Thursday, September 23, 2010

అస్తమించిన మరో అభ్యుదయం

 కళను పూర్తి వ్యాపారాత్మక వస్తువుగా మార్చుకుంది ఈనాటి సినిమా రంగం
కళ కేవలం వ్యాపారం కోసమే కాదు దానికొక సామాజిక బాధ్యత వుంది
ఆ బాధ్యతను గుర్తించిన సినిమా రంగ ప్రముఖులలో కె. బి. తిలక్ కూడా ఒకరు
ఆయన నిర్మించిన, దర్శకత్వం వహించిన చిత్రాల్లో ఈ విషయం స్పష్టంగా కనబడుతుంది
జగ్గయ్య, గాయని జానకి, జయప్రద లాంటి వాళ్ళనెందరినో తెలుగు తెరకు అందించారు తిలక్


ఈనాటి తెలుగు చిత్రాల్లో ఆ అభ్యుదయం కనుమరుగైంది
నేడు ఆ అభ్యుదయ దర్శక నిర్మాత అస్తమించాడు
అలాంటి సామాజిక బాధ్యత కలిగిన దర్శక నిర్మాత మళ్ళీ ఎప్పుడో ..... ఎవరో ....

ఈరోజు అస్తమించిన ఆ అభ్యుదయానికి శ్రద్ధాంజలి ఘటిస్తూ.........




Vol. No. 02 Pub. No. 032

Wednesday, September 22, 2010

నడి ' మం ' త్రపు సిరి

 సంస్కృతం భారతీయ భాషలన్నిటికీ తల్లి వంటిది. ఆ భాషా వ్యాప్తికి ఎందఱో మహానుభావులు తమ జీవితాలు అంకితం చేశారు.
వారిలో ప్రముఖులు కాశీ కృష్ణాచార్య గారు. ఆయనకు పద్య ధారణా శక్తి ధారాళంగా ఉండేదని చెప్పుకునేవారు. కృష్ణాచార్య గారు మంచి వక్త కూడా !

ఒకసారి ఆయనకు మచిలీపట్టణంలో ఘన సన్మానం ఏర్పాటయింది. ఆయన్ని వేదిక మీదకు ఆహ్వానిస్తూ ఆ నిర్వహణా సంఘ సభ్యుడు
" కాశీ కృష్ణమాచార్య గారిని వేదికను అలంకరించవలసినదిగా కోరుతున్నాం "
అని సంభోధించారు. అలాగే కృష్ణాచార్య గారిని సభకు పరిచయం చేసే సందర్భంలో కూడా అదే పేరుతో పరిచయ కార్యక్రమం కానిచ్చారు. పండితుల వారు ఈ విషయాన్ని నిశితంగా గమనించారు. తర్వాత కృష్ణాచార్యుల వారు తమ ప్రసంగం ప్రారంభిస్తూ

" నాగురించి పరిచయకర్తలు చెప్పినట్లు నాకు నడి'మం'త్రపు సిరి లేదు. నాపేరు కేవలం కృష్ణాచార్య మాత్రమే ! "
అన్నారు.  పండితులకు చమత్కారభాషణ సహజమే కదా !

Vol. No. 02 Pub. No. 031

Tuesday, September 21, 2010

ఈనాటి వాగ్గేయకారుడు పి.బి.


వాగ్గేయకారుడు అనే మాటకు సజీవ ఉదాహరణ పి. బి. శ్రీనివాస్
కాకినాడలో పుట్టి కన్నడిగులను మెప్పించిన గాన గంధర్వుడు పి.బి.

విలక్షణమైన స్వరం, వినసొంపైన గానం ఆయన స్వంతం
అందుకే పరాయి భాషల్లో కూడా ఆయన నీరాజనాలందుకున్నారు

తెలుగు..తమిళ.. కన్నడ..మళయాళ.. హిందీ..ఉర్దూ.. భాషల్లో పండితుడు
ఆశువుగా పద్యాలు పాటలు రాస్తారు .... అలవోకగా గజల్స్ గీతాలు పాడతారు


1951 - 52 ప్రాంతాల్లో ' మిస్టర్ సంపత్ '  అనే హిందీ చిత్రంలో అప్పటికే ప్రముఖ గాయనీమణులైన  గీతాదత్, షంషాద్ బేగం, జిక్కి లాంటి వారితో కలిసి పాడడంతో చిత్రసీమలో అడుగు పెట్టారు.  అదే సంవత్సరం ప్రముఖ కన్నడ దర్శక నిర్మాత ఆర్. నాగేంద్రరావు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నిర్మించిన త్రిభాషా చిత్రం ' జాతకఫలం ' లో మూడు భాషలలోను పి. బి. శ్రీనివాస్ పాడారు.  ఒకే సంవత్సరంలో నాలుగు భాషల్లో గాయకుడిగా పరిచయమైన ఘనత బహుశా ఆయన ఒక్కరిదేనేమో !

ఆయన గాయకుడే కాదు కవి, రచయిత కూడా ! ఎన్నో కవితలు, గజల్స్ వంటివి రాసారు. వాటిని స్వయంగా స్వరపరచి ఆలపించారు. సినిమాలకు పాటలు కూడా రాసారు. తెలుగులో ఎం.ఎస్. శ్రీరాం నిర్మించిన ' మంచిరోజు ' చిత్రంలో కొన్ని పాటలు రాసారు. ' భాగ్యజ్యోతి ' అనే కన్నడ చిత్రంలో సంస్కృత భాషలో ఒక పాట రాసారు. అలాగే మరో కన్నడ చిత్రం ' మక్కళ భాగ్య ' లో ఒక పాట అయిదు భాషల్లో వుంటుంది. అందులో కన్నడ చరణం తప్ప మిగిలిన తమిళ, తెలుగు, మళయాళ, హిందీ భాషల చరణాలు పి. బి. శ్రీనివాస్ రాసి తానే స్వయంగా ఆ పాట పాడారు.

ఎనభై వసంతాలు పూర్తి చేసుకున్న ఈనాటి వాగ్గేయకారుడు ప్రతివాది భయంకర శ్రీనివాస్ గారి జన్మదిన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ఆణిముత్యాల కదంబం..............





Vol. No. 02 Pub. No. 030

Monday, September 20, 2010

ఎనిమిదిన్నర దశాబ్దాల నవయువకుడు

అరవై ఏళ్ళు అందుకోనున్న వాణ్ణి 
రెండొందల మెట్లు ఎక్కిన వాణ్ణి 
మిట్టలు ఎక్కిన వాణ్ని 
పల్లాల్లో పడ్డ వాణ్ని 

అయినా 


అంతటి ఇంతటి వాడిననలేదు
మరికొన్నేళ్ళు అధిగమించాలనీ 
మరిన్ని మంచి చెడ్డలు చవి చూడాలనీ 
ముందుకు వెడుతున్నాను 

అభిమానుల దృష్టిలో కుర్రవాణ్ణి
పెద్దల హృదయాల్లో దాగున్న చిన్నవాణ్ణి 
ముందుకు వెళ్ళి సాధించేదేమిటో తెలియదు నాకు 
వెళ్ళిన తర్వాత మిగిల్చిందేమిటో తెలియాలి మీకు 

....... ఇవి అరవైవ పడిలో పడ్డ సందర్భంలో
అ . ఆ. లు........ అక్కినేని ఆలోచనలు

 ఎవర్ గ్రీన్ అనే పదానికి అర్థం అక్కినేని. అందుకే ఇప్పుడు ఎనభైయవ పడి సగం దాటాక కూడా ఎప్పటిలాగే వున్న నవయువకుడు అక్కినేని.
అక్కినేని నాగేశ్వరరావు గారి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలతో...........





Vol. No. 02 Pub. No. 029

Sunday, September 19, 2010

సూర్యకాంతమ్మ వైద్యం.. చిట్కా !


జలుబు, జ్వరాల కాలం నడుస్తోంది. ఎక్కడ చూసినా, ఎవరిని చూసినా వీటితో బాధపడుతున్నవారే ! ఈ బాధలో ఎవరైనా తమకు తెలిసిన ఏ చిన్న చిట్కా వైద్యం చెప్పినా, కొంచెం సానుభూతి చూపించి పలకరించినా చాలా ఉపశమనంగా వుంటుంది. 

ఇప్పుడంటే పూర్తి వ్యాపారమై పోయి సంబంధాలన్నీ ఆర్థిక పరమై పోయాయి గానీ గతంలో చిత్ర పరిశ్రమలో కూడా కళాకారులు, సాంకేతిక నిపుణులు, నిర్మాత దర్శకులు...... ఒకరేమిటి.... అందరి మధ్యా ఆర్థికానుబందాల కంటే ఆత్మీయతానుబంధాలు ఎక్కువగా వెల్లి విరిసేవి. దానికో ఉదాహరణ.  

సూర్యకాంతమ్మ అంటే గయ్యాళితనానికి మారు పేరుగా స్థిరపడిపోయింది. కానీ ఆవిడ నిజ జీవితంలో ఎంత సాత్వికురాలో అప్పట్లో పరిశ్రమతో పరిచయం వున్న వారందరికీ తెలుసు. ఆవిడ గళంలో గయ్యాళితనం ఎంత బాగా ప్రతిబింబింబిస్తుందో, అంత బాగా ఆత్మీయత ప్రతిఫలించేది.
ఆవిడ సెట్లో వుంటే ఎవరికి ఏ నొప్పి వచ్చినా, ఏ బాధ కలిగినా ఆప్యాయంగా పలుకరించేది.  అంతే కాదు ఆవిడకు గృహవైద్యంలో ప్రవేశం వుండేదేమో... ఎప్పుడూ కూడా అల్లం, శొంఠి, మిరియాలు, వేపచెక్క లాంటివి కూడా వుంచుకునేవారు. వాటితో చిట్కా వైద్యం చేసి అందరి బాధలను పోగొట్టేవారు.  ఆ గృహవైద్యం కంటే ఆవిడ మాటలే వాళ్లకి మంచి ఔషధాలుగా పనిచేసి ఇట్టే ఉపశమనం ఇచ్చేవి. వాళ్ళు మళ్ళీసారి ఆవిణ్ణి కలిసినపుడు వారి బాధలు తగ్గినా వైనాన్ని చెప్పి కృతజ్ఞతలు తెలియజేస్తే ఆవిడ పొంగిపోయేదట.
తన చుట్టుపక్కల వాళ్ళందరూ ఆరోగ్యంతో ఆనందంగా వుండాలని కోరుకోవడం కంటే గొప్పతనం ఉందంటారా ?  అదే  సూర్యకాంతమ్మ గారిలో విశేషం. అయితే ఇలా అందరికీ చిట్కా వైద్యాలు చెబుతూ పోతుంటే అప్పుడప్పుడు ఎలా ఎదురు తిరుగుతాయో ఆవిడకు సంబంధించినదే....... ఓ సరదా సంఘటన......

సూర్యకాంతం గారు ఒకసారి షూటింగ్ నిమిత్తం మద్రాస్ నుండి హైదరాబాద్ రైలులో బయిలుదేరారు. ఆవిడతో బాటు ఆ కూపేలో మరొక ఆవిడ కూడా ప్రయాణం చేస్తోంది. బాగా జలుబు చేసిందేమో ఆవిడ అదే పనిగా తుమ్ముతోంది. ఆది చూసి సూర్యకాంతమ్మ గారికి ఖంగారు పట్టుకుంది.... ఆ జలుబు తనకేక్కడ పట్టుకుతుందోనని. ఎందుకంటే మర్నాడు షూటింగ్ వుందాయే !  ఎప్పుడూ తనతో కూడా ఉండే చిట్కా మందులు లేవేమో మరి ఆవిడకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు. అందుకని తన సహజ ధోరణిలో ఆ తుమ్ముతున్నావిడతో.......

" చూడండమ్మా ! జలుబుని అశ్రద్ధ చెయ్యకూడదు. వచ్చే స్టేషన్ లో శారిడాన్ బిళ్ళలేమైనా దొరుకుతాయేమో చూడండి. దొరికితే అవి రెండు వేసుకుని వేడి వేడి కాఫీ తాగండి. చలిగాలి తగలకుండా తలకు మఫ్లర్ కట్టుకోండి. వెచ్చగా శాలువా కప్పుకుని పడుకోండి. తెల్లారి సికింద్రాబాద్ లో దిగేటప్పటికి జలుబు, గిలుబు ఎగిరిపోతుంది " అంటూ ఎడా పెడా సలహాలిచ్చేసారు సూర్యకాంతమ్మ.

జలుబు, తుమ్ములతో బాధపడుతున్న పక్కావిడ ఏమీ మాట్లాకుండా మౌనంగా వింటూంది. సూర్యకాంతం గారికి అనుమానం వచ్చింది.

" ఇంతకీ నేను చెప్పింది వింటున్నారా ? నా సలహాలు మీకు అర్థమయ్యాయా ? పాటిస్తారా ? ఇప్పటిదాకా నేనే వాగుతున్నాను.  మీరేం మాట్లాడడం లేదు. మీ పేరేమిటో తెలుసుకోవచ్చా ? " అనడిగారు.

ఆవిడ నిదానంగా " డాక్టర్ కామేశ్వరి " అంది. అంతే సూర్యకాంతం గారికి నోట మాట ఆగిపోయింది. 

" ఏమిటో ఈ ముదనష్టపు జలుబు డాక్టర్లను కూడా వదలడం లేదు " అని సణుక్కుంటూ తన బెర్త్ మీదకు వెళ్ళి పడుకున్నారు సూర్యకాంతం.          

Vol. No. 02 Pub. No. 028

Saturday, September 18, 2010

ఉద్యోగ భయం

నేడు చెన్నైగా మారిన మదరాసు మహానగరంలో ఒకప్పుడు ట్రామ్ బళ్ళు తిరిగేవి. ఆ రోజుల్లో ఒకసారి ఒక ట్రామ్ లో ప్రయాణం చేస్తున్న రచయిత ఆచంట జానకిరామ్ గారికి వెలిసిన పాత కోటు వేసుకుని అతి దీనమైన అవతారంతో వున్న కవి పుంగవులు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు కనిపించారు.

ఆయన పరిస్థితి చూసి ఏమీ అర్థం కాకపోయినా దగ్గరకెళ్ళి పరిచయం చేసుకున్నారు జానకిరామ్ గారు.
 అలా జరిగింది ఆ సరస్వతీ పుత్రుల తొలి పరిచయం. మర్నాడు జానకిరామ్ గారు మరో కవిశేఖరులు మల్లంపల్లి చంద్రశేఖర శాస్త్రి గారి ఇంటికి వెళ్లారు. అప్పుడక్కడికి కృష్ణశాస్త్రి గారు కూడా వచ్చారు. అయితే ఇప్పుడు మరో వేషంలో. మల్లెపువ్వులాంటి తెల్లని లాల్చీలో అచ్చమైన భావకవిలా వెలిగిపోతూ కనిపించారు. నిన్నటికీ, ఈరోజుకీ ఎంత తేడా అని జానకిరామ్ గారు ఆశ్చర్యపోయారు. అదే విషయం అడుగుదామని

" నిన్న మీరు ట్రాంలో..... వెలిసిపోయిన కోటులో .... " అంటూండగానే........

దేవులపల్లి వారు అందుకుని " అదా..... ఎవరో ఉద్యోగం యిస్తాం రమ్మన్నారు. వెళ్లక తప్పింది కాదు. వాళ్ళు అన్నంతపనీ చేస్తారేమోనని జడిసి ఆ కోటు తొడుక్కుని వెళ్లాను. అమ్మయ్య ! అదృష్టవశాత్తూ ఆ ఉద్యోగం రాలేదు " అన్నారట.

Vol. No. 02 Pub. No. 027

Friday, September 17, 2010

' రావణాసురుడు ' కాదు !


 ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా నీలం సంజీవరెడ్డి గారు పనిచేస్తున్న రోజుల్లో ఉత్తరాంధ్రకు చెందిన మాజీ మంత్రి భాట్టం శ్రీరామమూర్తి గారు విధాన సభలో సోషలిస్ట్ పార్టీ సభ్యులుగా వుండేవారు.

ఒకసారి శ్రీరామమూర్తి గారు అధికార పక్షాన్ని విమర్శిస్తుంటే సంజీవరెడ్డి గారు సభను ఉద్ద్యేశించి మాట్లాడుతూ....
" అధికార పక్షాన్ని దుయ్యబట్టే హక్కు ఒక్క ప్రతిపక్ష సభ్యులదే కాదు. అధికారపక్ష సభ్యులకు కూడా ఉంటుంది. మా పార్టీ సభ్యులై నన్నోకసారి రావణాసురుడు అన్నారు " అంటూ చెబుతుంటే ..........

వెంటనే భాట్టం శ్రీరామమూర్తి గారు అడ్డుకుని ......

" అయ్యా ! నేను గౌరవనీయ ముఖ్యమంత్రి గారిని రావణాసురుడితో పోల్చలేదు. అలా పోల్చలేను కూడా ! ఎందుకంటే రావణాసురుడు గొప్ప తపస్సంపన్నుడు కదా ! " అన్నారు. సభంతా గొల్లుమంది.

Vol. No. 02 Pub. No. 026