Thursday, January 14, 2010

హాస్య బ్రహ్మతో అనుభవం

నిన్న అంటే 14 వతేదీన హాస్య బ్రహ్మ జంధ్యాల గారి జన్మదినం. చాలామంది బ్లాగు మిత్రులు ఆయన్ని స్మరిస్తూ మంచి మంచి టపాలు రాసారు. నేను అనివార్య కారణాల వలన మిస్సయిన వాటిలో ఇదొక సందర్భం. అయితే ఆ నవ్వుల వైద్యుణ్ణి స్మరించుకోకుండా ఉండలేక ఆయనతో ఒక చిన్న అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను.

ఆయన
మాటలు రాయడంలో ఘనాపాటీ అన్న విషయం తెలియని తెలుగు ప్రేక్షకులుండరు ( ఉంటే వాళ్ళు తెలుగువాళ్ళు కారు ). ఆయన మాటల్లో తొణికసలాడే చమత్కారెలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అయితే సినిమా సంభాషణల్లో రాయడం వేరు. నిజ జీవితంలో...అదీ తన మీద తనే చమత్కార బాణాలు వేసుకోవడం విశేషం.

జంధ్యాల
దర్శకత్వం వహించిన ' మూడుముళ్ళు ' చిత్రం షూటింగ్ కోనసీమ లో జరుగుతోంది. సరిగా అదే సమయంలో మా కోనసీమా ఫిలిం సొసైటీ వార్షికోత్సవం వచ్చింది. ఆ కార్యక్రమ రూపకల్పనలో ఉండగా మా కార్యవర్గ మిత్రులు ముఖ్య అతిథిగా జంధ్యాల గారిని పిలిస్తే బాగుంటుందని ప్రతిపాదించారు. మా కార్యవర్గ సభ్యుల్లో షూటింగ్ జరుగుతున్న గ్రామం ' మాగాం ' వాస్తవ్యులు కూడా ఉన్నారు. వారితో బాటు జంధ్యాల గారిని కలిసి ముఖ్య అతిథిగా రావల్సిందిగా అభ్యర్థించాం. తనవి ఫిలిం సొసైటీలలో ప్రదర్శించదగిన సినిమాలు కావు కనుక తాను రావడం ఉచితంగా ఉండదేమోనని ముందు కొంచెం సందేహ పడ్డారు. ఆయనతో నాకున్న కొద్దిపాటి వ్యక్తిగత పరిచయంతో ఆయన సందేహాన్ని తీర్చి ఒప్పించడానికి ఒక చిత్రాన్ని గుర్తుచేసాను. అది ' నెలవంక '. ఈ చిత్రం గురించి చాలామందికి తెలియకపోవచ్చు. ఆ చిత్ర విశేషాలు క్లుప్తంగా....

మత ఘర్షణలు ప్రధానాంశంగా సాగిన చిత్రం. హిందూ యువతి, ముస్లిం యువకుడు ప్రేమించుకోవడం, వారి ప్రేమను భగ్నం చెయ్యడానికి పెద్దలు సృష్టించిన అడ్డంకులు మతకలహాలకు దారి తీయడం ఈ చిత్ర కథాంశం. ఇందులో తోలుబొమ్మలాట ప్రదర్శన మొదలైన ప్రయోగాలు జంధ్యాల చేసారు. అయితే ఆయన ఒరవడికి పూర్తి భిన్నంగా ఉన్న చిత్రం నెలవంక అనడానికి నిదర్శనం ఆ చిత్రంలో హాస్యం తేలిపోవడమే ! ' నాలుగు స్తంభాలాట ' సుత్తికి కొనసాగింపుగా అటుదిటు చేస్తూ వేలు యజమానిగా, వీరభద్రరావు సేవకునిగా సుత్తికి బదులుగా మేకులు వాడిన హాస్యం సీరియస్ గా నడుస్తున్న చిత్రంలో పేలవంగా కనిపిస్తుంది. రాజేష్ ముస్లిం యువకునిగా, తులసి హిందూ యువతిగా నటించారు. ఆ చిత్రం ఘోరంగా పరాజయం పాలయింది.

రోజు నేను ఆ చిత్రం గురించి చెప్పగానే ఆయన మా ఫిలిం సొసైటీ వార్షికోత్సవ సభలో ముఖ్య అతిథిగా పాల్గొనడానికి అంగీకరించడమే కాక ఆ చిత్రం ప్రదర్శిస్తే బాగుంటుందనే మా ప్రతిపాదనకు కూడా అంగీకరించి వెంటనే ఆయనే డిస్ట్రిబ్యూటర్ కి ఫోన్ చేసి చెప్పడంతో బాటు ఉచితంగా ఇవ్వవలసినదిగా ఒక ఉత్తరం కూడా రాసిచ్చారు. ఆ విధంగా వార్షికోత్సవం రోజు జంధ్యాల గారి సౌజన్యంతో ' నెలవంక ' చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేసాం ! ఆ సభలో ఆయన మాట్లాడుతూ అన్న మాటలు నేను ఈ రోజుకీ మర్చిపోలేను.

" చాలా చిత్రాలకు మాటలు రాస్తున్నాను. దర్శకత్వం చేస్తున్నాను. అన్నీ నాకు సంతృప్తి ఇచ్చేవా అంటే ఖచ్చితంగా కాదు అని చెప్పొచ్చు. మరెందుకు ఇవన్నీ చేస్తున్నారని మీరడగవచ్చు. ఇది నా వృత్తి. నన్ను రచన చెయ్యమనో, దర్సకత్వం కోసమో నిర్మాతలు అడిగినప్పుడు నా వృత్తి ధర్మాన్ని అనుసరించి చేస్తాను తప్ప నా స్వంత అభిప్రాయాలను వారి మీద రుద్దే ప్రయత్నం చెయ్యను. కానీ మొదటిసారిగా నేను ఇష్టపడి రాసుకున్న కథ, మలచిన చిత్రం నెలవంక. అది ప్రేక్షకులకు నచ్చలేదు. అందుకే ఆకాశమంత ఎత్తుకి ఎదుగుతుందనుకున్న ' నెలవంక ' ........ ' నేల 'వంక చూసింది. దాంతో ఇక మీదట నా ఇష్టాల్ని ప్రేక్షకుల మీద కూడా రుద్దకూడదనుకున్నాను. " అన్నారు జంధ్యాల.

సమాజం పట్ల బాధ్యతతో తీసిన చిత్రం పరాజయాన్ని చూపించినందుకు కమర్షియల్ చిత్రాలే తీస్తేనే బాగుంటుందనే అభిప్రాయానికి ఆయన వచ్చినట్లు ఆ మాటలు ధ్వనించినా ఆయన తన బాధ్యతను మరచి పోలేదు. కాకపోతే మరో రూపంలో నెరవేర్చారు. హాస్యంతో తెలుగు వారికెందరికో ఆరోగ్యాన్ని అందించారు. ఆయన అందించిన ఆణిముత్యం లాంటి, అమృత గుళిక లాంటి నినాదం

నవ్వడం ఒక భోగం

నవ్వలేక పోవడం ఒక రోగం

నవ్వించడం ఒక యోగం

Vol. No. 01 Pub. No. 158

Wednesday, January 13, 2010

సంక్రాంతికి బ్లాగు మిత్రుల కలయిక

ఈ రోజు సంక్రాంతి... పెద్ద పండుగ
వారం క్రితమే నాకు ఒక బ్లాగ్మిత్రుని నుండి మెయిల్ వచ్చింది సంక్రాంతికి వస్తున్నట్లు.
ఆయన ఎవరో కాదు ' సాహిత్య అభిమాని ' శివరామ ప్రసాద్ గారు.
అప్పటినుండి ఎదురు చూస్తున్నాను. చివరికి ఆరోజు రానే వచ్చింది.
ఈ రోజు సాయింత్రం గం. 4-00 లకు రాఘవయ్య పార్కులో కలుద్దామని శివ గారు నిన్ననే ఫోన్ చేసారు.
అలాగే పార్కుకి చేరుకున్నాను. మరోమిత్రుడు 'నవ్వులాట' శ్రీకాంత్ గారు తన వృత్తి పరమైన ఒత్తిడిలవల్ల కొంచెం ఆలస్యమవుతుందని ముందే చెప్పారు. కానీ ఆయన కంటే ముందు పిలవని అతిథిగా వర్షం వచ్చింది. దాంతో మిగిలిన మిత్రులు రాలేకపోయారు.
అయితే కొత్త విషయం ఏమిటంటే అక్కడ శివ గారిలో కొత్త కోణం చూసాను. ఆయన హామ్ రేడియో ఆపరేటర్. ఆయననే కాక ఆయన తోటి ఆపరేటర్లను కలుసుకోవడం చాలా ఆనందదాయకమైన విషయం. అందులో మంచి మంచి హోదాలో రిటైరయిన వ్యక్తుల దగ్గర్నుంచి మంచి వృత్తి, వ్యాపారాల్లో ఉన్న వారి వరకూ చాలామంది ఉన్నారు.
హామ్ రేడియోకి సంబంధించి నా అనుభవం. సమాచార వ్యవస్థ ఇంతగా విస్తరించని రోజుల్ల్లో హామ్ రేడియోకి చాలా ప్రాధాన్యం ఉండేది. ముఖ్యంగా తుఫానులు, వరదలు, భూకంపాలు లాంటి ప్రకృతి భీభత్సాలు సంభవించినప్పుడు సమాచార వ్యవస్థ చిన్నాభిన్నం అయినపుడు అనేకమంది హామ్ రేడియో ఆపరేటర్లు అందించిన సేవలు నిరుపమానం. ముఖ్యంగా 1977 దివిసీమ ఉప్పెన, 1986 లో గోదావరికి భారీ వరదలు వచ్చి మా కోనసీమ ఒక దీవిగా మారిపోయినపుడు వారందించిన సేవలు నేను మరచిపోలేను. అలాంటి వారి పరిచయం కలగడం మన తోటి బ్లాగరు శివ గారి వల్ల సాధ్యమైంది. అందుకు ఆయనకు ధన్యవాదాలు. సమాచార సాంకేతిక అభివృద్ధిని వారు అంది పుచ్చుకుని పురోగమిస్తున్నారని వారి సంభాషణల వలన నాకర్థమైన విషయం.
కొంచెం వర్షం తగ్గాక అప్పటికే కాలాతీతం కావడం వలన, శ్రీకాంత్ గారి కోరిక మేరకు అక్కడికి దగ్గరలోనే ఉన్న ఆయన ఆఫీసులో కలిసాం. కాసేపు మన బ్లాగుల విషయాలు మాట్లాడుకున్నాక ఈ రోజు కార్యక్రమానికి వర్షం ఆడ్డంకిగా మారి కలిగించిన నిరాశ నుంచి బయిటపడిన హృదయాలతో సంతృప్తిగా విడిపోయాం.
ఈ రోజు మా చర్చల్లోకి వచ్చిన ఒక అంశం గూగుల్ అనువాద పరికరం గురించి. అది త్వరలోనే తెలుగులో రాబోతున్నట్లు నెట్ లో చదివిన విషయాన్ని నేను చెప్పాను. రెండురోజుల క్రితం అనుకుంటా ! బ్లాగరు.కామ్ లో కొత్త పోస్టు బాక్స్ లో అకస్మాత్తుగా మార్పు కనిపించింది. పని ఒత్తిడిల కారణంగా సమయాభావం వలన, మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలందించాలనే కంగారులో నేను గమనించలేదు గానీ మిత్రులు కొందరైనా గమనించే ఉంటారు. కొత్త పోస్టు బాక్స్ కొత్త లేఔటు లో ఒక కొత్త బటన్ కలిపాడు. అదే అనువాద బొత్తాము. కాకతాళీయంగా ఈ రోజు మామధ్య చర్చలో వచ్చిన అంశం గూగుల్ వాడు నిజం చేసేసాడు......
అన్నీ నేనే చెప్పెయ్యడం బాగుండదేమో ! మిగిలిన వివరాలు బహుశా శివగారు సచిత్రంగా అందిస్తారనుకుంటా ! వేచి చూద్దాం !
బ్లాగు మిత్రుల ముఖాముఖి కలయిక ఒక తీయని అనుభూతి. ఆ అనుభూతి మాకు తరచుగా దక్కడం మా అదృష్టం. మొన్న కొత్తపాళీ గారు. నిన్న ఇ-తెలుగు కార్యవర్గ సభ్యులు. ఈరోజు శివ గారు.
ఉత్తర, దక్షిణ భారతాల ప్రధాన కూడలి విజయవాడ. బ్లాగర్లకు కూడా కూడలిగా మారుతుందేమో ! ఇదొక మంచి పరిణామం అని నేననుకుంటున్నాను.

Vol. No. 01 Pub. No. 157

నవ్య ' క్రాంతి ' సంక్రాంతి




ఈనాటి ఆనందమయ మకర సంక్రాంతి



అందరికీ అందించాలి నవ్య క్రాంతి



*************************************************


బ్లాగు మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు



రావమ్మా
మహాలక్ష్మీ ! రావమ్మా ! .......................




Vol. No. 01 Pub. No. 156

Monday, January 11, 2010

కిరాతుడి కన్ను


శ్రీయుతులు దువ్వూరి రామిరెడ్డి గారికి, గుర్రం జాషువా గారికి ఒక ప్రత్యేకమైన పోలిక ఉంది.
అదేమిటంటే ఇద్దరికీ బిరుదు ఒకటే !
' కవికోకిల ' .
అలాగే వారిద్దరికీ మంచి స్నేహం కూడా ఉంది.
ఒకసారి మద్రాసులో కవి సమ్మేళనం జరుగుతోంది .
ఆ సమ్మేళనానికి కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ,
కృష్ణ శాస్త్రి గారి లాంటి మహాకవులతో బాటు జాషువా, రామిరెడ్డి గార్లు కూడా హాజరయ్యారు.
సహజంగానే వారి సాన్నిహిత్యం కారణంగా ఇద్దరూ కబుర్లలో పడ్డారు.



వారిద్దరి ధోరణి చూసిన విశ్వనాథ వారు
' రెండు పక్షులు ఒక చోటికే చేరాయే ? '
అని కవికోకిల బిరుదలను దృష్టిలో ఉంచుకుని చమత్కరించారు.

దానికి ప్రతిగా జాషువాగారు వెంటనే
' నిజమే కానీ కిరాతుడి కన్ను ఇంకా పక్షుల మీదే ఉన్నదే ! '
అని జవాబిచ్చారు.

Vol. No. 01 Pub. No. 155

Friday, January 8, 2010

శ్రీశ్రీ శ్రవ్య నాటికలు

రంగస్థలం మీద ప్రదర్శించే దృశ్య ప్రధానమైన నాటికలకు భిన్నమైనవి శ్రవ్య నాటికలు. దృశ్య నాటికలు గానీ, నాటకాలు గానీ సంభాషణలకంటే నటుడి / నటి హావభావాల ద్వారా రచయిత / ప్రయోక్త చెప్పదలచుకున్న సందేశాన్ని ప్రేక్షకులకు అందిస్తాయి. కానీ శ్రవ్య నాటిక / నాటకానికి ఆ సౌలభ్యం లేదు. అక్కడ దృశ్యం ఉండదు. ప్రేక్షకులుండరు. కేవలం శ్రోతలు మాత్రమే ఉంటారు. రచయిత సంభాషణలలోనే దృశ్యాన్ని అందించగలగాలి. నటీనటులు తమ హావభావాలను సంభాషణలలోను, చిన్న చిన్న ఎక్స్ ప్రెషన్స్ ద్వారాను వ్యక్తం చెయ్యగలగాలి. అందుకే శ్రవ్య నాటిక రచన దృశ్య నాటిక రచన కంటే కష్టమైనది.

1980 దశకం వరకూ సామాన్యుడికి అందుబాటులో వున్న ఏకైక ప్రధాన ప్రసార మాధ్యమం ' రేడియో ' అదే 'ఆకాశవాణి '. మన దేశంలో స్వాతంత్ర్యానికి పూర్వమే ప్రాచుర్యంలోకి వచ్చిన రేడియో తర్వాత సామాన్య జనం జీవితాలలో విడదీయరాని భాగమైపోయింది. అప్పట్లో నాటకాలంటే దసరా, వినాయక చవితి మొదలైన ఉత్సవాల సమయంలోనో, అరుదుగా ఇతర సమయాలలోను ప్రదర్శించేవే ! రేడియో ప్రాచుర్యంలోకి వచ్చాక శ్రవ్య నాటక యుగం ప్రారంభమైంది. ప్రసిద్ధ నటుల రంగస్థల నాటకాలు గ్రామఫోన్ రికార్డులుగా వచ్చినా అప్పట్లో గ్రామఫోను కూడా లగ్జరీనే కావడం వలన అవి శ్రవ్య రూపంలో కన్న దృశ్య రూపంలోనే ఎక్కువ ఆదరణ పొందాయి. రేడియో శ్రవ్య నాటకాలను ప్రోత్సహించింది. ఎన్నో మంచి నాటకాలు వచ్చాయి. మరెన్నో మంచి నాటకాలు, కథలు, నవలలు శ్రవ్య నాటికలు, నాటకాలుగా రూపాంతరం చెందాయి. ప్రత్యేకంగా శ్రవ్య నాటకాలను రచించే రచయితలతో బాటు కొందరు ప్రసిద్ధ కవులు, రచయితలు అనేక రూపాల్లో శ్రవ్య నాటక రచన సాగించారు.

వారిలో మహాకవి శ్రీశ్రీ కూడా ఒకరు. ఆయన రేడియో కోసం రచించిన నాటికలు అప్పట్లో ప్రయోగాత్మకమైనవనే చెప్పాలి. వాటిల్లో కూడా ఆయన సామాన్య జనం తరఫునే నిలిచారు. వాటిల్లో కూడా ఆయనకే ప్రత్యేకమైన శైలి కనబడుతుంది. 1962 వరకూ రేడియోలో ( ఎక్కువగా మద్రాసు ఆకాశవాణి కేంద్రం నుండి ) ప్రసారమైన శ్రీశ్రీ నాటికల్ని' 1+1 = 1 మొదలైన రేడియో నాటికలు' అనే పేరుతో సంకలీకరించారు. ఆ నాటికలలో ఒకటి ఇంతకు ముందు టపాలో పరిచయం చేసిన ' గుమాస్తా కల ' . శ్రీశ్రీ రచనలు ' మహాప్రస్థానం ' 'సిరిసిరి మువ్వ ' ' ఖడ్గసృష్టి ' లాంటి కవితా ఖండికలు గుర్తున్నంతగా ఆయన నాటికలు గుర్తుండవు. మరోసారి ఆ మహాకవి రచించిన నాటికల్ని గుర్తు చేసే చిన్ని ప్రయత్నం ఈ పరిచయం.

Vol. No. 01 Pub. No. 154

Thursday, January 7, 2010

గుమాస్తా కల

ఆశ : అమెరికా దేశం కోనేటిరావును ఆహ్వానించింది.

భయం : అమెరికా ఎందు కాహ్వానించింది అతణ్ణి ?

ఆశ : ప్రపంచంలో ఈయన్ని మించిన ఇంజనీయరు లేడని.

ఆహ్వాన
పత్రం
ప్రపంచ ప్రథమ పౌరునికి అమెరికా స్వాగతం. మా ఆతిథ్యం మీరు స్వీకరించాలి. మా టేన్నేస్సీ లోయను తమరు తనిఖీ చెయ్యాలి. అమూల్యమైన మీ సలహాలను శిరసావహిస్తాము. సిఫారసులను తక్షణం అమలు చేస్తాము...(కరతాళ ధ్వనులు )

కోనేటి
: అబ్బే ! అదెంతమాట ! అల్పజ్ఞుణ్ణి. నన్నేదో పెద్దవాణ్ణి చేసి పొగుడుతున్నారు. నా మాత్రం తెలివైనవాళ్ళు మీ అమెరికాలో లేకపోయారా ? ఆంధ్రదేశం నుంచి ప్రత్యేకం నన్నిక్కడ కాహ్వానించడం మీ ఔదార్యాన్నే చాటుతోంది. అయినా సన్మానం నాదికాదు. ఆంధ్రదేశానిదీ గౌరవం.

(
చంటి పిల్ల ఏడ్చిన చప్పుడు. కోనేటిరావుకు మెలుకువ వస్తుంది. )

***********


భయం : ఈమారేమిటి ? సముద్రంలో ఏం చేస్తున్నాడు ?

ఆశ
: ప్రపంచ మహాయుద్ధాన్ని భావిస్తున్నాడు.

భయం : ఓహో ఎంత దివ్యంగా ఉంది. యుద్ధంలో కోనేటిరావు ప్రధాన పాత్రధారి కాబోలు.

ఆశ : ఔను. ఈసారి ఈయన జర్మన్ సబ్మేరిన్ కమాండర్ జటాఫట్ కొనేట్.

భయం : అయితే ?

ఆశ : అట్లాంటిక్ మహాసముద్ర గర్భంలో అతని జలాంతర్గామి తిమింగలంలాగ విహరిస్తోంది.

-----

కోనేటి : వేల్దాన్ షాంగ్ డెర్ ఉంటార్ డెన్ లిండెన్ ! గేస్తాల్ట్ డెర్ డాయిష్లాండ్ ఊబర్ ఆల్స్ .

ఆశ : మంచినీళ్ళ ప్రాయంగా జర్మన్ భాష మాట్లాడేస్తున్నాడు.

భయం : మాటకి అర్థం ఏమిటి ?

ఆశ : మాటలేమైనా ఫలితం ప్రధానం. తునా తునియలై పోయింది శతృనౌక.

--------

ఆశ : శతృ నావికులమీద మెషీన్ గన్లు పేల్చమని తన తరఫువారికి ఆర్డర్లు ఇస్తున్నాడు.

కోనేటి : ఫోల్కిషేర్ బియో బాక్టర్ ! గెహన్నా, ఆఖ్ టుంగ్, జైట్ గైన్ట్ ! మైన్ క్యాంప్.

( పిల్లి పాలగిన్నెను పడతోసిన చప్పుడు, తుళ్ళిపడిలేస్తాడు కోనేటి రావు )

***********

ఆశ : కోనేటిరావు కథానాయకుడుగా సినిమాలో నటిస్తున్నాడు.

భయం : యాభై యేళ్ళ కోనేటిరావు.

ఆశ : కలలో కోనేటిరావు వయస్సు పాతికేళ్ళే. బహుశా ఇంకాతక్కువ. కలలో కోనేటిరావు స్థూలకాయుడు కాదు. ఆజానుబాహువు. సౌందర్యాపరమత్స్య లాంచనుడు. కళా సర్వజ్ఞుడు కూడాను.

భయం : కథానాయిక ఎవరు ?

ఆశ : అతని స్వప్నసుందరి.

------

ఆశ : కథానాయిక అనేకమైన ఇబ్బందులలో, అరణ్యాలలో - భయంకర మృగాల మధ్య, నగరాలలో భయంకర పరిస్థితుల మధ్య చిక్కుకుంటుంది. ఆమెను కథానాయకుడు రక్షిస్తాడు. వారు పరస్పరం ప్రేమించుకుంటారు.

------

ఆశ : సౌందర్యం సమక్షంలో కోనేటిరావు నిలుచున్నాడు. అతని హృదయంలో ప్రేమ సంగీత రూపంలో ప్రవహిస్తోంది. కథానాయిక అతని ప్రేమని గానంతో అంగీకరించింది. కథలో అతడే సత్యవంతుడు. ఆమె సావిత్రి. అతడు రోమియో. ఆమె జూలియట్. అతడు కోనేటిరావు. ఆమె కోనేటిరాణి.

**********

భయం : అసలీ కోనేటి రావెవరు ?

ఆశ : అనంతకోటి కచేరీలలో ఒక గుమాస్తా.

భయం : అనధికారరీత్యా అతనికేమీ హోదా లేదా ?

ఆశ : కోనేటిరావు అందరిలోనూ,అందరిలాగే ఒక మానవుడు, సంసారి. పెళ్ళాన్నీ, పిల్లల్నీ ప్రేమిస్తాడు. కానీ తరచూ వాళ్ళ మీదా, తన మీదా విసుక్కుంటాడు. అతని జీవితంలో స్మరించదగ్గ సంఘటన లేవీ లేవు. సాహిత్య రంగంలో అతనికి నాయకత్వంలేదు. పత్రికలలో అతని పేరు కనబడదు. ప్రపంచంలో అతని పేరు వినబడదు. అతని నిజమైన జీవితం ఒక స్వప్నం. అతని స్వప్నం సాధ్యంకాని అబద్ధం.

() ******** ()

ఇదీ ఓ సగటు గుమాస్తా కలల ప్రపంచం. మహాకవి శ్రీశ్రీ రాసిన ' గుమాస్తా కల ' అనే రేడియో నాటికలోని కొన్ని ముఖ్యమైన ఘట్టాలు. సామాన్య మధ్య తరగతి మానవుని అంతరంగాన్ని ఇంతకంటే బాగా ఆవిష్కరించడం ఇంకెవరికైనా సాధ్యమా ? శ్రీశ్రీ కి మాత్రమే ఆ అథారిటీ ఉంది. సామాన్యుడు కలలు మాత్రమే కనగలడు. అవి తీర్చుకునే మార్గాలు లేవనుకోవడం నిరాశావాదం. కానీ శ్రీశ్రీ ఆశావాది. అందుకే ఆయన ఈ నాటికలో .......

మానవుడు కలలు కనడం మానలేడు. కోనేటిరావు జీవితంలో అవి ఫలింపక పోవచ్చును. మరో జీవితంలో, ఇంకో కాలంలో మానవజాతి తన స్వప్నాలను సాధించగలుగుతుంది.

......... అంటారు.

సామాన్యుడిలోని ఆశ, భయం ల మధ్య జరుగుతున్న సంభాషణ రూపంలో ఈ నాటిక సాగుతుంది. కోనేటిరావు లాంటి ఒక మామూలు గుమాస్తా తన ఆశల్ని, తన భయాల్ని నిద్రలో, కలల్లో సాక్షాత్కారించుకుంటాడు. ఆ కలల్లో అతని ఆశలు తీరుతాయి. అతని భయాలు పారిపోతాయి. ఆ కలల్లో అతను ఒక మేధావి. ఒక యోధుడు. ఒక హీరో. ఒకటేమిటి. నిజ జీవితంలో అతనేం కాలేడో....కలల్లో అవన్నీ కాగలడు !

సామాన్య మానవుడి తరఫున వకాల్తా పుచ్చుకున్న శ్రీశ్రీ గురించి, ఆయన రచనల గురించి సమీక్షించడం సూర్యుడి ముందు దివిటీ వెలిగించడమే ! అందుకే ఇది సమీక్ష కాదు. కేవలం ఆయన నాటిక పరిచయం మాత్రమే !

Vol. No. 01 Pub. No. 153

Wednesday, January 6, 2010

కనుక్కోండి చూద్దాం - 7

ఈ పాట ఏ చిత్రంలోదో తెలుసుకోవడం సుళువే !
గాయకుడెవరో కూడా చెప్పగలరనుకుంటాను.
ఇప్పుడు గాయని ఎవరో కనుక్కోండి చూద్దాం !



Vol. No. 01 Pub. No. 152