Wednesday, March 3, 2010

నాయకుడికి నిజమైన నిర్వచనం

నాయకుడంటే ఒక గుంపుకో, ఒక ప్రజా సమూహానికో దిశా నిర్దేశకుడు. అతనిని అనుసరించే వాళ్ళు సహజంగానే అతడు తమను సరైన మార్గంలో నడిపించాలనుకుంటారు. తమకు నాయకుడు మంచి చేస్తాడని, తమ ప్రయోజనాలను కాపాడతాడని నమ్ముతారు.

మనది అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. ప్రజల్ని నియోజకవర్గాలవారిగా విడదీసి ఒక్కొక్క నియోజక వర్గానికీ ఒక్కొక్క నాయకుడు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అతడు ఆ నియోజకవర్గ ప్రజల సంక్షేమానికి పాటు పడాలి. సాంకేతికంగా, రాజ్యాంగపరంగా ఇదే నిజమనుకుంటాను. కానీ ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడైనా ముందు ఆలోచించేది ప్రజల సంక్షేమం కాదు. తన, తనవాళ్ళ క్షేమం. ప్రజల ఓట్ల అండతో పదవిలోకొచ్చాక ఆలోచించేది తనకా స్థితి కల్పించిన ప్రజల్ని ఎలా దోచుకోవచ్చా అనే విషయమే ! అందుకే వాళ్ళు మంత్రి పదవి దక్కే అవకాశం వస్తే కాసులు కురిపించే శాఖ కావాలనుకుంటారే కానీ ప్రజలకు సేవ చేసే శాఖ కావాలని కోరుకుంటారా ? ప్రజలకు సేవ చేస్తే ఏం రాలుతుంది.... బూడిద !! ఒకవేళ ఎవరైనా అలా కోరుకుంటే వాళ్ళను పిచ్చివాళ్ళనుకుంటారు. కానీ అలా సేవ చెయ్యాలనుకునే వాళ్ళు కూడా వుంటారు. ఈ రోజుల్లో కాకపోవచ్చు. గతవైభవమే కావచ్చు. అయినా అలాంటి వాళ్ళను ఒక్కసారైనా తలుచుకుంటే ప్రస్తుత రాజకీయనాయకుల అవినీతి విన్యాసాలనుంచి కొంచెం ఉపశాంతి. అలాంటి ఓ ఉదంతం.

గత కాబినెట్ లో పశుసంవర్థక శాఖా మంత్రిగా పనిచేసిన మండలి బుద్ధ ప్రసాద్ గారి పేరు వినే వుంటారు. ఆయన తండ్రిగారు మండలి వెంకట కృష్ణారావు గారు కూడా ఒకప్పుడు మంత్రిగా పనిచేసినవారే ! ఆయనకు మొదటిసారి మంత్రి పదవి లభించింది పి.వి.నరసింహారావు గారి హయాంలో. పి.వి. గారు మంత్రివర్గానికి శాఖల కేటాయింపులు చేస్తూ సహచరులను శాఖల మీద వాళ్ళ ఆసక్తిని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలో మండలి వెంకట కృష్ణారావు గారి వంతు వచ్చింది. పి.వి. గారు అడిగారు మీకేం శాఖ కావాలని. తనకు సాంఘిక సంక్షేమ శాఖను కేటాయించమన్నారు. పి.వి. గారు ఆశ్చర్యపోయారు. ఆయన ఎందుకు ఆశ్చర్యపోయారో అప్పట్లో అజ్ఞానులైన ఓటర్లకు అర్థం కాకపోయి వుండవచ్చుగానీ, తెలివి మీరినా నిస్సహాయులైన ఇప్పటి ఓటర్లకు అర్థమవుతుంది. ఇదివరలో ప్రభుత్వోద్యోగులకు పనిష్మెంట్ ట్రాన్స్ఫెర్ అంటే ఏ శ్రీకాకుళమో, ఆదిలాబాదో పంపిచేయ్యడం. అదే ఇప్పటి నాయకుల దృష్టిలో సాంఘిక సంక్షేమ శాఖ ఇవ్వడమంటే అలాంటిదే ! రాజకీయాలు వ్యాపారమైపోయిన ఈ రోజుల్లో ఆశాఖలో తమ పెట్టుబడి గిట్టుబాటు కాదని వారి ప్రగాఢ విశ్వాసం. అందుకే వాళ్ళు దాని జోలికి పోరు. ఇక ఆఖరు వరుసలో వున్న వారు మాత్రం ( బంగారు ) భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తప్పనిసరై వప్పుకుంటారు.

అందుకే పి.వి. గారికి కూడా అనుమానం వచ్చింది. ఈయన ఈ శాఖను ఎందుకు కోరుకుంటున్నారా అని. ఆ విషయమే అడిగారు అందరూ వద్దనుకునే శాఖనే మీరెందుకు కోరుకుంటున్నారని. దానికి మండలి వెంకట కృష్ణారావు గారిచ్చిన సమాధానం ఏమిటంటే పేదప్రజలకు దగ్గరగా వుంటూ సేవ చేసే అవకాశం సాంఘిక సంక్షేమ శాఖలోనే వుందని, అందుకని ఆ శాఖనే తనకు కేటాయించవలసినదిగా ముఖ్యమంత్రిని కోరారు. పిచ్చివాడు కాకపోతే పేద ప్రజలకు సాయం చెయ్యడమేమిటి ? సొంత లాభం చూసుకోక ! అలా కాదు కాబట్టే మనం ఇప్పుడు కూడా వాళ్ళను తలచుకోవడం జరుగుతోంది. ఈ విషయాన్ని స్వయంగా పి.వి. గారే ఒక సదస్సులో చెప్పి మండలి వారి గొప్పతనాన్ని ప్రశంసించారట.

ఈ రోజుల్లో కూడా ఇలాంటి నిస్వార్థ రాజకీయ నాయకులు వుండాలని కోరుకోవడం అత్యాశ అవుతుందేమోగానీ నిజమైన నాయకుడికి నిజమైన నిర్వచనం మాత్రం ఇదేనేమో !



Vol. No. 01 Pub. No. 213

No comments:

Post a Comment