Monday, October 18, 2010

ఇది మౌనగీతం....

 కనుక్కోండి చూద్దాం - 28

ఒక ప్రముఖ గాయని తెలుగులో పాడిన తొలి పాట ఇది.
1 .  ఆ గాయని ఎవరు ?
2 . ఆ చిత్రం పేరేమిటి ?
3 . ఈ పాట రచయిత, సంగీత దర్శకులు ఎవరు ?



 Vol. No. 02 Pub. No. 039

Sunday, October 17, 2010

నవరాత్రుల విశేషాలు

శారదా / దేవీ నవరాత్రులు ముగుస్తున్నాయనగానే మేం చదువుకునే కాలంలోని కొన్ని జ్ఞాపకాలు బయిటకు వచ్చాయి. అప్పటికే సినిమా రికార్డింగ్ డాన్సులు వగైరాలతో కలుషితమై పద్య నాటకాలు, శాస్త్రీయ నృత్యాలు, జానపద కళా రూపాలైన తోలుబొమ్మలాటలు, బుర్రకథ, హరికథలు వగైరా కనుమరుగావడం చూసి ఇలాంటి ఉత్సవాల్లో వాటి పునరుద్ధరణకు మా వంతు కృషిగా 70 వ దశకంలో చేసిన ప్రయత్నంతో బాటు అప్పట్లో ఉత్సవాల తీరుతెన్నుల గురించి, నా అనుభవాల గురించి  వివరిస్తూ రాసిన
 శారదా / దేవీ నవరాత్రులు  
 నా స్వ'గతం'  పేజీలో చదవండి. ఆ పేజీలో ఈ అంశం కోసం చివరి వరకూ వెళ్ళవలసి వుంటుంది.

Vol. No. 02 Pub. No. 038

Saturday, October 16, 2010

అమ్మలగన్న యమ్మ....

అమ్మలగన్న యమ్మ  ముగురమ్మల మూలపుటమ్మ చాలపె
ద్దమ్మ సురారులమ్మ కడుపాఱడీపుచ్చినయమ్మ, దన్నులో
నమ్మినవేల్పుటమ్మల మనమ్ములయుండెడియమ్మ, దుర్గ
మాయమ్మ కృపార్థియిచ్చు తమహత్త్వకవిత్వపటుత్వ సంపదల్

 ఈ విజయదశమికి ఆ జగజ్జనని మిత్రులందరికీ సకల శుభాలు అందించాలని   కోరుకుంటూ............



Vol. No. 02 Pub. No. 037

Wednesday, October 13, 2010

అందరూ దిగ్దంతులే !

 ఓసారి రవీంద్రభారతిలో పండితసభ జరుగుతోంది. అందులో గిడుగు సీతాపతి గారు, విశ్వనాథ సత్యనారాయణ గారు, వేదుల సత్యనారాయణ గారు లాంటి పెద్దలంతా పాల్గొన్నారు. భాషావాదం పైన వాడిగా, వేడిగా  చర్చ జరుగుతోంది.

' ఏ వస్తువైనా సరే ఏ కాలంలోనైనా, ఏ దేశంలోనైనా ధనవంతులకు మాత్రమే కాకుండా సామాన్య ప్రజలకు అందుబాటులో ధరలో ఉంటేనే బాగుంటుంది. అలాగే విద్వాంసులకోసం పండిత భాష అనేది వున్నా కూడా సామాన్యులకు కోసం సరళమైన భాష ఉండాలి. అప్పుడే భాషలోని పరిమళం అందరికీ అందుతుంది. '

....... అని పెద్దలందరూ సుదీర్ఘ చర్చ తర్వాత తీర్మానించారు. ఈ చర్చ మొత్తాన్ని ఆ వేదిక మీదే కూర్చున్న దేవులపల్లి వారు మౌనంగా గమనిస్తున్నారు. వేదుల వారికి అనుమానం వచ్చింది. భాషావాదం పైన ఇంత ఘాటుగా చర్చ జరుగుతుంటే అందులో పాల్గోవటం మానేసి కృష్ణశాస్త్రి గారు ఏమీ మాట్లాడకుండా కూర్చున్నారేమిటా అని.  అదే విషయం ఆయన్ని అడిగారు.

" వారంతా దిగ్దంతులు. వారితో మనమేం మాట్లాడగలం చెప్పండి " అని చమత్కరించారు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు.

...... ఆ సభలో పాల్గొన్న పెద్దల్లో చాలామంది  ఢెబ్భైవ పడిలో పడ్డవారే !                                   
Vol. No. 02 Pub. No. 036

Tuesday, October 12, 2010

భోజన కాలస్మరణే గోవిందా ......

పాత సినిమాలంటే ఇష్టపడేవారికి వంగర వెంకట సుబ్బయ్య గారిని ప్రత్యేకంగా పరిచయం చెయ్యనక్కరలేదు. ఆయన నటుడే కాదు. వేద వేదాంగాలు అథ్యయనం చేసిన పండితుడు. సంగీతం, చిత్రలేఖనం, జ్యోతిష్యం వగైరాలన్నీ క్షుణ్ణంగా నేర్చుకున్నారు. ఆయనకు గురువు ఆయన తండ్రి గారే!

ఆయన తండ్రి గారు నేర్పిన మరో విషయం భోజన సమయంలో మొదటి ముద్ద నోటిలో పెట్టుకునే ముందు మన ప్రాణాన్ని నిలిపే ఆహారాన్ని మనకు అందిస్తున్న ఆ శ్రీమన్నారాయణుని స్మరించుకోవాలని. ఆయన ఎట్టి పరిస్థితులలోనూ తప్పకుండా ఆ నియమాన్ని పాటించేవారు. 

ఒకసారి ఆయన షూటింగ్ నిమిత్తం అమరావతి వెళ్ళారు. అక్కడ ఆయనతో బాటు ఆ గదిలో సి. యస్. ఆర్. కూడా వున్నారు. ఈయన న్యూస్ పేపర్ చదువుకుంటుంటే వంగర గారు బాత్రూంలో స్నానం చేస్తున్నారు. ఉన్నట్టుండి బాత్రూంలో నుంచి ' భోజన కాలస్మరణే గోవిందా... గోవిందా... ' అని వంగర గారి గొంతు వినబడింది.

సి. యస్. ఆర్. గారు ఆశ్చర్యపోయారు. ఆయనకేమీ అర్థం కాలేదు. అప్పుడే బాత్రూం లోనుంచి బయిటకు వచ్చిన  వంగర గారిని  " భోజనానికి ముందు గోవింద స్మరణ చేసే అలవాటు మీకు వుందని తెలుసు. కానీ బాత్రూం లో ఈ విష్ణు సంకీర్తన ఏమిటయ్యా ? " అనడిగారు. దానికి వంగర వెంకట సుబ్బయ్య గారు

" ఏం చెప్పమంటారు ? ఇందాక స్నానం చేస్తూ సబ్బుతో ముఖం తోముకుంటుంటే, ఆ పిడికెడు సబ్బు ముక్క కాస్తా గొంతులోకి జారిపోయింది. ఈరోజుకి ఇదే మొదటి ముద్ద కదా ! అందుకే గోవింద కొట్టాను " అన్నారు ఏడ్పుముఖంతో .

Vol. No. 02 Pub. No. 035

Friday, October 8, 2010

ఓ ఆచూకీ కథ

 ఇప్పుడు ఈ ఇంటర్నెట్ కాలంలో సోషల్ సైట్ల ద్వారా, ఇతర మార్గాల ద్వారా, ఇదిగో ఇలా బ్లాగుల ద్వారా కూడా ఎప్పుడో విడిపోయిన, దూరమైన కుటుంబ సభ్యుల, స్నేహితుల, బంధువుల ఆచూకీలు తెలియడం జరుగుతోందని తరచుగా వింటున్నాం. అప్పుడప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కూడా విడిపోయిన వ్యక్తుల్ని మా ఛానల్ కలిపిందని కనీసం ఓ వారం పాటు ఊదరగోట్టడం మనందరికీ తెలుసు. ఇదంతా సాంకేతిక పురోగతి పుణ్యం.
 కానీ ఉత్తరాల కాలంలో అదీ రవాణా వ్యవస్థ అంతగా అభివృద్ధి చెందని కాలంలో ఇలా విడిపోయిన వాళ్ళ ఆచూకీ దొరకడమంటే దాదాపు అసాధ్యంగా ఉండేది. వార్తా పత్రికలు, రేడియో లాంటివి వున్నా ఈ విషయంలో వాటి ఉపయోగం చాలా తక్కువే !
అలాంటిది 1938 వ సంవత్సరంలో ఓ సినిమా ద్వారా పారిపోయిన కొడుకు ఆచూకీ కనుగొనగలిగారు ఓ తల్లిదండ్రులు. ఆ విశేషాలు.....

అప్పటి మద్రాసులోని జార్జ్ టౌన్ లోని రోడ్ మీద రోహిణి పిక్చర్స్ వారి ' గృహలక్ష్మి ' చిత్రం షూటింగ్ జరుగుతోంది. అప్పట్లో మద్రాసులో ట్రాం బళ్ళు  ఉండేవి. దర్శకులు హెచ్. ఎం. రెడ్డి గారు కన్నాంబ పై ఓ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. ఆమె ట్రాం బండి తో బాటు ఏడుస్తూ పరుగెత్తే సన్నివేశం ఆది. చుట్టూరా జనాలు. సహజత్వం కోసం దర్శకులు ఆ జనాల మధ్యలోనే కన్నాంబను పరుగెత్తమన్నారు.
జనాలకు సూచనలు చేస్తూ రెడ్డి గారు ' మీరెవ్వరూ కెమెరా వంక చూడొద్దు. అలా ఎవరైనా చూసారో ల్యాబ్ కెళ్ళాక నెగెటివ్ లో వారి ముఖం మీద సూదితో ఒక ఏసిడ్ చుక్క వేస్తాను. వారి ముఖం సినిమాలో కనిపించకుండా పోతుంది. జాగ్రత్త ' అని హెచ్చరించారు. దాంతో అందరూ భయపడి కెమెరా వంక చూడక పోయినా అక్కడ ఓ తివాచీలు అమ్మే దుకాణం దగ్గర స్టూల్ మీద కూర్చున్న ఓ కుర్రాడు మాత్రం కెమెరా నే తదేకంగా చూడసాగాడు.
తర్వాత ఆ చిత్రం విడుదల అయ్యాక కడప లో ఆ చిత్రం చూస్తున్న ఒకాయన ఆ సన్నివేశం చూస్తూ ఆ కుర్రాడు తన కొడుకుగా గుర్తించాడు. అప్పటికి సంవత్సరం క్రితం స్కూల్ ఫైనల్ పరీక్షల్లో ఫెయిల్ అవ్వడంతో భయపడి ఆ అబ్బాయి ఇల్లు వదిలిపెట్టి మద్రాస్ పారిపోయాడు. హెచ్. ఎం. రెడ్డి గారి ' గృహలక్ష్మి ' పుణ్యమాని అతని ఆచూకీ దొరికింది. ఆ తండ్రి ఆనందంతో మద్రాస్ వెళ్ళి తివాచీ దుకాణంలో పనిచేస్తున్న కొడుకుని ఇంటికి తీసుకెళ్ళాడు. 
అదీ ఓ ఆచూకీ కథ. తెలుగు సినిమా ఆవిర్భవించిన దశకంలోనే సినిమా వల్ల ఒనగూడిన సాంఘిక ప్రయోజనం.

Vol. No. 02 Pub. No. 034

Thursday, October 7, 2010

నెహ్రూజీ డూప్ - జవాబు

కనుక్కోండి చూద్దాం - 28 - జవాబు


జవాబు : నెహ్రుజీ కి డూప్ లా భ్రమింపజేసిన వ్యక్తి


అయితే ఆయన ఫోటో బ్లాగర్ లో అప్లోడ్ కాకపోవడంతో పికాస ద్వారా ప్రయత్నించగా పేరు మార్చిన ఫైల్ కాకుండా అసలు ఫైల్ అప్లోడ్ అయి ఆ ఫైల్ పేరు పేకేటి గా తెలుస్తోందనే అభిప్రాయాన్ని మాగంటి వంశీమోహన్ గారు వ్యక్తం చేశారు.  శివగారు పేకేటి గారి పూర్తి పేరు రాసారు. ఇక జే.బీ. గారి కోరిక మేరకు పేకేటి గారి వివరాలు ......


పేకేటి గా గత తరం ప్రేక్షకులకు సుపరిచుతులైన పేకేటి శివరాం అసలు పేరు పేకేటి శివరామ సుబ్బారావు. తూర్పు గోదావరి జిల్లా పేకేరు గ్రామంలో 1918 అక్టోబర్ 8 వ తేదీన జన్మించిన శివరాం బి.ఏ. పాసయి ఎస్. ఆర్. సుబ్బారావు పేరుతో , ముఠా, ఉదయగిరి, కస్తూరి అనే కలం పేర్లతో రచనలు చేశారు. హార్మోనియం, జలతరంగిణి వాద్యాలు నేర్చుకున్నారు.

1940 వ దశకంలోనే తెలుగు చిత్రసీమలో ప్రవేశించి ప్రొడక్షన్ అసిస్టెంట్ నుంచి దర్శకత్వం దాకా అన్ని శాఖలను నిర్వహించారు. 1944 లో ఘంటసాల బలరామయ్య గారి ప్రతిభా ప్రొడక్షన్స్ లో పబ్లిసిటీ మేనేజర్ గా పనిచేసే సమయంలో ' సీతారామ జననం ' చిత్రంలో నటించడానికి వచ్చిన అక్కినేని నాగేశ్వరరావు కి మంచి మిత్రుడయ్యారు. అక్కినేని సినీ జీవిత చరిత్రలో పేకేటిది ఒక అధ్యాయం. అక్కినేని జీవితంలో అన్ని ముఖ్యమైన ఘట్టాలకు పేకేటి సాక్షి. వారి మైత్రి చిరకాలం కొనసాగింది.

పేకేటి కొంతకాలం ఫైర్ ఆఫీసర్ గా పని చేశారు. ఇండియన్ న్యూస్ సర్వీసు లో కెమెరామన్ గా కూడా పని చేశారు.

పేకేటి తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో నటించారు. ఆయన నట జీవితంలో చెరిగిపోని ముద్ర వేసిన పాత్ర అక్కినేని ' దేవదాసు ' చిత్రంలోని దేవదాసు మిత్రుడు భగవాన్. ఆ పాత్ర ఆయనకు ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టింది. దేవదాసు చూసిన ప్రేక్షకులు అక్కినేనిని ఎంత బాగా గుర్తు పెట్టుకున్నారో, భగవాన్ పాత్రలో పేకేటిని కూడా అంత బాగానూ గుర్తుంచుకున్నారు.

పేకేటి తెలుగులో చుట్టరికాలు, భలే అబ్బాయిలు, కులగౌరవం, కన్నడంలో మరికొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించారు. 2002 లో హెచ్. ఎం. రెడ్డి పురస్కారం అందుకున్నారు.

ప్రముఖ కళా దర్శకుడు పేకేటి రంగా ఆయన పుత్రుడు. తమిళంలో ప్రముఖ హీరో ప్రశాంత్ పేకేటి శివరాం మనుమడు.

ఈరోజు పేకేటి శివరాం జన్మదినం సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ......


Vol. No. 02 Pub. No. 033a