Tuesday, February 9, 2010

ఆజన్మాంతం

కొంతమంది అడ్డూ ఆపూ లేకుండా డబ్బు సంపాదించడమే పనిగా పెట్టుకుంటారు.
ఆ సమయంలో ఆకలిదప్పులు తెలియవు. కొందరైతే ఉచ్చ్హనీచాలు కూడా మరచిపోతారు.
అలా సంపాదించీ, సంపాదించీ అలసిపోయాక, జీవిత చరమాంకానికి చేరుకున్నాక బెంగ పట్టుకుంటుంది.
భయం చుట్టుకుంటుంది.
తన తదనంతరం ఈ సంపదంతా ఏమై పోతుంది ?
తన పిల్లలు దీన్ని సవ్యంగా నిలబెట్టుకుంటారా ?
తన సంపద మీద బంధువులు, దాయాదులు కన్నేసి కాజేయరు కదా ?
ఇలా....సవాలక్ష సందేహాలు.
తన బెంగ తీరాలంటే ఒకటే మార్గం.....
తాను మరణాన్ని జయిస్తే బాగుండును.
తన ఆస్థిని తనే కాపాడుకోవచ్చు. ఎవరి మీదా ఆధారపడనక్కర్లేదు.
కానీ... అది సాధ్యమా ?
ఒకవేళ సాధ్యమైతే...... ఏమవుతుంది ?


*** 

అలెగ్జాండర్ ప్రపంచ విజేత. ఆయన గురించి చెప్పుకునే ఓ కథ........         

అలెగ్జాండర్ ప్రపంచంలో తనకు తెలిసిన భూభాగాన్నంతా జయించేసాడు.
అప్పుడు మరణం గుర్తుకు వచ్చింది. ఏదో ఒకరోజు చనిపోక తప్పదు.
ఆ తర్వాత ఇంత కష్టపడి జయించి సంపాదించిన సామ్రాజ్యమంతా ఏమైపోతుంది ? అని బెంగపట్టుకుంది.
అంతే ! ఆయనకు మృత్యువుని జయించాలనిపించింది. అమరుడవ్వాలంటే అమృతం కావాలి.
దానికోసం అన్వేషణ ప్రారంభించాడు. కొండలు, కోనలు, కీకారణ్యాలు అన్నీ గాలించాడు. చివరికి సాధించాడు. ఒకచోట అమృతధార దర్శనమిచ్చింది. మహదానంద పడిపోయాడు.
ఆ అమృతధార ఉన్న చిన్న గుహలో అంతా చీకటి.
ఆ ధార మాత్రం మిలమిలా మెరుస్తూ దర్శనమిచ్చింది. దగ్గరకు వెళ్ళి దోసిటపట్టి తాగబోయాడు.
ఇంతలో అక్కడే చిరకాలంనుంచి నివసిస్తున్న ఒక కాకి అలెగ్జాండర్ ని నిలవరించి 
" నేనూ నీలాగే అమరత్వం సాధించాలని, కలకాలం బ్రతకాలని చాలా యుగాల క్రిందటే ఈ అమృతాన్ని తాగాను. సుదీర్ఘమైన జీవితంలో కొంతకాలం కోరుకున్నవన్నీ తృప్తిగా అనుభవించాను.
తరువాత నెమ్మదిగా అన్నిటి మీదా వాంచ తగ్గింది.
కోరికలన్నీ నశించాయి. దేనిమీదా వ్యామోహం లే్దు.
ఇప్పుడు చచ్చిపోవాలనిపిస్తోంది. కానీ ఈ అమృతం కారణంగా చావు రావడం లేదు.
అనేక ప్రయత్నాలు చేసాను. పీక కోసుకుందామంటే కత్తి బండబారిపోతోంది.
సముద్రంలో దూకితే నీళ్ళమీద తేలుతున్నాను.
ఈ బ్రతుకు బ్రతకలేక రోజు రోజూ చస్తున్నాను.
ఇహలోకంలోనే నరకం అనుభవిస్తున్నాను.
తాగబోయేముందు ఇదంతా నీకు తెలిస్తే మంచిదని చెబుతున్నాను.
అయినా నీకు తాగాలని వుంటే నిరభ్యంతరంగా తాగు.
కానీ భవిష్యత్తులో ఎప్పుడైనా దీనికి విరుగుడు తెలిస్తే మాత్రం నాకు చెప్పు " అందట ఆ కాకి.

ఇంకేం మాట్లాడతాడు ?
అందుకే ఆ ప్రయత్నం విరమించుకుని వెనుదిరిగాడట బుద్ధిశాలైన అలెగ్జాండర్.  


Vol. 01 Pub. 192




1 comment:

  1. ఉచ్చనీచాలు

    uccha means urine FYI

    ReplyDelete