Tuesday, August 31, 2010

కలిపిన ' విడదీసే రైలు బళ్ళు '


నువ్వెక్కవలసిన రైలు బండి జీవితకాలం లేటు అన్నారు ప్రముఖ తెలుగు రచయిత ఆరుద్ర. కానీ ఆయన విషయంలో ఆది నిజం కాలేదు.

అలాగే ' విడదీసే రైలు బళ్ళు ' అని రాసిన ప్రముఖ రచయిత్రి కె. రామలక్ష్మి విషయంలో ఇదీ నిజం కాలేదు. అందుకేనేమో  వారిద్దరూ జీవితకాలం లేటు కాకుండా కలిసారు.


 భాగవతుల సదాశివశంకర శాస్త్రి అనే అసలు పేరు కల ఆరుద్ర కవిత్వంలో అప్పుడప్పుడే ప్రసిద్ధి చెందుతున్న కాలంలో అంటే 1950 వ దశకం తొలినాళ్ళలో రామలక్ష్మి ' స్వతంత్ర ' పత్రికలో పనిచేసేవారు. అప్పటికి ఆవిడకు దేవులపల్లి, శ్రీశ్రీ లాంటి వాళ్ళే కవులుగా తెలుసు. ఆరుద్ర పేరు, ఆయన కవిత్వం ఆ పత్రికలోనే ఆవిడకు పరిచయమయ్యారు. ఆయన కవిత్వం నచ్చింది. ఆయనా నచ్చారు. రామలక్ష్మి తన తొలి కథల సంపుటి ' విడదీసే రైలు బళ్ళు ' కు ముందుమాట రాయాల్సిందిగా ఆరుద్ర గారిని కోరారు. అమ్మాయి అడిగిందిగదాని అర్జెంటుగా రాసిచ్చేయలేదాయన. ఆర్నెల్లపాటు అడిగించుకుని మొహమాటం లేకుండా , పొగడ్తలు వగైరా లేకుండా సూటిగా తన అభిప్రాయాన్ని రాసిచ్చారు. అలా ఆ ' విడదీసిన రైలు బళ్ళు ' వాళ్ళని 1955 లో కలిపింది.
నిన్న ( 31 ఆగష్టు ) ఆరుద్రగారి జన్మదినం. ఆ సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ........



Vol. No. 02 Pub. No. 017

Sunday, August 29, 2010

నృత్య దర్శకత్వం .....జవాబు

 కనుక్కోండి చూద్దాం - 25  
 జవాబు  



1931 లో తెలుగు చలనచిత్ర నిర్మాణం ప్రారంభమైంది. అప్పటికింకా చలనచిత్ర రంగంలో కొన్ని శాఖలు పూర్తి రూపు సంతరించుకోలేదు. అందులో ఒకటి నృత్య శాఖ.  కొంతకాలం వరకూ నటీనటులు ఎవరికి వారే తమ తమ నృత్యాలను కూర్సుకునేవారు.

1 . తెలుగులో నృత్య దర్శకత్వం అనేది ప్రత్యేకంగా ఏ చిత్రంతో ఆరంభమైంది ?
 
జవాబు : తెలుగులో చిత్ర నిర్మాణం ప్రారంభమైన దశాబ్దం తర్వాత 1941 లో వచ్చిన ' భక్తిమాల ' చిత్రంతో ప్రత్యేకంగా నృత్య దర్శకత్వం, దానికో శాఖ ఏర్పడ్డాయి.

 
2 . తెలుగు చలచిత్ర రంగ తొలి నృత్య దర్శకుడు ఎవరు ? 
 
జవాబు : తొలి నృత్యదర్శకుడు  భక్తిమాల చిత్రానికి నృత్య దర్శకత్వం వహించిన వెంపటి ( పెద ) సత్యం గారు

  
Vol. No. 02 Pub. No. 015a

Saturday, August 28, 2010

తెలుగు బాట నడుద్దాం !


దేశభాషలందు తెలుగు లెస్స
ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ తెలుగు
పంచదారకన్న పాలకోవకన్న తెలుగు భాష తీపి
తెలుగు భాషకు, తెలుగు వెలుగులకి, తెలుగుదనానికి వందనం
తెలుగు వ్యావహారిక భాషకు ఉద్యమించిన గిడుగు వారికి వందనం 

తెలుగులో రాద్దాం
తెలుగులో మాట్లాడుదాం 
తెలుగు చదువుదాం 
                            తెలుగు వాళ్ళమనిపించుకుందాం
                            తెలుగేతరులకు కూడా తెలుగు నేర్చుకోవాలనిపిద్దాం
                            తెలుగు బాట నడుద్దాం ! తెలుగు ఖ్యాతి చాటుదాం !!

తెలుగు వారందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలతో ..............................



Vol. No. 02 Pub. No. 016

నృత్య దర్శకత్వం .....??

కనుక్కోండి చూద్దాం - 25  

1931 లో తెలుగు చలనచిత్ర నిర్మాణం ప్రారంభమైంది. అప్పటికింకా చలనచిత్ర రంగంలో కొన్ని శాఖలు పూర్తి రూపు సంతరించుకోలేదు. అందులో ఒకటి నృత్య శాఖ.  కొంతకాలం వరకూ నటీనటులు ఎవరికి వారే తమ తమ నృత్యాలను కూర్సుకునేవారు.

1 . తెలుగులో నృత్య దర్శకత్వం అనేది ప్రత్యేకంగా ఏ చిత్రంతో ఆరంభమైంది ?
2 . తెలుగు చలచిత్ర రంగ తొలి నృత్య దర్శకుడు ఎవరు ? 

Vol. No. 02 Pub. No. 015

Friday, August 27, 2010

మహాలక్ష్మి - శ్రీరంజని

అలనాటి నటి శ్రీరంజని మేటి నటిగా వెలుగుతున్న కాలంలో జబ్బు పడడంతో తన భర్త నాగమణికి మళ్ళీ పెళ్లి చెయ్యాలని సంకల్పించింది. తన తల్లిదండ్రుల సమ్మతంతో చెల్లెలైన మహాలక్ష్మినిచ్చి తన భర్తకు మళ్ళీ పెళ్లి చేసింది. ఇది 1940 వ సంవత్సరంలో జరిగింది.

శ్రీరంజని వారసురాలిగా మహాలక్ష్మిని మొదట గుర్తించింది అప్పటి మేటి దర్శకుడు చిత్రపు నారాయణ మూర్తి గారు. 1944 లో  తన భీష్మ చిత్రంలో సత్యవతి పాత్రనిచ్చి తెలుగు చిత్ర ప్రపంచానికి పరిచయం చేశారు. ఆ చిత్రాన్ని విడుదల చేసిన చమ్రియా టాకీస్ వారు మహాలక్ష్మి పేరును జూనియర్ శ్రీరంజని గా మార్చారు.

ఆ తర్వాత గొల్లభామ, గృహప్రవేశం, బ్రహ్మరథం, మదాలస వంటి చిత్రాల్లో నటించారు. 1949 లో కదిరి వెంకట రెడ్డి దర్శకత్వంలో వచ్చిన  గుణసుందరి కథ లో  గుణసుందరి పాత్ర  ఆమెకు స్టార్ హోదా కల్పించిందని చెప్పవచ్చు. దాంతో ఆమె అనేక తెలుగు చిత్రరంగంలోనే కాక తమిళ చిత్రరంగంలో కూడా ప్రముఖ నటిగా వెలుగొందారు.  1960 వరకూ పూర్తిస్థాయిలోను, ఆ తర్వాత 1974 వరకూ అడపాదడపా అతిథి పాత్రల్లోనూ నటించారు. మూడు దశాబ్దాలు కొనసాగిన ఆమె సుదీర్ఘ నట ప్రస్థానం 1974 లో ఆగష్టు 27 వ తేదీన ముగిసింది.

జూనియర్ శ్రీరంజని వర్థంతి సందర్భంగా ఆమెను స్మరించుకుంటూ............



Vol. No. 02 Pub. No. 014

Thursday, August 26, 2010

అమ్మకు వందనం


 నూరేళ్ళు నిండిన అమ్మకు శతసహస్ర వందనం 
జనం మదిలో పదిలం మరో వెయ్యేళ్ళు నీ జ్ఞాపకం 

 Vol. No. 02 Pub. No. 013

Wednesday, August 25, 2010

బొచ్చుకుక్కా ? ఒట్టి కుక్కా ?

 అధికారానికి సృజనాత్మకతకు సరిపడదేమో !
లలిత కళలు, వాటికి సంబంధించిన విభాగాలు ప్రభుత్వాధీనంలో వుంటే వాటి పరిస్థితి ఏమిటో వేరేగా చెప్పనక్కరలేదు. అధికారం, అలసత్వం, అవినీతి, బంధుప్రీతి వగైరా అవలక్షణాలన్నీ చెరుకుకు పట్టిన చెదల్లా లలిత కళల్లో వున్న తీపిని పీల్చేసి మనకి పిప్పిని మిగులుస్తాయి. గతంలో ప్రభుత్వ అకాడెమిలు, వాటి పనితీరు తెలిసిన వాళ్ళందరికీ ఇది అనుభవమే ! అలాగే ప్రభుత్వ సంస్థలైన ఆకాశవాణి, దూరదర్శన్ విషయం చెప్పనక్కర్లేదు. అందరూ ఇదే పద్ధతిలో ఉంటారని చెప్పలేం గానీ ఆ విభాగాల అధికారులలో  చాలామంది తమ అలసత్వానికి, అవినీతికి ప్రభుత్వ నియమనిబంధనలను అడ్డు పెట్టుకుంటారు. కొంతమందికి సృజనాత్మకత లేకపోయినా ఇతర కారణాలవలన ఆ స్థానానికి చేరుకుని యాంత్రికంగా విధులు నిర్వహిస్తుంటారు. కానీ ఈ విభాగాల్లో సృజనాత్మకత తప్ప యాంత్రికత పనికిరాదు.

అలాంటి యాంత్రికత, నియమ నిబంధనలు సృజనాత్మకతకు ఎలా అడ్డు వస్తాయి అనేదానికి ఒక ఉదాహరణ.......


ప్రముఖ రచయిత దేవరకొండ బాలగంగాధర తిలక్ ఒకసారి ఆకాశవాణికి ఒక కవిత పంపించారు. అందులో ఒక పంక్తిలో ' ఒడిలో బొచ్చుకుక్క పిల్ల ' అంటూ రాసారట. ఆ కవితలో  ' బొచ్చు ' అనే పదం ఆ రేడియో కేంద్ర అధికారులకు అభ్యంతరకరంగా తోచింది. అందుకని ఆ మాట తీసేయ్యమన్నారట. తిలక్ గారికి అందులో అభ్యంతరమేమిటో అర్థం కాలేదు.
" బొచ్చు కుక్క పిల్లను బొచ్చు కుక్క పిల్ల అనక ఒట్టి కుక్కపిల్ల అంటారా ?  "
అని చిరాకు పడ్డారట.


Vol. No. 02 Pub. No. 013