మునిమాణిక్యం నరసింహారావు గారి పేరు తెలియని సాహితీ ప్రియులుండరేమో ! గిలిగింతలు పెట్టే ' కాంతం కథలు ' ఒక్కటి చాలు ఆయన్ని హాస్య రచయితగా తెలుగువారి మదిలో నిలపడానికి.
ఆయన మచిలీపట్టణం లోని హిందూ హైస్కూల్లో పనిచేశారు. అప్పట్లో ఆయనకో వింత అలవాటుండేది. తరచూ గోళ్ళు కొరుక్కునేవారు. పాఠం చెప్పే సమయంలో కూడా ఆ అలవాటు కొనసాగేది.
ఓసారి ఆయన ' ఆర్యులు - నాగరికత ' పాఠం చెబుతున్నారు. ఆయన పాఠంతో బాటు గోళ్ళు కొరకడం కూడా సాగుతోంది. మధ్య మధ్యలో విద్యార్థుల్ని ప్రశ్నలడుగుతున్నారు.
" ఆర్యుల ముఖ్య ఆహారం ఏమిటి ? " అని ఒక విద్యార్థిని లేపి అడిగారు.
" గోధుమలు, సజ్జలు, వరి ....... " అని నసుగుతున్నాడు ఆ విద్యార్థి. మునిమాణిక్యం గారు తన పని కానిస్తూనే ఆ విద్యార్థితో
" ఇంకా... " అన్నారు.
" రాగులు, జొన్నలు....." అని ఆగాడు, మేస్టారు ఇంకా ఏం చెప్పారా అని ఆలోచిస్తూ. మాస్టారు అతన్ని మరింత ఉత్సాహపరచాలని
" ఇంకా.... ఇంకా ....." అంటూనే వున్నారు గోళ్ళు కొరుక్కునే కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే.
ఇంకా ఏమున్నాయా అని తీవ్రంగా ఆలోచిస్తున్న ఆ విద్యార్థి పరధ్యానంగా
" గోళ్ళు " అన్నాడు.
.................. అంతే ! మాస్టారితో బాటు పిల్లలంతా ఒకటే నవ్వులు.
స్వాతంత్ర్యోద్యమ కాలంలో దేశంలో ప్రతి ఒక్కరిలోనూ ఆ స్పూర్తి ప్రతిఫలించేది. ఆ ప్రభావం స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత కొంత కాలం వరకూ కొనసాగింది. చిత్ర పరిశ్రమ కూడా దీనికి అతీతం కాదు. స్వాతంత్ర్యానంతరం 1949 లో ఎన్టీ రామారావు గారి తొలి చిత్రం గా వచ్చిన " మనదేశం " చిత్రం విషయంలో జరిగిన ఓ సంఘటన దీనికి తార్కాణం.
ఆ చిత్రంలో ఓ దేశభక్తి గీతం రికార్డింగ్ జరుగుతోంది. పాట పాడుతున్నది, పాడిస్తున్నది గాన గంధర్వుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. అప్పటికే చాలాసార్లు పాడారు. బాగా వస్తున్నట్లు అనిపించడం లేదు. ఘంటసాల గారికి తృప్తి కలగడం లేదు. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. దీన్ని గురించే తీవ్రంగా ఆలోచిస్తూ చుట్టూ చూసారు ఘంటసాల. దూరంగా ఓ పెద్ద మనిషి గాంధీ టోపీ పెట్టుకుని ఎవరితోనో మాట్లాడడం కనబడింది. వెంటనే ఘంటసాల గారు అక్కడి సిబ్బందిని వుద్ద్యేశించి " కాసేపు ఆ టోపీ కావాలి. ఎవరైనా వెళ్లి ఆ పెద్దమనిషిని అడిగి తీసుకొచ్చి పుణ్యం కట్టుకుంటారా ? " అన్నారు. వారిలో ఒకరు వెళ్లి ఆ టోపీ తీసుకొచ్చారు. ఆది తలకి పెట్టుకుని రికార్డింగ్ స్టూడియోలోకి వెళ్ళారు ఘంటసాల గారు. అంతే ! పాట బ్రహ్మండంగా వచ్చింది. స్వరాజ్య స్పూర్తి ఎంత గొప్పదో, అప్పటి తరంలో అణువణువునా ఎలా జీర్ణించుకుపోయిందో నిరూపించిన ఈ సంఘటనకు కారణమైన పాట....... భారత యువకా కదలిరా........... వినండి
Friendship day సందేశానికి జవాబిస్తూ మిత్రులు శ్రీ నూర్ రహమతుల్లా గారు నిన్న నాకో పరీక్ష పెట్టారు. ఆది ........................................... రావుగారూ ధన్యవాదాలు. " విశాల విశ్వంలో నా భారతదేశం ఉన్నతం" అనే పాట (గాయని తెలియదు) గతంలో ఎయిర్ టెల్ వారు హలో ట్యూన్ గా పెట్టారు.ఇప్పుడు ఆ పాట లేదంటున్నారు.అది దొరికే అవకాశం ఉందా ? ............................................................. ఇదీ ఆ పరీక్ష . సుమారు దశాబ్దకాలం క్రితం ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన " మా తెలుగు తల్లి " కేసెట్లో ఈ పాట వున్నట్లు తెలుసు. కానీ ఈ సీడీల యుగంలో మూలన పెట్టేసిన కేసెట్లలో ఎక్కడ వెదకాలి ? మొత్తానికి గాలించి ఆ కేసెట్ పట్టుకున్నాను. దాన్ని డిజిటలైజ్ చెయ్యడం మరో పెద్ద సమస్య. ఎందుకంటే కేసేట్లతో బాటే మ్యూజిక్ ప్లేయర్ ప్రభంజనంతో కేసెట్ ప్లేయర్ కూడా మూలన పెట్టేశాం. దాని దుమ్ము దులిపి పనిచేయించి ఈ పాట సిస్టం లోకి పంపి మొత్తానికి రహమతుల్లా గారికి అందించాను.
" మా తెలుగు తల్లి " కేసెట్ విడుదలైనపుడు మా పిల్లలు చిన్నవాళ్ళు. ఈ కేసెట్ కొని తెస్తే అదే పనిగా ఆ పాటలు పెట్టుకుని విని అవి నేర్చేసుకుని ఆగష్టు 15 కు స్కూల్లో ఈ పాటలు పాడేసారు. ముఖ్యంగా ' విశాల విశ్వంలో నా భారత దేశం ఉన్నతం ' పాట వాళ్లకు స్కూల్లో ఓ గుర్తింపు తెచ్చింది. ఇదో మధురమైన జ్ఞాపకం, మాకు మాపిల్లలకి. నిన్న ఇది బయిటకు తియ్యగానే అందరం ఓసారి గుర్తుచేసుకున్నాం. ఈ స్వాతంత్ర్యదినోత్సవ సంబరాల మాసంలో మిత్రులు తమ పిల్లలకు కూడా ఈ పాటను పరిచయం చేస్తే బాగుంటుంది.
మిత్రులు రహమతుల్లా గారికి ఆ పాట పంపిన గంటన్నర లోపే నాకు జవాబిచ్చారు, ఆ పాట విని సాహిత్యాన్ని రాస్తూ. ఆ జవాబిదిగో............... ...................................................................... ధన్యవాదాలు రావుగారూ ఇక్బాల్ గారి సారే జహాసే అచ్చాకు ఏమాత్రం తీసిపోకుండా అనువాదం జరిగింది.నిత్యసంతోషిణి గారు బాగా పాడారు.అనువాదకుడి పేరు కూడా తెలిస్తే ఇంకా బాగుండేది.లిరిక్ నేనే విని టైపు చేశాను.మీ బ్లాగులో దీనిని ఉంచగలరు.
విశాల విశ్వంలో నా భారతదేశం ఉన్నతం
సుస్వరాలమూ మేమూ మధుర వీణ నాదేశం దేశం [[విశాల]]
ధృఢమైన పర్వతములతో ఆకాశాన్నందే నగం ఆ నగం మాదే ఆ హిమనగం మాదే మాదే [[విశాల]]
ఏమతమైనా కానీ కలహించడమూ నేర్పదూ భారతీయులం మనమూ భారతదేశం మనదీ అనాదీ [[విశాల]] ................................................... కేసెట్ మీద వున్న ఈ పాట వివరాలు - గానం : నిత్యసంతోషిణి ; రచన : జంగా సత్యదేవ్ శర్మ ; సంగీతం : దుగ్గిరాల
ఈ పాటను వెలికి తీయించిన మిత్రులు నూర్ రహమతుల్లా గారికి కృతజ్ఞతలతో ........ ఆ పాట మీకోసం .........................................
బళ్ళారి రాఘవ - ఆధునికాంధ్ర నాటక రంగం కలకాలం గుర్తుంచుకోవలసిన పేరు.
అప్పటివరకూ పౌరాణిక పద్యనాటకాలలో రాగాలు సాహిత్యాన్ని, ఒక్కోసారి పాత్ర ఔచిత్యాన్ని మింగేస్తూ ఉండేవి. ఆ సమయంలో పద్యాలలో రాగాలకంటే సాహిత్యాన్ని వినబడేటట్లు చెయ్యాల్సిన అవసరాన్ని గుర్తించి అమలులో పెట్టి విజయం సాధించిన వారు బళ్ళారి రాఘవ.
అంతేకాదు. పౌరాణిక నాటకాల హోరులో కొట్టుకుపోతున్న తెలుగు నాటక రంగాన్ని సాంఘిక నాటకాలవైపు మళ్ళించడానికి ఎనలేని కృషి చేశారు రాఘవ. సమకాలీన సమస్యలను ప్రతిబించే నాటకాలు రావాలని కోరుకుని ఎన్నో సాంఘిక నాటకాల్ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు.
అనంతపురం జిల్లా తాడిపత్రిలో 1880 ఆగష్టు 2 వ తేదీన నరసింహాచార్యులు, శేషమ్మ దంపతులకు జన్మించారు రాఘవ. మద్రాసు లా కళాశాల నుండి న్యాయవాద పట్టా పొంది మద్రాసులో న్యాయవాద వృత్తి చేపట్టి ప్రఖ్యాతి పొందారు. ఆ రంగంలో ఆయన ఘనతను గుర్తించి అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నియమించి ' రావు బహద్దూర్ ' బిరుదుతో సత్కరించింది.
న్యాయవాదం ఆయన వృత్తి అయితే నాటకం ఆయన ప్రవృత్తి. పన్నెండవ ఏటనే రంగస్థలం ఎక్కిన రాఘవ బళ్లారిలో షేక్స్పియర్ క్లబ్ స్థాపించి ఆయన నాటకాలు ప్రదర్శించేవారు. తర్వాత బెంగళూర్ లోని కోలాచలం శ్రీనివాసరావు బృందంతో కలసి చాలా నాటకాల్లో ముఖ్య పాత్రలు ధరించారు. తెలుగు నాటకాన్ని విశ్వవ్యాప్తం చేసిన కళాతపస్వి బళ్ళారి రాఘవ. మహాత్మాగాంధీ, రవీంద్రనాథ్ టాగోర్ లాంటి ప్రముఖుల ప్రశంసలు పొందిన మహానటుడు బళ్ళారి రాఘవ.
1936 లో ' ద్రౌపదీ మానసంరక్షణ ' లో దుర్యోధనుడి పాత్రతో చలనచిత్ర రంగ ప్రవేశం చేసినా ఎక్కువ కాలం అక్కడ ఇమడలేకపోయారు.
హరిశ్చంద్ర, ప్రహ్లాద, పాదుకాపట్టాభిషేకం, సావిత్రి, రామదాసు, తప్పెవరిది, సరిపడని సంగతులు మొదలైన పౌరాణిక, సాంఘిక నాటకాలలో ప్రధాన పాత్రలు పోషించారు.
బందా కనకలింగేశ్వరరావు, బసవరాజు అప్పారావు, కొమ్మూరి పద్మావతి, కొప్పరపు సరోజినీ లాంటి శిష్యులెందరినో తయారు చేశారు. ఆయన సంస్మరణార్థం నాటక రంగంలో విశిష్ట సేవలందించిన ప్రముఖులకు ' బళ్ళారి రాఘవ పురస్కారం ' ఏర్పాటు చెయ్యబడింది.
తెలుగు నాటక రంగానికి జీవితాంతం విశిష్టమైన సేవలందించిన ఆ మహానటుడి జయంతి సందర్భంగా ఆయన నటించిన ' భక్తప్రహ్లాద ' నాటకం రికార్డులను టాలీ నేషన్ - స్వర నీరాజనంద్వారా వినండి.