Monday, December 14, 2009

మనసున మల్లెల మాలలూగెనే !


ఒక కళా ఖండం పుట్టాలంటే ఎంతో ఓర్పు అవసరం. ముఖ్యంగా కవుల నుండి , రచయితల నుండి ఒక రచన అలవోకగా వస్తుంది. మరొక రచనకు వారెంతో మధన పడతారు. ఆ మథనం నుంచి అమృతం లాంటి రచన పుడుతుంది. అందరినీ అలరిస్తుంది. వారి నుండి అలాంటి అద్భుతమైన రచనలని రాబట్టడం కూడా ఒక కళే ! అందులో నిష్ణాతులు వాహినీ అధినేత బి.ఎన్. రెడ్డి గారు.

దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి చేత తమ చిత్రాలకు రచన చేయించాలని చాలాకాలం చేసి ప్రయత్నం చివరకు ' మల్లీశ్వరి ' చిత్రంతో సఫలీకృతమయ్యారు బి.ఎన్. అజరామరమైన సాహిత్యాన్ని అందించడంలో కృష్ణశాస్త్రి గారి కృషి ఎంత ఉందో మన మనస్సులో చిరస్థాయిగా నిలవడానికి బి.ఎన్. రెడ్డి గారి ఓర్పు, నైపుణ్యం అంతే స్థాయిలో ఉన్నాయి. దానికి ఉదాహరణే ఈ సంఘటన.

కృష్ణశాస్త్రి గారు " మల్లీశ్వరి " చిత్రంలో పాటలన్నీ రాసేసారు గానీ ఒక పాట మాత్రం వెంటనే రాయడం ఆయనకి సాధ్యం కాలేదు. రోజులు గడుస్తున్నాయిగానీ ఆయనకు తృప్తి కలిగించే సాహిత్యం రావడంలేదు. నిత్యం బి.ఎన్. గారు ఆయన్ని కలవడం, నిరాశగా వెనుదిరగడం జరుగుతోంది. ఫలితం మాత్రం రాలేదు. కృష్ణశాస్త్రి గారు కూడా ఆందోళన చెందుతున్నారు. బాగా ఆలోచించి బి.ఎన్. గారు ఒక నిర్ణయానికి వచ్చారు.

" కృష్ణశాస్త్రి గారూ ! మీరు పాట కోసం చాలా మధన పడుతున్నారని తెలుసు. ఏం చేస్తాం ! మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం భావ్యం కాదు. ఈ రోజు సాయింత్రం లోగా పాట పూర్తయితే సరే ! లేకపోతే ఆ సన్నివేశంలో జయదేవుని అష్టపది ' ధీర సమీరే ' పెట్టేదాం ! " అనేసి వెళ్లిపోయారు.

అంతే ! ఆ మాట కృష్ణశాస్త్రి గారిని కలచివేసింది. ఆరోజు సాయింత్రమే రెడ్డి గారిని కలిసారు. పూర్తయిన ఆ పాట అందించారు. బి.ఎన్. రెడ్డి గారి ఆనందానికి అవధి లేదు. తెలుగు శ్రోతల హాయికి అదుపు లేదు. అంతగా శ్రోతల్ని ఆనంద డోలికల్లో తేలియాడించిన / ఆడిస్తున్న ఆ పాట " మనసున మల్లెల మాలలూగెనే ! " . మీలో హాయిని నింపే ఆ పాటను ఒక్కసారి వీక్షించండి..........




Vol. No. 01 Pub. No. 137

5 comments:

  1. ఈ పాట నాకు చాలా ఇష్టమండి. పాట చరిత్ర తెలియచేసినందుకు కృతజ్ఞతలు.

    ReplyDelete
  2. ఎంత మంచి పాట ? ఈ పాట తయారైన క్రమాన్ని తెలుసుకుంటే ఎంత ఆనందంగా వుందో ! అభినందనలు.

    ReplyDelete
  3. ఈ విధంగా పాటలు తయరైన పరిణామక్రమం తెలిపినందుకు ధన్యవాదములు. ఇదేవిధంగా మరిన్ని ఆణిముత్యాల జీవిత రహస్యాలను కూడ వెలుగులోకి తెస్తారని ఆశించవచ్చనుకుంటాను.

    ReplyDelete
  4. * శిశిర గారూ !
    * నరసింహ గారూ !
    * శివ గారూ !
    అందరికీ ధన్యవాదాలు.

    ReplyDelete