Tuesday, May 11, 2010

బొమ్మల పెండ్లి

  సాధారణంగా పిల్లలకు పెద్దల్ని అనుకరించడం అలవాటు. పుట్టిన వెంటనే బిడ్డ తన చిరునవ్వు నుంచి, నడక, మాట, ప్రవర్తన, అలవాట్లు ఇలా అన్నీ తన కంటే పెద్దవారి నుంచి ముఖ్యంగా తమ తల్లిదండ్రులు, అక్కలు, అన్నల నుంచి నేర్చుకునేది ఎక్కువగా వుంటుంది. తర్వాత కాలంలో స్నేహితులు, ఉపాధ్యాయులు మొదలైన వారినుంచి, తాము చదువుకున్న పుస్తకాలలోని గొప్ప వ్యక్తుల జీవితాలను అనుకరించడానికి ప్రయత్నిస్తారు. అలాగే తాము చూసే సినిమాలలోని నటులను అనుకరించాలనే భావన కూడా వారిలో వుంటుంది.

 అలాంటి అనుకరణలోంచి వచ్చినదే గతతరంలోని పిల్లలు ఆడుకున్న అచ్చ తెలుగు ఆట బొమ్మల పెళ్లి. ముఖ్యంగా వేసవి సెలవలిస్తే ఆడపిల్లలే కాదు మగపిల్లలు కూడా కలసి తాటియాకు బొమ్మల్ని చేసుకుని వాటిని సింగారించి, కొబ్బరి బూరాలు చేసుకుని అట్టహాసంగా పెళ్లి జరిపేవారు. టీవీలు, కంపూటర్లు వచ్చి వీటినన్నిటినీ మింగేసిన నేపథ్యంలో ఒక్కసారి ఆ ఆటను గురించి పేరడీ రచనలకు పేర్గాంచిన జరుక్ ( జలసూత్రం రుక్మిణీనాథ ) శాస్త్రి గారి వర్ణన చూద్దాం !


 తాటియాకుకు కాటికా బొట్టు పెట్టి
చీర సింగారించి షోకు జేశారు !


గాజు పూసలపేరు మెళ్ళో వేశారు
గౌరీ కళ్యాణాల రేఖ దిద్దారు !


పానకం బిందెలూ సిద్ధపరిచారు
పాప పేరంటాండ్రు కాచుకున్నారు !


లక్కపిడతలో అన్నముడికి పోయింది
లక్కచట్టిలో పుప్పు ఉడికిపోతోంది


పెళ్ళికూతురు మామ కట్నాల కోసం
చింతగింజలు లెఖ్ఖపెట్టి దాచాడు


ఉత్తుత్తి అలజడి జరిగిపోతోంది
ఉత్తుత్తి బాజాలు మ్రోగుతున్నాయి


కబురు మీదా కబురు వెళ్ళింది కాని,
పెళ్ళికొడుకులవారు  తర్లిరాలేదు !!

ప్రముఖ కవి దాశరధి రేడియో కోసం రాసిన పిల్లల పాట గురించి తృష్ణ గారు గతంలో తన బ్లాగులో రాసారు. ఒకసారి ఆ టపా చదివి ఈ పాట వినండి.



Vol. No. 01 Pub. No. 286

3 comments:

  1. మేము చిన్న నాడు ఆడుకున్న ఆటలు గుర్తొచ్చాయి . అబ్బో ఎంత హైరానా పడేవాళ్ళమని . పెళ్ళి కోసమని ఇటుక పొడితో ఆవకాయ కూడా పెట్టే వాళ్ళము !

    ReplyDelete
  2. శ్రీ జాబిలి గారూ !
    నా బ్లాగు, నా రాతలు నచ్చడం ఒకెత్తైతే, మీ అనుభూతి మరో ఎత్తు. అందరి జీవితాల్లోను గతం ఒక మధురానుభూతి. చీకటి వెలుగులు రెండూ సమానంగానే అనుభవించినా వెలుగొచ్చాక చీకటిని మరచిపోలేము. అందుకే గతకాలము మేలు వచ్చుకాలము కంటే అన్నారు. ఆ జ్ఞాపకమే ఎప్పుడూ మన భవిష్యత్తుకు మార్గదర్శి. ఆ జ్ఞాపకమే జీవితాంతం హాయిగా నడిపేస్తుంది. మీకు ధన్యవాదాలు.

    ReplyDelete