Thursday, October 28, 2010

పోటాపోటీ


తెలుగు చిత్ర రంగంలో ఇప్పుడు నడుస్తున్న కొత్త ట్రెండ్ టైటిల్స్ కోసం పోటాపోటీ. గతంలో కూడా ఈ పోటీ వున్నా ప్రజలకు అంతగా తెలిసేది కాదు. వాళ్ళల్లో వాళ్ళే పరిష్కరించుకునేవారు. ఇప్పుడు చీమ చిటుక్కుమంటే ప్రజలకు చేరిపోతోంది. చిన్న విషయం కూడా పెద్ద రాద్దాంతమవుతోంది. ఇది కూడా ప్రసార మాధ్యమాలు సాధించిన ప్రగతి పుణ్యమే !

అసలు ఈ పోటీ తత్త్వం తెలుగు చిత్ర రంగం ఆవిర్భవించిన తొలినాళ్ళలోనే ఆరంభమైంది. అయితే ఇప్పటి పోటీ పేర్లకోసమైతే అప్పటి పోటీ కథలకోసం !

  1933 లోనే ఈ పోటీ తత్వానికి అంకురార్పణ జరిగింది. ' రామదాసు ' పేరుతో రెండు చిత్రాలోచ్చాయి. ఒక చిత్రాన్ని బొంబాయి కి చెందిన ఇంపీరియల్ కంపెనీ నిర్మించగా మరో చిత్రాన్ని కలకత్తాకు చెందిన ఈస్ట్ ఇండియా కంపెనీ నిర్మించింది. రెండవ చిత్రంలో సి. యస్. ఆర్, ఘంటసాల రాధాకృష్ణమూర్తి, రామతిలకం నటించారు. సి. పుల్లయ్య దర్శకత్వం వహించారు.

మరో విశేషమేమిటంటే అదే సంవత్సరం ' సావిత్రి ' పేరుతో రెండు చిత్రాలు వచ్చాయి. ఈస్ట్ ఇండియా కంపెనీ నిర్మించిన చిత్రానికి సి. పుల్లయ్య గారే దర్శకత్వం వహించగా రామతిలకం, వేమూరి గగ్గయ్య, నిడుముక్కల సుబ్బారావు నటించారు.  

రెండో చిత్రం బి. వి. రామానందం దర్శకత్వంలో కృష్ణా ఫిలిం కంపెనీ నిర్మించింది. ఈయన విశ్వనట చక్రవర్తి ఎస్వీరంగారావుగారికి మేనమామ. ఇందులో సురభి కమలాబాయి, మునిపల్లె రాజు నటించారు. ఈ రెండింటిలో మొదటి చిత్రమే విజయం సాధించి ఒకే డేరా హాలులో సంవత్సరంపాటు ఆడిందని చెబుతారు. కథలలోనే కాదు పేర్లలో కూడా మార్పు లేకపోవడం ఈ చిత్రాల విశేషం.

1936 లో మళ్ళీ రెండు సినిమాలు పోటీ పడి రికార్డులలో నిలిచిపోయాయి. రెండింటి ఇతివృత్తం ఒకటే ! మొదటిది ' ద్రౌపదీ మానసంరక్షణ ' . లక్ష్మి ఫిల్మ్స్ పతాకంపైన నిర్మించిన ఈ చిత్రానికి ఎస్. జగన్నాథ్ దర్శకుడు. ఇందులో ప్రముఖ రంగస్థల నటుడు బళ్ళారి రాఘవ దుర్యోధనుడిగా నటించగా సురభి కమలాబాయి ద్రౌపదిగా నటించారు.

రెండవ చిత్రం ' ద్రౌపదీ వస్త్రాపహరణం '.  సరస్వతీ టాకీస్ పతాకంపైన నిర్మించిన ఈ చిత్రానికి హెచ్. వి. బాబు దర్శకుడు. ఇందులో కృష్ణుడిగా సి. యస్. ఆర్. ఆంజనేయులు, ద్రౌపదిగా కన్నాంబ, దుర్యోధనునిగా యడవిల్లి సూర్యనారాయణ నటించారు. ఈ చిత్రమే విజయం సాధించింది.


మళ్ళీ ఈ పోటీ చిత్రాల సందడి 1950 వ సంవత్సరంలో కనిపించింది. ' శ్రీలక్ష్మమ్మ కథ ' పేరుతో ప్రతిభా పతాకంపైన ఘంటసాల బలరామయ్య గారు స్వీయ దర్శకత్వంలో నాగేశ్వరరావు, అంజలీదేవిలతో ఒక చిత్రం నిర్మించారు.

' లక్ష్మమ్మ కథ ' పేరుతో శోభనాచల స్టూడియో వారు గోపీచంద్ దర్శకత్వంలో  సి. హెచ్. నారాయణరావు, కృష్ణవేణిలతో మరో చిత్రం నిర్మించారు. ఘంటసాల గారిని సంగీత దర్శకుణ్ణి చేసిన చిత్రం కూడా ఇదే ! రెండు చిత్రాలలోనూ ఈ చిత్రమే విజయం సాధించింది. 

ఇవీ తెలుగు చిత్ర రంగ తొలినాళ్లలోని పోటీ చిత్రాల వివరాలు.

Vol. No. 02 Pub. No. 045

Tuesday, October 26, 2010

నవలక్ష్ములు

అష్టలక్ష్ముల గురించి అందరికీ తెలుసు. మరి తొమ్మిదవ లక్ష్మి ఎవరు ? తెలుసుకోవాలనుందా ? అయితే .......

నటరత్న నందమూరి తారకరామారావు గారి వారసుడు బాలకృష్ణ నటుడిగా ఈ తరం ప్రేక్షకులకు తెలుసు. కానీ గత తరం ప్రేక్షకులకు హాస్యనటుడు బాలకృష్ణ గుర్తుండే వుంటారు. ' పాతాళ భైరవి ' అంజిగాడు అంటే చాలామంది సులువుగా గుర్తు పట్టేస్తారు. ఈ బాలకృష్ణ ఎన్టీరామారావు గారికి అభిమాన నటుడు కూడా !

బాలకృష్ణది చాలా జాలిగుండె. సెట్లో వున్నపుడు ఎవరైనా దిగులుగా కనిపిస్తే దగ్గరకు వెళ్ళి పలుకరించి ఓదార్చేవాడు. ఓసారి ఓ జూనియర్ ఆర్టిస్ట్ సెట్ బయిట దిగులుగా కూర్చుని వుండడం చూసి ........

" ఏంటి బాబాయ్ ! దిగాలుగా కూర్చున్నావు ? " అని అడిగారు.

దానికా నటుడు
" ఏం చెప్పమంటావ్ బాబాయ్ ? మాకు ఇప్పటికి ఎనిమిదిమంది ఆడపిల్లలు. ఇప్పుడు మళ్ళీ నా భార్య గర్భవతి. అదే నా దిగులు " అన్నాడు.

" ఓహో ! మళ్ళీ ఆడపిల్ల పుడితే ఇంకా ఖర్చు పెరుగుతుందనా నీ దిగులు ? " అని అడిగారు బాలకృష్ణ.

దానికా నటుడు
" ఖర్చు గురించి నాకు దిగులు లేదు. ఏదో తెర మీద కనిపించాలనే దురదతో ఈ ఫీల్డ్ లోకి వచ్చి ఈ ఎక్స్ ట్రా వేషాల బారిన పడ్డాను గానీ మీ దయవల్ల మా వూళ్ళో కావలసినంత ఆస్తి వుంది " అన్నాడు.

" మరింక దేనికయ్యా నీ దిగులు ? " అనడిగాడు బాలకృష్ణ

" ఇప్పటివరకూ నా ఎనిమిదిమంది కూతుళ్ళకూ ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, భాగ్యలక్ష్మి...... ఇలా అష్టలక్ష్ముల పేర్లు పెట్టేసాను. మళ్ళీ ఆడపిల్ల పుడితే ఏం పేరు పెట్టాలా అనేదే నా దిగులు " అని తన దిగులుకి కారణం తేల్చాడా నటుడు.

దానికి బాలకృష్ణ కొంచెం అలోచించి
" ఏముంది ? ఈసారి జ్యోతిలక్ష్మి అని పెట్టేయ్యి. సరిపోతుంది " అనేసి అక్కడనుంచి తప్పుకున్నాడు.

తోటరాముడు, నేపాళ మాంత్రికుడు, డింగరి లతో 'అంజి ' గాడిని ఈ పాటలో చూడండి....



  
Vol. No. 02 Pub. No. 044

Saturday, October 23, 2010

కళా దర్శకత్వం

 కనుక్కోండి చూద్దాం - 29 

ఈ  ఫోటోలో ఉన్నవారు తెలుగు వారు గర్వించదగిన వ్యక్తి.  బహుముఖ ప్రజ్ఞాశాలి. రచయిత, చిత్రకారులు, గాయకులు. తెలుగు చలన చిత్రరంగం తొలినాళ్ళలో రెండు చిత్రాలకు కళా దర్శకత్వం వహించారు.


* ఆయన పేరేమిటి ?

* ఆయన కళా దర్శకత్వం వహించిన చిత్రాల పేర్లు ఏమిటి ?  





Vol. No. 02 Pub. No. 043

Friday, October 22, 2010

మీసం చేసిన మోసం

 రంగస్థలం మీద నటునికి ముందుగా కావాల్సింది ధారణ శక్తి . ఎంత పెద్ద డైలాగ్ నైనా, ఎన్ని పేజీలున్నా తడుముకోకుండా సహజరీతిలో చెప్పాల్సివుంటుంది. జ్ఞాపకశక్తి అంతగా లేని నటుడు రంగస్థలం మీద రాణించడం కష్టమే !
సినిమాలో అయితే ఆ అవసరం తక్కువ. గతంలోనైతే ముందుగా పక్కాగా స్క్రిప్ట్ తయారయ్యేది, దాన్ని షూటింగ్ కి వెళ్లక ముందే నటీనటులకు పంపడం జరిగేది. వాళ్ళు బాగా చదువుకుని, హావభావాలు సాధన చేసి మరీ షూటింగ్ కి వచ్చేవారు. అందువలన దర్శకుడు ఇచ్చే సూచనలను బాగా అర్థం చేసుకుని నటించడానికి వీలయ్యేది. సెట్ మీద అప్పడికప్పుడు డైలాగ్ లు రాసుకుని, అసలు డైలాగ్ షీట్ అవసరం లేకుండా సీన్ చెబితే చాలు నటీనటులు ఎవరికి తోచిన డైలాగ్ లు వారే చెప్పుకునే స్థాయికి ఎదిగిన ఈరోజుల్లో ఈ సంగతి చాలామందికి తెలియక పోవచ్చు....తెలిసినా తెలియనట్లు నటించొచ్చు, లేదా అంత శ్రమ పడడం శుద్ధ దండగ అని కొట్టి పడేయ్యవచ్చు. 

ఎంత పెద్ద పేరున్న నటుడైనా ఎప్పుడైనా తడబడతాడేమో గానీ ఎంత పెద్ద డైలాగ్ ఇచ్చినా ఒక్క అక్షరం పొల్లు పోకుండా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసాడా అన్నట్లు నటించే నటుడు సాక్షి రంగారావు. ఆయన సంభాషణా ప్రవాహానికి ఒక ఉదాహరణ ' నటనలో జీవించిన సాక్షి ' అనే టపాలో గతంలో వివరించాను.

అయితే ఎంత గొప్పవారికైనా, ఎంత జాగ్రత్త తీసుకున్నా ఒక్కోసారి తప్పటడుగు పడే సందర్భం వస్తుంది. అంతటి ధారణాశక్తి కలిగిన సాక్షి రంగారావు గారికి కూడా అలాంటి పరిస్థితి ఒకసారి ఎదురయింది. అయితే దాన్నుంచి ఆయన ఎలా బయిట పడ్డారో చూద్దాం.......

ప్రకృతి వైపరీత్యాలు ఎదురైనపుడు బాధితుల సహాయం కోసం చలనచిత్ర నటులు సాంస్కృతిక ప్రదర్శనలివ్వడం ద్వారా ధన సేకరణ చెయ్యడం ఆనవాయితీ. అలా ఓసారి కరువు బాధితుల సహాయం కోసం సూపర్ స్టార్ కృష్ణ తెనాలిలో ఓ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ప్రముఖ నటీనటులు పాల్గొన్నారు. అందులో భాగంగా కృష్ణ, చంద్రమోహన్, సత్యనారాయణ, రావికొండలరావు, రాధాకుమారి, సాక్షి రంగారావు పాల్గొన్న ' వింత మనుషులు ' అనే హాస్యనాటిక ప్రదర్శించారు.

సాక్షి రంగారావు చేతిలో గొడుగుతో స్టేజి మీదకు ప్రవేశించే ఘట్టం. ఆయన హుషారుగా వచ్చేసాడు. కానీ ఆయన  మీసం పెట్టుకోవడం మరచిపోయాడు. ఆది గమనించిన రావికొండలరావు గారు ఊరుకోకుండా సాక్షి చెవిలో ' మీసం పెట్టుకోలేదేం ? ' అని అడిగారు. దాంతో సాక్షిగారు తెల్లబోయారు. గుటకలు మింగారు. ఆ తప్పు ఎలా జరిగిందో అర్థం కాక అయోమయంలో పడిపోయారు.

అంతే ! ఆ దెబ్బకి చెప్పాల్సిన డైలాగ్ మరిచిపోయారు. తోటి నటీనటులందరి వంకా వెర్రిచూపులు చూస్తూ నిలబడిపోయారు. ఆయన మొహంలో రకరకాల భావాలు ఒకేసారి కనిపించాయి. డైలాగ్ గుర్తు తెచ్చుకోవడానికి రకరకాల వింత చేష్టలు చేశారు. ఇదంతా చూస్తున్న ప్రేక్షకులు మాత్రం ఆది కూడా నటనలో భాగమే అనుకుని ఆనందపడిపోయారు. పగలబడి నవ్వారు. చివరికి గండం గట్టెక్కిందనుకోండి. సాక్షి రంగారావు గారిని మీసం చేసిన మోసం కథ ఆది.   

Vol. No. 02 Pub. No. 042

Thursday, October 21, 2010

పరామర్శ

సంజీవదేవ్ ప్రముఖ చిత్రకారుడు. ఒకసారి ఆయనింట్లో దొంగలు పడ్డారు. నగలూ, నట్రా పోయాయి. ఈ విషయం ఆయన మిత్రుడైన రచయిత చలం గారికి తెలిసింది. సంజీవదేవ్ గారిని పరామర్శిస్తూ ఆయన ఓ ఉత్తరం రాసారు.

' దొంగలు పడ్డారని తెలిసింది. చారుదత్తుడిలాగ మీరు ఆ దొంగలు వేసిన కన్నం దగ్గర కూర్చుని వారి హస్త లాఘవాన్ని మెచ్చుకోవడం లేదు కదా ! 

  ఏమేం పోయాయి ? నగా నట్రా అయితే ఫర్వాలేదు. కానీ మీ దగ్గరున్న పుస్తకాలు, ఉత్తరాలు, చిత్రాలు భద్రంగా వున్నాయి కదా ! ఎందుకంటే అవి అన్నిటికంటే విలువైనవి కదా !  '

........... ఇలా సాగింది ఆ పరామర్శ.

నిజమే కదా ! నగలూ, నగదూ అయితే మళ్ళీ సంపాదించుకోవచ్చు. కానీ విజ్ఞాన బాంఢాగారాలైన పుస్తకాలు వగైరా పోతే మళ్ళీ సంపాదించుకోవడం సులువు కాదు కదా ! అయినా వాటికంటే నగలూ, నట్రా విలువైనవి అంటారా ?

Vol. No. 02 Pub. No. 041

Tuesday, October 19, 2010

కీర్తి కండూతి



అనంతమైన కీర్తి సంపాదించాలని, తమ పేరు దశదిశలా మార్మోగిపోవాలని, ఆ కీర్తి ఆ చంద్ర తారార్కం నిలిచివుండాలని ఎవరికుండదు చెప్పండి ? అందుకే అందరూ ఆ కీర్తి కోసం తహతహలాడిపోతారు.

కొందరు ఈ విషయాన్ని నేరుగా వప్పుకోరు. ' అబ్బే ! నాకలాంటి కొరికలేమీ లేవండీ ! ఏదో నా జీవనం సాఫీగా గడిస్తే చాలు. మా పిల్లలు చక్కగా స్థిర పడితే అంతకంటే కావాల్సిందేముంటుంది. శేష జీవితాన్ని కృష్ణా, రామా అంటూ గడిపేస్తాను ' అంటూంటారు. వాళ్ళనే మీ గొప్పతనానికి మెచ్చి మీకు సన్మానం చెయ్యాలనుకుంటున్నాం అని చెప్పండి. ' అబ్బే ! సన్మానం చేయించుకునేంత గొప్పతనం నాలో ఏముంది చెప్పండి. ఏదో నా విధి నేను నిర్వర్తించాను. అంతే కదా ! ' అంటూనే పక్కవాళ్ళతో, ఇంట్లో వాళ్ళతో నాకు సన్మానం చేస్తారట. వద్దన్నా వినడం లేదు అని చెబుతారు. ' పోనీలే ఆయన మొహమాట పడుతున్నాడు. ఈసారికి మరొకరిని వెదుక్కుందాంలే అని మనం అనుకునేలోగా పరోక్షంగా అంగీకారం తెలియజేసేస్తారు. సన్మానమంటే ఎవరికి చేదు చెప్పండి.

ఇంకా కొంతమంది వుంటారు. వాళ్ళకి ఇలాంటి సన్మానాలు, ప్రచారాలు చేయించుకోవాలని కోరిక బలంగా వుంటుంది. కానీ ఎవరిని, ఎలా అడగాలో తెలీదు. తెలిసినా అడిగితే వాళ్ళు ఏమనుకుంటారోనని సంకోచం. ఎవరి వల్లనైనా తమకు ప్రచారం వస్తుందని అనిపిస్తే వాళ్ళ చుట్టూ తిరుగుతూ వుంటారు, ఎప్పటికైనా గుర్తించి తమకు సన్మానమో, మరోటో చేసి ప్రచారం కల్పిస్తారనే ఆశతో

మరికొంతమంది వుంటారు. తమకు ప్రచారం కావాలనుకోండి. మీడియా వాళ్ళను పిలిచి ఏదో ఒక విషయం మీద మాట్లాడేస్తుంటారు. ఈ మధ్య మీడియాలో వచ్చిన పోటీ ధోరణి వీళ్ళకు మరింత ఆలంబన. ఒకవేళ వాళ్ళు రారేమోననిపిస్తే ఏ స్టార్ హోటల్ లోనో విందు కార్యక్రమం, ఇతర ఆకర్షణలు ఏర్పాటు చేసి రప్పిస్తారు. మరి తిన్న విశ్వాసం చూపించాలి కదా అందుకే మర్నాడు మీడియాలో ఈయన మాటలు వచ్చేస్తాయి. అవి మామూలుగా వుంటే జనం ఒకసారి చూస్తారు. వివాదాస్పదంగా వుంటే ఇంక చెప్పనక్కర్లేదు. మరో కొన్ని రోజులు మీడియాకు విందు. ఈయనకు పసందు. దీనివలన కలిసొచ్చేది ఏమిటయ్యా అంటే పైకి కారణాలేమి చెప్పినా ఈయనకు అదో తృప్తి

వీళ్లలోనే మరో రకం. మీడియాను పోగెయ్యలేకపోయినా చుట్టూ పదిమందిని పోగేసి అక్కడ లేని వాళ్ళ గురించో, ప్రపంచ రాజకీయాల గురించో, చరిత్రలో లేని చారిత్రాత్మక విషయాల గురించో..... ఏదో విషయం గురించి మాట్లాడేస్తూ వుంటారు . ఆ విన్న వాళ్ళంతా ' అబ్బో మీకెన్ని విషయాలు తెలుసండీ ! ' అంటూ ఆశ్చర్యపోతుంటే... అబ్బో ..... ఆ సంతృప్తే వేరు

కీర్తి కండూతికి ఎన్నో అవతారాలు. అందులో మరో అవతారం అంటే మరో రకం వున్నారు. వీళ్ళు తమను తాము గొప్పవాళ్ళుగా వూహించేసుకుని చుట్టూ వున్నవాళ్లు ఆథములని వాళ్ళను వుద్ధరించడానికే తాము అవతరించామని చెప్పుకుంటూ సంతృప్తి చెందుతూ వుంటారు. వంగి వంగి దణ్ణాలు పెట్టే వాళ్ళకు వందలు వందలు సమర్పించుకుంటారు.  వళ్లు వంచి పనిచేసే వాళ్ళను తమకు దణ్ణం పెట్టలేదనే కారణంతోనో, మరో కారణంతోనో దూరం చేసుకుంటారు. తమకు బాజా వాయించేవాళ్ళకు పంచభక్ష్య పరమాన్నాలు..... కష్టసుఖాలన్నిటిలో తోడునీడగా నిలిచే కుటుంబసభ్యులకు పచ్చడి మెతుకులు. బయిట అందరూ నా గొప్పతనానికి అడుగడుగునా మెచ్చుకుంటున్నారు, ఇంట్లో మాత్రం వీసమెత్తు విలువలేదు.....ఇదీ వారి ఫిర్యాదు. బయిట వాళ్లయితే తమ స్వార్థం కోసం తప్పనిసరై మెచ్చుకుంటారని,  ఇంట్లో వాళ్ళకు అడుగడుగునా మెచ్చుకునే అవసరం లేదని, వాళ్ళకు వీరి పట్ల బాధ్యత వుంటుందే కానీ స్వార్థం కాదనీ  అర్థం కాదు. అర్థం అయినా అది ఒప్పుకునేందుకు అహం అడ్డొస్తుంది. ఎందుకంటే పొగడ్తలనే భ్రమలో బతికేస్తుంటారు కదా !

 ఈ కీర్తి కండూతి మహా చెడ్డది. దీనిలో పీకలదాకా మునిగిపోయిన వాళ్ళు స్వజనాన్ని దూరం చేసుకుంటారు. ఉన్నదంతా ఊడ్చుకుపోయాక పరజనం దూరం అయిపోతారు. నిజానికి అందరిలోనూ ఈ కీర్తి కండూతి అంతో ఇంతో అంతర్లీనంగా వుంటుంది. కాకపోతే కొంతమంది బయిట పడతారు. కొంతమంది గుంభనంగా వుంటారు. ఎవరైనా తమ స్వార్థంకోసమో, నిస్వార్థంగానో  మనల్ని పొగడ్తలతో ముంచెత్తినపుడు వివేకం వుపయోగిస్తే సమస్య వుండదు. 

ఏమైనా ఈ కీర్తి కండూతిని తగిన మోతాదులో వాడాలి.  శృతి మించితే వికటించి కళ్ళు మూసుకుపోతాయి.... చెవులు వినిపించవు.... బుద్ధి పనిచేయదు.... విచక్షణ నశిస్తుంది. ఆలోపతీ మందుల కంటే సైడ్ ఎఫ్ఫెక్ట్స్ చాలా వుంటాయి. అన్నీ ఉడిగాక... సర్వం హరించుకు పోయాక జ్ణానోదయం అయినా ప్రయోజనం లేదు. బెల్లంకోసం వచ్చిన ఈగలు అది ఖాళీ అవగానే ఎగిరిపోతాయి. తమని సదా అంటిపెట్టుకుని మంచిచెడ్డల్లో అండగా నిలిచే తన మనుష్యులు దూరం అవుతారు. చివరికి ఒంటరిగా మిగిలిపోతారు. మనుష్యుల నైజమే అంత అనుకోండి. తమకందుబాటులో వున్నదాన్ని నిర్లక్ష్యం చేస్తారు. అంతరిక్షంలో వున్నవాటికోసం అర్రులు చాస్తారు. 

మనలోని గొప్పతనం వల్లో, మన ప్రవర్తన వల్లో, మన మంచితనం వల్లో కీర్తి దానంతట అది రావడం ఎంత మంచిదో..... కీర్తిని బలవంతంగా తెచ్చుకోవాలనుకోవడం, కొనుక్కోవాలనుకోవడం అంత చెడ్డది. 

కీర్తి హానికరం కాదు. కీర్తి కండూతి మాత్రం అత్యంత ప్రమాదకరమైనది. కీర్తికోసం కాక ఒక ప్రయోజనం కోసం కృషి చేస్తే...  వస్తే దానంతట ఆదే వస్తుంది. లేకపోతే ఆత్మ సంతృప్తైనా మిగులుతుంది. కేవలం కీర్తికోసం మాత్రమే కృషి చేస్తే చివరకు అది అపకీర్తినే మిగులుస్తుంది. 

మనవి : ఈ వ్యాసంతో బాటు మానవ జీవితాల్లో కనిపించే ఇలాంటి విషయాల గురించి నా అనుభవంలో నాకు కలిగిన భావాలకి అక్షర రూపం తేవాలనే వుద్దేశ్యంతో రాయడం ప్రారంభించాను. మనసులో మెదిలినపుడు కొన్ని విషయాలని రాసి పెట్టుకున్నాను.  అయితే వాటికి మెరుగులు దిద్ది పూర్తి చేసి ప్రచురించడం ప్రారంభిద్దామనుకునే లోగా మా ఇంటర్నెట్ కనెక్షన్ లో గత నెల 24 వ తేదీ నుంచి సమస్య వచ్చింది. బి‌.ఎస్‌.ఎన్‌.ఎల్. వారితో ఒక రకంగా యుద్ధం చేశాక, జి‌ఎం వరకూ వెళ్ళాక విజయదశమికి ముందురోజు అంటే సుమారు 20 రోజుల తర్వాత  పూర్తి పరిష్కారం దొరికి మామూలుగా పనిచేస్తోంది. 

ఈలోపు అనుకోకుండా ఇదే కీర్తి అనే విషయం మీద ప్రముఖ రచయిత శ్రీయుతులు గొల్లపూడి మారుతీరావు గారు అంతర్జాల పత్రిక కౌముది లో అక్టోబర్ 11 వతేదీన ఓ ఆడియో సహిత వ్యాసం ప్రచురించారు. అద్భుతమైన ఉదాహరణలతో వున్న ఆ మహానుభావుడి వ్యాసం ఇక్కడ చదవండి. గొల్లపూడి గారికి, కౌముది వారికి కృతజ్ణతలతో......   

Vol. No. 02 Pub. No. 040

Monday, October 18, 2010

ఇది మౌనగీతం....

 కనుక్కోండి చూద్దాం - 28

ఒక ప్రముఖ గాయని తెలుగులో పాడిన తొలి పాట ఇది.
1 .  ఆ గాయని ఎవరు ?
2 . ఆ చిత్రం పేరేమిటి ?
3 . ఈ పాట రచయిత, సంగీత దర్శకులు ఎవరు ?



 Vol. No. 02 Pub. No. 039