చిత్తూరు వి. నాగయ్య గారి కాలం తెలుగు సినిమా సంగీతానికి స్వర్ణయుగం. ఆయన రేణుకా పిక్చర్స్ కార్యాలయం సంగీత సరస్వతి నిలయం. సంగీత సామ్రాట్టులు, సాహితీ స్రష్టలతో నిత్యం ఆ కార్యాలయం కళకళలాడేది. విద్వద్గోష్టులు జరుగుతుండేవి. ఒకటేమిటి... సమస్తం సంగీతమయంగా వుండేది.
త్యాగయ్య చిత్ర నిర్మాణ కాలంలో ఆ కార్యాలయంలో సంగీత వైభవం మరింతగా వుండేది. అప్పటి ప్రముఖ సంగీత విద్వాంసులందరూ అక్కడే వుండేవారు. కాబట్టి ఆ ప్రాంగణంలో నిత్యం జరిగే మామూలు సంభాషణలు కూడా సంగీతమయంగానే వుండేవి. వాటినుంచి కొన్ని..........
* ప్రముఖ సంగీత విద్వాంసులు చెంబై వైద్యనాథ భాగవతార్ కూడా ఆ సమయంలో నాగయ్య గారి వద్దకు వచ్చేవారు. ఆయన్ని నాగయ్యగారు ఓసారి " అయ్యా ! మీ వయసెంతో తెలుసుకోవచ్చా ? " అని అడిగారు. దానికి సమాధానంగా ఆయన
" షణ్ముఖ ప్రియ " అన్నారట.
షణ్ముఖ ప్రియ 65 వ మేళకర్త రాగం. అంటే వైద్యనాథ భాగవతార్ గారి జవాబుకి అర్థం ఆయన వయస్సు 65 సంవత్సరాలు అని.
* చిత్తూరు సుబ్రహ్మణ్య పిళ్ళై అని మరో విద్వాంసుణ్ణి " మీ ఇల్లు ఎంత దూరం ? " అని అడిగితే " మా ఇల్లు ఇక్కడికి దగ్గరే ! మాయామాళవగౌళ గజాలకన్నా ఎక్కువ వుండదు " అన్నారట.
మాయామాళవగౌళ 15 వ మేళకర్త రాగం. అంటే ఆయన ఇల్లు 15 గజాలకన్నా ఎక్కువ వుండదు.
* నాగయ్య గారు తమ కార్యాలయానికి ఎవరొచ్చినా కాఫీ పలహారాదులు, భోజనాలు చేసి వెళ్ళే ఏర్పాటు చేసేవారు. ఇందుకోసం కార్యాలయంలోనే మెస్ నడిపేవారు. ఒకసారి ఒక సంగీత విద్వాంసుడు ఆ మెస్ లో ఫలహారం కానిచ్చి " ఇడ్లీకి పక్కవాయిద్యాలు భలే వున్నాయి " అన్నాడట. ఇడ్లీకి పక్కవాయిద్యాలంటే దానితో బాటు ఇచ్చిన సాంబారు, చెట్నీ, కారప్పొడి.
ఆ విద్వాంసుడే కాఫీ త్రాగబోతూ " అరే ! కాఫీ ఇంత వేడిగా వుందేమిటి ? " అన్నాడట. అక్కడే వున్న నాగయ్య గారు " ఏముందీ ! ఆ లోటాలోంచి ఈ లోటాలోకి ఆరోహణ, అవరోహణ చెయ్యండి " అని సంగీత పరిభాషలోనే సలహా ఇచ్చారట.
................. ఇలా సాగేవి నాగయ్యగారి కొలువులో సంగీత సరస్వతి స్వేచ్చా విహారాలు.
Vol. No. 01 Pub. No.312







