అతి తేలికైన పదాల్లో, సరళమైన భాషలో అంతులేని జీవిత సత్యాలను ప్రబోధిస్తారు శ్రీశ్రీ. సాహిత్యానికి కావలసింది పదాడంబరం కాదు భావ ప్రకటన అని ప్రకటించారు శ్రీశ్రీ. సినిమా సాహిత్య ప్రక్రియ మరే ఇతర ప్రక్రియకు తీసిపోనిదని ఋజువు చేశారు శ్రీశ్రీ. మహాప్రస్థానంలాంటి రచనలతో మహోన్నతాలకెదిగిన ఆయన సినిమా సాహిత్యాన్ని కూడా ఆ స్థాయికి తీసుకెళ్ళచ్చని నిరూపించారు ఏం రాసినా, ఏది రాసినా ఆయనకే చెల్లు ఎవరెన్ని అన్నా, ఎవరేం అనుకున్నా ఆయన పథం ఆయనది.. ఆయన విధానం ఆయనది అందుకే ఆయన మహాకవి అయ్యారు, ప్రజల కవి అయ్యారు.
కల కానిది.... పాట పూర్వాపరాల గురించి ' పాడవోయి భారతీయుడా ' సంకలనంలోని శ్రీశ్రీ గారి మాటల్లో............... ************************************************************************** అన్నపూర్ణా పిక్చర్స్ వారి ' వెలుగు నీడలు ' లోని ఈ పాటకు ట్యూన్ వెదకడానికి సంగీత దర్శకుడు పెండ్యాల 15 రోజులు కృషి చేశారు. ట్యూన్ ఓకే అయిన తరువాత తెలుగు పాట నేను, తమిళ పాట నారాయణ కవి రాశాము. సాధారణంగా అన్నపూర్ణా సంస్థలో ముందుగా ట్యూన్ నిర్ణయించడం జరుగుతుంది. సంగీతం విషయంలో మధుసూదనరావు గారికి మంచి అభిరుచి వుంది. హిందీలో రాజ్ కపూర్ కి ఉన్నట్లు. అందుకే వీరుద్దరి చిత్రాలలోని పాటలు నాలుగు కాలాలపాటు నిలిచేవిగా వుంటాయి. ఎంతవరకూ నిజమో నాకు తెలియదుగానీ ఆత్మహత్య చేసుకోబోయిన ఒక వ్యక్తి ' కలకానిది, విలువైనది ' అన్న పాటను విని ఆ ప్రయత్నం విరమించుకున్న ఉదంతం ఎవరో చెప్పగా విన్నాను. ******************************* ******************************************
' అగాధమౌ జలనిధిలోన ఆణిముత్య మున్నటులే ' అన్న వాక్యం నారాయణకవిదని శ్రీశ్రీ గారు చెప్పినట్లుగా నేనెక్కడో చదివినట్లు బాగా గుర్తు. తనది కాని విషయాన్ని నిజాయితీగా అంగీకరించే సంస్కారం మహాకవి శ్రీశ్రీది. ఎవరు అంగీకరించినా, అంగీకరించకపోయినా ఆయన ప్రభావం తెలుగు కవిత్వం మీద ఇప్పటికీ వుంది. ఎప్పటికీ వుంటుంది.
మహాకవి శ్రీశ్రీ శతజయంతి వేడుకలు నేటితో ( ఏప్రిల్ 30 ) ముగుస్తున్నాయి. ఆయన్ని స్మరించుకోవడమంటే తెలుగు కవిత్వాన్ని, సినీ కవిత్వాన్ని మరోసారి సమీక్షించుకోవడమే ! ఆ మహాకవికి కవితాంజలులు.
మనిషి ఎంతటివాడైనా కోరికలకు అతీతుడు కాదు. కొన్ని కోరికలు సునాయాసంగా తీరుతాయి. మరికొన్ని కొంచెం కష్టపడితే తీరతాయి. అయితే కొన్ని మాత్రం తీరని కోరికలగానే మిగిలిపోతాయి.
మహాకవి శ్రీశ్రీ గారికి కూడా కొన్ని కోరికలుండేవి. అయితే అవి తీరని కోరికలే ! ఎందుకంటే అవి తీరకుండానే ఆయన మరణించారు. వాటిలో ముఖ్యమైన కొన్ని ...........
* ఆయనకు రెండు కథల మీద మోజుగా వుండేది. అవి ఒకటి రుక్మిణీ కళ్యాణం కథ. మరోటి కవి తిక్కన - ఖడ్గతిక్కన, ఈ ఇద్దరి జీవితాలలోని విశేషాలను మిళితం చేసి ఒకే కథగా రూపొందించాలని ఆయన కోరిక. అంతే కాదు. ఈ రుక్మిణీ కళ్యాణం కథనీ, కవి - ఖడ్గ తిక్కన కథనీ చలన చిత్రాలుగా తీయాలని కోరికగా వుండేది.
* " నెరవేరితే నిలువుటద్దం సైజులో ' మహాప్రస్థానం ' ను ఆచ్చువేయించాలని ఉంది. ఇవి గొంతెమ్మ కోరికలే ! నా జన్మలో నేరవేరుతాయా ? " అనేవారట ఆ మహాకవి.
చివరకి ఈ రెండు కోరికలూ నెరవేరలేదు. ఆ మహాకవి శత జయంతి సందర్భంగా ఎవరైనా పూనుకుని కనీసం ఆయన రెండో కోరికైన ' మహాప్రస్థానం ' నిలువుటద్దం సైజులో అచ్చు వేయిస్తే ఆయన కోరిక నేరవేర్చినట్లుంటుంది. ఎవరైనా ఆలోచిస్తే బాగుండును.
ఆ మహాకవికి ఇష్టమైన పాటలుగా పేర్కొన్న వాటిలో ఒకటి ' తోడికోడళ్ళు ' చిత్రంలో ' నలుగురు కలసి, పొరువులు మరచి, చెయ్యాలి ఉమ్మడి వ్యవసాయం ' ........ మీకోసం........
ఋగ్వేదం నుంచి వాయిద్యం యజుర్వేదం నుంచి అభినయం సామవేదం నుంచి సంగీతం అధర్వణవేదం నుంచి భావ ప్రకటన
ఉద్భవించాయంటారు. నాలుగు వేదాలలోని లక్షణాలను సంతరించుకున్నది కనుక నాట్యాన్ని ' పంచమవేదం ' అంటారు. నాట్యానికి రాజు ' నటరాజు '.
సుమారు రెండు వేల సంవత్సరాలకు పూర్వం భరతముని రాసిన ' నాట్యశాస్త్రము ' మనకి నాటక కళను నేర్పింది. నాట్యమేళ సాంప్రదాయం శాస్త్రీయ కళగా రూపొందడానికి నాట్యశాస్త్రం దోహదపడింది.
క్రీ.శ. 3 వ లేదా 4 వ శతాబ్దంలో నందికేశుడు రచించినట్లుగా చెప్పబడుతున్న ' భరతార్ణవం ' అప్పటివరకూ అమలులోవున్న ఏకపాత్రకేళికా సాంప్రదాయాన్ని కళాఖండాలుగా తీర్చిదిద్దింది. దీనికి సంక్షిప్త రూపమైన ' అభినయ దర్పణం ' నాట్యాచార్యులకు భగవద్గీతలాంటిదని చెబుతారు.
క్రీ.శ. 1253-54 ప్రాంతంలో కాకతీయ చక్రవర్తి గణపతిదేవుని బావమరిది అయిన జాయపసేనాని ' నృత్త రత్నావళి ' రచించాడు. ఈయన కృష్ణాజిల్లాలోని దివిసీమకు చెందిన వాడుగా చరిత్ర.. జాయపను చిన్నప్పుడే గణపతి దేవుడు ఓరుగల్లుకు తీసుకువెళ్ళి గుండయామాత్యుడనే నాట్యాచార్యుని దగ్గర జేర్చి నాట్యకళను నేర్పించాడు. ఆనాటి నాట్య శాస్త్రాలను, సాంప్రదాయాలను క్షుణ్ణంగా పరిశీలించి, పరిశోధించి తన అనుభవములను కూడా జోడించి ' నృత్తరత్నావళి ' ని రచించాడు.
దేవగిరిని పాలించిన యాదవరాజుల ఆస్థాన విద్వాంసునిగా వున్న శార్జ్ఞ్గదేవుడు తాను రచించిన ' సంగీత రత్నాకరము ' అనే గ్రంథములో భారత నాట్య రీతుల్లో వచ్చిన మార్పుల్ని వివరించాడు.
భారత దేశంలో సంస్కృతం రాజభాషగా వున్న కాలంలో ఇన్ని రకాల నృత్య రీతులు లేవు. దేశమంతటా ఒకే రకమైన శాస్త్రీయ నృత్యకళ వుండేది. ప్రాంతీయ భాషల ప్రాముఖ్యం పెరిగి, సంస్కృతం ప్రాముఖ్యం తగ్గడంతో ప్రాంతాల వారీగా నృత్య రీతులు అభివృద్ధి చెందాయి. వింధ్య పర్వతాలకు దక్షిణాన వున్న తెలుగు భాష సంగీతానికి, సాంస్కృతిక వికాసానికి అనువైన భాషగా పండితులు, విద్వాంసులు గుర్తించారు. దాంతో తెలుగు భాషలో అనేక నృత్య సంగీత రచనలు వెలువడ్డాయి. అందుకే దక్షిణాదిన ప్రధానంగా తెలుగు పాటే వినబడుతుంది.
ప్రాచీన కాలంలో మతానికి, కళలకి దగ్గర సంబంధముండేది. అందుకే దేవాలయ శిల్పాలలో మనం నాట్యకళను దర్శించవచ్చు. యజ్ఞయాగాది క్రతువుల్లో సంగీత నృత్యాలు భాగమై వుండేవి. బౌద్ధ, జైన మతాలు కూడా నాట్యకళను ప్రోత్సహించినట్లు ఆధారాలు లభిస్తున్నాయి. శాతవాహన, ఇక్ష్వాక రాజుల చరిత్రలలో ఈ ప్రస్థావన కనిపిస్తుంది. హాలుని గాథాసప్తశతి, గుణాఢ్యుని బృహత్కథలలో కూడా నాట్య ప్రస్థావన వున్నట్లు చెబుతారు. గుజరాతీ, కన్నడ భాషల్లో వున్న జైన మత గ్రంథాలలో నృత్యభంగిమలు, నర్తనరీతుల గురించి వున్నట్లు తెలుస్తోంది. తర్వాత కాలంలో వ్యాప్తిలోకి వచ్చిన శైవ, వైష్ణవ సాంప్రదాయాలు రెండూ నాట్యకళకు పెద్దపీటే వేసాయని చెప్పవచ్చు.
ఇక తెలుగు కళను సుసంపన్నం చేసిన కూచిపూడి నాట్య సాంప్రదాయం కృష్ణాజిల్లాలోని ఒక చిన్న గ్రామమైన ' కూచిపూడి ' నుంచి వచ్చింది. క్రీ.శ. 13 లేదా 14 వ శతాబ్దులలోనే ఈ సాంప్రదాయానికి మూలాలు వున్నట్లు చెబుతారు. ఆ ప్రాంతానికి చెందిన నృత్యకళా ప్రవీణుడు, వాగ్గేయకారుడు అయిన సిద్ధేంద్ర యోగి ' భామాకలాపం ' రచించి కూచిపూడి భాగవతులకు నేర్పించాడు. క్రీ.శ. 1506-09 ప్రాంతాలలో కూచిపూడి భాగవతులు హంపీ విజయనగరంలో ప్రదర్శనలిచ్చినట్లు ఆధారాలున్నాయి. ఇవి ప్రధానంగా నృత్య రూపకాలు. కూచిపూడికి దగ్గరలోనే ' మువ్వగోపాల పదాలు ' రచించిన మహాకవి క్షేత్రయ్య నివసించిన మొవ్వ గ్రామం వుంది. ఈ విషయం మీద చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయాలున్నట్లుగా తోస్తుంది. అక్కడికి సమీపంలో ఒకప్పుడు శాతవాహనుల రాజధాని అయిన శ్రీకాకుళం కూడా వుంది. ' కృష్ణలీలాతరంగిణి ' రచించిన నారాయణ తీర్థులువారు కూడా శ్రీకాకుళానికి చెందిన వారేనని ఒక వాదన.
ఇప్పుడు మనం భరతనాట్యంగా పిలుచుకుంటున్న సాంప్రదాయాన్ని మహారాష్ట్ర రాజైన రెండవ శరభోజి ఆస్థానంలో విద్వాంసులుగా వున్న నలుగురు సోదరులు రూపొందించిన సదిర్ లేదా దాసి ఆట నుండి రూపాంతరం చెందింది. ఐతే ఇది భరతనాట్యంగా 1930 తర్వాతే విస్తృత ప్రచారం పొందిందట. క్రీ.శ. 17 వ శతాబ్దంలో కథకళి , ఆ తర్వాత కాలాల్లో ఒడిస్సీ, మణిపురి, కథక్ మొదలైన సాంప్రదాయాలు మన దేశంలో రూపుదిద్దుకున్నాయి.ఇవన్నీ మూడు వందల సంవత్సరాల కాలంలోనివే !
ఆంధ్ర దేశంలో నాట్య సాంప్రదాయం రెండు రకాలు . ఒకటి నట్టువ మేళం. రెండు నాట్యమేళం. నట్టువమేళం ఏకపాత్ర నృత్యము. ఇది ఎక్కువగా దేవదాసీ సాంప్రదాయంగా వుండేది. నాట్యమేళం సామూహికంగా ఎక్కువ పాత్రలతో రూపకాలుగా వుండేది. కూచిపూడి ఆ సాంప్రదాయానికి చెందినదే. వీటిని ' యక్షగానాలు ' అని కూడా పిలిచేవారు. అలాగే ఆలయాల్లో చేసే ఆగమ శాస్త్ర నర్తనం, రాజాస్థానాలలో చేసే ఆస్థాన నర్తనం, కలాపాలు, భాగవతాలతో కూడిన ప్రబంధ నర్తనం అనే మూడురీతులు ప్రచారంలో వుండేవి. ప్రముఖ నాట్యాచార్యులు నటరాజ రామకృష్ణ గారు ఈ మూడు రీతుల్నీ సమన్వయ పరుస్తూ ' ఆంధ్ర నాట్యం ' అనే కొత్త రీతిని ప్రచారంలొకి తెచ్చారు. అలాగే ఆయన జాయప సేనాని రచించిన ' నృత్తరత్నావళి ' నుంచి ' పేరిణి ' అనే నృత్యాన్ని గ్రహించి ' పేరిణి శివతాండవం ' పేరుతో పునరుద్ధరించారు.
సూక్ష్మంగా మన నాట్య కళా చరిత్ర ఇది. అంతర్జాతీయ నాట్య దినోత్సవం ( ఏప్రిల్ 29 ) సందర్భంగా ఒకసారి సింహావలోకనం చేసుకుంటూ..... ఎందరో కళాకారులు మన నాట్య కళా సాంప్రదాయాన్ని సుసంపన్నం చేసారు. అందులో ముఖ్యమైన వారిని ఈ శుభసందర్భంగా తలచుకుందాం !
మహాకవి శ్రీశ్రీ గారు ఆధునిక కవిత్వానికి ప్రతీక అయినా ప్రాచీన కవిత్వ ప్రభావం ఆయనపై ఎంత వుందో తెలుసుకోవడానికి ఈ సంఘటనే ఉదాహరణ.
****************************************
అంహో దుర్భరమాయె భారతము ! గ
గర్వాంధుల్, దురార్భాట సం
రంహుల్, స్వార్తపరుల్ చరింతురిట ! నీ
రల్ సేయు ఘోరాలప
సింహంబోయిన లేచి, నేనిక మహా
క్ష్వేళాధ్వనిన్ వీరలన్
సంహారం బొనరించు శక్తిని జగ న్మాతా ! ప్రసాదింపుమా !
* * *
సినిమాకు పద్యం రాయడం అంటే నాకు చాలా ఇష్టం. నవతా ప్రొడ్యూసర్ కృష్ణంరాజు గారు తమ " పంతులమ్మ " చిత్రంలోని శివాజీ నాటకానికొక పద్యం కావాలంటే ఇది రాశాను. రాసిన తర్వాత ఎవరో - కృష్ణంరాజుగారే కాబోలును - ఇందులోని తుది పాదంలో యతి భంగమయిందన్నారు. ( ' సం ' తో ' న్మా ' యతి కుదరదనుకొని ) దానికి ముందు పాదంలోని ' వీరలన్ ' లో ఉన్న నకారపు పొల్లుతో ' న్మా ' కి యతి కుదిరిందన్నారు. ఇటువంటి చందో రహస్యాలు చాలామందికి తెలియవు. దీర్ఘాక్షరంతో ప్రారంభమైన కంద పద్యంలో నాలుగింట జగణం వెయ్యకూడదని కొందరికి తెలియదు.
బిందు పూర్వక హకార ప్రాస నిర్వహించడం కష్టం. విశ్వనాథ సత్యనారాయణగారు తమ విశ్వేశ్వర శతకంలో ' అ(హోవారణ కుంభ పాటనకళోధచ్చ్వేత భూ భ్రుద్ధరీ సింహస్వామి ' అని ప్రారంభించి నాలుగో పాదంలో ' నచాహం హంతవ్య ' అని ప్రాస చేశారు. సంస్కృతంలో వారు ప్రాస వాడితే నేనెందుకు ఇంగ్లీషులో వాడకూడదని..
సింహాలకు Zoo లుండును
సంహారమే సృష్టియగును సామాన్యంగా
అంహస్సెయగును పుణ్యము
Somehow మన కవనధారా స్రవియించు ...
అని రాశాను.
*******************************************
............... అంటారు మహాకవి శ్రీశ్రీ తన పాటల సంకలనం ' పాడవోయి భారతీయుడా ' లో .......
శ్రీశ్రీ గారి చెప్పుకోదగ్గ పాటల్లో ఒకటి నటుడు పద్మనాభం నిర్మించిన ' దేవత ' చిత్రంలోని ' బొమ్మను చేసి ప్రాణం పోసి...' పాట గురించి......
" బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుక..........." అనే పల్లవి వేటూరిది. అతని అనుమతి మీద, పద్మనాభం కోరిక మీద ప్రారంభంలోని సాకీతో సహా దీన్ని పూర్తి చేసాను. కీర్తిశేషుడు కోదండపాణి తయారు చేసిన బాణీ రచయితను తికమాట పెట్టేదిగా ఉంది. కష్టపడి నేను రాసిన పాటలలో ఒకటిగా దీనిని చెప్పుకోవాలి.
........... అంటారు శ్రీశ్రీ తన ' పాడవోయి భారతీయుడా ' సంకలనం లో .
హాస్య బ్రహ్మ భమిడిపాటి కామేశ్వర రావు గారికి ఓసారి పెద్ద సమస్య వచ్చిపడింది. ఆయన రాజమండ్రిలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న కాలంలో ఎక్కడికెళ్ళినా అభిమానులనుంచి, శిష్యులనుంచి నమస్కార బాణాలు విరివిగా పడేవి. అయితే ఓసారి అకస్మాత్తుగా ఆయన్ని ఎవరూ పట్టించుకోక పోవడం, పలకరించకపోవడం, నమస్కారాలందించకపోవడం.... ఇంతెందుకు... జగమెరిగిన హాస్యబ్రహ్మను అసలెవరూ గుర్తించకపోవడం జరిగింది. ఇలా హఠాత్తుగా అందరూ తననెందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో కామేశ్వరరావు గారికి ఏమీ అర్థం కాలేదు. ఎందుకిలా జరుగుతోందని ఆలోచిస్తే విషయం బోధపడింది.
కామేశ్వరరావు గారికి అప్పట్లో మెడ మీద చిన్న కణితి వుండేది. దాన్ని కప్పి వుంచడం కోసం ఆయన తన జుట్టును వత్తుగా, అచ్చం భావకవిలా గిరజాలతో పెంచారు. అయితే శస్త్రచికిత్స చేయించి ఆ కణితిని తీసేయడంతో అవసరం తీరిపోయిందని జుట్టు కూడా తగ్గించేసారు. వత్తైన గిరజాల జుట్టుతో ఆయనను చూడడానికి అలవాటు పడ్డ వాళ్ళు తలకట్టు మారడంతో గుర్తుపట్టలేకపోయారు. దాంతో పలకరింపులు, నమస్కారాలు కూడా మాయమైపోయాయి. ఈ విషయం గ్రహించిన భమిడిపాటి కామేశ్వరరావు గారు సరాసరి తనకు శస్త్ర చికిత్స చేసిన డాక్టర్ దగ్గరకు వెళ్ళారు.
" అయ్యా ! డాక్టర్ గారూ ! మీరు ఎలాగైనా నా కణితిని నాకు తిరిగి తెప్పించండి. లేకపోతే నన్నెవరూ గుర్తుపట్టటం లేదు. " అన్నారట. అప్పుడు చూడాలి డాక్టర్ గారి పరిస్థితి...!!
హాస్య బ్రహ్మ జయంతి సందర్భంగా ఆయనకు నవ్వుల పువ్వులు సమర్పించుకుంటూ .................