Tuesday, October 12, 2010

భోజన కాలస్మరణే గోవిందా ......

పాత సినిమాలంటే ఇష్టపడేవారికి వంగర వెంకట సుబ్బయ్య గారిని ప్రత్యేకంగా పరిచయం చెయ్యనక్కరలేదు. ఆయన నటుడే కాదు. వేద వేదాంగాలు అథ్యయనం చేసిన పండితుడు. సంగీతం, చిత్రలేఖనం, జ్యోతిష్యం వగైరాలన్నీ క్షుణ్ణంగా నేర్చుకున్నారు. ఆయనకు గురువు ఆయన తండ్రి గారే!

ఆయన తండ్రి గారు నేర్పిన మరో విషయం భోజన సమయంలో మొదటి ముద్ద నోటిలో పెట్టుకునే ముందు మన ప్రాణాన్ని నిలిపే ఆహారాన్ని మనకు అందిస్తున్న ఆ శ్రీమన్నారాయణుని స్మరించుకోవాలని. ఆయన ఎట్టి పరిస్థితులలోనూ తప్పకుండా ఆ నియమాన్ని పాటించేవారు. 

ఒకసారి ఆయన షూటింగ్ నిమిత్తం అమరావతి వెళ్ళారు. అక్కడ ఆయనతో బాటు ఆ గదిలో సి. యస్. ఆర్. కూడా వున్నారు. ఈయన న్యూస్ పేపర్ చదువుకుంటుంటే వంగర గారు బాత్రూంలో స్నానం చేస్తున్నారు. ఉన్నట్టుండి బాత్రూంలో నుంచి ' భోజన కాలస్మరణే గోవిందా... గోవిందా... ' అని వంగర గారి గొంతు వినబడింది.

సి. యస్. ఆర్. గారు ఆశ్చర్యపోయారు. ఆయనకేమీ అర్థం కాలేదు. అప్పుడే బాత్రూం లోనుంచి బయిటకు వచ్చిన  వంగర గారిని  " భోజనానికి ముందు గోవింద స్మరణ చేసే అలవాటు మీకు వుందని తెలుసు. కానీ బాత్రూం లో ఈ విష్ణు సంకీర్తన ఏమిటయ్యా ? " అనడిగారు. దానికి వంగర వెంకట సుబ్బయ్య గారు

" ఏం చెప్పమంటారు ? ఇందాక స్నానం చేస్తూ సబ్బుతో ముఖం తోముకుంటుంటే, ఆ పిడికెడు సబ్బు ముక్క కాస్తా గొంతులోకి జారిపోయింది. ఈరోజుకి ఇదే మొదటి ముద్ద కదా ! అందుకే గోవింద కొట్టాను " అన్నారు ఏడ్పుముఖంతో .

Vol. No. 02 Pub. No. 035

4 comments:

  1. * కొత్తపాళీ గారూ !
    * వేణూ శ్రీకాంత్ గారూ !
    * అప్పారావు శాస్త్రి గారూ !

    ధన్యవాదాలు

    ReplyDelete