కుళ్ళు, కుత్సితాలును పారద్రోలే రోజు అన్యాయం, అక్రమాలను రూపుమాపే రోజు స్వార్థం, అధర్మాలను అంతం చేసే రోజు దోపిడీలను, దౌర్జన్యాలను అరికట్టే రోజు మనకి అసలైన దీపావళి ఆ రోజు
మరి ఈనాడు మన చుట్టూ నరకాసురులెందరో ఆ నరకాసురులను చంపే కృష్ణుడెక్కడున్నాడో ... నిజానికి మనలోని మాత్సర్యం, అహంకారాలే నరకాసురులు వాటిని అంతం చెయ్యగలిగితే మనం కూడా సత్యభామా శ్రీకృష్ణులం
వాగ్గేయకారుడు అనే మాటకు సజీవ ఉదాహరణ పి. బి. శ్రీనివాస్ కాకినాడలో పుట్టి కన్నడిగులను మెప్పించిన గాన గంధర్వుడు పి.బి.
విలక్షణమైన స్వరం, వినసొంపైన గానం ఆయన స్వంతం అందుకే పరాయి భాషల్లో కూడా ఆయన నీరాజనాలందుకున్నారు
తెలుగు..తమిళ.. కన్నడ..మళయాళ.. హిందీ..ఉర్దూ.. భాషల్లో పండితుడు ఆశువుగా పద్యాలు పాటలు రాస్తారు .... అలవోకగా గజల్స్ గీతాలు పాడతారు
1951 - 52 ప్రాంతాల్లో ' మిస్టర్ సంపత్ ' అనే హిందీ చిత్రంలో అప్పటికే ప్రముఖ గాయనీమణులైన గీతాదత్, షంషాద్ బేగం, జిక్కి లాంటి వారితో కలిసి పాడడంతో చిత్రసీమలో అడుగు పెట్టారు. అదే సంవత్సరం ప్రముఖ కన్నడ దర్శక నిర్మాత ఆర్. నాగేంద్రరావు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నిర్మించిన త్రిభాషా చిత్రం ' జాతకఫలం ' లో మూడు భాషలలోను పి. బి. శ్రీనివాస్ పాడారు. ఒకే సంవత్సరంలో నాలుగు భాషల్లో గాయకుడిగా పరిచయమైన ఘనత బహుశా ఆయన ఒక్కరిదేనేమో !
ఆయన గాయకుడే కాదు కవి, రచయిత కూడా ! ఎన్నో కవితలు, గజల్స్ వంటివి రాసారు. వాటిని స్వయంగా స్వరపరచి ఆలపించారు. సినిమాలకు పాటలు కూడా రాసారు. తెలుగులో ఎం.ఎస్. శ్రీరాం నిర్మించిన ' మంచిరోజు ' చిత్రంలో కొన్ని పాటలు రాసారు. ' భాగ్యజ్యోతి ' అనే కన్నడ చిత్రంలో సంస్కృత భాషలో ఒక పాట రాసారు. అలాగే మరో కన్నడ చిత్రం ' మక్కళ భాగ్య ' లో ఒక పాట అయిదు భాషల్లో వుంటుంది. అందులో కన్నడ చరణం తప్ప మిగిలిన తమిళ, తెలుగు, మళయాళ, హిందీ భాషల చరణాలు పి. బి. శ్రీనివాస్ రాసి తానే స్వయంగా ఆ పాట పాడారు.
ఎనభై వసంతాలు పూర్తి చేసుకున్న ఈనాటి వాగ్గేయకారుడు ప్రతివాది భయంకర శ్రీనివాస్ గారి జన్మదిన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ఆణిముత్యాల కదంబం..............
అంతటి ఇంతటి వాడిననలేదు మరికొన్నేళ్ళు అధిగమించాలనీ మరిన్ని మంచి చెడ్డలు చవి చూడాలనీ ముందుకు వెడుతున్నాను అభిమానుల దృష్టిలో కుర్రవాణ్ణి పెద్దల హృదయాల్లో దాగున్న చిన్నవాణ్ణి ముందుకు వెళ్ళి సాధించేదేమిటో తెలియదు నాకు వెళ్ళిన తర్వాత మిగిల్చిందేమిటో తెలియాలి మీకు
....... ఇవి అరవైవ పడిలో పడ్డ సందర్భంలో అ . ఆ. లు........ అక్కినేని ఆలోచనలు
ఎవర్ గ్రీన్ అనే పదానికి అర్థం అక్కినేని. అందుకే ఇప్పుడు ఎనభైయవ పడి సగం దాటాక కూడా ఎప్పటిలాగే వున్న నవయువకుడు అక్కినేని. అక్కినేని నాగేశ్వరరావు గారి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలతో...........
కృషితో నాస్తి దుర్భిక్షం ............ దీనికి సజీవ ఉదాహరణ డా. డి. రామానాయుడు గారు
సినిమా నిర్మాణం మీద మక్కువను పెంచుకుని మద్రాస్ బాట పట్టి చిత్ర నిర్మాణంలో మెళుకువలు నేర్చుకుని చిత్రసీమ మీద ' అనురాగం ' పెంచుకుని ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ నేడు భారత దేశంలో అత్యున్నత పురస్కారాన్ని అందుకునే స్థాయికి చేరడం........... నిజంగా తెలుగు సినిమా రంగం, తెలుగు సినిమా ప్రేక్షకులు గర్వించదగ్గ విషయం.
ఒక నిర్మాత ఇన్ని సంవత్సరాలు వరుసగా చిత్రాలు నిర్మించడం మాటలు కాదు. అందుకే గిన్నిస్ బుక్ లోకి ఆయన పేరు చేరింది. ఆయన చిత్రాలు నేల విడిచి సాము చేసినవి కావు వినోదం, వ్యాపారం ప్రధానమైనా బాధ్యత మరచిపోలేదు సినిమా తియ్యడం పెద్ద గొప్పేమీ కాదు.... పుంఖాను పుంఖాలుగా నేను కూడా తియ్యగలను.... అని అదీ ఇదీ అని చూడకుండా అడ్డమైన చెత్త తీసి ప్రేక్షకుల మొహాన కొట్టలేదు.
ఆయన చిత్రాల విజయానికి, ఆయన జీవిత విజయానికి ముఖ్యమైన కారణం ప్రణాళిక ఆయన చిత్రం నిర్మించినా, స్టూడియో కట్టినా, సంతానాన్ని చిత్రసీమలో ప్రవేశపెట్టినా అన్నీ ఒక ప్రణాళిక ప్రకారం జరిగాయి....జరుగుతాయి. సరైన ప్రణాళిక, నిబద్ధత వుంటే ఏ మనిషైనా ఎంత ఎత్తు ఎదగచ్చో నాయుడు గారిని చూస్తే తెలుస్తుంది కేవలం డబ్బు ఆ స్థాయిని కల్పిస్తుందని అనుకుంటే ఆది చాలా పొరబాటు. ఆయన కంటే డబ్బున్నవాళ్ళు చాలామందే పరిశ్రమలోకి వచ్చారు. గొప్ప నిర్మాతలుగా చాలామంది చెలామణీ అయ్యారు. కానీ అవన్నీ స్వల్పకాలమే ! తరువాత తెరమరుగయిన వాళ్ళే ఎక్కువ .
ఆయన చలన చిత్ర జీవితం కొత్తగా వచ్చే నిర్మాతలకు పెద్దబాలశిక్ష. వాళ్ళు కొంతకాలం ఆయన నిర్మాణ శైలిని నిశితంగా గమనించిన తర్వాత నిర్మాణంలోకి దిగితే చేతులు కాల్చుకోవాల్సిన అవసరముండదు. ఆయన చిత్రాల్లో అనవసరపు ఆర్భాటాలుండవు. హింసతో నిండిపోవు. హద్దు మీరిన శృంగారం వుండదు. ఫ్యాక్షన్ లు, బాంబులు వగైరా మసాలాలుండవు. సగటు ప్రేక్షకుడికి ఏమి కావాలో ఆయనకు స్పష్టంగా తెలుసు. అందుకే ఆయన చిత్రాల్లో అన్నీ సమపాళ్ళల్లో రంగరిస్తారు. ఆయన చిత్రాలు ట్రెండ్ అంటూ గాలివాటుగా పోవు. అందుకే ఆయన తీసిన సినిమాలన్నీ దాదాపుగా విజయవంతమే !
కొందరికి తాము చేసిన పనుల కంటే తమకు ఎక్కువ గుర్తింపు రావాలనే కండూతి వుంటుంది. దానికోసం అవసరమైతే బిరుదులూ, సన్మానాలు కొనుక్కుంటారు. ఏదో ఒక సంచలన వార్తతోనో, వ్యాఖ్యతోనో మీడియా ద్వారా ప్రజల నోటిలో తమ పేరు నానేటట్లు చేసుకోవడానికి నానా తంటాలు పడతారు. ఆయనే ఒక చానెల్ గానీ, న్యూస్ పేపర్ గానీ పెట్టగలిగే స్థోమత వుండి కూడా పెట్టుకోలేదు. ఆయనకు ప్రచారం ఆయన చిత్రాలే !
రామానాయుడు గారికి ఆయన చిత్రాలు, ఆయన స్టూడియో తప్ప మరో దృష్టి వున్నట్లు తోచదు . రాజకీయాల్లో కూడా ఆయన ఇమడలేదు. తాను నమ్ముకున్న, తనని నమ్ముకున్న తెలుగు చిత్ర పరిశ్రమను ఆయన వదలలేదు. ఆ నిబద్ధతే ఆయన్ని ఈనాడు ఉన్నత శిఖరాలు చేర్చింది.
అందుకే ఆయన ఇంతకుముందు మూవీ మొఘల్ అయ్యారు. ఇప్పుడు తెలుగు సినిమా దాదా అయ్యారు
దాదాసాహెబ్ ఫాల్కే భారతీయులకు సినిమాకళను అందించారు రామానాయుడు తెలుగు చిత్ర పరిశ్రమకు నిర్మాణ కళను అందించారు
డా. రామానాయుడు గారికి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం ప్రకటించిన సందర్భంగా శుభాకాంక్షలతో...............
దేశభాషలందు తెలుగు లెస్స ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ తెలుగు పంచదారకన్న పాలకోవకన్న తెలుగు భాష తీపి తెలుగు భాషకు, తెలుగు వెలుగులకి, తెలుగుదనానికి వందనం తెలుగు వ్యావహారిక భాషకు ఉద్యమించిన గిడుగు వారికి వందనం
తెలుగులో రాద్దాం
తెలుగులో మాట్లాడుదాం
తెలుగు చదువుదాం
తెలుగు వాళ్ళమనిపించుకుందాం
తెలుగేతరులకు కూడా తెలుగు నేర్చుకోవాలనిపిద్దాం తెలుగు బాట నడుద్దాం ! తెలుగు ఖ్యాతి చాటుదాం !!
తెలుగు వారందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలతో ..............................
మన మధురమైన తీపి జ్ఞాపకాలను పదిలపరిచే చాయాచిత్రం మన జీవితాల్లో విడదీయరాని బంధమైన ఛాయాచిత్రం మనకి దూరంగా వున్న, దూరమైన వారిని దగ్గరగా చూపే చాయాచిత్రం మన రూపాలకి ప్రతిరూపం, మన హావభావాలకి నిలువెత్తు నిదర్శనం చాయాచిత్రం
ప్రపంచ ఛాయాచిత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ మధుర స్మృతుల మాల ...............
పరతంత్ర పాలనలో మగ్గిన భారతజాతి స్వాతంత్ర్య వాయువులు పీల్చుకుని 63 సంవత్సరాలు గడిచిపోయాయి. ఎన్నెన్నో పంథాలు, పోరాటాలు, విధానాలు, ఉద్యమాలు, త్యాగాలు, బలిదానాలు....... వెరసి పరాయి పాలకుల పలాయనం, స్వతంత్ర్య బారతదేశ ఆవిర్భావం
స్వాతంత్ర్యోద్యమం కేవలం పరాయిపాలనకు వ్యతిరేకంగా జరిగింది కాదు మన హక్కులు, మన సంపద, మన సంస్కృతి కాపాడుకోవడానికి జరిగిన ఆత్మగౌరవ పోరాటం రాజ్యంలోని మానవులందర్నీ సమానంగా చూడలేని రాజు... రాజు కాడు సమాజంలోని తోటి మనుష్యుల్ని తమతో సమానంగా చూడలేని ప్రజలు... ప్రజలు కారు
రాజరికంలో యథా రాజా తథా ప్రజా ప్రజాస్వామ్యంలో యథా ప్రజా తథా రాజా ఇది స్వాతంత్ర్యోద్యమ స్పూర్తి మనకు నేర్పించింది ఇవే హక్కుల్ని రాజ్యాంగం మనకు ప్రసాదించింది
మన హక్కుల్ని మనమెంతవరకూ కాపాడుకుంటున్నాం ? మన అధికారాల్ని మనమెంతవరకూ ఉపయోగించుకుంటున్నాం ? ప్రజాస్వామ్యంలో పాలకులు ఉండరు...సేవకులే అందరూ .... మరి సేవకుల్ని పాలకులుగా ఎందుకు భావిస్తున్నాం ?
బ్రిటిష్ వలస పాలనలో 200 ఏళ్ళు మగ్గిన మనలో ఆ బానిస భావాలు పోలేదా ? ఇంకా ఎన్ని తరాలు ఆ భావ దారిద్యంలో మగ్గాలి ? దానినుండి ఈ జాతికి విముక్తి లేదా ? నవ భావాల ... ఆధునిక యువతరమైనా ఈ బానిస భావాలను చేదిస్తుందా ? డబ్బు సంపాదనా మార్గాల అన్వేషణలో పడి కర్తవ్యం మరచిపోతుందా ?
వ్యక్తి కంటే సమాజం ముఖ్యమని నవతరం గుర్తిస్తే నిజమైన స్వాతంత్ర్య ఫలాలను చూడవచ్చు సమాజం బాగుంటేనే మనం హాయిగా, స్వేచ్చగా జీవించగలమని యువత గుర్తించాలి నా కుటుంబం, నా బాగు, నా సంపాదన, నా సరదాలు అనే పరిధిని దాటి ఆలోచించాలి అప్పుడే స్వాతంత్ర్య యోధుల త్యాగాలకు నిజమైన విలువ నిచ్చినట్లవుతుంది అప్పుడే సమసమాజ, నవసమాజ స్థాపన సాధ్యమవుతుంది
విభజించి పాలించు సూత్రాన్ని పాటిస్తూ బ్రిటిష్ ప్రభుత్వం అప్పటివరకూ ఒకే జాతిగా వున్న భారతీయుల్ని రెండుగా విడదీసింది . 63 ఏళ్ళు గడిచినా ఆ బేధాలు సమసిపోలేదు. సరిగదా మన నాయకులు ఈ బ్రిటిష్ సూత్రాన్ని బాగా వంటపట్టించుకుని తమ పబ్బం గడుపుకుంటున్నారు. ఇప్పటికైనా నవతరం మేల్కొని ఇలాంటి కుత్సిత, స్వార్థపూరిత నాయకులకు మంగళం పాడకపోతే మన జాతిలో మరో ముసలం పుడుతుంది.
64 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలతో .................... స్వాతంత్ర్యం సిద్ధించిన పరిణామ క్రమం చూడండి..............
ఆ స్నేహాన్ని నిజంగానే శాశ్వతం చేసుకున్నారు రైల్వే మిక్స్ డ్ హైస్కూల్ 1984 బ్యాచ్ విద్యార్థులు. నిన్న జరిగిన ఆ కలయికలో వారి ఆనందం, ఉత్సాహం, ఉద్వేగం చెప్పనలవికాదు. ఒక్కసారిగా అందరూ పాతిక సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోయారు. మళ్ళీ చిన్న పిల్లలయిపోయారు. పదవతరగతి విద్యార్థులుగా మారిపోయారు. హాయిగా ఆడి పాడి తమ మిత్రుల్ని కలసిన ఆనందాన్ని పంచుకున్నారు. నిన్నటి వారి ఆనందం వర్ణనాతీతం.
వారి స్కూల్ జ్ఞాపకాలను పదిలం చేసుకోవడానికి నేను తయారు చేసిన డాక్యుమెంటరీలోని కొన్ని ఘట్టాలు.........
స్నేహబంధము ఎంత మధురము చెరిగిపోదు తరగిపోదు జీవితాంతమూ ...
చిన్ననాటి జ్ఞాపకాలు తీయనైనవి నూరేళ్ళు గడిచినా అవి మరపురానివి
...... అని నిరూపించారు విజయవాడ రైల్వే మిక్స్ డ్ హైస్కూల్ 1983-84 నాటి విద్యార్థులు....... ఇప్పటి బాధ్యతలు గలిగన పౌరులు.
ప్రపంచవ్యాప్తంగా వివిధ హోదాల్లో, వృత్తుల్లో స్థిరపడి ఆ భాధ్యతల్లో మునిగిపోయి తీరిక లేకుండా వున్న సుమారు 100 మంది ఈరోజు ( జూలై 17 వతేదీ శనివారం ) విజయవాడలో కలవబోతున్నారు.
తమ తమ స్థాయిలు, హోదాలు మరచిపోయి బాల్యమిత్రులను కలవాలనే అభిలాషతో ఉత్సాహంగా ఉరకలేస్తూ దేశవిదేశాలలోని వివిధ ప్రాంతాలనుంచి వస్తున్నారు.
తమకు విద్యాబుద్ధులు చెప్పి తమ ఉన్నతికి కారకులైన అప్పటి ఉపాధ్యాయులను, ఆ అవకాశాన్ని కల్పించిన ఆ పాఠశాలను స్మరించుకోవడానికి, సత్కరించుకోవడానికి సిద్ధంగా వున్నారు.
ఎప్పుడో పాతికేళ్ళక్రితం నాటి సహాధ్యాయుల వివరాలు సేకరించడం అంత సులభం కాదు. ఎక్కడెక్కడో స్థిరపడ్డారు. వారందరి వివరాలు, చిరునామాలు సేకరించడం కష్టం. ఒకరకంగా అది అసాధ్యం. కానీ ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు విజయవాడలో స్థానికంగా వున్న మిత్రులు. ముఖ్యంగా ఏక్సిస్ బ్యాంకు లో ఉన్నత స్థానంలో వున్న శరత్ చంద్ర, విజయవాడ రైల్వే లో పనిచేస్తున్న మరికొందరు మిత్రులు, ఇంకా ఇతర రంగాలలో వున్న మిత్రులు కలసి సుమారు నాలుగు నెలలుగా ఈ బృహత్ కార్యక్రమం చేపట్టి ఇంటర్నెట్ ద్వారా, ఇతర మార్గాల ద్వారా అందరి వివరాలు సేకరించగలిగారు. అందర్నీ ఒక త్రాటి మీదకు తీసుకురాగలిగారు. ఫలితంగా ఇంతమంది మిత్రులు పాతికేళ్ళ అనంతరం మళ్ళీ కలవబోతున్నారు.
ఆ అనుభూతి ఎంత మధురమో ముందరే నేను చవిచూసాను. మిత్రులు శరత్ చంద్ర గారికి ఈ సందర్భంలో కేవలం కలవడం, చిన్నప్పటి కబుర్లు చెప్పుకోవడం, విడిపోవడం మాత్రమే కాకుండా తమ చిన్నప్పటి మధుర స్మృతుల్ని శాశ్వతంగా పదిలపరచాలనే ఆలోచన వచ్చింది. వెంటనే నన్ను సంప్రదించారు. అప్పటి ఉపాధ్యాయుల, మిత్రుల జ్ఞాపకాలను వారి చేతనే చెప్పించి రికార్డు చేసి డీవీడీలుగా తయారుచేసి మిత్రులందరికీ అందించడానికి ప్రణాళిక రూపొందించాం. ఆ మిత్రుల పట్టుదల నాకు ఉత్సాహాన్నిచ్చింది. క్రిందటి నెలలో షూటింగ్ అనుకున్న రోజున విజయవాడ పరిసరాలు, హైదరాబాద్, చెన్నై లాంటి చోట్లనుండి సుమారు 30 మంది హాజరయ్యారు. అప్పటి ఉపాధ్యాయులు సుమారు 10 మంది హాజరయ్యారు. ఈనాటి కార్యక్రమానికి నాంది పలికిన ఆనాటి కార్యక్రమానికి హాజరయిన మిత్రుల ఆనందం వర్ణనాతీతం. అందులోను వారు చదువుకున్న పాఠశాలలో కలవడం వారి ఆనందాన్ని అవధులు దాటించింది. వాళ్ళు వయసు, హోదాలు అన్నీ మరచిపోయి మళ్ళీ ఆనాటి విద్యార్థి దశకు వెళ్ళిపోయారు. వారి సంతోషం చూసి తీరాల్సిందే ! వారికంటే ఎక్కువ అనుభూతి పొందినవారు, ఆనందించినవారు అప్పట్లో వారికి విద్యనందించిన ఉపాధ్యాయులు.
మళ్ళీ వాళ్ళూ, ఇంకా మిగిలిన మిత్రులు తమ కుటుంబాలతో సహా ఈరోజు కలుస్తున్నారు. వారి చిన్ననాటి జ్ఞాపకాలను, అనుభూతుల్ని, అనుభవాల్ని, ముచ్చట్లను చిత్రీకరించే అవకాశం నాకిచ్చారు. అవన్నీ డాక్యుమెంటరీ లాగ పేర్చి, కూర్చి పదిలపరిచాను. ఈరోజు వారందరూ ఆ జ్ఞాపకాలమాలికను అందుకోబోతున్నారు. వారి జీవితకాలంలో ఆ జ్ఞాపకాల్ని కేవలం మనసులో తలుచుకోవడంతో సరిబెట్టక తమ బాల్య మిత్రుల్నీ, తాము చదివిన పాఠశాలను కళ్ళెదుట నిలుపుకోవాలని మిత్రులు శరత్ చంద్ర ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. నేను కార్యరూపంలో పెట్టాను.
భవిష్యత్తులో వాళ్ళే కాదు.... వారి పిల్లలు.... వారి మనుమలు కూడా ఈ జ్ఞాపకాల్ని పంచుకుంటారు. స్నేహబంధం లోని మాధుర్యాన్ని చవి చూస్తారు. ఇదొక విచిత్రమైన, మధురమైన అనుభూతి. పాతికేళ్ళ తర్వాత ఒకే వేదిక పైకి రానున్న ఆ మిత్రులందరికీ శుభాకాంక్షలు.
నాన్న- జననంలో భాగస్వామి నాన్న - ఎదుగుదలకు మార్గదర్శి నాన్న - జ్ఞానార్జనకు ఆలంబన నాన్న - జీవితాన్ని తీర్చిదిద్దే త్యాగశీలి
అందుకే ......
ఓ నాన్నా !...... నీ మనసే వెన్నా !..... అమృతం కన్నా ఆది ఎంతో మిన్నా ! ............... ముళ్ళ బాటలో నీవు నడిచావు పూలతోటలో మమ్ము నడిపావు ఏ పూట తిన్నావో ఎన్ని పస్తులున్నావో పరమాన్నం మాకు దాచి వుంచావు
*************************************************
పితృ దినోత్సవ సందర్భంగా తండ్రులందరికీ శుభాకాంక్షలతో .............
స్లం డాగ్ మిలియనీర్ చిత్రానికి శబ్ద గ్రాహకుడిగా వ్యవహరించిన తెలుగు తల్లి ముద్దుబిడ్డ అదృష్ట దీపక్ కి ప్రతిష్టాత్మక గ్రామీ పురస్కారం లభించింది. ఆయనకు అభినందనలు తెలుపుతూ ....... ఈనాడులో ఆ వార్త లింక్ ...........
ఎలక్ట్రానిక్ వాచ్ ( ఓడిపోయిన మొహంతో ) : మా బాస్ కి స్పీడెక్కువ. ఆయనతో పరుగెత్తలేక నా కాళ్ళు ( ముళ్ళు ) నొప్పెడుతున్నాయి. నన్నిక ఎవరికో ఒకరికి ప్రెజెంట్ చేసినా బాగుణ్ణు. కాస్త ఊపిరి పీల్చుకోవచ్చు.
గిల్లెట్ రేజర్ ( దర్పంగా ) : ఆయనకి ప్రతిరోజూ షేవింగ్ హడావిడే ! కంఠం దగ్గరకొచ్చేసరికి మాత్రం నేను చాలా ' స్మూత్ ' గా రన్నవుతాను.
ఏసీ అంబాసడర్ కారు ( ఉస్సురనుకుంటూ ) : ప్రతిపూటా ఓవర్ లోడింగే ! ఆయన కేంతమంది ఫ్రెండ్స్ ఉంటే మాత్రం అంతా రికార్డింగ్ కి రావలసిందేనా ! ఇద్దరు ముగ్గురు చాలు ప్రాణానికి హాయిగా వుంటుంది.
వడపళని, నుంగంబాక్కం రోడ్లు ( సాదరంగా ) : ఎంతమంది మహావ్యక్తులకి మేము రోజూ రాజమార్గాలైనా, బాలూ కారుకి మేమిచ్చేది మాత్రం ఎప్పటికీ రెడ్ కార్పెట్ ట్రీట్ మెంటే !
మైక్ ( సిన్సియర్ గా ) : ఏకు మేకై కూర్చోడమంటే ఇదే ! సన్నగా, నున్నగా వున్న ' బాలగాత్రం ' గాన గానాభివృద్ధి చెంది ' బోల్డ్ వాయిస్ ' అయిన బాలు గాత్రంగా మారడానికి నేనేగా ప్రత్యక్ష సాక్షిని. ఏమాటకామాటే చెప్పుకోవాలి. నేనున్నా, లేకున్నా - నాలోంచి విన్నా, విడిగా విన్నా బాలు గొంతు ' నభూతో నభవిష్యతి '
మద్రాస్ రికార్డింగ్ థియేటర్లు ( గ్లూకోస్ డబ్బాలవైపు చూస్తూ ) : మేమే మెషిన్లమయితే మమ్మల్ని మించిన ' సింగింగ్ ' మెషిన్ దొరికాడు మా ప్రాణానికి.
పాట సాహిత్యం ( బాలానందంగా ) : థాంక్ గాడ్ ! మా పదాలకి మాకే తెలీని కొత్త అందాలు పెట్టగలిగే గాయకుడి గొంతులో పడ్డాం !
బాల్ ( + ఉ ) పెన్ను ( ధీమాగా ) : మా ఓనర్ గారి చేతిలో పడ్డాక నా ' రాతే ' మారిపోయింది.
పత్రికలు ( గర్వంగా ) : ఈయన పేరు లేకుండా రావుకదా పత్రికలు.
హిగ్గిన్ బాదమ్స్ బుక్ స్టాల్ ( ముసి ముసి నవ్వులతో ) : కొత్త ఇంగ్లిష్ పుస్తకం రావడం ఆలస్యం. నా రాక్ లో పట్టుమని పదినిముషాలుండనివ్వడు కదా !
రేడియో ( గంతులేస్తూ ) : ఇక నా పేరు ' బాలిండియా రేడియో ' గా మార్చేస్తారట.
వీడియో ( దర్పంగా ) : నాకు, బాలు గారికి ఇంతటి అనుబంధం ఏర్పడిపోతుందని కల( ర్ ) లో కూడా అనుకోలేదు. రాత్రి ఒకటైనా, రెండైనా నా దర్శనం చేసుకోందే పడుకోలేడుకదా !
అకాయ్ డెక్ ( హడావిడిగా ) : సారీ సర్ ! ఐ యాం టు బిజీ. టేప్ టు టేప్ టు టేప్...... !
చొక్కా ( కన్నీళ్ళతో ) : కాస్త డైటింగ్ చెయ్యమని చెప్పండి డాక్టరూ ! నా కుట్లు విడిపోతున్నాయి దేవుడో !
సుమారు రెండు దశాబ్దాల క్రితం బాలుగారికి హైదరాబాదులో జరిగిన ఓ సన్మాన కార్యక్రమంలో డా. వై. దివాకరబాబు సమర్పించిన వెరైటీ సన్మాన పత్రం ఇది.
బాలుగారి జన్మ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలందిస్తూ....... బాలుగారు తెరమీద తొలిసారిగా కనిపించి స్వయంగా పాడిన ' హ్యాపీ బర్త్ డే ' పాట..... ఆయనకోసం, మీకోసం .................