Sunday, April 11, 2010

కొత్తొక వింత

 ఏ విషయమైనా కొత్తలో వింతగానే వుంటుంది. సినిమాలు, షూటింగ్ లూ ఇప్పుడు పెద్ద వింత కాకపోవచ్చు గానీ సినిమాలు ప్రారంభమైన చాలాకాలం వరకూ అవి వింతగానే అనిపించేవి. దానికి  ప్రధాన కారణం అప్పుడు చిత్ర నిర్మాణానికి వున్న పరిమితులు కారణంగా స్టూడియో లలోనే ఎక్కువగా నిర్మాణం సాగేది. అవుట్ డోర్ లలోను, ప్రైవేటు భవంతులలోను షూటింగ్ లు జరగడం చాలా అరుదు. గుప్పెడు మూసి వుండేది. అందుకని ప్రజలకు సినిమా ప్రపంచంలో కొత్తగా ఏమి వచ్చినా అబ్బురమే ! అలాంటి ఓ సంఘటన.




విజయ ప్రొడక్షన్స్ వారు తీసిన ' చంద్రహారం ' ( 1953 ) షూటింగ్ జరుగుతున్న రోజుల్లో జరిగిన సంఘటన ఇది. ఆ చిత్ర నిర్మాణం వాహిని స్టూడియో లో జరిగింది. ఆ సమయంలో వాహిని వారు కొత్తగా తమ స్టూడియో కోసం ఆర్క్ లైట్ తెప్పించారు.


 దక్షిణ భారతానికి ఆ లైట్ ని పరిచయం చేసింది వాహిని వారే ! ఆది వెలిగించగానే కళ్ళు మిరుమిట్లు గొలిపే కాంతి. అప్పటి వరకూ అంత కాంతినిచ్చే లైట్ చూసి వుండని వారికి అదొక వింతగా తోచింది. అంతే ! ఆ నోటా ఈ నోటా ఈ లైట్ విషయం ప్రజల్లోకి పాకింది. దాన్ని  చూడడానికి జనం విరగబడ్డారు. షూటింగ్ సమయంలో ఫ్లోర్లోకి అనుమతించడం  కుదరదు కనుక వాహిని వారు ఓ ఏర్పాటు చేశారు. లంచ్ సమయంలో జనాన్ని లోపలి అనుమతించి ఆ లైట్ వెలిగించి, ఆర్పి చూపించేవారట. వచ్చిన జనం ఆశ్చర్యంతో ఆ లైట్ ను తిలకించేవారట. ఎంతైనా కొత్తొక వింతే కదా !



Vol. No. 01 Pub. No. 251

2 comments: