Monday, July 19, 2010

ఫైటింగ్ లంటే ఈలపాటలా ?

మన సినిమాల్లో చూపించనంత సులువుగా యుద్ధ దృశ్యాలు, హీరో విలన్ ల ఫైటింగ్ లు రంగస్థలం మీద చూపడం కుదరదు. మన స్టార్ లు వెండితెర మీద చాలా రకాల ఫైటింగ్ లు చేసేస్తూ వుంటారు. అమాంతం సూపర్ స్టార్ లయి పోతుంటారు. కానీ రంగస్థలం మీద అలా కాదు. ముఖ్యంగా పౌరాణిక నాటకాలలో పద్యం ఎంత బాగా పాడితే, సంభాషణలు ఎంత బాగా పలికితే అంత సూపర్ స్టార్లు.

ఈలపాట రఘురామయ్య రంగస్థలం మీద సూపర్ స్టార్ అన్న విషయం అందరికీ తెలిసిందే ! ఆయన పద్యం పాడే పధ్ధతి, సంభాషణలు పలికే తీరు గురించి తెలుగు నాటక ప్రియులకు ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఆయనకే ప్రత్యేకమైన ఈలపాట గురించి వేరే చెప్పాలా ? ఆయన్ని ఫైటింగ్ చెయ్యమంటే ఎలా వుంటుంది ? ఇదిగో ఇలా .............

ప్రముఖ దర్శక నిర్మాత బి. ఏ. సుబ్బారావు గారు 1950 లో నిర్మించిన  " పల్లెటూరి పిల్ల " చిత్రంలో  అక్కినేని నాగేశ్వర రావు గారు పోషించిన పాత్రకు మొదట రఘురామయ్య గారిని తీసుకున్నారు. రెండు మూడు రోజులు షూటింగ్ కూడా జరిపారు. ఫైటింగ్ సీన్ షూట్ చేస్తున్నప్పుడు ఆయన చేతికి కత్తి గీసుకుపోయింది. అసలే ఫైటింగ్ ల అనుభవం లేకపోవడం, మొదటి సారే గాయం కావడంతో ఆయన భయపడ్డారు. దాంతో

" బాబ్బాబూ ! మాటా, పాటా అంటే ఏదో అఘోరిస్తాగానీ ఈ ఫైటింగ్ లు చచ్చినా నా వల్ల కాదు. మరెవరినైనా బుక్ చేసుకోండి. మీకు పుణ్యం వుంటుంది "

అని సుబ్బారావు గారిని బ్రతిమలాడి ఆ చిత్రం నుంచి తప్పుకున్నారు. అప్పుడా పాత్ర అక్కినేనిని వరించింది. 

Vol. No. 01 Pub. No. 349

2 comments: