Tuesday, April 27, 2010

భమిడిపాటి వారికి గుర్తు

 హాస్య బ్రహ్మ భమిడిపాటి కామేశ్వర రావు గారికి ఓసారి పెద్ద సమస్య వచ్చిపడింది. ఆయన రాజమండ్రిలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న కాలంలో ఎక్కడికెళ్ళినా అభిమానులనుంచి, శిష్యులనుంచి నమస్కార బాణాలు విరివిగా పడేవి. అయితే ఓసారి అకస్మాత్తుగా ఆయన్ని ఎవరూ పట్టించుకోక పోవడం, పలకరించకపోవడం, నమస్కారాలందించకపోవడం.... ఇంతెందుకు... జగమెరిగిన హాస్యబ్రహ్మను అసలెవరూ గుర్తించకపోవడం జరిగింది. ఇలా హఠాత్తుగా అందరూ తననెందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో కామేశ్వరరావు గారికి ఏమీ అర్థం కాలేదు. ఎందుకిలా జరుగుతోందని ఆలోచిస్తే విషయం బోధపడింది.

కామేశ్వరరావు గారికి అప్పట్లో మెడ మీద చిన్న కణితి వుండేది. దాన్ని కప్పి వుంచడం కోసం ఆయన తన జుట్టును వత్తుగా, అచ్చం భావకవిలా గిరజాలతో పెంచారు. అయితే శస్త్రచికిత్స చేయించి ఆ కణితిని తీసేయడంతో అవసరం తీరిపోయిందని జుట్టు కూడా తగ్గించేసారు. వత్తైన గిరజాల  జుట్టుతో ఆయనను చూడడానికి అలవాటు పడ్డ వాళ్ళు తలకట్టు మారడంతో గుర్తుపట్టలేకపోయారు. దాంతో పలకరింపులు, నమస్కారాలు కూడా మాయమైపోయాయి. ఈ విషయం గ్రహించిన భమిడిపాటి కామేశ్వరరావు గారు సరాసరి తనకు శస్త్ర చికిత్స చేసిన డాక్టర్ దగ్గరకు వెళ్ళారు.

" అయ్యా ! డాక్టర్ గారూ ! మీరు ఎలాగైనా నా కణితిని నాకు తిరిగి తెప్పించండి.  లేకపోతే నన్నెవరూ గుర్తుపట్టటం లేదు. " అన్నారట. అప్పుడు చూడాలి డాక్టర్ గారి పరిస్థితి...!!

హాస్య బ్రహ్మ జయంతి సందర్భంగా ఆయనకు నవ్వుల పువ్వులు సమర్పించుకుంటూ .................

తెలుగు వికీపీడియా లో హాస్యబ్రహ్మ

హాస్యబ్రహ్మ గురించిన గత టపాలు :
హాస్యబ్రహ్మ  ఛలోక్తులు
ధుమాలమ్మ ఓఘాయిత్యం - కథా పరిచయం

భమిడిపాటి వారి అందుబాటులో వున్న రచనలు :

ఈడు జోడు: ఆరు రంగాలుగల రూపకం
రాక్షస గ్రహణం: ఏడు రంగాలుగల రూపకం
వినయ ప్రభ: ఏడు రంగాలుగల రూపకం
మాటవరస: సర్వ సామాన్య విషయముల గురించిన తేలిక రచనల సంపుటి
ప్రణయరంగం: ఏడు రంగాలుగల రూపకం
వసంతసేన: తొమ్మిది రంగాలుగల రూపకం
గుసగుస పెళ్లి: తొమ్మిది కథలు
 
Vol. No. 01 Pub. No.271

3 comments: