Friday, April 9, 2010

పంజాబ ఆంధ్ర గుజరాత మరాఠా, ద్రావిడ ఉత్కళ వంగ ...........

A study of Telugu regional and social dialects: A prosodic analysis (CIIL silver jubilee publication series)A study of Telugu regional and social dialects: A prosodic analysis (CIIL silver jubilee publication series)

"  మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తమిళ, కన్నడ, మరాఠీ, ఒరియా ప్రాంతాలు సరిహద్దులుగా వున్నాయి. ఈ ద్విభాషా ప్రాంతాల్లో ఆచార వ్యవహారాలు కొద్దిగానో, ఎక్కువగానో కలగాపులగం కావడం తప్పనిసరి ! తెలంగాణా తెలుగువారి మాటల్లో  ఉర్దూ యాస తప్పదు. కన్నడులు బహుళంగా గుండప్పలు, నంజుండప్పలు గదా ! అందువల్ల బెంగుళూరు తెలుగు వాళ్ళు ' ఏమండప్పా ! రండప్పా ! కూచోండప్పా ! ' అంటారు. యావదాంధ్రంలోను చదువుల తల్లి సరస్వతీదేవి వున్న ఒకే ఒక ఆలయం ఆదిలాబాదు జిల్లాలో వుంది. అక్కడ ఆంధ్రులు తెలుగు కలిసిన మరాఠీతోను, మరాఠీ కలిసిన తెలుగుతోను మాట్లాడుకుంటారు. ఇటు అరకుగానీ, ఇచ్చాపురంగానీ వెళ్ళి చూడు. అక్కడ మన వాళ్ళ భాష తెలుగు ఒరియా కలిసిన మణిప్రవాళంలా వుంటుంది. ఆ మాట కొస్తే వివిధ సంస్కృతుల సమ్మేళనమే గదటయ్యా నేటి మానవ నాగరికత ! నువ్వానాడు తెలుగుభాష అనుకునేది ఏనాటి ఏయే భాషల మిశ్రమమో చెప్పగలవా ? అట్లాగే ఆచారాలూ వ్యవహారాలూ అన్నీ ! సంకరంగాని మతం, సంకరంగాని కులం, సంకరంగాని భాష ఈ ఇలాతలంపైన ఉన్నాయంటావా ? పోనీలే, ద్విభాషా ప్రాంతంలో నివసించే మేము అసలు తెలుగు వాళ్ళమైతే కాకపొవచ్చునుగానీ, మీకులేని సదుపాయం మాకొకటి వుంది. మాతృభాషతో బాటుగా మాకు మరొక దేశ భాష సునాయాసంగా అబ్బుతుంది. అందువల్ల మాకు విజయవాడ ఎంతో తంజావూరూ అంతే ! తల్లి కృష్ణమ్మ ఎంతో అన్నై కావేరీ అంతే ! విశ్వనాథ వారి ' వేయిపడగ ' లెంతో , కల్కి రచన ' శివగామియున్ శపథమూ ' అంతే ! నా కత్తికి రెండంచులూ పదునేనయ్యా ప్రసాదరావ్ ! నా భాగ్యం  తక్కువైందేమీ కాదు. నిజానికి నన్ను చూసి అసూయ పడాలి నువ్వు ! " 
అంటాడు వెంకటేశం - సరిహద్దు ప్రాంతమైన చిత్తూరు జిల్లా భాషను సంకరభాష అని, అక్కడి ప్రజలు అసలైన తెలుగు వాళ్ళు కారని వాదించిన ప్రసాదరావు తో.

చిత్తూరు జిల్లానుండి వయోజన విద్యా శిక్షణా శిబిరంలో పాల్గొనడానికి కృష్ణా జిల్లా బందరు వచ్చిన వెంకటేశంతో గుడ్లవల్లేరుకు చెందిన ప్రసాదరావు అనబడే దుర్గావరప్రసాద మల్లిఖార్జున రావు తరచుగా ఈ విషయంలో వాదనలేసుకునే వాడు. చిత్తూరు వాళ్ళ భాషను అవహేళన చేస్తూ....  
కట్టూ బొట్టూ, మాటాడే తీరు, తినే తిండి - ఇలా ఏ అంశాన్ని బట్టి చూసినా ఆపాదమస్తకం తెలుగు వాళ్ళం మేమేనని ఢంకా బజాయించి చెప్పేవాడు.

వెంకటేశం కూడా తమను సమర్థించుకోవడానికి ప్రతిగా ఎంత వాదించినా కొట్టిపారేసేవాడు. ఈ ఒక్క విషయంలోను తప్ప మిగిలిన విషయాలన్నిటిలో ప్రసాదరావు చాలా మంచివాడు, ఉదారుడు, స్నేహ పాత్రుడు కావటం వల్ల వెంకటేశం అతని స్నేహాన్ని వదల్లేకపోయాడు. శిక్షణ ముగియడంతో ఎవరి తోవ వారిదైంది. దాదాపు పదిహేను సంవత్సరాలదాకా వారి స్నేహం కేవలం ఉత్తర ప్రత్యుత్తరాలకే పరిమితమైంది.

ఒకసారి దక్షిణాది యాత్ర పూర్తి చేసుకుని హఠాత్తుగా వెంకటేశం దగ్గరికి వచ్చాడు ప్రసాదరావు. ఇంట్లోకి అడుగుపెడుతూనే.......
" అహా ! ఎంత బాగుందోయ్ మీ వూరు ! చుట్టూరా కొండలు, మామిడి తోటలు, ముచ్చటగా ఓ ఏరు, దాని గట్టు వెంబడి కొబ్బరి చెట్లు...."
అని మైమరచిపోయాడు.

" బాగుండారా అన్నా ! ఈయన ఎన్నిసార్లు చెప్పినాడో మిమ్మల్ని గురించి ! ఇంత కాలానికి మా పైన దయకలిగింది " అని నోరారా పలకరించిన వెంకటేశం భార్యను చూసి ఇంటికి మొదటిసారిగా వచ్చిన తనను ' అన్నా ' అని అప్యాయంగా పలకరించడం చూసి పరవశించిపోయాడు.

" ఏందేందో చెప్పినారు గానీ, మనిషి చాలా మంచాయనలా వున్నాడు గదండీ ! "
అని నిలదీసిన భార్యతో ఆ మనిషిని మెప్పించడం కష్టమని, ఎలాగైనా తన పరువు నిలబెట్టమని బ్రతిమాలతాడు వెంకటేశం.

ఆమె వడ్దించిన పప్పుల పొడి, కూర అని వేసిన ములగకాడల పులుసు, రసం తయారీ విధానాలను తెలుసుకుంటూ వాటి రుచుల్ని అస్వాదిస్తూ ఆవిడ పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని కీర్తిస్తూ భోజనం ముగిస్తాడు ప్రసాదరావు.

సాయింత్రం ' సైట్ సీయింగు ' అంటూ ఊళ్ళోకి వెళ్ళి ఆ ఊరి అందాన్ని కీర్తిస్తున్న అతనితో......... 
" పోనీలే ప్రసాదరావ్ ! నీకెట్లాగూ మా భాషంటే సరిపడదు. మా ప్రాంతమైనా నచ్చింది చాలు. అదే పదివేలు. "
అని సంబరపడుతున్న వెంకటేశంతో

" అబ్బే, అదేం లేదు లేవోయ్ ! ఈ మధ్య విస్తృతంగా దేశం తిరిగొచ్చాను గదా ! నా అభిప్రాయాలు మార్చుకున్నా. మహాకవులు వ్యాకరణ విరుద్ధమైన ప్రయోగాలు చేస్తారనుకో ! ఏమిటిలా చేశారని మనం అడగ్గూడదట ! ' మహాకవుల ప్రయోగమ్ములు యథాతథంగా గ్రాహ్యంబులు ' అంటాడు శాస్త్రజ్ఞుడు. ప్రజల విషయమున్నూ అంతే ! ' పదుగురాడు మాట పాడియై ధరచెల్లు ' అంటారు గదా ! అవును మరి ! ప్రజల భాషను తప్పు పట్టడానికి మనమెవరం ? ఇప్పుడా పట్టింపులేవీ లేవు. కొంచెం ఆలోచన, కొంచెం వివేచన వచ్చాక అతిశయం గాలిలో బూరగ దూదిలా ఎగిరిపోయిందనుకో ! "
అంటాడు ప్రసాదరావు.

మార్పు మానవ స్వభావం. కొందరు బింకానికి పోయి పాత అభిప్రాయాలకే అంటి పెట్టుకున్నట్టు నటిస్తారు. అలా కాకుండా తమ అభిప్రాయాల్లో మార్పు వచ్చినట్లుగా ఒప్పుకోవడం ఉత్తమ సంస్కారం లక్షణం. 
 ఆ కారణంగానే ప్రసాదరావు వ్యక్తిత్వంపట్ల గౌరవం పెరిగిపోతుంది వెంకటేశానికి.

అరవం అక్షరం ముక్కకూడా రాకుండా దక్షిణాది అవసరానికి సరిపడా భాషా పరిచయాన్ని సంపాదించిన వైనాన్ని వర్ణిస్తాడు ప్రసాదరావు.  

ఆ రోజు రాత్రి మంత్రపేటిక లాంటి తన సూట్కేసు తెరిచి పూంబుహార్ లో కొన్న తిరువళ్ళువర్ విగ్రహాన్ని వెంకటేశానికి, నాగపట్నంలో కొన్న ముత్యాల గాజుల్ని ' చెల్లమ్మా ! ఇది నీకు '
అంటూ అతని భార్యకు ఇస్తాడు. ఎవరెవరి కోసం ఏమేం కొన్నాడో తీసి చూపిస్తాడు.

చివరగా " నీకోసం నువ్వేమి  కొనుక్కున్నావయ్యా ? "
అని అడిగిన వెంకటేశంతో     

"  ఇదిగో, ఇది నా కోసం "  అంటూ ఓ పుస్తకం తీసి చూపిస్తాడు. 

ఆ పుస్తకం పేరు  ' ముఫ్ఫై రోజుల్లో తమిళ భాష - తెలుగు ద్వారా '


.............................................


                                     ఇదీ మధురాంతకం రాజారాం గారి  
' పంజాబ ఆంధ్ర గుజరాత మరాఠా, ద్రావిడ ఉత్కళ వంగ ..........
కథా పరిచయం.

మధురమైన కథలెన్నిటినో రచించిన రాజారాం గారు భాషా బేధాలను, ప్రాంతీయ బేధాలను విశ్లేషిస్తూ రాసిన కథ ఇది. ఆయన శైలి సరళం. చెప్పదలచుకున్నది సూటిగా గందరగోళం లేకుండా చెప్పడం ఆయన పద్దతి. ఆయన కథలకు వ్యాఖ్యానాలు, ఉపాఖ్యానాలు అవసరంలేదు.
ఉపాధ్యాయ వృత్తిలో వుంటూ ఆయన కలుసుకున్న విభిన్న మనస్తత్వాలను, అనుభవాలను ఆధారంగా చేసుకుని ఆయన చాలా కథలు రాసారు.  ఎన్నో కథా సంపుటాలు వెలువడ్డాయి. సుమారు పదిహేడేళ్ళ క్రితం రాసిన కథ ఇది.

గమనిక : ఇటాలిక్స్ లో వున్న భాగాలు ఆయన కథలోంచి యథాతథంగా తీసుకున్నవి.

Vol. No. 01 Pub. No. 250

2 comments:

  1. మ౦చి పుస్తక౦ పరిచయ౦ చేశారు తప్పక చదవాల్పి౦చేలా వ్రాశారు..

    ReplyDelete
  2. Thank you for understanding my agony. Thanks, also for the suggestion to write in Telugu. Yes, I can express my views in Telugu better but typing in English itself is difficult for me. A font that can allow me to write Telugu through English will help me.

    ReplyDelete