Friday, July 16, 2010

స్నేహబంధమూ... ఎంత మధురమూ ...!!


స్నేహబంధము ఎంత మధురము 
చెరిగిపోదు తరగిపోదు జీవితాంతమూ ...

చిన్ననాటి జ్ఞాపకాలు తీయనైనవి
నూరేళ్ళు గడిచినా అవి మరపురానివి





...... అని నిరూపించారు విజయవాడ రైల్వే మిక్స్ డ్ హైస్కూల్ 1983-84 నాటి విద్యార్థులు....... ఇప్పటి బాధ్యతలు గలిగన పౌరులు.

ప్రపంచవ్యాప్తంగా వివిధ హోదాల్లో, వృత్తుల్లో స్థిరపడి ఆ భాధ్యతల్లో మునిగిపోయి తీరిక లేకుండా వున్న సుమారు 100 మంది ఈరోజు  ( జూలై 17 వతేదీ శనివారం ) విజయవాడలో కలవబోతున్నారు.

తమ తమ స్థాయిలు, హోదాలు మరచిపోయి బాల్యమిత్రులను కలవాలనే అభిలాషతో ఉత్సాహంగా ఉరకలేస్తూ  దేశవిదేశాలలోని వివిధ ప్రాంతాలనుంచి వస్తున్నారు.

తమకు విద్యాబుద్ధులు చెప్పి తమ ఉన్నతికి కారకులైన అప్పటి ఉపాధ్యాయులను, ఆ అవకాశాన్ని కల్పించిన ఆ పాఠశాలను స్మరించుకోవడానికి, సత్కరించుకోవడానికి సిద్ధంగా వున్నారు.

ఎప్పుడో పాతికేళ్ళక్రితం నాటి సహాధ్యాయుల వివరాలు సేకరించడం అంత సులభం కాదు.  ఎక్కడెక్కడో స్థిరపడ్డారు. వారందరి వివరాలు, చిరునామాలు సేకరించడం కష్టం. ఒకరకంగా అది అసాధ్యం. కానీ ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు విజయవాడలో స్థానికంగా వున్న మిత్రులు. ముఖ్యంగా ఏక్సిస్ బ్యాంకు లో ఉన్నత స్థానంలో వున్న శరత్ చంద్ర, విజయవాడ రైల్వే లో పనిచేస్తున్న మరికొందరు మిత్రులు, ఇంకా ఇతర రంగాలలో వున్న మిత్రులు కలసి సుమారు నాలుగు నెలలుగా ఈ బృహత్ కార్యక్రమం చేపట్టి ఇంటర్నెట్ ద్వారా, ఇతర మార్గాల ద్వారా అందరి వివరాలు సేకరించగలిగారు. అందర్నీ ఒక త్రాటి మీదకు తీసుకురాగలిగారు. ఫలితంగా ఇంతమంది మిత్రులు పాతికేళ్ళ అనంతరం మళ్ళీ కలవబోతున్నారు.

ఆ అనుభూతి ఎంత మధురమో ముందరే నేను చవిచూసాను. మిత్రులు శరత్ చంద్ర గారికి ఈ సందర్భంలో కేవలం కలవడం, చిన్నప్పటి కబుర్లు చెప్పుకోవడం, విడిపోవడం మాత్రమే కాకుండా తమ చిన్నప్పటి మధుర స్మృతుల్ని శాశ్వతంగా పదిలపరచాలనే ఆలోచన వచ్చింది. వెంటనే నన్ను సంప్రదించారు. అప్పటి ఉపాధ్యాయుల,  మిత్రుల జ్ఞాపకాలను వారి చేతనే చెప్పించి రికార్డు చేసి డీవీడీలుగా తయారుచేసి మిత్రులందరికీ అందించడానికి ప్రణాళిక రూపొందించాం. ఆ మిత్రుల పట్టుదల  నాకు ఉత్సాహాన్నిచ్చింది. క్రిందటి నెలలో షూటింగ్ అనుకున్న రోజున విజయవాడ పరిసరాలు, హైదరాబాద్, చెన్నై లాంటి చోట్లనుండి సుమారు 30 మంది హాజరయ్యారు. అప్పటి ఉపాధ్యాయులు సుమారు 10 మంది హాజరయ్యారు. ఈనాటి కార్యక్రమానికి నాంది పలికిన ఆనాటి కార్యక్రమానికి హాజరయిన మిత్రుల ఆనందం వర్ణనాతీతం. అందులోను వారు చదువుకున్న పాఠశాలలో కలవడం వారి ఆనందాన్ని అవధులు దాటించింది. వాళ్ళు వయసు, హోదాలు అన్నీ మరచిపోయి మళ్ళీ ఆనాటి విద్యార్థి దశకు వెళ్ళిపోయారు. వారి సంతోషం చూసి తీరాల్సిందే ! వారికంటే ఎక్కువ అనుభూతి పొందినవారు, ఆనందించినవారు అప్పట్లో వారికి విద్యనందించిన ఉపాధ్యాయులు. 

మళ్ళీ వాళ్ళూ, ఇంకా మిగిలిన మిత్రులు తమ కుటుంబాలతో సహా ఈరోజు కలుస్తున్నారు. వారి చిన్ననాటి జ్ఞాపకాలను, అనుభూతుల్ని, అనుభవాల్ని, ముచ్చట్లను చిత్రీకరించే అవకాశం నాకిచ్చారు. అవన్నీ డాక్యుమెంటరీ లాగ పేర్చి, కూర్చి పదిలపరిచాను. ఈరోజు వారందరూ ఆ జ్ఞాపకాలమాలికను అందుకోబోతున్నారు. వారి జీవితకాలంలో ఆ జ్ఞాపకాల్ని  కేవలం మనసులో తలుచుకోవడంతో సరిబెట్టక తమ బాల్య మిత్రుల్నీ, తాము చదివిన పాఠశాలను కళ్ళెదుట నిలుపుకోవాలని మిత్రులు శరత్ చంద్ర ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. నేను కార్యరూపంలో పెట్టాను.

భవిష్యత్తులో వాళ్ళే కాదు.... వారి పిల్లలు.... వారి మనుమలు కూడా ఈ జ్ఞాపకాల్ని పంచుకుంటారు. స్నేహబంధం లోని మాధుర్యాన్ని చవి చూస్తారు.  ఇదొక విచిత్రమైన, మధురమైన అనుభూతి. పాతికేళ్ళ తర్వాత ఒకే వేదిక పైకి రానున్న ఆ మిత్రులందరికీ శుభాకాంక్షలు.

Vol. No. 01 Pub. No. 348

3 comments:

  1. పాత మిత్రులను కలుసుకొనే ఆ అనుభూతి వర్ణించలేనిది. తప్పకుండా నా శుభాకాంక్షలు కూడా.

    ReplyDelete
  2. జయ గారూ !
    నిన్న ఆ కలయికలో వారి ఉత్సాహం, ఆనందం చూస్తూంటే రెండు కళ్ళూ చాలలేదు. ధన్యవాదాలు.

    ReplyDelete
  3. జాన్ గారూ !
    మీ అభిమానానికి ధన్యవాదాలు. మీ జ్ఞాపకాల్ని ఎంతవరకూ నేను డాక్యుమెంటరీలో పదిలపరిచానోగానీ నేను మాత్రం చాలా ఆనందాన్ని అనుభవించాను మీ మిత్రుల కలయిక చూసి. ఆ భావాలనే ఇక్కడ అందించాను.

    ReplyDelete