెనాలిలో ఓ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ప్రముఖ నటీనటులు పాల్గొన్నారు. అందులో భాగంగా కృష్ణ, చంద్రమోహన్, సత్యనారాయణ, రావికొండలరావు, రాధాకుమారి, సాక్షి రంగారావు పాల్గొన్న ' వింత మనుషులు ' అనే హాస్యనాటిక ప్రదర్శించారు.

సాక్షి రంగారావు చేతిలో గొడుగుతో స్టేజి మీదకు ప్రవేశించే ఘట్టం. ఆయన హుషారుగా వచ్చేసాడు. కానీ ఆయన  మీసం పెట్టుకోవడం మరచిపోయాడు. ఆది గమనించిన రావికొండలరావు గారు ఊరుకోకుండా సాక్షి చెవిలో ' మీసం పెట్టుకోలేదేం ? ' అని అడిగారు. దాంతో సాక్షిగారు తెల్లబోయారు. గుటకలు మింగారు. ఆ తప్పు ఎలా జరిగిందో అర్థం కాక అయోమయంలో పడిపోయారు.

అంతే ! ఆ దెబ్బకి చెప్పాల్సిన డైలాగ్ మరిచిపోయారు. తోటి నటీనటులందరి వంకా వెర్రిచూపులు చూస్తూ నిలబడిపోయారు. ఆయన మొహంలో రకరకాల భావాలు ఒకేసారి కనిపించాయి. డైలాగ్ గుర్తు తెచ్చుకోవడానికి రకరకాల వింత చేష్టలు చేశారు. ఇదంతా చూస్తున్న ప్రేక్షకులు మాత్రం ఆది కూడా నటనలో భాగమే అనుకుని ఆనందపడిపోయారు. పగలబడి నవ్వారు. చివరికి గండం గట్టెక్కిందనుకోండి. సాక్షి రంగారావు గారిని మీసం చేసిన మోసం కథ ఆది.   

Vol. No. 02 Pub. No. 042

Wednesday, October 13, 2010

అందరూ దిగ్దంతులే !

 ఓసారి రవీంద్రభారతిలో పండితసభ జరుగుతోంది. అందులో గిడుగు సీతాపతి గారు, విశ్వనాథ సత్యనారాయణ గారు, వేదుల సత్యనారాయణ గారు లాంటి పెద్దలంతా పాల్గొన్నారు. భాషావాదం పైన వాడిగా, వేడిగా  చర్చ జరుగుతోంది.

' ఏ వస్తువైనా సరే ఏ కాలంలోనైనా, ఏ దేశంలోనైనా ధనవంతులకు మాత్రమే కాకుండా సామాన్య ప్రజలకు అందుబాటులో ధరలో ఉంటేనే బాగుంటుంది. అలాగే విద్వాంసులకోసం పండిత భాష అనేది వున్నా కూడా సామాన్యులకు కోసం సరళమైన భాష ఉండాలి. అప్పుడే భాషలోని పరిమళం అందరికీ అందుతుంది. '

....... అని పెద్దలందరూ సుదీర్ఘ చర్చ తర్వాత తీర్మానించారు. ఈ చర్చ మొత్తాన్ని ఆ వేదిక మీదే కూర్చున్న దేవులపల్లి వారు మౌనంగా గమనిస్తున్నారు. వేదుల వారికి అనుమానం వచ్చింది. భాషావాదం పైన ఇంత ఘాటుగా చర్చ జరుగుతుంటే అందులో పాల్గోవటం మానేసి కృష్ణశాస్త్రి గారు ఏమీ మాట్లాడకుండా కూర్చున్నారేమిటా అని.  అదే విషయం ఆయన్ని అడిగారు.

" వారంతా దిగ్దంతులు. వారితో మనమేం మాట్లాడగలం చెప్పండి " అని చమత్కరించారు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు.

...... ఆ సభలో పాల్గొన్న పెద్దల్లో చాలామంది  ఢెబ్భైవ పడిలో పడ్డవారే !                                   
Vol. No. 02 Pub. No. 036

Wednesday, September 22, 2010

నడి ' మం ' త్రపు సిరి

 సంస్కృతం భారతీయ భాషలన్నిటికీ తల్లి వంటిది. ఆ భాషా వ్యాప్తికి ఎందఱో మహానుభావులు తమ జీవితాలు అంకితం చేశారు.
వారిలో ప్రముఖులు కాశీ కృష్ణాచార్య గారు. ఆయనకు పద్య ధారణా శక్తి ధారాళంగా ఉండేదని చెప్పుకునేవారు. కృష్ణాచార్య గారు మంచి వక్త కూడా !

ఒకసారి ఆయనకు మచిలీపట్టణంలో ఘన సన్మానం ఏర్పాటయింది. ఆయన్ని వేదిక మీదకు ఆహ్వానిస్తూ ఆ నిర్వహణా సంఘ సభ్యుడు
" కాశీ కృష్ణమాచార్య గారిని వేదికను అలంకరించవలసినదిగా కోరుతున్నాం "
అని సంభోధించారు. అలాగే కృష్ణాచార్య గారిని సభకు పరిచయం చేసే సందర్భంలో కూడా అదే పేరుతో పరిచయ కార్యక్రమం కానిచ్చారు. పండితుల వారు ఈ విషయాన్ని నిశితంగా గమనించారు. తర్వాత కృష్ణాచార్యుల వారు తమ ప్రసంగం ప్రారంభిస్తూ

" నాగురించి పరిచయకర్తలు చెప్పినట్లు నాకు నడి'మం'త్రపు సిరి లేదు. నాపేరు కేవలం కృష్ణాచార్య మాత్రమే ! "
అన్నారు.  పండితులకు చమత్కారభాషణ సహజమే కదా !

Vol. No. 02 Pub. No. 031

Sunday, September 19, 2010

సూర్యకాంతమ్మ వైద్యం.. చిట్కా !


జలుబు, జ్వరాల కాలం నడుస్తోంది. ఎక్కడ చూసినా, ఎవరిని చూసినా వీటితో బాధపడుతున్నవారే ! ఈ బాధలో ఎవరైనా తమకు తెలిసిన ఏ చిన్న చిట్కా వైద్యం చెప్పినా, కొంచెం సానుభూతి చూపించి పలకరించినా చాలా ఉపశమనంగా వుంటుంది. 

ఇప్పుడంటే పూర్తి వ్యాపారమై పోయి సంబంధాలన్నీ ఆర్థిక పరమై పోయాయి గానీ గతంలో చిత్ర పరిశ్రమలో కూడా కళాకారులు, సాంకేతిక నిపుణులు, నిర్మాత దర్శకులు...... ఒకరేమిటి.... అందరి మధ్యా ఆర్థికానుబందాల కంటే ఆత్మీయతానుబంధాలు ఎక్కువగా వెల్లి విరిసేవి. దానికో ఉదాహరణ.  

సూర్యకాంతమ్మ అంటే గయ్యాళితనానికి మారు పేరుగా స్థిరపడిపోయింది. కానీ ఆవిడ నిజ జీవితంలో ఎంత సాత్వికురాలో అప్పట్లో పరిశ్రమతో పరిచయం వున్న వారందరికీ తెలుసు. ఆవిడ గళంలో గయ్యాళితనం ఎంత బాగా ప్రతిబింబింబిస్తుందో, అంత బాగా ఆత్మీయత ప్రతిఫలించేది.
ఆవిడ సెట్లో వుంటే ఎవరికి ఏ నొప్పి వచ్చినా, ఏ బాధ కలిగినా ఆప్యాయంగా పలుకరించేది.  అంతే కాదు ఆవిడకు గృహవైద్యంలో ప్రవేశం వుండేదేమో... ఎప్పుడూ కూడా అల్లం, శొంఠి, మిరియాలు, వేపచెక్క లాంటివి కూడా వుంచుకునేవారు. వాటితో చిట్కా వైద్యం చేసి అందరి బాధలను పోగొట్టేవారు.  ఆ గృహవైద్యం కంటే ఆవిడ మాటలే వాళ్లకి మంచి ఔషధాలుగా పనిచేసి ఇట్టే ఉపశమనం ఇచ్చేవి. వాళ్ళు మళ్ళీసారి ఆవిణ్ణి కలిసినపుడు వారి బాధలు తగ్గినా వైనాన్ని చెప్పి కృతజ్ఞతలు తెలియజేస్తే ఆవిడ పొంగిపోయేదట.
తన చుట్టుపక్కల వాళ్ళందరూ ఆరోగ్యంతో ఆనందంగా వుండాలని కోరుకోవడం కంటే గొప్పతనం ఉందంటారా ?  అదే  సూర్యకాంతమ్మ గారిలో విశేషం. అయితే ఇలా అందరికీ చిట్కా వైద్యాలు చెబుతూ పోతుంటే అప్పుడప్పుడు ఎలా ఎదురు తిరుగుతాయో ఆవిడకు సంబంధించినదే....... ఓ సరదా సంఘటన......

సూర్యకాంతం గారు ఒకసారి షూటింగ్ నిమిత్తం మద్రాస్ నుండి హైదరాబాద్ రైలులో బయిలుదేరారు. ఆవిడతో బాటు ఆ కూపేలో మరొక ఆవిడ కూడా ప్రయాణం చేస్తోంది. బాగా జలుబు చేసిందేమో ఆవిడ అదే పనిగా తుమ్ముతోంది. ఆది చూసి సూర్యకాంతమ్మ గారికి ఖంగారు పట్టుకుంది.... ఆ జలుబు తనకేక్కడ పట్టుకుతుందోనని. ఎందుకంటే మర్నాడు షూటింగ్ వుందాయే !  ఎప్పుడూ తనతో కూడా ఉండే చిట్కా మందులు లేవేమో మరి ఆవిడకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు. అందుకని తన సహజ ధోరణిలో ఆ తుమ్ముతున్నావిడతో.......

" చూడండమ్మా ! జలుబుని అశ్రద్ధ చెయ్యకూడదు. వచ్చే స్టేషన్ లో శారిడాన్ బిళ్ళలేమైనా దొరుకుతాయేమో చూడండి. దొరికితే అవి రెండు వేసుకుని వేడి వేడి కాఫీ తాగండి. చలిగాలి తగలకుండా తలకు మఫ్లర్ కట్టుకోండి. వెచ్చగా శాలువా కప్పుకుని పడుకోండి. తెల్లారి సికింద్రాబాద్ లో దిగేటప్పటికి జలుబు, గిలుబు ఎగిరిపోతుంది " అంటూ ఎడా పెడా సలహాలిచ్చేసారు సూర్యకాంతమ్మ.

జలుబు, తుమ్ములతో బాధపడుతున్న పక్కావిడ ఏమీ మాట్లాకుండా మౌనంగా వింటూంది. సూర్యకాంతం గారికి అనుమానం వచ్చింది.

" ఇంతకీ నేను చెప్పింది వింటున్నారా ? నా సలహాలు మీకు అర్థమయ్యాయా ? పాటిస్తారా ? ఇప్పటిదాకా నేనే వాగుతున్నాను.  మీరేం మాట్లాడడం లేదు. మీ పేరేమిటో తెలుసుకోవచ్చా ? " అనడిగారు.

ఆవిడ నిదానంగా " డాక్టర్ కామేశ్వరి " అంది. అంతే సూర్యకాంతం గారికి నోట మాట ఆగిపోయింది. 

" ఏమిటో ఈ ముదనష్టపు జలుబు డాక్టర్లను కూడా వదలడం లేదు " అని సణుక్కుంటూ తన బెర్త్ మీదకు వెళ్ళి పడుకున్నారు సూర్యకాంతం.          

Vol. No. 02 Pub. No. 028

Saturday, September 18, 2010

ఉద్యోగ భయం

నేడు చెన్నైగా మారిన మదరాసు మహానగరంలో ఒకప్పుడు ట్రామ్ బళ్ళు తిరిగేవి. ఆ రోజుల్లో ఒకసారి ఒక ట్రామ్ లో ప్రయాణం చేస్తున్న రచయిత ఆచంట జానకిరామ్ గారికి వెలిసిన పాత కోటు వేసుకుని అతి దీనమైన అవతారంతో వున్న కవి పుంగవులు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు కనిపించారు.

ఆయన పరిస్థితి చూసి ఏమీ అర్థం కాకపోయినా దగ్గరకెళ్ళి పరిచయం చేసుకున్నారు జానకిరామ్ గారు.
 అలా జరిగింది ఆ సరస్వతీ పుత్రుల తొలి పరిచయం. మర్నాడు జానకిరామ్ గారు మరో కవిశేఖరులు మల్లంపల్లి చంద్రశేఖర శాస్త్రి గారి ఇంటికి వెళ్లారు. అప్పుడక్కడికి కృష్ణశాస్త్రి గారు కూడా వచ్చారు. అయితే ఇప్పుడు మరో వేషంలో. మల్లెపువ్వులాంటి తెల్లని లాల్చీలో అచ్చమైన భావకవిలా వెలిగిపోతూ కనిపించారు. నిన్నటికీ, ఈరోజుకీ ఎంత తేడా అని జానకిరామ్ గారు ఆశ్చర్యపోయారు. అదే విషయం అడుగుదామని

" నిన్న మీరు ట్రాంలో..... వెలిసిపోయిన కోటులో .... " అంటూండగానే........

దేవులపల్లి వారు అందుకుని " అదా..... ఎవరో ఉద్యోగం యిస్తాం రమ్మన్నారు. వెళ్లక తప్పింది కాదు. వాళ్ళు అన్నంతపనీ చేస్తారేమోనని జడిసి ఆ కోటు తొడుక్కుని వెళ్లాను. అమ్మయ్య ! అదృష్టవశాత్తూ ఆ ఉద్యోగం రాలేదు " అన్నారట.

Vol. No. 02 Pub. No. 027

Friday, September 17, 2010

' రావణాసురుడు ' కాదు !


 ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా నీలం సంజీవరెడ్డి గారు పనిచేస్తున్న రోజుల్లో ఉత్తరాంధ్రకు చెందిన మాజీ మంత్రి భాట్టం శ్రీరామమూర్తి గారు విధాన సభలో సోషలిస్ట్ పార్టీ సభ్యులుగా వుండేవారు.

ఒకసారి శ్రీరామమూర్తి గారు అధికార పక్షాన్ని విమర్శిస్తుంటే సంజీవరెడ్డి గారు సభను ఉద్ద్యేశించి మాట్లాడుతూ....
" అధికార పక్షాన్ని దుయ్యబట్టే హక్కు ఒక్క ప్రతిపక్ష సభ్యులదే కాదు. అధికారపక్ష సభ్యులకు కూడా ఉంటుంది. మా పార్టీ సభ్యులై నన్నోకసారి రావణాసురుడు అన్నారు " అంటూ చెబుతుంటే ..........

వెంటనే భాట్టం శ్రీరామమూర్తి గారు అడ్డుకుని ......

" అయ్యా ! నేను గౌరవనీయ ముఖ్యమంత్రి గారిని రావణాసురుడితో పోల్చలేదు. అలా పోల్చలేను కూడా ! ఎందుకంటే రావణాసురుడు గొప్ప తపస్సంపన్నుడు కదా ! " అన్నారు. సభంతా గొల్లుమంది.

Vol. No. 02 Pub. No. 026

Friday, September 3, 2010

సాంగుల గ్రంథం

చమత్కారాలు పలికించడంలో కవులు, రచయితలు సిద్ధహస్తులు. ఆ విషయంలో మనకి ఎలాంటి సందేహం లేదు. మరి కవిత్వంలో ఉద్ధండులైన ఇద్దరు మహానుభావులు కలిస్తే .....................



దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి గారు భావకవిత్వమెంత మధురంగా చెప్పగలరో సరస సంభాషణ కూడా అంతే మధురంగా చెయ్యగలరు.









కొసరాజు రాఘవయ్య చౌదరి తెలుగు సినీ కవిత్వాన్ని జానపదుల బాట పట్టించిన ఘనులు.


వీరిద్దరూ కలిస్తే ఆ సంభాషణ ఎంత సరసంగా వుంటుందో కదా ........ !

వాహినీ వారి ' బంగారు పంజరం ' చిత్రానికి పాటలు రాసే పనిలో వున్న దేవులపల్లి వారి దగ్గరకి కొసరాజు గారు వచ్చారు. ' పుస్తకం హస్త భూషణం ' అనే మాట కొసరాజు గారికి సరిగా సరిపోతుంది. ఆయన చేతిలో ఎల్లవేళలా ఒక పుస్తకం ఉండేది. దాంట్లో ఆయన రాసిన పాటలు, రాస్తున్న పాటలు ఉండేవి.

వస్తూనే దేవులపల్లి వారికి నమస్కారం చేశారు కొసరాజు గారు.  ప్రతి నమస్కారం చేస్తూ కృష్ణశాస్త్రి గారు కొసరాజు గారి చేతిలోని పుస్తకాన్ని ఏమిటన్నట్లు సైగ చేశారు.

విషయం గ్రహించిన కొసరాజు గారు ఆ పుస్తకాన్ని దేవులపల్లి వారికి చూపిస్తూ "  సాంగుల గ్రంథం " అన్నారు.
దానికి దేవులపల్లి వారు వెంటనే.......
 " సాంగుల గ్రంథం అంటున్నారు. మీరు గ్రంథ సాంగులు కారు కదా !  " .... అని చమత్కరించారు.

Vol. No. 02 Pub. No. 019

Monday, August 23, 2010

మూగ ప్రజా ప్రతినిధి


 ఈ పేరు గత తరం పాఠకులకు చిరపరిచితం. దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారు ప్రారంభించిన ఆంధ్రపత్రిక ఆ రోజుల్లో అఖిలాంద్ర ప్రజల ఆదరాభిమానాల్ని అమితంగా చూరగొంది.

ఆ పత్రికను స్వయంగా నడుపుతూ సంపాదక బాధ్యతలను కూడా చిరకాలం నిర్వహించిన శివలెంక శంభుప్రసాద్ గారు కొంతకాలం పార్లమెంట్ సభ్యునిగా కూడా పనిచేసారు. అయితే పార్లమెంట్ లో అనవసర చర్చల్లోను, వాదోపవాదాలలోను పాల్గోవడం ఆయనకు నచ్చని విషయం. అందుకే సాధారణంగా సమావేశాల్లో ఆయన నోరు మెదిపేవారు కాదు.

ఒకసారి ఒకాయన శంభుప్రసాద్ గార్ని " ప్రసాద్ గారూ ! మీరు పార్లమెంట్ లో ఎప్పుడూ మాట్లాడరేమిటి ? " అనడిగాడట.

దానికి సమాధానంగా " అశేష మూగ ప్రజానీకానికి నేను ప్రతినిధిని కదా ! నేనేం మాట్లాడగలను ? " అని చమత్కరించారట శంభుప్రసాద్ గారు.

Vol. No. 02 Pub. No. 011

Tuesday, August 17, 2010

కవి ప్రభావం - పన్ను భారం



తల్లావఝుల శివశంకర శాస్త్రి గారు బహు భాషావేత్త, పండితులు. సాహితీసమితి ని స్థాపించి నవ్య సాహితీ సమితిగా దాన్ని మార్చి ఎందఱో కవులను, పండితులను ప్రోత్సహించారు.

శివశంకరశాస్త్రి గారికి పళ్ళు ఊడిపోయి బోసినోరు వచ్చేసింది. ఒకసారి ఆయన బోసినోటిని చూసి  ఒక మిత్రుడు " మీరు పళ్ళు కట్టించుకుంటే బాగుంటుంది కదా ! " అని ఓ ఉచిత సలహా పడేసాడు.

దానికి శాస్త్రిగారు ఓ బోసి నవ్వు నవ్వి
" నాకు వాక్ - స్థానం కవి. ఆ కవిగాడి ప్రభావం వల్లనే నా నోట్లో ఒక్క పన్ను కూడా మిగలకుండా పోయింది. కవిగాడి ప్రభావానికి ఎదురు నిలవడం ఎవరితరం. అయినా భారాలు ఎక్కువైపోతున్న రోజుల్లో పన్నుల భారం తగ్గినందుకు సంతోషించాలి కదా ! " అన్నారట.

శ్లేషలంటే పండితులకు నల్లేరు మీద బండి నడక లాంటివి కదా !

Vol. No. 02 Pub. No. 006

Monday, August 16, 2010

మేకప్ గొప్పా......???

 మేకప్ మహత్యమేమిటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అనాకారిని అందంగా మలచవచ్చు. అందంగా ఉన్నవారిని కురూపిగా చూపించవచ్చు.

అలాగే సన్నివేశంలోని భావప్రకటనకు అనుగుణంగా ముఖకవళికల్ని మార్చవచ్చు. ఈ విషయం మనతో బాటు ఒకప్పటి హాస్యనటుడు సీతారాం కూడా ఒప్పుకుంటాడు. ఓసారి ఆయన తన ముందు తరంలోని మేకప్ కళాకారుడు హరిబాబుని తలుచుకుంటూ.....

" ఆ రోజుల్లో హరిబాబు ఎంత అద్భుతంగా మేకప్ చేసేవారంటే, చిరునవ్వులు చిందే ముఖాన్ని అరగంటలో దుఃఖరసం ఉట్టి పడేటట్లు మలచేవారు " అన్నాడు.

అంతే ! ఆ ప్రక్కనే వున్న చాయాదేవి వెంటనే అందుకుని .............

" అదో గొప్పా ! ఒక్క మొట్టికాయతో అర సెకండ్ లో నేనా పని చెయ్యగలను " అందట.    

Vol. No. 02 Pub. No. 004

Thursday, August 5, 2010

ఆర్యుల ముఖ్య ఆహారం




మునిమాణిక్యం నరసింహారావు గారి పేరు తెలియని సాహితీ ప్రియులుండరేమో ! గిలిగింతలు పెట్టే ' కాంతం కథలు ' ఒక్కటి చాలు ఆయన్ని హాస్య రచయితగా తెలుగువారి మదిలో నిలపడానికి.

ఆయన మచిలీపట్టణం లోని హిందూ హైస్కూల్లో పనిచేశారు. అప్పట్లో ఆయనకో వింత అలవాటుండేది. తరచూ గోళ్ళు కొరుక్కునేవారు. పాఠం చెప్పే సమయంలో కూడా ఆ అలవాటు కొనసాగేది. 

ఓసారి ఆయన ' ఆర్యులు - నాగరికత ' పాఠం చెబుతున్నారు. ఆయన పాఠంతో బాటు గోళ్ళు కొరకడం కూడా సాగుతోంది. మధ్య మధ్యలో విద్యార్థుల్ని ప్రశ్నలడుగుతున్నారు.

" ఆర్యుల ముఖ్య ఆహారం ఏమిటి ? " అని ఒక విద్యార్థిని లేపి అడిగారు.
 
" గోధుమలు, సజ్జలు, వరి ....... " అని నసుగుతున్నాడు ఆ విద్యార్థి.  మునిమాణిక్యం గారు తన పని కానిస్తూనే ఆ విద్యార్థితో 

" ఇంకా... " అన్నారు.

" రాగులు, జొన్నలు....." అని ఆగాడు, మేస్టారు ఇంకా ఏం చెప్పారా అని ఆలోచిస్తూ. మాస్టారు అతన్ని మరింత ఉత్సాహపరచాలని

" ఇంకా.... ఇంకా ....." అంటూనే వున్నారు గోళ్ళు కొరుక్కునే కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే.

ఇంకా ఏమున్నాయా అని తీవ్రంగా ఆలోచిస్తున్న ఆ విద్యార్థి పరధ్యానంగా

" గోళ్ళు " అన్నాడు.

.................. అంతే !  మాస్టారితో బాటు పిల్లలంతా ఒకటే నవ్వులు.

Vol. No. 01 Pub. No. 365

Tuesday, July 27, 2010

హాస్యాస్పదం





సున్నితమైన హాస్యం, వ్యంగ్యం అణువణువునా తొణికసలాడే సంభాషణలతో తెలుగు సినిమా ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించిన రచయిత డి.వి. నరసరాజు గారు. సన్మానాలు, బిరుదులపై ఆయన విసిరిన ఓ ఛలోక్తి ............



ఒకప్పుడు ఒకానొక ' కళాసమితి ' వారు నాకు సన్మానం చేస్తామని వచ్చారు.
సన్మానంతో బాటు బిరుదు కూడా  ఇవ్వదలచుకున్నామని చెప్పారు.

" ఏం బిరుదు ఇస్తారు ? " అని అడిగాను. 

" మీరు హాస్యం బాగా రాస్తారుగనుక ' హాస్యాస్పదబ్రహ్మ ' అని ఇద్దామనుకున్నాం " అన్నారు.

" ఇప్పుడు ఒంట్లో ఓపిక లేదు. తర్వాత చేయించుకుంటాను సన్మానం " అని పంపేసాను.

' హాస్యం ' , ' హాస్యాస్పదం ' ఈ రెండు పదాలకు తేడాలేదు వారి దృష్టిలో.

మిత్రుల ఇళ్ళకు వెడితే వాళ్లకిచ్చిన సన్మాన పత్రాలు  గోడలకు తగిలించినవి, షో కేసులలో పెట్టివున్నవి తీరిగ్గా చదవడం నాకు ఎంతో ఇష్టం !

వాటిలో ఎంతో ' హాస్యం ' వుంటుంది. ' హాస్యం ' , హాస్యాస్పదం ' లాంటిదే !

Vol. No. 01 Pub. No. 356

Friday, July 9, 2010

'భట్' రాజీయం


డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి గురించి చెప్పగానే మనకి ముందు గుర్తుకొచ్చేది ఆంధ్రాబ్యాంకు. ఆయన దాని వ్యవస్థాపకుడు. తర్వాత కృష్ణా జిల్లాతో, ముఖ్యంగా బందరుతో  అనుబంధమున్న వాళ్లకి ఆయన పేరు చెప్పగానే గుర్తుకొచ్చేది ఆంధ్రా జాతీయ కళాశాల. దాని వ్యవస్థాపకుల్లో ముఖ్యులు డా. పట్టాభి. ఆయన దేశభక్తుడు, జాతీయవాది.




ఒకసారి ఆయనకు బందరులో సన్మాన సభ ఏర్పాటు చేశారు. సభ ప్రారంభమైంది. ప్రసంగాలు ప్రారంభమయ్యాయి. సన్మాన సభ అనగానే ఆ సన్మాన స్వీకర్తను పొగడ్తలతో ముంచెత్తడం సర్వసాధారణం. అలాగే ఆ సభలో కూడా పట్టాభిగారి మీద పొగడ్తల వర్షం కురుస్తోంది. ఒక శ్రోత మరీ రెచ్చిపోయి " భోగాన్ని అనుభవించడంలో ఆయన భోగరాజు. దానం చేయడంలో ఆయన దానరాజు, త్యాగశీలత గల త్యాగరాజు..... " అంటూ ఆవేశంగా పొగిడేస్తున్నాడు.

డా. పట్టాభి గారికి పొగడ్తలంటే సుతరామూ గిట్టదు. హద్దులు దాటేస్తున్న పొగడ్తలను భరించలేక లేచి మైక్ అందుకుని
" నా గురించి ఈయన చెప్పింది ఎంతవరకూ నిజమో తెలియదు గానీ, ఈయన మాత్రం నిజంగా  ' భట్ ' రాజే ! " అని చమత్కరించారు.
ఇంతకీ అప్పటివరకూ డా. భోగరాజు పట్టాభి సీతారామయ్యగారిని పొగడ్తలతో ముంచేసిన వక్త పేరు పి.సి.భట్. అదీ సంగతి.


Vol. No. 01 Pub. No. 344

Thursday, July 8, 2010

శిధిల శిల్పం

 తెలుగు నాటక ప్రియులకు చిరపరిచితమైన పేరు బళ్ళారి రాఘవ. రంగస్థల నటుడిగా ఆయన అధిరోహించిన కీర్తిశిఖరాలు మహోన్నతమైనవి.

బళ్ళారి రాఘవాచార్యులు గారి వృద్ధాప్యంలో ఆయనకు అభినందన సభ ఏర్పాటయింది. ఆ సభకు ప్రముఖ కవులు, రచయితలు తల్లావఝుల శివశంకర శాస్త్రి, దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ లాంటి మహామహులు హాజరయ్యారు. ఆ సందర్భంగా వీరందరూ రాఘవ గారింట్లోనే బస చేశారు. సభ విజయవంతంగా జరిగింది. ఆ ఆనందం పంచుకోవడానికి వీరందరూ మరో నాలుగైదు రోజులు అక్కడే వుండి పోయారు. వారు తిరుగు ప్రయాణానికి తయారవుతుంటే బళ్ళారి రాఘవగారు .......

" ఎలాగూ ఇంత దూరం వచ్చారు. ఇక్కడకి దగ్గరలోనే హంపి వుంది. అక్కడ శిధిలాలు చూసి పోదురుగాని " అన్నారు.

ఆది విని మాటల శ్లేషల శ్రీశ్రీ  " మిమ్మల్ని చూస్తున్నాంగా...... "  అన్నారు, అప్పటికే శిధిల శిల్పంలా మారిన రాఘవగారిని చూస్తూ !
  
Vol. No. 01 Pub. No. 343

Tuesday, July 6, 2010

పేర్ల పేరడీ

 తన పేరునే పేరడీ శాస్త్రిగా పిలిపించుకున్న పేరడీ రచయిత జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి. అప్పట్లో ప్రముఖ రచయితల రచనలన్నిటికీ పేరడీలు రాసిన ఘనత ఆయనది. ఈ పేరడీలల్లడంలో ఆయన ప్రతిభ అసమానమైనది, అనుపమానమైనది. ఆయన ప్రతిభ గురించి అడిగితే  తన పేరునే పేరడీ చెయ్యగల చమత్కారి. హాస్యరసం వొలికించే ఆయన జవాబులు చూడండి.

ప్రశ్న :  అసలు ఈ పేరడీ అనేది ఎక్కడ నేర్చుకున్నారు ?
జరుక్ : మా నాన్నగారి దగ్గర నేర్చుకున్నాను.
ప్రశ్న :  అదెలా ? 
జరుక్ : తెలుగు వాళ్ళలో నాపేరులాంటి పేరు ఎవరికైనా ఉందా ? కృష్ణశాస్త్రి అనకుండా మా నాన్న బెంగాలీ పేరును పేరడీ చేసి రుక్మిణినాథశాస్త్రి అని పేరు పెట్టారు. నిజానికి నాకు, కృష్ణశాస్త్రికి తేడా లేదు.
ప్రశ్న :  మరి మీ ఇంటి పేరు కూడా ' జలసూత్రం ' అని తమాషాగా వుంది కదా ! దాని భావమేమిటో ?
జరుక్ : ఏముందీ ! H 2 O ఫార్ములాని మా వాళ్ళే కనిపెట్టారట. అందుకే ఆ పేరు వచ్చిందట.

............................... ఇదండీ ఆయన పేర్ల పేరడీ.

 Vol. No. 01 Pub. No. 341

Friday, July 2, 2010

గో ' నిధి '

ఆదిభట్ల నారాయణదాసు గారు ప్రఖ్యాతి గాంచిన హరికథకులు. చమత్కారి.  ఆయన అప్పుడప్పుడు సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేపట్టేవారు. ఆ క్రమంలో ఒకసారి గోసంరక్షణ నిమిత్తం విరాళాలు సేకరించారు. ఇంతవరకూ బాగానే వుంది.


ఒకసారి ఆయన హరికథ చెబుతుండగా ఒక శ్రోత లేచి 

" అయ్యా ! దాసుగారూ ! మీరు గోసంరక్షణ పేరుతో చాలా డబ్బు వసూలు చేసారు. అదంతా మీరే కైంకర్యం చేసేసారని అభియోగం. దీనికి  మీ సమాధానం ఏమిటి ? " అని అడిగాడు నిలదీసే ధోరణిలో.

దానికి దాసు గారు ఏమాత్రం తొట్రుపాటు లేకుండా చిరునవ్వు నవ్వి
" వెర్రి నాయనా ! నేను కూడా గంగిగోవు లాంటి వాడినే. ముందు నన్ను నేను రక్షించుకోవాలి కదా ! అందుకే ఆ ద్రవ్యంతో నన్ను నేను రక్షించుకున్నాను. మరి నేను గోసంరక్షణ చెయ్యలేదంటావా ? "
అనగానే సభికులందరూ ఘొల్లున నవ్వారట.


Vol. No. 01 Pub. No. 336

Thursday, July 1, 2010

రిలాక్ ' సింగ్ '

మిల్కాసింగ్ - ఫ్లయింగ్ సింగ్ 

దేశ విభజన సమయంలో జరిగిన అల్లర్లలో తల్లిదండ్రుల ఊచకోత కళ్ళారా చూసి భయంతో ప్రాణాలను అరచేత పెట్టుకుని తాను పుట్టిన పాకిస్తాన్ నుంచి భారత్ వైపు పరుగెత్తుకుంటూ రావడంతో ఆయన పరుగు జీవితం ప్రారంభమైంది.


ఆ పరుగే తర్వాత ఆయన వృత్తి అయింది. భారత అథ్లెటిక్ చరిత్రను తిరగరాసింది. ప్రపంచ అథ్లెటిక్ పోటీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన క్రీడాకారుడు మిల్కాసింగ్.

1958 లో కటక్ లో జరిగిన జాతీయ క్రీడల్లో మిల్కాసింగ్ ప్రతిభ వెలుగులోకి వచ్చింది. అందులో 200 మీటర్ల, 400 మీటర్ల రికార్డు సృష్టించాడు. అదే సంవత్సరం అదే విభాగాల్లో టోక్యో ఆసియా క్రీడల్లో సరికొత్త రికార్డులు నెలకొల్పాడు. అదే సంవత్సరం కార్డిఫ్ లో జరిగిన కామన్ వెల్త్ క్రీడల్లో స్వర్ణ పతకం దక్కించుకున్నాడు.

రెండు సంవత్సరాల తర్వాత 1960 లో జరిగిన రోమ్ ఒలింపిక్స్ లో అద్భుతమైన ప్రావీణ్యాన్ని ప్రదర్శించి విజయకేతనాన్ని ఎగురవేశారు.  అద్భుతమైన ప్రతిభ కనబరిచినా చివరి క్షణంలో తీసుకున్న ఒక నిర్ణయం కారణంగా ప్రథమ స్థానాన్ని కోల్పోవలసి వచ్చింది. తాను మరీ వేగంగా పరుగెడుతున్నానని భావించిన మిల్కాసింగ్ ఒక్క క్షణం రిలాక్స్ అవడం దీనికి కారణం. అయినా ఫోటో ఫినిష్ ఫలితం రావడం విశేషం. 44.8 సెకండ్లు ప్రథమ స్థానం కాగా మిల్కాసింగ్ 45.6 సెకండ్లలో పూర్తి చేసి నాలుగో స్థానంలోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత 38 సంవత్సరాల వరకూ ఆ రికార్డుని ఏ భారత అథ్లెట్ అధిగమించలేదు.

మిల్కాసింగ్ ' రిలాక్సింగ్ ' గురించి ఆయనే చెప్పిన ఓ జోకు .........

మిల్కాసింగ్ కు అప్పట్లో ఇంగ్లీష్ అంతగా రాదు. 1960 ఒలింపిక్స్ లో పోటీ పూర్తయ్యాక ఆయాసం తీర్చుకోవడానికి నేలపైన పడుకుండి పోయాడు. అతనితో ఇంటర్వ్యూ చెయ్యడానికి ఒక మహిళా జర్నలిస్ట్ వచ్చింది. తనదే తొలి ఇంటర్వ్యూ కావాలని ఆమె ఆత్రుత. హడావిడిగా ప్రశ్నలడగడం మొదలు పెట్టింది. అసలే ఇంగ్లీష్. ఆపై ఖంగారు. మన సింగ్ గారికేమో ఆయాసం. ఆవిడ ప్రశ్నలు వేస్తోంది. అతనికి అర్థం కావడం లేదు. సమాధానాలు లేకపోవడంతో ఆవిడ ప్రశ్నలాపి,
' మిస్టర్ ! ఆర్ యూ రిలాక్సింగ్ ! ' అనడిగింది. 
ఈ ప్రశ్న మాత్రం మిల్కాసింగ్ కి అర్థమైనట్లనిపించింది.  దీనికైనా సమాధానం చెప్పకపోతే బాగోదనుకున్నాడేమో వెంటనే లేచి కూర్చుని
' నో ! నో ! ఐయాం మిల్కాసింగ్ ! ' అన్నాడు హుషారుగా !

Vol. No. 01 Pub. No. 335