Thursday, November 25, 2010

విషాదంలోనూ వినోదమే !


విషాదంలోనుంచి వినోదం సృష్టించడంలో ప్రపంచ ఖ్యాతి గడించిన కళాకారుడు చార్లీ చాప్లిన్. ఆ ఒరవడిని అంది పుచ్చుకున్న తెలుగు నటుడు రేలంగి వెంకట్రామయ్య. తెలుగు చిత్రరంగంలో హాస్యనటులకు సుస్థిర స్థానం కల్పించిన నటుడు రేలంగి. ఆయన తెరమీద నవ్వినా, ఏడ్చినా ప్రేక్షకులకు వచ్చేవి కన్నీళ్లు కాదు.....నవ్వులే ! తెర మీద కనిపించినపుడే కాదు నిజజీవితంలో కూడా ఆయన ఎక్కడ కనిపించినా జనం నవ్వేవారు.


ఆయన
కారు దిగితే నవ్వు....
నడిస్తే నవ్వు......
ఆగితే నవ్వు.....
మాట్లాడబోతే నవ్వు.....
మాట్లాడకపోతే నవ్వు......
ఏం చేసినా నవ్వే ! ఏం చెయ్యకపోయినా నవ్వే !
................అలా సాగింది ఆయన నవ్వుల ప్రవాహం

1955 లో హైదరాబాద్ లో జరిగిన ఆంధ్ర నాటక కళా పరిషత్ లో ప్రముఖ నాటుడు స్థానం నరసింహారావు గారి  చేతుల మీదుగా రేలంగి వెంకట్రామయ్య గారికి ఘన సన్మానం జరిగింది. ఆ సన్మానానికి రేలంగికి నోట మాట రాలేదు. గొంతు పూడుకుపోయింది. కళ్ళ వెంట ధారాపాతంగా కన్నీళ్లు. ఆది చూసి ప్రేక్షకుల నవ్వులు.
అప్పుడు చూడండి రేలంగి గారి పరిస్థితి. ఎలాగో గుండె దిటువు చేసుకుని నేను నిజంగానే ఏడుస్తున్నానని ప్రకటించారు. ఆయన పరిస్థితి అర్థమైన కొంతసేపటికి ప్రేక్షకుల నవ్వులు ఆగాయి.
స్థానం వారు " ఎందుకు బాబూ నీకీ కన్నీళ్లు ? " అని అడిగారు.
గద్గద స్వరంతో రేలంగి గారు " గతంలో నాటకాల్లో వేషం వెయ్యాలని కోరికతో మీదగ్గరకొచ్చి అడిగాను. నువ్వు నాటకాలేం వేస్తావు పొమ్మన్నారు. ఈరోజు మీ చేతుల మీదుగా సన్మానం అందుకోవడం నిజంగా ఆ ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నాను. అందుకే ఈ ఆనంద భాష్పాలు " అన్నారు. సభంతా గంభీర వాతావరణం నిండిపోయింది.
వినోదంలో ఎంత ఆనందాన్ని పంచగలడో విషాదంలో అంత అనుభూతిని పంచగల సమర్థుడు రేలంగి వెంకట్రామయ్య. హరికథకుడిగా, హార్మోనియం వాయిద్యకారుడిగా, రంగస్థల నటుడిగా ప్రారంభమైన రేలంగి 1935 లో శ్రీ కృష్ణ తులాభారం చిత్రంతో మలుపు తిరిగింది. హాస్యనటుడిగానే కాక గాయకుడిగా కూడా కొన్ని పాటలు పాడారు.

తెలుగు చిత్రాల్లో హాస్యానికి రాచబాట వేసిన రేలంగి వర్థంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తూ................



Vol. No. 02 Pub. No.

Thursday, November 11, 2010

జారిపోయిన జంట కవిత్వం

తెలుగు సాహితీ సంపద పెరుగుదలకు ఎందఱో సాహితీవేత్తలు, కవులు తమ వంతు కృషి చేశారు. వారిలో కొంతమంది జంట కవులు కూడా వున్నారు. వారిలో కొప్పరపు కవులు, తిరుపతివెంకట కవులు.... ఇలా ఎన్నో జంటలు విడివిడిగానే కాక జంటకవులుగా ప్రసిద్ధులు.


ఒకసారి ప్రముఖ కవులు దీపాల పిచ్చయ్యశాస్త్రి గారు, గుర్రం జాషువా గారు కలసి జంటగా కవిత్వం చెప్పాలని సంకల్పించారు. ఇతర జంట కవుల్లాగే తమ పేర్లు కలసివచ్చేలాగా తమ జంటకు ఒక పేరు పెట్టుకోవాలని ఆలోచించారు. ఎంత ఆలోచించినా వీరికి తమ పేర్లలోనుంచి సరిపోయే పేరు దొరకలేదు. ఏ రకంగా చూసినా పిచ్చి జాషువా అనో , జాషువా పిచ్చి అనో, దీపాల గుర్రం అనో ...... ఇలా ఏదో పెట్టుకోవాల్సి వస్తోంది. ఎంత కసరత్తు చేసినా తమ పేర్లతో కుదిరే కుదురైన అందమైన పేరు దోరక్క చివరికి జంటగా కవిత్వాన్ని చెప్పే ఆలోచనే విరమించుకున్నారట. దాంతో మరో కవుల జంట తెలుగు సాహిత్యం చేజారిపోయింది.  


Vol. No. 02 Pub. No. 054

Wednesday, November 10, 2010

అయిదుగురు ముఖ్యమంత్రులు - జవాబులు

 కనుక్కోండి చూద్దాం..... 31 - జవాబులు 

ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పడానికి పోటీ పడ్డ అందరికీ ధన్యవాదాలు. ఆ. సౌమ్య గారు కొంచెం ఆలోచిస్తే చెప్పగలిగేవారేనేమో ! Wit Real గారు చాలావరకూ సరిగానే చెప్పారు గానీ సంస్థ పేరు విషయంలో చాలా ఛాయస్ తీసుకున్నారు. వీరుభోట్ల వెంకట గణేష్ గారు అన్నీ సరిగానే చెప్పడమే కాకుండా మంచి వివరణ ఇచ్చారు. కొత్తపాళీ గారు సంస్థని సరిగానే ఊహించినా ఎందుకో పేర్లు విషయంలో కొంచెం ఆలోచించినట్లున్నారు. మలక్పేట రౌడి గారు అన్నీ సరిగానే చెప్పారు. అజ్ఞాత గారు చెప్పిన జానకి రామచంద్రన్ గారు ఒకప్పుడు నటి అయినా ఎక్కువ చిత్రాలు చెయ్యలేదు. AVM చిత్రాల్లో చేసిన దాఖలాలు లేవు. మిత్రులేవరిదగ్గరైనా దీనికి సంబంధించిన సమాచారం వుంటే తెలియజెయ్యగలరు.


దక్షిణ భారత దేశంలోని ఒక ప్రముఖ చిత్ర నిర్మాణసంస్థలో 
వివిధ విభాగాలలో అయిదుగురు ముఖ్యమంత్రులు పనిచేశారు.

అ.) ఆ సంస్థ పేరేమిటి ?          

జవాబు : AVM ప్రొడక్షన్స్    


ఆ.) ఆ అయిదుగురు ముఖ్యమంత్రులు ఎవరు?  
జవాబు : 1 . నందమూరి తారక రామారావు  - సంఘం, రాము లాంటి చిత్రాల్లో నటించారు.
            2 . ' ఓర్ ఇరవు ' అనే చిత్రానికి సి. ఎన్. అణ్నాదురై రచయిత 
            3 .  ' పరాశక్తి ' చిత్రానికి ప్రస్తుత ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి రచయిత
            4 . తమిళనాడు మాజీ ముఖ్యమంత్రులు ఎమ్జీఆర్
            5 . జయలలిత చాలా చిత్రాల్లో నటించారు. 

Vol. No. 02 Pub. No. 53a

Tuesday, November 9, 2010

అయిదుగురు ముఖ్యమంత్రులు


 కనుక్కోండి చూద్దాం..... 31 


దక్షిణ భారత దేశంలోని ఒక ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థలో వివిధ విభాగాలలో అయిదుగురు ముఖ్యమంత్రులు పనిచేశారు.

అ.. ఆ సంస్థ పేరేమిటి ?

ఆ. ఆ అయిదుగురు ముఖ్యమంత్రులు ఎవరు ?




Vol. No. 02 Pub. No. 053

Monday, November 8, 2010

సి. యస్. ఆర్. హస్త సాముద్రికం

 తెలుగు చిత్ర రంగంలో కొన్ని పాత్రల గురించి ప్రస్తావన వస్తే కొంతమంది నటులు ప్రత్యేకంగా గుర్తుకువస్తారు. భారతంలోని శకుని పాత్ర పేరు చెబితే మొదటగా గుర్తుకు వచ్చేది చిలకలపూడి సీతారామాంజనేయులు. సి. యస్. ఆర్. గా ప్రసిద్ధుడైన ఈయన రంగస్థలం నుండి చిత్రరంగానికోచ్చిన వారే ! 1930 దశకంలో కథానాయకుడిగా వెలిగిన ఈయన 1950 దశకంలో క్యారెక్టర్ నటుడిగా మారారు. దేవదాసులో పార్వతిని పెళ్ళాడిన జమిందారు పాత్రలో ఆయన నటన ఎవరూ మర్చిపోలేరు. ఆ చిత్ర నిర్మాణ సమయంలో జరిగిన ఓ సంఘటన ఆయన మాటల చమత్కారానికి నిదర్శనం.

దేవదాసు షూటింగ్ విరామ సమయంలో సెట్ బయిట కూర్చున్న సావిత్రితో సి. యస్. ఆర్.
" అమ్మాయీ ! ఏదీ నీ చెయ్యి చూపించు " అన్నారు.

సావిత్రి  తన చెయ్యి చూపించి ఆయన ఏం చెబుతారా అని కుతూహలంగా చూస్తోంది . కాసేపు తదేకంగా ఆ చెయ్యిని పరిశీలించిన సి. యస్. ఆర్.
" నీకు మూడు ముఖ్యమైన విషయాలు చెబుతాను. అవి
ఒకటి నిన్నెవరూ సరిగా అర్థం చేసుకోరు.
రెండు నీ ప్రతిభకు తగ్గ వేషం దొరకడానికి ఇంకా కొంత కాలం పట్టవచ్చు
మూడు నీకు అప్పుడప్పుడూ స్టమక్ ట్రబుల్ వస్తూంటుంది " అన్నారు.

సావిత్రి ఆశ్చర్యపోయి " ఇంత కరెక్ట్ గా ఎలా చెప్పగలిగారు ? " అని అడిగింది.

దానికి సి. యస్. ఆర్. నవ్వుతూ " ఇందులో ఆశ్చర్యపోవడానికేముంది. ఎవరి చెయ్యి చూసినా ఈ మూడు విషయాలు మాత్రం సులువుగా చెప్పెయ్యొచ్చు . ఇవి అందరికీ అన్వయించే విషయాలే ! " అన్నారు. 

Vol. No. 02 Pub. No. 052

Saturday, November 6, 2010

భమిడిపాటి వారి ' దీపావళి '

నిన్న దీపావళి. ఈ దీపావళి పండుగ చిన్నతనంలోని చిలిపి జ్ఞాపకాలను వెలికి తెచ్చింది. అవన్నీ ఒక మాలగా గుదిగుచ్చి అందిద్దామని ప్రయత్నిస్తుండగా గతంలో చదివిన హాస్యబ్రహ్మ భమిడిపాటి కామేశ్వరరావు గారి ' దీపావళి ' వ్యాసం గుర్తుకొచ్చింది. నా అనుభవాలని గుర్తు చేసే ఆ వ్యాసంలోని కొంత బాగం ఇక్కడ అందిస్తున్నాను. గిలిగింతలు పెట్టే ఆ భాగాన్ని అందుకుని ఆస్వాదించండి.








దీపావళిలో ‘ దీపం ‘ వేసి చూడకుండానే కొందరు మాట్టాడతారు. వెనక ఒక రాక్షసుడు చచ్చిపోయాడు గనుక వాడి నిమిత్తం మనం పిండివంటల్తో భోంచెయ్యాలనీ, దీపావళి నాటికి వాన్లు వెనకట్టడం జరుగుతుంది గనుక లోగడ పుట్టిపెరిగిన క్రిమి కీటకాదులు ( నలకలడయోరభేధ: ) సమూలంగా నశించడానికి దేశం అంతా తలంట్లుపోసుగుని బాణాసంచా కాల్చాలనీ, అల్లుళ్ళని పిలవడానికి ఆదే సందర్భంగనుక వాళ్ళ ముఖతేజం ఎక్కువ చేసే నిమిత్తం మతాబాలు కాల్పించాలనీ, మొదలైన పూర్వగాథలకి తడుముకోనూ లేదు. 

దీపావళి కాల్పులికి దరిద్రుడూ, ధనికుడూ వివక్షత లేదు, గానీ పిన్నా పెద్ద వివక్షతా, ఖర్చూ బేఖర్చూ వివక్షతా, కసీ బేకసీ వివక్షతా ఉన్నాయి. పిన్నలకి ఏదో ఇంత తగలేయ్యాలనీ, పెద్దలకి ఖర్చులేకుండా ఉంటే సరి ఇంకా తగలెయ్యమనీ ! దరిద్రుడైనా సరే కసి ఉంటే తల తాకట్టేట్టయినా సరే నరకాసురుణ్ణి దహనం చేస్తాడు. ఇంతవరకింకా దీపావళిలో దీపంసంగతి అప్రధానం అయిందే కానీ, ఆరిపోలేదు. 

ప్రధాన విషయం చప్పుడు ! ఎంత గొప్పచప్పుడు చేస్తే అంతా గొప్ప దీపావళి యోధుడు. దరిద్రుడు కాగితపు టపాకాయను పేల్చడం, ( సంచీ లామడిచి, ఒకవైపు చిల్లు చేసి, గాలి పోరించి, అది పొంగిన తరవాత నేల మీద పెట్టి ఒకటిచ్చుగుంటే ఠప్పుమనేవి ), ఖాళీ డబ్బాలు వాయించడం, డబ్బాలోరాళ్లేసి వేళ్లాడ గట్టి రెండు మూడు రకాల కర్రల్తో బాదడం - తరవాత తాటాకు టపాకాయలు ! ఇవేనా లేకుండా ఎవరూ ? ఇవి క్రమేపీ చౌకఅవడం కద్దు. మేఘదర్శనం అయేసరికి ఇవి కాళ్ళుపారజాచేస్తాయి. మరీ నాసిరకం పేలకపోయినా నాలిక గీసుకోవచ్చని కొందరు కొనడం. ఇవి పెల్తే ఒట్టి పేలుడే ! కానీ ఎడా పెడా ఎడా పెడా వాయించినట్టు పేలే సీమటపాకాయలు. ఎల్లానూ సీమ సీమే ! కొందరికి కసి ఆగక రెండుమూడు సీమటపాకాయల గుత్తులు కిరసనాయలు డబ్బాలోపడేసి అవి చెడామడా క్షోభపడిపోతోంటే ' వెయ్ వెయ్ ' అని కేకలేస్తూ డబ్బాని చావగొట్టడం ! 
గోడటపాకాయలని కూడా వస్తుండేవి  అరుగులమీద పరధ్యానంగా కూచున్న వాళ్ళు ఉలిక్కిపడేటట్లు ఒక్ఖటి గోడనిబాదేసి, దీపావళివీరుడు పరక్షోభగురించి నవ్వుకుంటూ పోతుండేవాడు. అవే నేల్నెట్టి జబ్బనేప్పెట్టేలాగా కొట్టేవాళ్లు కొందరు.వీట్లని మించిపోయినవి ఔట్లు. ఔట్లు పేల్చేవాళ్లు మహాధ్వనికారుల్లో జమ.ఒక దీపావళి రౌతు ఒక ముసలాయనతో చెప్పకుండా ఔటు పేల్చేసరికి ఆయనగుండే ఆగిపోయింది. అది ఆగిపోవడంవల్ల తెలిసింది గాని లేకపోతే ఆయనకి గుండె ఉన్నసంగతి తేలకపోయేదిగదా అన్నాడు ఆ రౌతు. 
వెలుగు గురించిన ఆరాధనలో మతాబాలు సార్థకం అయినా, అవి కాల్చడం అనేదాన్లో పౌరషం లేదు పొమ్మన్నారు. ఎందుకంటే - ప్రతి సందర్భంలోనూ ప్రతీవాళ్లూ మతాబా కాల్చగలరు గనుక ! కాల్చడంలో ఒకచోటనుంచి మరోచోటుదాకా వెళ్ళి ఇతరుల్ని బాధపెట్టే బాపతైన తూటాల వంటి వాట్లకి ఘరానాఎక్కువ. ఎడంచేత్తో అంటించిన తూటా పట్టుగుని ఇటూ అటూ రవ్వలు చిమ్ముతూ, ఒకవేళ చీదినా, అరిచెయ్యి దానిమ్మకాయ పగిలినట్టు పగిలినా, కిక్కురుమనకుండా చివరదాకా నిల్చేవాళ్లూ, 'బాబోయ్ ' అని తోకముడిచేవాళ్లూ ఉండేవాళ్ళు. కానీ, ఎంత ఎత్తుకి వేడితే అంత గొప్పవాడు అనేది దీపావళిలోనూ నిజమే. దీపావళి భటుడి అసలు అస్త్రం జువ్వ.అతడు జువ్వల రంగడు. జువ్వవదలడం కొత్తగా నేర్చుగునేవాళ్ళు తాటాకు చూర్లకీ చుట్టుపక్కజనానికీ భయకారణంగా ఉండేవాళ్లు. ఆరి తేరిన వాళ్ళు అల్లాంటిపన్లు చెయ్యక, ఊరవతలకిపోయి పాతిగముఫ్ఫై గజాల్లో ఎదరేదరగా నుంచుని, జువ్వలు నేలబారుగా వదిలి, పోటీ చేసుగునేవాళ్లు. దెబ్బలు తగిలినవాళ్ళని తక్కిన వాళ్ళు ఇంటికి మోసుకెళ్ళేవాళ్లు. అవీ ఇనీ కొనడంకంటే మనమే కట్టుగుంటే సొమ్ముకిమించిన సరుకొస్తుంది అనేగడుసుదనంతో వ్యవహరించి, యథాశక్తిగా కాళ్ళూ, వేళ్లూ, చేతులూ, చర్మమూ, వొళ్లూ, ఇల్లూ, ప్రాణమూ ధారపోసిన దీపావళి మత భక్తులుంటుంటారు - సంస్థ స్థాపించిన వాళ్ళ ఉద్దేశం ఈభక్తి కాదేమో అనితోస్తుంది. ఏమిటో, చెప్పలేం ! కొంత పిరికి తనం, కొంత దారిద్ర్యం, కొంత ఇతరులకి బాధ గలిగి దెబ్బలాట కోస్తారనే భయం - ఇవన్నీ ఉండడంవల్ల, నేను ఏ మతాబా అగ్గిపుల్లేనా కాల్చి ఉంటాను, గాని ఒకటోరకమైన మతాబాయేనా కాల్చినట్టు జ్ఞాపకంలేదు.
ఇదో రకం : 
" బాణాసంచా అంటే చెవి కోసుగుంటారు. సూర్యాస్తమయాలు చూసి ఆనందించలేరు కొందరుజనం " అంటాడు ఒక కవి.

 


Vol. No. 02 Pub. No. 051

Thursday, November 4, 2010

దిబ్బు దిబ్బు దీపావళి ...........

దిబ్బు దిబ్బు దీపావళి
మళ్ళీ వచ్చే నాగులచవితి
..............


గోగు మొక్కల దివిటీలు
దుష్టశక్తులను తరిమే కమిచీలు
పిల్లలకు అవి రక్షణ కవచాలు 
ఏవీ ఎక్కడా ఆ దివిటీలు ....
ఇక అవి గతకాలపు జ్ఞాపకాలు



మతాబులు.... కాకర పువ్వోత్తులు......
చిచ్చుబుడ్లు..... పటాసులు........
చిన్ని చిన్ని బుడతల కళ్ళల్లో మెరిసే కాంతులు
చెడును పారద్రోలి మంచిని తెచ్చిన నవ్యక్రాంతులు


 కుళ్ళు, కుత్సితాలును పారద్రోలే రోజు
అన్యాయం, అక్రమాలను రూపుమాపే రోజు
స్వార్థం, అధర్మాలను అంతం చేసే రోజు
 దోపిడీలను, దౌర్జన్యాలను అరికట్టే రోజు
మనకి అసలైన దీపావళి ఆ రోజు 





చైతన్య దివిటీలు వెలిగిద్దాం
అజ్ఞానపు చీకట్లు తొలగిద్దాం
దుష్టశక్తులను తరిమికొడదాం !

అందుకే దిబ్బు దిబ్బు దీపావళి ........





Vol. No. 02 Pub. No. 050

Wednesday, November 3, 2010

నరకాసుర సంహారం చేద్దాం !


భూమాత పుత్రుడు నరకాసురుడు
బ్రహ్మ వరం ప్రజలపాలిట శాపమయింది
అహంకారం హద్దులు దాటింది
దుర్మార్గం దుష్టత్వం విజృంభించింది
అన్యాయం అరాచకం ప్రబలింది


ధర్మ సంస్థాపకుడు శ్రీకృష్ణుడు
దుర్మార్గుడైన నరకాసురుడ్ని
సత్యభామా సహితుడై సంహరించాడు
దుర్మార్గానికి స్వ పర భేధం లేదని నిరూపించాడు

అరాచకాలు అంతమైన రోజు
అకృత్యాలకు భరత వాక్యం పలికిన రోజు
నరకాసురవధ జరిగిన రోజు
 ఆరోజే నరక చతుర్దశి

 తెల్లవారు ఝామునే మేలుకోవడం
తలారా స్నానాలు చెయ్యడం
మిఠాయి తినడం.. బాణాసంచా కాల్చడం
చెడుపై విజయాన్ని సంబరంగా జరుపుకోవడం

మరి ఈనాడు మన చుట్టూ నరకాసురులెందరో
ఆ నరకాసురులను చంపే కృష్ణుడెక్కడున్నాడో ...
నిజానికి మనలోని మాత్సర్యం, అహంకారాలే నరకాసురులు
వాటిని అంతం చెయ్యగలిగితే మనం కూడా సత్యభామా శ్రీకృష్ణులం 

Vol. No. 02 Pub. No. 049

Tuesday, November 2, 2010

శంకరశాస్త్రి....శారద.... ? - జవాబులు

  కనుక్కోండి చూద్దాం - 3 0 - జవాబులు 

ఈ ప్రశ్నలకు స్పందించిన మిత్రులకు ధన్యవాదాలు. మాధురి గారు మొదటి ప్రశ్నకు సరైన సమాధానమిచ్చారు. లక్ష్మీనారాయణ సునీల్ వైద్యభూషణ గారు, కేకే గారు ఇచ్చిన సమాధానాలు అప్పట్లో కొన్ని ఆలోచనలు మాత్రమే ! పూర్తిగా నిర్ణయించినవి కావు. ఇక జవాబులు చూడండి.

 తెలుగు చిత్ర రంగంలో ఈ చిత్రం సృష్టించిన ప్రభంజనం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ చిత్రంలో రెండు ప్రధానమైన పాత్రలు శంకరశాస్త్రి, ఆయన కూతురు శారద.
ఈ పాత్రలను పోషించిన సోమయాజులు గారు, రాజ్యలక్ష్మి చాలా పేరు తెచ్చుకున్నారు. కానీ ఆ పాత్రలకు ముందుగా నిర్ణయించింది వారిని కాదు.

మరి ముందుగా అనుకున్న ......
* శంకరశాస్త్రి ఎవరు ?
జవాబు : కృష్ణంరాజు గారు. అయితే అంతటి ఉదాత్తమైన పాత్ర ఔచిత్యానికి తన రెబెల్ హీరో ఇమేజ్ అడ్డు వస్తుందేమోననే సందేహం వ్యక్తపరచడంతో.... చాలా ఆలస్యంగా అప్పుడే చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన ప్రముఖ రంగస్థల నటుడు జే. వి. సోమయాజులు గారిని ఎంపిక చెయ్యడం జరిగింది.  

* శారద ఎవరు ?
జవాబు : తొలుత ఈ పాత్రకు అప్పడప్పుడే హీరోయిన్ గా నిలదొక్కుకుంటున్న జ్యోతిని అడిగారు. అయితే ఆ పాత్ర ప్రాధాన్యం తక్కువ అనే ఉద్దేశ్యంతో ఆమె ఒప్పుకోలేదు. దాంతో ఆ పాత్ర కూడా అప్పట్లో పరిశ్రమలో కొత్తగా అడుగుపెట్టిన రాజ్యలక్ష్మిని వరించింది. 

Vol. No. 02 Pub. No. 046a

Monday, November 1, 2010

కర్తవ్యం

కీర్తిశేషులు భోగరాజు పట్టాభిసీతారామయ్య గారు, కృష్ణాపత్రిక సంపాదకులు ముట్నూరి కృష్ణారావు గారు చాలా సన్నిహితులు. ఇద్దరి మధ్యా అంతులేని ఆత్మీయత ఉండేది.  విలువలు పాటించే ఆ రోజుల్లో కర్తవ్యానికి స్నేహం అడ్డు రాకూడదని నమ్మిన వారు.

ఓసారి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఎన్నికలు జరుగుతున్నాయి. సుభాష్ చంద్రబోస్ కు పోటీగా గాంధీగారి అభ్యర్థిగా పట్టాభిగారు నిలబడ్డారు. ఆ సందర్భంలో ముట్నూరి కృష్ణారావు గారు తన పత్రికలో పట్టభిగారిని ఘాటుగా విమర్శిస్తూ సంపాదకీయం రాసారు. ఈ విషయం తెలిసి తనకు అత్యంత ఆత్మీయుడు, తన గురించి సంపూర్ణంగా తెలుసున్న మిత్రుడు కృష్ణారావు గారు అలా రాసినందుకు పట్టభిగారు చాలా బాధపడ్డారు.

వారిద్దరికీ ఆత్మీయులైన కొందరు ఈ విషయాన్ని ముట్నూరి వారి దగ్గర చెప్పారు. అప్పుడాయన  తన తల మీద వున్న తలపాగాను తీసి బల్ల మీద పెట్టారు.
" ఇప్పుడు పట్టాభిని ఎవరైనా పల్లెత్తు మాటన్నా చీల్చి చెండాడేస్తాను " అన్నారు ముట్నూరివారు.

తలపాగా వృత్తి చిహ్నం. వృత్తి ధర్మం ఆయన చేత పట్టాభిగారిపై విమర్శలు చేయించింది.
స్నేహం వ్యక్తిగతం. ఆ స్నేహం ఆయన చేత మిత్రునికి రక్షణ కల్పించింది.

కర్తవ్యం వేరు......... వ్యక్తిగతం వేరు.........

................ అవీ అప్పటి పత్రికారంగ విలువలు.

Vol. No. 02 Pub. No. 048