రాజకీయ చైతన్యం పుష్కలంగా వున్న నటుడు జగ్గయ్య 1962 లో ' పదండి ముందుకు ' అనే చిత్రాన్ని నిర్మించారు.
ఆ చిత్రానికి ఆయనే సంభాషణలు సమకూర్చగా విక్టరీ మధుసూదనరావు దర్శకత్వం వహించారు. స్వాతంత్ర్య సమరం, గాంధీ మహాత్ముని సత్యాగ్రహాలు, భగత్ సింగ్ లాంటి వీరుల త్యాగాలు ఈ చిత్ర నిర్మాణానికి ప్రేరణ.
అప్పటి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి చేతుల మీదుగా మన రాష్ట్రంలోనే తొలిసారి సబ్సిడీ అందుకున్న చిత్రంగా ' పదండి ముందుకు ' ను చెబుతారు.
ఈ చిత్రం ఆర్థికంగా విజయం సాధించకపోయినా జగ్గయ్య కృంగిపోలేదు.
" నా మనస్సు వ్యాపారపరమైంది కాదు. సాంఘిక బాధ్యతలెరిగిన వ్యక్తిని. రాజకీయవాదిగా నాకో ఇమేజ్ వుంది. ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా చిత్ర నిర్మాణంలో రాజీ పడడానికి నా మనసొప్పదు " అనేవారాయన.
హీరో కృష్ణ తొలిసారి తెర మీద కనిపించిన చిత్రం కూడా ఇదే !
పదండి ముందుకు చిత్రంలో మహాకవి శ్రీశ్రీ రాసిన దేశభక్తిని ప్రభోదించే టైటిల్ పాటను ఘంటసాల వెంకటేశ్వరరావు , బి. వసంత ఆలపించగా ఎస్.పి. కోదందపాణి స్వరపరిచారు. ఆ పాట అందరి కోసం........
రిచర్డ్ అటెన్ బరో నిర్మించిన ' గాంధీ ' చిత్రం అద్భుతమైన చిత్రీకరణతో ప్రపంచ ప్రేక్షకుల్ని అలరించింది.
ఆ మహాత్ముని అంతిమ యాత్ర దృశ్యాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ చిత్రీకరణలో ప్రజలందరూ విరివిగా పాల్గొనవలసినదిగా విజ్ఞప్తి చేస్తూ రేడియోల్లోనూ, టీవీల్లోనూ, పత్రికలలోనూ, ఇంకా చాలా విధాలుగా ప్రకటించారు .
కానీ ఎంత ప్రయత్నించినా పదిహేనువేలమంది దాటలేదు. వాళ్ళలో కూడా చాలామంది ఆధునిక దుస్తులు ధరించి వచ్చారు. ఆ కాలానికి తగ్గట్లు వాళ్ళ ఆహార్యం మార్చడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. అయినా అటెన్ బరో కి తృప్తి కలుగలేదు.
మిలిటరీ దళాలనుంచి సుమారు 1700 మందిని, BSF జవానుల్ని, డిల్లీ పోలీసుల్ని కూడా రప్పించినా ఆయనకు ఇంకా తృప్తి కలుగలేదు. ఏం చెయ్యాలో అర్థం కాలేదు.
చివరికి అటెన్ బరో కూడా తనే వేషం వేసుకుని ఆ జనాల్లో ఒకడుగా నిలబడ్డాక తృప్తి కలిగింది. అంతిమయాత్ర సీను అద్భుతంగా వచ్చింది.
1938 లో వచ్చిన ' మాలపిల్ల ' చిత్రంలో పి. సూరిబాబు పాడిన బసవరాజు అప్పారావు గారి గీతం ' కొల్లాయి గట్టితేనేమి....' బి. నరసింహారావు గారి స్వరకల్పనలో ..................
ఒక జాతి లేదా దేశం యొక్క అస్తిత్వానికి చిహ్నం ' జెండా ' భారత జాతి ప్రపంచంలో గర్వంగా చెప్పుకునే చిహ్నం మన మువ్వన్నెల జెండా ఈ జెండా రూపకల్పనా ప్రస్థానాన్ని ఓసారి పరిశీలిద్దాం...........
* తొలిసారిగా 1904 లో భారత జాతికి ఒక ప్రత్యేకమైన చిహ్నం ఉండాలనే ఉద్దేశ్యంతో సిస్టర్ నివేదిత ఒక పతాకాన్ని రూపొందించారు. మొదట ఆది ఎరుపు, నలుపు రంగుల్లో ఉండేది. అయితే తర్వాత ఆమె తన విద్యార్థుల సలహాతో కాషాయం, పసుపు రంగుల్లోకి మార్చారు. 1906 లో కలకత్తాలో జరిగిన కాంగ్రెస్ మహాసభల్లో ఈ జెండా ఎగురవేశారు.
* 1905 లో బ్రిటిష్ ప్రభుత్వం బెంగాల్ ను విభజించింది. ఆ విభజనను వ్యతిరేకిస్తూ పెద్ద ఉద్యమం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో బెంగాల్ కే చెందిన సచ్చీంద్రప్రసాద్ బోస్, సుకుమార్ లు మొదటిసారి త్రివర్ణ పతాకం రూపొందించారు. హిందూ ముస్లిం సమైక్యతను ప్రతిఫలించే విధంగా ఆ జెండా రూపుదిద్దుకుంది.
* తర్వాత కొన్నాళ్ళకి హోం రూల్ ఉద్యమం ప్రారంభమైంది. దానికి అనీబిసెంట్, బాలగంగాధర తిలక్ లు నాయకత్వం వహించారు. అప్పుడు ఐదు రంగులతో మరో జెండా రూపుదిద్దుకుంది.
* మహాత్మాగాంధీ ప్రభావానికి ఉత్తేజితుడైన పింగళి వెంకయ్య గారు మొదట ఒక జెండా నమూనా తయారుచేసారు. తర్వాత దానికి మధ్యలో చరఖాను కలిపారు. అయితే కాంగ్రెస్ కమిటీ ఈ నమూనా నచ్చలేదు.
అప్పుడు గాంధీగారి సలహాతో వెంకయ్య గారు తయారు చేసిన మరో జెండా అందరి ఆమోదం పొంది 1921 లో అహమ్మదాబాద్ లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ మహాసభలో ఎగిరింది. ఆ జెండా దేశమంతా స్వాతంత్ర్య స్పూర్తిని రగిలించింది. ఎరుపు, తెలుపు, ఆకుపచ్చ రంగులతో మధ్యలో చరఖాతో ఆ జెండా ఉండేది.
* తెలుగు తేజం పింగళి వెంకయ్య గారు రూపొందించిన ఆ మువ్వన్నెల జెండా స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారతదేశ చిహ్నంగా గుర్తించబడి కొన్ని మార్పులతో ఆమోదించబడింది. కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులతో బాటు మధ్యలో చరఖా బదులుగా అశోక చక్రం ఉంచబడింది. అప్పటినుంచి ఇప్పటివరకూ ప్రపంచ పటంలో భారతదేశ పతాకం రెపరెపలాడుతోంది.
1952 లో వచ్చిన ' జ్యోతి ' చిత్రంలో జి. వరలక్ష్మి గానం చేసిన గురజాడ అప్పారావు గారి దేశభక్తి గేయం వినండి.
Friendship day సందేశానికి జవాబిస్తూ మిత్రులు శ్రీ నూర్ రహమతుల్లా గారు నిన్న నాకో పరీక్ష పెట్టారు. ఆది ........................................... రావుగారూ ధన్యవాదాలు. " విశాల విశ్వంలో నా భారతదేశం ఉన్నతం" అనే పాట (గాయని తెలియదు) గతంలో ఎయిర్ టెల్ వారు హలో ట్యూన్ గా పెట్టారు.ఇప్పుడు ఆ పాట లేదంటున్నారు.అది దొరికే అవకాశం ఉందా ? ............................................................. ఇదీ ఆ పరీక్ష . సుమారు దశాబ్దకాలం క్రితం ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన " మా తెలుగు తల్లి " కేసెట్లో ఈ పాట వున్నట్లు తెలుసు. కానీ ఈ సీడీల యుగంలో మూలన పెట్టేసిన కేసెట్లలో ఎక్కడ వెదకాలి ? మొత్తానికి గాలించి ఆ కేసెట్ పట్టుకున్నాను. దాన్ని డిజిటలైజ్ చెయ్యడం మరో పెద్ద సమస్య. ఎందుకంటే కేసేట్లతో బాటే మ్యూజిక్ ప్లేయర్ ప్రభంజనంతో కేసెట్ ప్లేయర్ కూడా మూలన పెట్టేశాం. దాని దుమ్ము దులిపి పనిచేయించి ఈ పాట సిస్టం లోకి పంపి మొత్తానికి రహమతుల్లా గారికి అందించాను.
" మా తెలుగు తల్లి " కేసెట్ విడుదలైనపుడు మా పిల్లలు చిన్నవాళ్ళు. ఈ కేసెట్ కొని తెస్తే అదే పనిగా ఆ పాటలు పెట్టుకుని విని అవి నేర్చేసుకుని ఆగష్టు 15 కు స్కూల్లో ఈ పాటలు పాడేసారు. ముఖ్యంగా ' విశాల విశ్వంలో నా భారత దేశం ఉన్నతం ' పాట వాళ్లకు స్కూల్లో ఓ గుర్తింపు తెచ్చింది. ఇదో మధురమైన జ్ఞాపకం, మాకు మాపిల్లలకి. నిన్న ఇది బయిటకు తియ్యగానే అందరం ఓసారి గుర్తుచేసుకున్నాం. ఈ స్వాతంత్ర్యదినోత్సవ సంబరాల మాసంలో మిత్రులు తమ పిల్లలకు కూడా ఈ పాటను పరిచయం చేస్తే బాగుంటుంది.
మిత్రులు రహమతుల్లా గారికి ఆ పాట పంపిన గంటన్నర లోపే నాకు జవాబిచ్చారు, ఆ పాట విని సాహిత్యాన్ని రాస్తూ. ఆ జవాబిదిగో............... ...................................................................... ధన్యవాదాలు రావుగారూ ఇక్బాల్ గారి సారే జహాసే అచ్చాకు ఏమాత్రం తీసిపోకుండా అనువాదం జరిగింది.నిత్యసంతోషిణి గారు బాగా పాడారు.అనువాదకుడి పేరు కూడా తెలిస్తే ఇంకా బాగుండేది.లిరిక్ నేనే విని టైపు చేశాను.మీ బ్లాగులో దీనిని ఉంచగలరు.
విశాల విశ్వంలో నా భారతదేశం ఉన్నతం
సుస్వరాలమూ మేమూ మధుర వీణ నాదేశం దేశం [[విశాల]]
ధృఢమైన పర్వతములతో ఆకాశాన్నందే నగం ఆ నగం మాదే ఆ హిమనగం మాదే మాదే [[విశాల]]
ఏమతమైనా కానీ కలహించడమూ నేర్పదూ భారతీయులం మనమూ భారతదేశం మనదీ అనాదీ [[విశాల]] ................................................... కేసెట్ మీద వున్న ఈ పాట వివరాలు - గానం : నిత్యసంతోషిణి ; రచన : జంగా సత్యదేవ్ శర్మ ; సంగీతం : దుగ్గిరాల
ఈ పాటను వెలికి తీయించిన మిత్రులు నూర్ రహమతుల్లా గారికి కృతజ్ఞతలతో ........ ఆ పాట మీకోసం .........................................