Sunday, February 28, 2010

రంగుల పండుగ శుభాకాంక్షలు

జీవితమే రంగేళీ !
రంగు రంగుల కేళీ హోలీ !
మిత్రులందరికీ హోలీ శుభాకాంక్షలతో......
వి.శాంతారాం అద్భుత వర్ణమయ సృష్టి  నవరంగ్  నుంచి ' సంధ్య ' చేసిన హోలీ నయనానందకర నృత్యం మీకోసం....  





Vol. No. 01 Pub. No.211

Saturday, February 27, 2010

పదివేల వందనాలు

బ్లాగు మిత్రులు, వీక్షకులు అయిన శ్రేయోభిలాషులందరికీ పదివేల వందనకదంబాలు
ఈ నెల 14 వ తేదీతో బ్లాగు ప్రారంభించి ఆరునెలలు అయితే మరో పద్నాలుగు రోజులకు
అంటే నేటితో పదివేల హిట్లు పూర్తయ్యాయి. ఇందుకు కారణమైన అందరికీ పదివేల కృతజ్ఞతలు.







Vol. No. 01 Pub. No. 210

Friday, February 26, 2010

బాలు గారి తొలిపాట గురించి పద్మనాభం

శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న కథ చిత్రం ద్వారా శ్రీ ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం గారిని తెలుగు చలన చిత్ర ప్రపంచానికి పరిచయం చేసిన నిర్మాత పద్మనాభం గారనే విషయం అందరికీ తెలిసినదే ! ఆ చిత్రంలోని ఏమి ఈ వింత మోహం... అనే పాట ద్వారా ఆ పరిచయం జరిగిందనే విషయం కూడా అందరికీ తెలిసినదే ! ఆ పాట మొదట ఘంటసాల, పి.బి. శ్రీనివాస్, రఘురామయ్య, సుశీల గార్లతో పాడించాలని అనుకున్నారట.  కానీ ఘంటసాల గారి తల్లిగారికి ఆరోగ్యం బాగులేక వూరికెళ్ళడంతో ఆ అవకాశం సంగీత దర్శకుడు కోదండపాణి గారి ద్వారా పరిచయమైన బాలు గారికి ఇచ్చారు పద్మనాభం.  ఆ విశేషాన్ని వివరిస్తూ పద్మనాభం గారు .................

" మేస్టారి అమ్మగారికి పెద్ద సుస్తీ చేసి ఆయన వాళ్ళ వూరు వెళ్ళారు. ఇటు చూస్తే పాట చిత్రీకరణ పూర్తి చెయ్యాలి. అందుకని పాట త్వరగా రికార్డు చెయ్యాలి. మాకు కొత్త కుర్రాడు గుర్తొచ్చాడు. చూద్దాం. ముందు అతనిచేత పాడిద్దాం. అంతగా బాగుండకపోతే ఆ తరువాత మళ్ళీ అండరినీ కలుపుకుని ఇంకోసారి రికార్డు చేదామని అనుకున్నాం. బాలు వచ్చాడు. ముగ్గురు ఉద్ధండుల మధ్య పాడుతున్నానన్న భయం ఎంతమాత్రం లేకుండా రిహార్సల్స్ లో పాల్గొన్నాడు. రికార్డింగ్ లోనూ దంచేశాడు. నాకు అతని గళం నచ్చింది, అయినా మర్యాదకోసం మేస్టారు వూరినుంచి వచ్చాక ఆయనకు పాట వినిపించాం. ఆయన కూడా కుర్రాడు అద్భుతంగా పాడాడు. ఉంచేయండన్నారు. అలా బాలు గాయకుడయ్యాడు " అని ఓ సందర్భంలో చెప్పారు.  



Vol. No. 01 Pub. No. 210

అమెరికాలో ' రంగుటద్దాల కిటికీ '

ఆమధ్య ఆంధ్రాలో ' రంగుటద్దాల కిటికీ ' తెరుచుకుంది.
ఈమధ్య అమెరికాలో మళ్ళీ అదే ' రంగుటద్దాల కిటికీ ' తెరుచుకుంది.
మన బ్లాగు మిత్రులు కొత్తపాళీ నారాయణ స్వామి గారు రాసిన ఆ పుస్తకం అమెరికాలో ఆవిష్కృతమైంది.
ఆ విశేషాలు ప్రసారమైన TV9 దృశ్య శకలం మీరు కూడా ఒకసారి చూడండి.




Vol. No. 01 Pub. No. 209

Thursday, February 25, 2010

విజయాధినేతకు నివాళి

తెలుగు చలనచిత్ర రంగంలో ' షావుకారు ' మొదలుపెట్టి ' శ్రీ రాజ రాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్ ' వరకూ 'విజయ' కేతనం ఎగురవేసిన విజయా ప్రొడక్షన్స్ అధినేత కీ.శే. బి.నాగిరెడ్డి గారి ఆరవ వర్థంతి ఈ రోజు ( 25 ఫిబ్రవరి ) . ఈ సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ.............

 * నాగిరెడ్డి గారి జన్మదినం సందర్భంగా రాసిన టపా ఇక్కడ చూడండి.
Vol. No. 01 Pub. No. 208

Wednesday, February 24, 2010

సృజనాత్మక చిత్రాలు

మనలో చెలరేగే భావవ్యక్తీకరణకు మార్గాలెన్నో ! ఒక కవి తన భావాల్ని తన కవిత్వం ద్వారా, రచయిత కథలలాంటి రచనా ప్రక్రియల ద్వారా, సంగీతజ్ఞుడు తన సంగీతం ద్వారా, నటుడు తన నటన ద్వారా, శిల్పి తన శిల్పాల ద్వారా, చిత్రకారుడు తన చిత్రాల ద్వారా తెలియజేస్తారు. ఇందులో చిత్రలేఖన కళ విశిష్టమైనది. ఎందుకంటే పది పేజీలలో ఇమడ్చలేని భావాన్ని చిత్రకారుడు ఒక చిత్రంలో ఇమడ్చగలుగుతాడు. ఈ చిత్రలేఖనంలో నుంచి పుట్టుకొచ్చినదే చాయాచిత్ర కళ అదే ఫోటోగ్రఫి. ప్రస్తుతం ఈ కళ అత్యంత శక్తివంతమైన సమాచార సాధనం. సాంకేతికంగా అతి వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతం డిజిటల్ ఫోటోగ్రఫి రాజ్యమేలుతోంది. అయితే డిజిటల్ గా ఎంత అభివృద్ధి చెందినా ఫిలింపై వచ్చే నాణ్యతను అధిగమించలేక పోతోంది.
ఆటో ఫోకస్ కెమెరాతోనో, డిజిటల్ కెమెరాతోనో ఏ విధమైన సాంకేతిక పరిజ్ఞానం లేకుండా కేవలం ఎయిమ్ అండ్ షూట్ అన్న పద్ధతిలో పుంఖాన పుంఖాలుగా ఫోటోలు తీసిపడెయ్యడం మనకు తెలుసు. అలాంటి మనకు హఠాత్తుగా ఒక ఎస్.ఎల్.ఆర్. కెమెరా ఇచ్చి ఏదో ఒక విషయం మీద ఫోటోలు తీసుకురమ్మంటే అవి సాగరసంగమం సినిమాను గుర్తుకుతెస్తాయేమో ! అలాంటి దశ నుండి ఇప్పుడిప్పుడే సాంకేతికాంశాలు నేర్చుకుంటున్నవారికి ఓ కెమెరా ఇచ్చి ఫోటోలు తీసుకుని రమ్మంటే..... వాళ్ళు తీసిన ఫోటోలకు వాళ్ళ చేతనే వ్యాఖ్యలను రాయించి, అవి ప్రదర్శనకు పెడితే...............
అదే జరిగింది నిన్న ( ఫిబ్రవరి 23 ), మొన్న ( ఫిబ్రవరి 24 ) విజయవాడ లో .............
ఆంధ్ర లయోలా కళాశాల విజువల్ కమ్యూనికేషన్స్ విభాగం వారు స్పార్క్స్ ' 10 పేరిట ఫోటోగ్రఫి ప్రదర్శన నిర్వహించారు. అందులో పాల్గొన్న వారు నిష్ణాతులైన ఫోటోగ్రాఫర్లేమీ కాదు. సాంకేతికాంశాలను ఔపోసన పట్టేసిన వారూ కాదు. ఇప్పుడిప్పుడే ఫోటోగ్రఫిలో ఓనమాలు దిద్దుతున్న విద్యార్థులు. ఆంధ్ర లయోలా కళాశాల లో విజువల్ కమ్యునికేషన్స్ విభాగంలో బి.ఎస్సీ. మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు. ఇప్పుడిప్పుడే ఈ రంగంలో అడుగుపెట్టిన విద్యార్థులలో దాగివున్న సృజనాత్మకతను వెలికి తీసే ప్రయత్నంలో కళాశాల... వాళ్లకు కెమెరా ఇచ్చి ఫోటోలు తీసుకురమ్మని పంపించింది. అలా తీసిన వాటిల్లో మంచివి ఎన్నుకుని వాటికి సరిపడే వ్యాఖ్యలు వారిచేతనే రాయించి ప్రదర్శనకు ఉంచింది. ఎన్నుకున్న విషయానికి సంబంధించిన సబ్జెక్టు వెతుక్కోవడం ఒక ఎత్తైతే, వాటికి సరిపడే వ్యాఖ్య రాయడం మరో ఎత్తు. ఒక్కోసారి ఫోటో కంటే వ్యాఖ్యే మనల్ని ఎక్కువ ఆకర్షిస్తుంది. ఆలోచింపజేస్తుంది.
అవేమీ కళాఖండాలు కాకపోవచ్చు. కానీ ఇప్పుడే వికసిస్తున్న మొగ్గలు తీసినవి. వాళ్ళ లేత మేధకు అందిన అంశాలవి. దృశ్య మాధ్యమం ద్వారా సమాచార వ్యాప్తి చేసే క్రమంలో ఇది ఆ విద్యార్థుల తొలి అడుగు. వారిని ప్రోత్సహిస్తున్న కళాశాల యాజమాన్యానికి, వారికి నిర్దుష్టమైన మార్గాన్ని చూపుతున్న అధ్యాపక వర్గానికీ అభినందనలు. ఆ విద్యార్థుల కృషిని మీరు కూడా చూడండి........


కొసమెరుపు : ఈ విద్యార్థులలో మా అబ్బాయి కూడా ఒకడు.
Vol. No. 01 Pub. No. 207

నమ్మిన బంటు

1960 లో విడుదలయిన చిత్రం ' నమ్మినబంటు '. అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో పాల్గొన్న తొలి తెలుగు చిత్రం ' నమ్మిన బంటు '. ఆ చిత్ర విశేషాలు కొన్ని ..................

* శంభు ఫిల్మ్స్ పతాకం పైన యార్లగడ్డ వెంకన్న చౌదరి నిర్మించిన ఈ చిత్రానికి ఆదుర్తి సుబ్బారావు దర్శకుడు. 
* అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, గుమ్మడి, ఎస్వీ రంగారావు, రేలంగి, గిరిజ, చదలవాడ మొదలైన హేమాహేమీలు నటించిన  ఈ చిత్రంలో రామలక్ష్మణలనే రెండు ఎద్దులు, ఒక పాము కూడా నటించాయి.
అప్పట్లో దొక సంచలనం. 
* ఈ చిత్రానికి మొదట మాస్టర్ వేణు సంగీత దర్శకుడిగా వ్యవహరించినా ఆయన మరణం తర్వాత 'స్వ'రాజేశ్వరరావు గారు ఆ బాధ్యత తీసుకున్నారు. 
* ప్రముఖ రచయిత సుంకర సత్యనారాయణ ఈ చిత్ర కథనందించారు. ఆయనతోబాటు ఆత్రేయ సంభాషణలు రాసారు. సుంకర కమ్యూనిస్ట్ గా పేరు పడడంతో స్క్రిప్ట్ లో ఆ భావాలు ఎక్కువగా పడకుండా నిర్మాత స్వయంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.  
* ఎడ్ల పందాలు సన్నివేశాల చిత్రీకరణ ప్రకాశం జిల్లా కారంచేడు గ్రామంలో వారంరోజులపాటు మూడు కెమెరాలతో భారీగా ( అప్పట్లో ) చిత్రీకరించారు.    
* సుమారు ఒకటిన్నర సంవత్సరాలు పాటు షూటింగ్ జరిగిన ఈ చిత్రం నిర్మాణ సమయంలో అనేక అవాంతరాలు ఎదుర్కొంది. మాస్టర్ వేణు మరణంతో బాటు నాగేశ్వరరావు కాలికి దెబ్బ తగలడం, సావిత్రి గర్భవతి కావడం, మొదటి జత ఎద్దులు చనిపోవడం వంటి సమస్యలను ఎదుర్కొని నిర్మాణం పూర్తి చేసుకుని ఘన విజయం సాధించింది.  
* అచ్చమైన గ్రామీణ వాతావరణంలో నిర్మించిన ఈ చిత్రం జాతీయ స్థాయిలో ఉత్తమ తెలుగు చిత్రంగా రాష్ట్రపతి రజత పతకం పొందింది. 
ఆ సంవత్సరం ' మా ఇంటి మహాలక్ష్మి ', ' జయభేరి ' చిత్రాలు కూడా ప్రశంసా పత్రాలు సాధించాయి.   
* శాన్స్  బాస్టియన్ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొని అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో పాల్గొన్న తొలి తెలుగు చిత్రంగా చరిత్రకెక్కింది. 


 గమనిక :
* సాహిత్య అభిమాని బ్లాగు మిత్రులు శ్రీ శివ గారు పంపిన అక్కినేని వారి సంభాషణ నుంచి ఆడియో క్లిప్పింగ్ క్రింద ఇచ్చాను. శ్రీ శివ గారికి ధన్యవాదాలతో మీ కోసం.............
 

Vol. No. 01 Pub. No. 206