Friday, May 7, 2010

ఫలరాజు ' పనస '

మృగాలన్నిటికీ రాజు సింహం 
ఫలాలన్నిటికీ రాజు   పనస 

పనసపండు ఆకారంలోనే కాదు ఉపయోగంలో కూడా పెద్దదే ! పనసపండులో ఉపయోగపడని భాగమంటూ లేదు. తొనల సంగతి చెబితే అందరికీ నోరూరుతుంది కదా ! గింజలతో కూర చేస్తారు. దుంప కూరల రుచికి ఏమాత్రం తీసిపోదు. తొనలు తీసేసాక మిగిలిన భాగాన్ని కొంతమంది పారేస్తారు. కానీ కొన్ని ప్రాంతాలలో వాటిని శుభ్రం చేసుకొని పులుసు లాగ పెట్టుకుంటారు. అది ఎంత రుచిగా ఉంటుందని !

ఇక పనస ఆకులలో ఔషధ గుణాలుంటాయంటారు. అందుకేనేమో గోదావరి జిల్లాల్లో ముఖ్యంగా కోనసీమలో వాటిని బుట్టలుగా అల్లి ' పోట్టెంకలు '  అని చేసుకుంటారు. సుభద్ర గారు వాటిని చేసే విధానం గురించి, రుచి గురించి తన బ్లాగు వాలుకొబ్బరిచెట్టు లో  సచిత్రంగా వివరంగా రాసారు.

సరే పనస చెక్క ఫర్నిచర్ తయారీకి, గృహనిర్మాణ అవసరాలకు ఉపయోగపడుతుంది. ఆది చాలా నాణ్యత కలిగి ఉంటుందంటారు. ముఖ్యగా చెదలు లాంటివి పట్టవని చెబుతారు.

ఇన్ని చెప్పి పనస పొట్టు గురించి చెప్పకపోతే ఫలరాజుకు ద్రోహం చేసినట్లే ! పచ్చిగా వున్న పనసకాయను తీసుకొని దాన్ని పొట్టుగా కొట్టే విధానం నుంచి దాంతో కూర చేసే విధానం దాకా అన్ని దశలలోనూ దాని ప్రత్యేకత దానిదే ! ఇప్పుడంటే మిక్సీలు వగైరా వచ్చేసి పని సులువు చేసాయి గానీ గతంలో పనసపొట్టు కొట్టడమంటే అదొక బృహత్కార్యము. పదును మీద వున్న పనసకాయను కోసి దాన్ని పైన ఉండే తొక్కను వలుస్తారు. అప్పుడు జిగురులాంటి పదార్ధం వస్తుంది. ఆది చేతులకు అంటకుండా నూనె రాసుకుంటారు. పొట్టు కొట్టడానికి ప్రత్యేకమైన కత్తి వుంటుంది. కాయకు మధ్యన పట్టుకోవడానికి వీలుగా పెద్ద మేకు గానీ, అట్లకాడ గానీ గుచ్చుతారు. దాన్ని పట్టుకుని కత్తితో సున్నితంగా కొడ్తూ వుంటారు. అలా సుమారుగా వున్న ఒక కాయ కొట్టడానికి సుమారు ఏడు, ఎనిమిది గంటల వరకూ సమయం పడుతుంది. ఒక్కోసారి ఇద్దరు కలసి చెరోవైపు రెండు కత్తులతో కొడతారు. అలా ఓపిగ్గా, సున్నితంగా కొడితే వచ్చే పొట్టు చాలా సన్నగా వుంటుంది. ఆ పొట్టును ఆవ పెట్టి కూర వండితే... ఆహా( !......ఏమి రుచి !

ఇప్పుడు వేసవి కాలం. పనసపండ్లు విరివిగా వచ్చేకాలం. పనస ఒకప్పుడు మనదేశానికే ప్రత్యేకం. విదేశాల వారు ఈ పండు ఆకారానికి, రుచికి తన్మయులై ఈ చెట్టును ( విత్తనాన్ని ) ఇక్కడినుంచి తరలించుకు పోయారని చరిత్ర. మన దేశంలో తూర్పు, పశ్చిమ కనుమల్లో ఈ చెట్లు విస్తారంగా పెరుగుతాయి. మన రాష్ట్రంలో దాదాపుగా అన్ని ప్రాంతాలలోను ఈ చెట్లు కనబడతాయి. ఇది ఉష్ణమండల పంట అవడం వలన, దీని పెరుగుదలకు గాలిలో తేమ ఎక్కువగా వుండాలి కనుక మన రాష్ట్రంలో ఇవి ఎక్కువగా కోస్తా ప్రాంతంలో పెరుగుతాయి. ముఖ్యంగా గోదావరి జిల్లాలలో అందులోనూ డెల్టా ప్రాంతమైన కోనసీమ లోను మరీ ఎక్కువగా కనబడతాయి. సారవంతమైన నేల కావడం వలనో, గాలిలో తేమ బాగా వుండటం వలనో కోనసీమ పనస మరింత రుచిగా వుంటుంది.

పనసలో పోషక విలువలు అధికం. దీనిలో కెరోటిన్, కార్బోహైడ్రేట్లు, కాల్సియం, పొటాషియం, విటమిన్ ' సి ' అధికంగా వుంటాయి. కొన్ని రకాల రుగ్మతలకు పనస మేలు చేస్తుంది. పూజలు, వ్రతాలలో పనస ప్రాధాన్యం చాలా వుంది. పనసపళ్లు దానాలివ్వడం, పూజా ద్రవ్యాలలో మామిడితో బాటు పనస ఆకులను ఉపయోగించడం జరుగుతుంటుంది. దక్షిణాది దేవాలయాల్లో పనస చెట్టుని స్థలవృక్షంగా భావించి పెంచడం కనిపిస్తుంది. కేరళ ప్రాంతంలో హోమాలు, యజ్ఞాలు చేసేటపుడు అగ్ని రగల్చడానికి ఎండు పనస కొమ్మలను రాపాడిస్తారు.

" పనసపండులాంటి బిడ్డను కను " అనే పెద్దల దీవెన ఆ పండుకున్న విశిష్టతలను బట్టే వచ్చివుంటుంది. అందుకే పళ్ళన్నిటిలో పనస రారాజు లాంటిది. అందుకే రాజా ఫలం ' పనస ' . ఈ వేసవిలో విరివిగా దొరికే ఈ ఫలరాజును ఒకసారి గుర్తు చేసుకుందామనిపించి.........         

Vol. No. 01 Pub. No. 284

7 comments:

  1. రావు గారూ...పనసపొట్టు ఎక్కడ దొరుకుతుందో విజయవాడలో కాస్త చెప్దురూ

    ReplyDelete
  2. మా నీరు తాగి ఇలాంటి పంటలన్నీ పండిస్తారు,ఆంద్రోల్లు
    తెలంగానా తెలుగోడు

    ReplyDelete
  3. ఇక్కడ పనసతొనలు డబ్బా చూసి కొన్నాను. ప్రాణం ఉసూరుమంది తినబోతే. ఎండుగడ్డి నవిలినట్టే. అంతకంటె మీబొమ్మలు చూస్తే ఎక్కువ ఆనందంగా ఉంది.:)

    ReplyDelete
  4. Good one

    ~sUryuDu

    ReplyDelete
  5. పనసపొట్టు ఆవకూర, పనస తొనలు అమోఘం :)

    ReplyDelete
  6. సౌమ్య గారూ !
    ధన్యవాదాలు

    ReplyDelete
  7. మంచి సమాచారం ఇచ్చారు పనసపొట్టు కూర గురించి .అవునండి ఫలాల రాజు "మామిడి పండు " కదా !

    ReplyDelete