Monday, April 5, 2010

గుజ్జనగూళ్ళు - సందేహం

ప్రముఖ బ్లాగర్ జ్యోతి గారు పంపిన లింకు ఇక్కడ ఇస్తున్నాను.

http://jyothivalaboju.blogspot.com/2008/11/blog-post_16.html

దానిలో ' గుజ్జనగూళ్ళు ' కు సంబంధించిన భాగం :

13. ఇంట్లోనే ఉండి ఆడుకునే మరో ఆట . గుజ్జనగుళ్లు. తెలంగాణాలో ఒనగండ్ల ఆట అంటారు. దీనికి ప్రత్యేకంగా తయారు చేసిన పీట ఉంటుంది. చెక్కతో కాని, స్టీలుతో కాని చేసి ఉంటుంది. రెండువైపులా ఎదురెదురుగా పదేసి గుండ్రటి గళ్లు ఉంటాయి. ఆటగాళ్లు ఎదురెదురుగా కూర్చోని చింతగింజలు, లేదా సీతాఫల గింజలు ఆ గళ్లలో వేసి గవ్వలు లేదా పావులతో ఆడతారు. ఇది తెలివిగా ఆడితే ఎదుటివారి గింజలన్నీ సంపాదించుకోవాలి. ఇందులో కూడా రెండు మూడు రకాల ఆటలు ఉన్నాయి. ఆడుతుంటె సమయమే తెలీదు. వేసవి సెలవుల్లో మంచి కాలక్షేపం.

కానీ నాకు ఒక సందేహం. జ్యోతి గారు పైన చెప్పిన ఆటను గుజ్జనగూళ్ళు అనికాక ' వామన ( లేదా ) ఓమన గుంటలు ' అంటారనుకుంటాను. ( చూ : గాజుల సత్యనారాయణ గారి ' పెద్దబాలశిక్ష ' పేజీ : 686 ) . మా అమ్మమ్మ గారు ( వయసు సుమారు 90 సంవత్సరాలు ) ఇప్పటికీ ఆడుకుంటూ వుంటారు. ఆవిడ దగ్గర చెక్కతో చేసిన పీట ఇప్పటికీ వుంది. ఇంతకీ ఈ ఆటకు ఈ రెండింటిలో ఏది సరైన పేరు ?

' గుజ్జనగూళ్ళు ' ఆట ఆడే పద్ధతులు నాకు గుర్తున్నంతవరకూ ఇవి -

1 . పిల్లలు ఒకరికొకరు ఎదురుగా నిలబడి ఒకరి చేతులొకరు పట్టుకుని కొంచెం ఎత్తులో వుంచుతారు. మిగిలిన పిల్లలు ఏదైనా పాట పాడుతూ ఆ చేతుల క్రిందనుంచి వరుసగా దూరుతూ వెడతారు. ఆ పాట పూర్తయ్యే సమయానికి చేతులెత్తి నిలుచున్న పిల్లలు ఆ చేతులు దించి వేస్తారు. అప్పుడు ఆ చేతి క్రింద దూరుతూ వెడుతున్న వాళ్ళలో ఎవరు వుంటే వారు ఔట్ అయినట్లు.
2. పిల్లలు పెద్దవాళ్ళను అనుకరిస్తూ ఆడుకునేటప్పుడు బొమ్మల పెళ్ళిళ్ళు, వంటలు, విందులూ చేసుకుని తినిపిస్తారు.

పెద్దబాలశిక్ష లో ఈ రెండో పద్ధతే కనిపిస్తుంది. మరో చోట మొదటి పధ్ధతినే గుజ్జనగూళ్ళు అంటారని చదివాను. అంతే కాదు చిన్నప్పటి జ్ఞాపకం కూడా !

- ఈ రెండు పద్ధతుల్లో ఏది సరైనదో సరిగా గుర్తులేదు. ప్రాంతీయ బేదాలున్నాయేమో తెలీదు. ఈ సందేహాన్ని జ్యోతి గారు గానీ, ఈ ఆట తెలిసిన మరెవరైనా బ్లాగు మిత్రులు గానీ తీర్చాలి.

అసలు ' గుజ్జనగూళ్ళు ' అంటే అర్థం ఏమిటి ? ఆది కూడా చెప్పగలరేమో ప్రయత్నించండి.


Vol. No. 01 Pub. No. 243a

5 comments:

  1. మీరు చెప్పిన రెండు పద్ధతుల్లో ఒకటవ పద్ధతిలో -"1 . పిల్లలు ఒకరికొకరు ఎదురుగా నిలబడి ఒకరి చేతులొకరు"- మేము ఆడేవాళ్ళం. కానీ ఆ పాట గుర్తు లేదు. ఆ పాట పేరే ఆ ఆట పేరన్నట్టు గుర్తుంది.

    ReplyDelete
  2. అసలు పద్ధ్హతైతే,రెండవదే...చిన్నపిల్లలు వండే అన్నాన్ని గుజ్జెన అంటారు...అందులో ఎక్కువ కష్టం లేకుండా,బియ్యం,పప్పు అన్నీ కలిపి దంచి,తిరగలితో విసిరి పెట్టి ఉంచేవాళ్ళు.పిల్లలు ఆడుకునేప్పుడు,అది తెచ్చి చిన్న రాళ్ళపొయ్యిలు పెట్టి వండేవాళ్ళం..దాంట్లో నెయ్యి వేసి తింటే,అద్భుతంగా ఉండేది...దీన్నే చిన్నపిల్లలకి,రెండు సంవత్సరాలు వెళ్ళెవరకు పెడతారు..చాలా బలవర్ధకమైన ఆహారం.....ఎవరన్నా చెయ్యితిరిగిన పిల్లలుంటే,ఇంకా వెరైటీలు వండేవాళ్ళం..అలా వండి ఇంట్లో పెద్దవాళ్ళందరికీ రుచి చూపించేవాళ్ళం...

    ReplyDelete
  3. జ్యోతిగారు చెప్పిన ఆట వామనగుంటేనండీ. మీరు చెప్పిన ఆట మేమూ ఆడుకునేవాళ్ళం, కాని పేరు గుర్తులేదు

    ReplyDelete
  4. ' గుజ్జన గూళ్ళు ' అంటే నవలల్లో క్రిష్ణాగోదారి జిల్లాల హీరోఇన్లు చిన్నప్పుడు పల్లెల్లో ఆడుకున్నాము అని చెప్పుకునే ఫ్లాష్బాక్ ఆట, అదేంటో నాకు తెలియదు. నేను ఏ గుగ్గుళ్ళో , గజిగాడి( అదేదో పిట్ట అని ఇక్కడ చదివాను, అది తెలుగులో తెలియని వాడు బ్రతకడం వేస్ట్ అని ఓ కవి గారు, వాసుకి అనే పాము గారు సెలవిచ్చారు, మంచి తాడు దొరికితే వురేసుకుందామనుకుంటున్నా :) ) గూడో అనుకునేవాడిని.

    చింత గింజలతో , గుంతలున్న పీట్తో అడే ఆటను ' (చింత) పిచ్చల పీట ' అంటారు.

    చేతులెత్తి దూరుతూ పిల్లలు ఆడే ' రింగా రింగా రోజస్ ' . తెలుగులో 'బూదుగుమ్మ పెండు , బళ్ళారి సంతలో , బొట్టుకు రెండు ...ఆఖరు పిల్లను పట్టుకోండీ అనే ఆట, గుర్తులేదు :)

    ReplyDelete
  5. * మందాకిని గారూ !
    * కౌటిల్య గారూ !
    * మాధురి గారూ !
    * సౌమ్య గారూ !
    * అజ్ఞాత గారూ !

    అందరికీ ధన్యవాదాలు. గుజ్జనగూళ్ళు పూర్తి వివరాలకోసం కొత్త టపా చూడండి.

    ReplyDelete