Tuesday, August 24, 2010

హీరో & ద్విపాత్రాభినయం

పాత తెలుగు చిత్రాలతో పరిచయమున్న వారందరికీ ప్రక్క ఫోటోలోని నటుడు గుర్తుండే ఉంటాడు.

ఆయన పేరు బొడ్డపాటి కృష్ణారావు .

వృత్తిరీత్యా తెలుగు ఉపాధ్యాయుడైన ఈయన స్వస్థలం మచిలీపట్టణం. విలక్షణమైన ఆకారం గల కృష్ణారావు గారు రంగస్థలం మీద ' సుబ్బిశెట్టి ' లాంటి వేషాలు వేసి చెళ్ళపిళ్ళ వారి వంటి ఉద్దండ పండితుల చేత ' హాస్యాంబుధి '  అనే బిరుదు పొందారు.


1954 లో ఆదుర్తి సుబ్బారావు గారి ' అమర సందేశం ' చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు. సినిమాల్లో వేషాలు వేస్తూనే ట్యూషన్లు కూడా చెప్పేవారు. నందమూరి తారక రామారావు గారి పిల్లలకి ఆయనే పాఠాలు చెప్పారు. సరిగా చదవకపోతే పిల్లలను దండించడంలో రామారావు గారు కృష్ణారావు గారికి పూర్తి స్వేచ్చనిచ్చారు.

ఒకసారి కృష్ణారావు గారు అందరికీ తాను ఒక చిత్రంలో హీరోగా చేస్తున్నట్లు చెప్పారు. ఎవ్వరూ నమ్మలేదు. కానీ ఆయన చాలా నమ్మకంగా చెప్పడంతో విచారించగా ' వినాయక చవితి ' చిత్రంలో వినాయకుడిగా నటిస్తున్నట్లు తెలిసింది. తొండం, చాటంత చెవులు వగైరాలతో ముఖం కనిపించకుండా పోవడంతో ఆయనకి బాధ కలిగింది. ఆ మాటే దర్శక నిర్మాతలతో చెబితే అదే చిత్రంలో యదువీరుడి వేషం కూడా ఇచ్చారు.  దాంతో కృష్ణారావు గారు గర్వంగా అందరికీ తాను ఆ చిత్రంలో ద్విపాత్రాభినయం కూడా చేస్తున్నట్లు చెప్పుకున్నారట.
  
Vol. No. 02 Pub. No. 012

2 comments:

  1. It was nice of the director and producer. They respected their artist and fulfilled his wish.

    ReplyDelete
  2. మాధురి గారూ !
    ధన్యవాదాలు

    ReplyDelete