Friday, July 9, 2010

'భట్' రాజీయం


డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి గురించి చెప్పగానే మనకి ముందు గుర్తుకొచ్చేది ఆంధ్రాబ్యాంకు. ఆయన దాని వ్యవస్థాపకుడు. తర్వాత కృష్ణా జిల్లాతో, ముఖ్యంగా బందరుతో  అనుబంధమున్న వాళ్లకి ఆయన పేరు చెప్పగానే గుర్తుకొచ్చేది ఆంధ్రా జాతీయ కళాశాల. దాని వ్యవస్థాపకుల్లో ముఖ్యులు డా. పట్టాభి. ఆయన దేశభక్తుడు, జాతీయవాది.




ఒకసారి ఆయనకు బందరులో సన్మాన సభ ఏర్పాటు చేశారు. సభ ప్రారంభమైంది. ప్రసంగాలు ప్రారంభమయ్యాయి. సన్మాన సభ అనగానే ఆ సన్మాన స్వీకర్తను పొగడ్తలతో ముంచెత్తడం సర్వసాధారణం. అలాగే ఆ సభలో కూడా పట్టాభిగారి మీద పొగడ్తల వర్షం కురుస్తోంది. ఒక శ్రోత మరీ రెచ్చిపోయి " భోగాన్ని అనుభవించడంలో ఆయన భోగరాజు. దానం చేయడంలో ఆయన దానరాజు, త్యాగశీలత గల త్యాగరాజు..... " అంటూ ఆవేశంగా పొగిడేస్తున్నాడు.

డా. పట్టాభి గారికి పొగడ్తలంటే సుతరామూ గిట్టదు. హద్దులు దాటేస్తున్న పొగడ్తలను భరించలేక లేచి మైక్ అందుకుని
" నా గురించి ఈయన చెప్పింది ఎంతవరకూ నిజమో తెలియదు గానీ, ఈయన మాత్రం నిజంగా  ' భట్ ' రాజే ! " అని చమత్కరించారు.
ఇంతకీ అప్పటివరకూ డా. భోగరాజు పట్టాభి సీతారామయ్యగారిని పొగడ్తలతో ముంచేసిన వక్త పేరు పి.సి.భట్. అదీ సంగతి.


Vol. No. 01 Pub. No. 344

1 comment:

  1. Madhuri Garu
    Thank you very much your for valuable infomation

    ReplyDelete