Wednesday, November 3, 2010

నరకాసుర సంహారం చేద్దాం !


భూమాత పుత్రుడు నరకాసురుడు
బ్రహ్మ వరం ప్రజలపాలిట శాపమయింది
అహంకారం హద్దులు దాటింది
దుర్మార్గం దుష్టత్వం విజృంభించింది
అన్యాయం అరాచకం ప్రబలింది


ధర్మ సంస్థాపకుడు శ్రీకృష్ణుడు
దుర్మార్గుడైన నరకాసురుడ్ని
సత్యభామా సహితుడై సంహరించాడు
దుర్మార్గానికి స్వ పర భేధం లేదని నిరూపించాడు

అరాచకాలు అంతమైన రోజు
అకృత్యాలకు భరత వాక్యం పలికిన రోజు
నరకాసురవధ జరిగిన రోజు
 ఆరోజే నరక చతుర్దశి

 తెల్లవారు ఝామునే మేలుకోవడం
తలారా స్నానాలు చెయ్యడం
మిఠాయి తినడం.. బాణాసంచా కాల్చడం
చెడుపై విజయాన్ని సంబరంగా జరుపుకోవడం

మరి ఈనాడు మన చుట్టూ నరకాసురులెందరో
ఆ నరకాసురులను చంపే కృష్ణుడెక్కడున్నాడో ...
నిజానికి మనలోని మాత్సర్యం, అహంకారాలే నరకాసురులు
వాటిని అంతం చెయ్యగలిగితే మనం కూడా సత్యభామా శ్రీకృష్ణులం 

Vol. No. 02 Pub. No. 049

Tuesday, November 2, 2010

శంకరశాస్త్రి....శారద.... ? - జవాబులు

  కనుక్కోండి చూద్దాం - 3 0 - జవాబులు 

ఈ ప్రశ్నలకు స్పందించిన మిత్రులకు ధన్యవాదాలు. మాధురి గారు మొదటి ప్రశ్నకు సరైన సమాధానమిచ్చారు. లక్ష్మీనారాయణ సునీల్ వైద్యభూషణ గారు, కేకే గారు ఇచ్చిన సమాధానాలు అప్పట్లో కొన్ని ఆలోచనలు మాత్రమే ! పూర్తిగా నిర్ణయించినవి కావు. ఇక జవాబులు చూడండి.

 తెలుగు చిత్ర రంగంలో ఈ చిత్రం సృష్టించిన ప్రభంజనం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ చిత్రంలో రెండు ప్రధానమైన పాత్రలు శంకరశాస్త్రి, ఆయన కూతురు శారద.
ఈ పాత్రలను పోషించిన సోమయాజులు గారు, రాజ్యలక్ష్మి చాలా పేరు తెచ్చుకున్నారు. కానీ ఆ పాత్రలకు ముందుగా నిర్ణయించింది వారిని కాదు.

మరి ముందుగా అనుకున్న ......
* శంకరశాస్త్రి ఎవరు ?
జవాబు : కృష్ణంరాజు గారు. అయితే అంతటి ఉదాత్తమైన పాత్ర ఔచిత్యానికి తన రెబెల్ హీరో ఇమేజ్ అడ్డు వస్తుందేమోననే సందేహం వ్యక్తపరచడంతో.... చాలా ఆలస్యంగా అప్పుడే చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన ప్రముఖ రంగస్థల నటుడు జే. వి. సోమయాజులు గారిని ఎంపిక చెయ్యడం జరిగింది.  

* శారద ఎవరు ?
జవాబు : తొలుత ఈ పాత్రకు అప్పడప్పుడే హీరోయిన్ గా నిలదొక్కుకుంటున్న జ్యోతిని అడిగారు. అయితే ఆ పాత్ర ప్రాధాన్యం తక్కువ అనే ఉద్దేశ్యంతో ఆమె ఒప్పుకోలేదు. దాంతో ఆ పాత్ర కూడా అప్పట్లో పరిశ్రమలో కొత్తగా అడుగుపెట్టిన రాజ్యలక్ష్మిని వరించింది. 

Vol. No. 02 Pub. No. 046a

Monday, November 1, 2010

కర్తవ్యం

కీర్తిశేషులు భోగరాజు పట్టాభిసీతారామయ్య గారు, కృష్ణాపత్రిక సంపాదకులు ముట్నూరి కృష్ణారావు గారు చాలా సన్నిహితులు. ఇద్దరి మధ్యా అంతులేని ఆత్మీయత ఉండేది.  విలువలు పాటించే ఆ రోజుల్లో కర్తవ్యానికి స్నేహం అడ్డు రాకూడదని నమ్మిన వారు.

ఓసారి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఎన్నికలు జరుగుతున్నాయి. సుభాష్ చంద్రబోస్ కు పోటీగా గాంధీగారి అభ్యర్థిగా పట్టాభిగారు నిలబడ్డారు. ఆ సందర్భంలో ముట్నూరి కృష్ణారావు గారు తన పత్రికలో పట్టభిగారిని ఘాటుగా విమర్శిస్తూ సంపాదకీయం రాసారు. ఈ విషయం తెలిసి తనకు అత్యంత ఆత్మీయుడు, తన గురించి సంపూర్ణంగా తెలుసున్న మిత్రుడు కృష్ణారావు గారు అలా రాసినందుకు పట్టభిగారు చాలా బాధపడ్డారు.

వారిద్దరికీ ఆత్మీయులైన కొందరు ఈ విషయాన్ని ముట్నూరి వారి దగ్గర చెప్పారు. అప్పుడాయన  తన తల మీద వున్న తలపాగాను తీసి బల్ల మీద పెట్టారు.
" ఇప్పుడు పట్టాభిని ఎవరైనా పల్లెత్తు మాటన్నా చీల్చి చెండాడేస్తాను " అన్నారు ముట్నూరివారు.

తలపాగా వృత్తి చిహ్నం. వృత్తి ధర్మం ఆయన చేత పట్టాభిగారిపై విమర్శలు చేయించింది.
స్నేహం వ్యక్తిగతం. ఆ స్నేహం ఆయన చేత మిత్రునికి రక్షణ కల్పించింది.

కర్తవ్యం వేరు......... వ్యక్తిగతం వేరు.........

................ అవీ అప్పటి పత్రికారంగ విలువలు.

Vol. No. 02 Pub. No. 048

Sunday, October 31, 2010

రెండో రాముడు

గతంలో రంగస్థల నాటకాలు సుదీర్ఘంగా సాగేవి. అందుకని రాముడు, కృష్ణుడు వంటి ముఖ్య పాత్రలను ఇద్దరు ముగ్గురు నటులు ధరించేవారు. ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు..... ఇలా ఆ పాత్రని ఫలానా నటుడు ధరిస్తాడని అని కరపత్రాల్లో ముద్రించేవారు.

అలాగ కాదుగానీ  మనకి వెండి తెర రాముడు అంటే గుర్తుకొచ్చేది నందమూరి తారక రాముడే ! ఆయన్ని తప్ప ఊహించుకోలేకుండా వున్న పరిస్థితుల్లో ఆయనే తన స్వంత చిత్రం ' సీతారామకల్యాణం ' లో మరో రాముణ్ణి ప్రవేశపెట్టారు. ఆ రాముడే హరనాథ్.

హరనాథ్ తండ్రి నటుడు అవ్వాలని మద్రాస్ చేరి సహకార దర్శకుడిగా మారారు. హరనాథ్ కి కూడా సినిమాల మీద, నటన మీద ఆసక్తి వున్నా తండ్రి తన అనుభవంతో విధించిన ఆంక్షల కారణంగా బి.ఏ. పూర్తి చేసేవరకూ ఆవైపు తొంగి చూడలేదు. ఇంటర్ మద్రాస్ లో చదివేటపుడు బాపు రమణలు ఆయన సహాధ్యాయులు. కాకినాడలో బి.ఏ, చదివేటపుడు ప్రముఖ నిర్మాతలు వి. బి. రాజేంద్రప్రసాద్, ఏడిద నాగేశ్వరరావు లు సహాధ్యాయులు.

తండ్రి వల్లో, మిత్రుల వల్లో హరనాథ్ కు సినిమాలలో అవకాశం రాలేదు.  బి.ఏ. పూర్తిచేసి మిలిటరీలో చేరే ఉద్దేశ్యంతో మద్రాస్ కొచ్చిన హరనాథ్ ఒకరోజు కోడంబాక్కం బస్సు స్టాప్ లో నిలబడి వుండగా అప్పట్లో ప్రముఖ కళాదర్శకుడైన సూరన్న చూసి తన కారు ఆపి ' సినిమాలో వేషం వేస్తావా ? ' అని అడిగాడు. తన చిరకాల కోరిక తీరే అవకాశం తనని వెదుక్కుంటూ వచ్చినందుకు షాక్ తిన్న ఆయన్ని నవశక్తి గంగాధరరావు గారికి పరిచయం చేశారు సూరన్న. అతని రూపం, హావభావాలు నచ్చి గుత్తా రామినీడు దర్శకత్వంలో తాను నిర్మించబోయే చిత్రంలో అవకాశం ఇచ్చారు గంగాధరరావు గారు.    

అలా హైదరాబాద్ సారధి స్టూడియోస్ లో చిత్రీకరించబడ్డ మొదటి చిత్రం ' మా ఇంటి మహాలక్ష్మి ' తో 1959 లో చిత్రరంగ గృహప్రవేశం చేసిన హరనాథ్ 60 వ దశకంలో తెలుగు చిత్ర సీమలో ప్రముఖ హీరోల సరసన చేరాడు. బడ్జెట్ చిత్రాల హీరో గా, పురాణ పాత్రలకు సరిపోయే ఆకారంతో, చూడ చక్కని రూపంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. జమున, హరనాథ్ జంట అప్పటి ప్రేక్షకుల కన్నుల పంట.  ' భీష్మ ' ( 1967 ) చిత్రంలో కృష్ణుడిగా,  ' శ్రీరామకథ '   ( 1969 ) లో మరోసారి రాముడిగా నటించారు. తెలుగు, తమిళం, కన్నడం, హిందీ భాషల్లో సుమారు 130 చిత్రాల్లో నటించిన హరనాథ్ చివరి చిత్రం ' నాగు ' .  దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తొలిసారి హీరోగా నటించిన ' పగడాల పడవ ' చిత్రంలో హరనాథ్ ఓ ప్రముఖ పాత్ర పోషించారు. ఆ చిత్రం విడుదల కాలేదు.

ఉన్నతమైన స్థానానికి ఎదగడానికి అన్ని లక్షణాలు వున్న వ్యక్తి కొన్ని అవలక్షణాల బారిన పడితే తన పతనం తానే కోరి తెచ్చుకున్నట్లవుతుందని చెప్పడానికి హరనాథ్ జీవితమే ఒక ఉదాహరణ.

ఈరోజు ( నవంబర్ 1 )  హరనాథ్ వర్థంతి. ఆయనలోని నటుడిని స్మరించుకుంటూ ..............



Vol. No. 02 Pub. No. 047

Saturday, October 30, 2010

శంకరశాస్త్రి.... శారద... ?

  కనుక్కోండి చూద్దాం - 3

తెలుగు చిత్ర రంగంలో ఈ చిత్రం సృష్టించిన ప్రభంజనం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ చిత్రంలో రెండు ప్రధానమైన పాత్రలు శంకరశాస్త్రి, ఆయన కూతురు శారద.
ఈ పాత్రలను పోషించిన సోమయాజులు గారు, రాజ్యలక్ష్మి చాలా పేరు తెచ్చుకున్నారు. కానీ ఆ పాత్రలకు ముందుగా నిర్ణయించింది వారిని కాదు.

మరి ముందుగా అనుకున్న ......
* శంకరశాస్త్రి ఎవరు ?
* శారద ఎవరు ?

Vol. No. 02 Pub. No. 046

Friday, October 29, 2010

క్రీడోత్సవాలకు మరో కొత్త ఆట

 మొన్ననే కామన్ వెల్త్ క్రీడలు ముగిసాయి. మళ్ళీ ఆసియా క్రీడలు, ఒలింపిక్ క్రీడలు ఇంకా ఏవేవో వస్తాయి. వీటన్నిటికంటే ఇంగ్లీష్ వాళ్ళు మనకంటించిన క్రికెట్ ఎలాగూ వుంది. ఈ క్రీడా పోటీల నిర్వాహకులకి ఈసారి ఓ విజ్ఞప్తి చెయ్యాలని వుంది. వాళ్ళ క్రీడల జాబితాలో మరో కొత్త క్రీడను కలుపుకోమని చెప్పాలి. అందరం సామూహికంగా విజ్ఞప్తులు చెయ్యాలి. అవసరమైతే ఆందోళనలు చెయ్యాలి. ధర్నాలు, నిరాహారదీక్షలు, ర్యాలీలు.... ఇలా ఒకటేమిటి అనుకున్నది సాధించడానికి ఏమైనా చెయ్యాలి. ఎలాగైనా సాధించాలి.

ఇంతకీ అదేం క్రీడ అంటారా ? అక్కడికే వస్తున్నా ! కొంచెం ప్రాణాంతకమైనా మంచి ఉత్సుకత, సస్పెన్సు వగైరా పుష్కలంగా వుంటాయి. అసలు అవేమీ లేకపోతే ఆటలో థ్రిల్ ఉంటుందా ? కిక్ ఉంటుందా ? ఆమాటకొస్తే ఫుట్ బాల్, హాకీ.....చివరకి క్రికెట్ లో కూడా మనకు ఉత్కంఠగా వుంటుంది. ఆటగాళ్లకు ప్రాణసంకటంగానే వుంటుంది.... పాపం. వాళ్ళలోని క్రీడాస్పూర్తికి మనం పోటీలు పడి స్టేడియం అదిరిపోయేలాగా చప్పట్లు కొడతాం. బూరాలు ఊదుతాం. డప్పులు కొడతాం. డాన్సులు చేస్తాం. ఇవన్నీ టీవీల ముందు వుండి కూడా  చేస్తాం. మన చేష్టలతో వాళ్ళు ఉత్సాహంతో రెచ్చిపోయి ఇంకా బాగా ఆడతారని సంబరపడిపోతాం. ఇంతలో వాళ్ళు అవుట్ అయిపోయి పెవిలియన్ దారి పడుతుంటే మన ఒక్కసారిగా ఉత్సాహం చల్లబడిపోతుంది. ఇంతకీ వాళ్ళు మన ఉత్సాహానికి రెచ్చిపోయి ఆడాల్సింది పోయి వెన్ను చూపుతారెందుకు అని ఒకసారి సావధానంగా ఆలోచిస్తే అర్థమవుతుంది. మనకంత సావదానం, సావకాశం ఎక్కడుంటాయండీ ? అందుకే అంత దూరం ఆలోచించం. మనమిచ్చే డబ్బులకు ఆశపడి వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకుంటారా చెప్పండి. మన గోలకు అవతల జట్టు వాళ్లకు ఎంత ఒళ్ళు మండుతుందీ అన్నది మనకంటే వాళ్ళకే ఎక్కువ తెలుసు కనుకనే అబౌట్ టర్న్.

అసలు ఇంగ్లీషువాడు మనం తోటల్లోనూ, పొలంగట్ల మీద, రోడ్లమీద ఆడుకునే కర్రా బిళ్ళా ఆట చూసే క్రికెట్ కనిపెట్టాడని నాకో అనుమానం. మీక్కూడా అదే అనుమానం ఉందా ? ఉంటుంది మరి. ఆ ఆట అంతర్జాతీయ స్థాయికి వెళ్ళింది కదా ! అలాగే మనం తోటల్లోను... అదే పార్కుల్లో, పొలంగట్ల మీద... అదేనండీ పేవ్ మెంట్ల మీదా ( అవేక్కడున్నాయని నన్నడక్కండి ), ఇంకా రోడ్ల మీదా ఆడుకునే ఈ ఆట కూడా అంతర్జాతీయ స్థాయికి వెళ్లాలని నా ఆశ. ప్రభుత్వం ప్రోత్సాహమిస్తే పిల్లలు, పెద్దలు, మగవారు, ఆడవారు, మాన్యులు, సామాన్యులు..... ఇలా ఒకరేమిటి అందరూ తమ ప్రతిభ నిరూపించుకునే అవకాశం వస్తుంది. మిగిలిన ఆటల్లో క్రీడాకారులు కఠోర సాధనతో జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయికి చేరుకుంటుంటుంటే ఈ ఆటలో ప్రజలందరూ క్రీడాకారులే ! అందరూ అంతర్జాతీయ స్థాయికి అవిరళంగా కృషి చేస్తున్నవారే ! మరి వాళ్ళనెందుకు ప్రోత్సహించకూడదూ ? ఇది నా మదిన దొలుస్తున్న ప్రశ్న.

ప్రతీ ఆటలోనూ రెండు జట్లుంటాయి. ప్రత్యేకమైన ప్రత్యర్థులుంటారు. వారి మధ్యనే పోటీ వుంటుంది. ఎదుటి జట్టుని మాత్రమే ఎదుర్కోవాలి తప్ప కనీసం రిఫేరీ మీదకైనా వెళ్ళకూడదు. అంటే వాటిలో స్వేచ్చ చాలా తక్కువ. మన ఆటలో స్వేచ్చ చాలా ఎక్కువ. దీనికి ఎలాంటి నియమ నిబంధనలు లేవు. జట్లు ఉండవు. ఎవరైనా ఎవరికైనా ప్రత్యర్థే ! ఎవరు ఎవరినైనా ఎంచుకోవచ్చు. అసలు ఎంచుకోకపోవచ్చు కూడా ! ఈ ఆటకు స్టేడియంలు అక్కరలేదు. క్రీడా శిక్షణా శిబిరాలక్కర్లేదు. కోచ్ లు అక్కర్లేదు. అన్నిటికంటే క్రీడాకారులకు పెద్ద పెద్ద పారితోషికాలక్కర్లేదు. చూసారా ఈ దేశానికి ఎంత డబ్బు ఆదానో ! రోడ్ వుంటే చాలు. ట్రాఫిక్ ఎక్కువగా ఉండేదైతే మరీ మంచిది. బాల్, బాట్ లాటివి ఏవీ అక్కర్లేదు. ఒక చిన్న సాధనం మాత్రం అవసరం. అసలు ఈ ఆటకు అదే కీలకం. ఆటగాడికి శిక్షణ, నైపుణ్యం వగైరా లనవసరం. ఇప్పటికైనా అర్థం అయిందా ? అవలేదా ! వస్తున్నా .....వస్తున్నా ! అక్కడికే వస్తున్నా !

ఈ మధ్య మనం రోడ్ మీద నడుస్తున్నా, ద్వి/ త్రి/చతుశ్చక్ర వాహనం మీద వెళ్తున్నా తప్పనిసరిగా ఉండవలసిన వాటిలో మరో వస్తువు చేరింది. ఆ వస్తువే మనల్ని అంతర్జాతీయ స్థాయికి చేర్చే ఆటలో నిపుణుల్ని చేస్తోంది. నడుస్తూ, డ్రైవ్ చేస్తూ తమలోకంలో తాము వున్నట్లు, పరిసరాలతో పనిలేనట్లు తమలో తామే మాట్లాడుకుంటూ వెళ్ళే లోకాతీతులు మీకందరికీ దర్శనమిచ్చే వుంటారు. అదిగో వాళ్ళే ఈ క్రీడాకారులు. ఫుట్ బాల్, బాట్ లాంటి వాటిలాగ వాళ్ళ చేతుల్లో ఉండే క్రీడా సాధనమేమిటో ఎవరైనా ఊహించగలరా ?

అదేనండీ సెల్ ఫోన్. దాంతో రోడ్ మీద మన క్రీడాకారులు చేసే విన్యాసాలు చూసి తీరాలి. మిగిలిన ఆటలు చూడాలంటే పెద్ద మొత్తాలు ఖర్చుపెట్టి టికెట్స్ కొనాలి. అక్కడ తోపులాటల్లో ఇరుక్కోవాలి. అవేమీ లేకుండా ఫ్రీగా దొరుకుతున్న వినోదం. ఒకరు సెల్ ఫోన్లో మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెడుతుంటారు. మనం ఎదురు వెళ్ళామనుకోండి. మనల్ని చూసి ప్రక్కకు తప్పుకుంటారనుకుంటాం కదా ! ఊహు( ! తప్పుకోరు. మనకడ్డుగానే మనం ఎటు తిరిగితే అటు తిరుగుతారు. మన కాళ్ళల్లో కాళ్ళు పెట్టి మనల్ని పడగొట్టాలని చూస్తారు. మనం ఎన్ని తిట్టినా వాళ్ళ ధోరణిలో వాళ్ళుంటారు తప్ప మనల్ని పట్టించుకోరు. చూసారా వాళ్ళకెంత ఏకాగ్రతో ! మనల్ని పడగొట్టాలనే గానీ మరే ధ్యేయం లేనట్లు ఎంత సీరియస్ గా ఆడుతుంటారో ! ఆ ఆటలో సాధారణంగా మనమే ఓడిపోతామనుకోండి. ఎందుకంటే మనం ఆ ఆటలో నిష్ణాతులం కాదు కదా !

పోలో ఆట గుర్రపు స్వారీ చేస్తూ కూడా ఆడుతారు. అలాగే కొంతమంది సెల్ క్రీడాకారులు బైక్ లు డ్రైవ్ చేస్తూ ఆడే ఈ ఆట బహు ముచ్చటగా వుంటుంది. మనం బైక్ మీద వేడుతున్నామనుకోండి. మన ముందు వెడుతున్న ఓ బైక్ హటాత్తుగా స్లో అవుతుంది. కొద్ది క్షణాల్లోనే ఆ రౌతు ( బైక్ స్వారీ చేస్తున్న వ్యక్తి ) తల ఓ ప్రక్కకి ఒరిగిపోతుంది. వెనుకనున్న మనం పాపం అతని మెడకి ఏమైందోనని ఖంగారు పడతాం. హటాత్తుగా బైక్ వేగం పెరుగుతుంది. మనకి మళ్ళీ ఖంగారు. ఆ బైక్ అటూ ఇటూ ఊగుతుంది. ఓ ప్రక్కకి ఒరుగుతుంది. ఇదంతా ఆటలోని భాగమని తెలియని మనకి ఖంగారు మరింత పెరుగుతుంది. మన బైక్ వేగం పెంచి అతని ప్రక్కకి వెడతాం. ఏవో మాటలు వినబడతాయి. పరిశీలనగా చూస్తే ఒరిగిపోయిన మెడ క్రింద నలిగిపోతూ కనిపిస్తుంది సెల్ ఫోన్. పద్మవ్యూహంలో అభిమన్యుడు ఎలా జోరబడ్డాడో మనకి ప్రత్యక్షంగా తెలియదు గానీ ట్రాఫిక్ పద్మ వ్యూహంలో అతను సాక్షాత్తూ అభిమన్యుడి లాగే కనబడతాడు. ప్రతి సంవత్సరం భారత ప్రభుత్వం క్రీడాకారులకి అర్జున అవార్డులిచ్చినట్లు గానే ఈ సెల్ క్రీడాకారులకి అభిమన్య అవార్డులిచ్చి ప్రోత్సహించాలి. వీరు అలా సెల్ మాట్లాడుతూ రోడ్ మీద ఆట ఆడే తీరు బహు రమ్యం గా వుంటుంది. సడెన్ గా స్పీడ్ పెరుగుతుంది. మళ్ళీ స్లో అవుతుంటుంది. తన మానాన తాను పోతున్న వాహనం మీదకో, నడిచి వెడుతున్న మనిషి మీదకో వేడుతుంటుంది. ఖంగారు పడి తప్పుకోవడం వాళ్ళ వంతు. లేకపోతే ఔటే ! ఇదంతా చూస్తున్న రోడ్ మీద ప్రేక్షకులకి ఎంత ఉత్కంఠ ! అంతర్జాతీయ ఫుట్ బాల్ పోటీల్లో కూడా అంతటి ఉత్కంఠ వుండదేమో !

ఇక ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర మాత్రం వీళ్ళు తమ ఆటకు బ్రేక్ తీసుకుంటారు. అక్కడ వాళ్ళ శత్రువులు ( పోలీసులు )  వుంటారు కదా ! ఆది కూడా ఒక కారణం. అసలు ఈ దేశంలో క్రీడా స్పూర్తి లేదు. క్రీడాకారులకు స్వేచ్చ లేదు. లేకపోతే హాయిగా రోడ్ మీద ఆటను ప్రాక్టీసు చేస్తున్న వాళ్ళ మీద కేసులా ? వాళ్ళు రేపొద్దున్న అంతర్జాతీయంగా రికార్డులు సృష్టిస్తే మాత్రం సన్మానాలు చేస్తారు. ఏమిటో ఈ న్యాయం ? చట్టాలు మార్చమని కూడా ఆందోళన చెయ్యాలి.

అసలు ప్రత్యర్థులను ఓడించడంలో వీళ్ళను మించిన వాళ్ళు ఇంకెవరూ వుండరేమో ! అప్పటివరకూ రోడ్ కి ఓ ప్రక్కగా వెడ్తున్న వీళ్ళకు ఫోన్ రావడం పాపం ... రోడ్ మధ్యలోకి వచ్చి వెనుక వచ్చే ప్రత్యర్థుల్ని చిత్తు చెయ్యడానికి వీళ్ళు చేసే విన్యాసాలు అన్నీ ఇన్నీ కావు. వాళ్ళు వెళ్ళరు. వీళ్ళని వెళ్ళనివ్వరు. హార్న్ కొట్టినా వినిపించుకోరు. అడ్డు తప్పుకోరు. చివరికి వాళ్ళ బైక్ కి మన బైక్ తగిలి ఆక్సిడెంట్ అవుతుందేమోననే భయంతో మనం సడెన్ బ్రేక్ వేసి.. దాంతో బైక్ స్కిడ్ అయి క్రింద పడి దెబ్బలు తిని ఈ ఆటలో ఓడిపోయి అయోమయంగా చూస్తుంటే విజయగర్వంతో ఆగకుండా ముందుకు సాగిపోయే ఈ నిర్వికార క్రీడాకారులకు ఏ అవార్డు ఇచ్చి సత్కరించాలో అర్థం కాదు. ఈ విషయం నిర్ధారించడానికి ఓ కమిటీ వెయ్యాలి. వాళ్ళతో పోటీ పడలేని వాళ్ళు అంటే సెల్ ఫోన్ లేని వాళ్ళని, వున్నా డ్రైవ్ చేస్తూ, రోడ్ మీద నడుస్తూ సెల్ ఫోన్ లు మాట్లాడడం చేతకాని వాళ్ళని, ఆ క్రీడాకారుల్ని ఓడించే సామర్థ్యం లేనివాళ్ళని ఆ భగవంతుడే కాపాడాలి. యుద్ధంలోను, క్రీడల్లోనూ గెలుపోటములు దైవాధీనాలు. కానీ ఈ ఆటలో మాత్రం గెలుపు ఖచ్చితంగా సెల్ ఫోన్ డ్రైవర్లదే !

నీతి : దుష్టులను దూరంగా ఉంచవలెను. డ్రైవింగ్ లో సెల్ ఫోన్ మాట్లాడే వాళ్లకు మనమే వీలైనంత దూరంగా ఉండవలెను. ఇది నా స్వానుభవం.

 Vol. No. 02 Pub. No. 045

Thursday, October 28, 2010

పోటాపోటీ


తెలుగు చిత్ర రంగంలో ఇప్పుడు నడుస్తున్న కొత్త ట్రెండ్ టైటిల్స్ కోసం పోటాపోటీ. గతంలో కూడా ఈ పోటీ వున్నా ప్రజలకు అంతగా తెలిసేది కాదు. వాళ్ళల్లో వాళ్ళే పరిష్కరించుకునేవారు. ఇప్పుడు చీమ చిటుక్కుమంటే ప్రజలకు చేరిపోతోంది. చిన్న విషయం కూడా పెద్ద రాద్దాంతమవుతోంది. ఇది కూడా ప్రసార మాధ్యమాలు సాధించిన ప్రగతి పుణ్యమే !

అసలు ఈ పోటీ తత్త్వం తెలుగు చిత్ర రంగం ఆవిర్భవించిన తొలినాళ్ళలోనే ఆరంభమైంది. అయితే ఇప్పటి పోటీ పేర్లకోసమైతే అప్పటి పోటీ కథలకోసం !

  1933 లోనే ఈ పోటీ తత్వానికి అంకురార్పణ జరిగింది. ' రామదాసు ' పేరుతో రెండు చిత్రాలోచ్చాయి. ఒక చిత్రాన్ని బొంబాయి కి చెందిన ఇంపీరియల్ కంపెనీ నిర్మించగా మరో చిత్రాన్ని కలకత్తాకు చెందిన ఈస్ట్ ఇండియా కంపెనీ నిర్మించింది. రెండవ చిత్రంలో సి. యస్. ఆర్, ఘంటసాల రాధాకృష్ణమూర్తి, రామతిలకం నటించారు. సి. పుల్లయ్య దర్శకత్వం వహించారు.

మరో విశేషమేమిటంటే అదే సంవత్సరం ' సావిత్రి ' పేరుతో రెండు చిత్రాలు వచ్చాయి. ఈస్ట్ ఇండియా కంపెనీ నిర్మించిన చిత్రానికి సి. పుల్లయ్య గారే దర్శకత్వం వహించగా రామతిలకం, వేమూరి గగ్గయ్య, నిడుముక్కల సుబ్బారావు నటించారు.  

రెండో చిత్రం బి. వి. రామానందం దర్శకత్వంలో కృష్ణా ఫిలిం కంపెనీ నిర్మించింది. ఈయన విశ్వనట చక్రవర్తి ఎస్వీరంగారావుగారికి మేనమామ. ఇందులో సురభి కమలాబాయి, మునిపల్లె రాజు నటించారు. ఈ రెండింటిలో మొదటి చిత్రమే విజయం సాధించి ఒకే డేరా హాలులో సంవత్సరంపాటు ఆడిందని చెబుతారు. కథలలోనే కాదు పేర్లలో కూడా మార్పు లేకపోవడం ఈ చిత్రాల విశేషం.

1936 లో మళ్ళీ రెండు సినిమాలు పోటీ పడి రికార్డులలో నిలిచిపోయాయి. రెండింటి ఇతివృత్తం ఒకటే ! మొదటిది ' ద్రౌపదీ మానసంరక్షణ ' . లక్ష్మి ఫిల్మ్స్ పతాకంపైన నిర్మించిన ఈ చిత్రానికి ఎస్. జగన్నాథ్ దర్శకుడు. ఇందులో ప్రముఖ రంగస్థల నటుడు బళ్ళారి రాఘవ దుర్యోధనుడిగా నటించగా సురభి కమలాబాయి ద్రౌపదిగా నటించారు.

రెండవ చిత్రం ' ద్రౌపదీ వస్త్రాపహరణం '.  సరస్వతీ టాకీస్ పతాకంపైన నిర్మించిన ఈ చిత్రానికి హెచ్. వి. బాబు దర్శకుడు. ఇందులో కృష్ణుడిగా సి. యస్. ఆర్. ఆంజనేయులు, ద్రౌపదిగా కన్నాంబ, దుర్యోధనునిగా యడవిల్లి సూర్యనారాయణ నటించారు. ఈ చిత్రమే విజయం సాధించింది.


మళ్ళీ ఈ పోటీ చిత్రాల సందడి 1950 వ సంవత్సరంలో కనిపించింది. ' శ్రీలక్ష్మమ్మ కథ ' పేరుతో ప్రతిభా పతాకంపైన ఘంటసాల బలరామయ్య గారు స్వీయ దర్శకత్వంలో నాగేశ్వరరావు, అంజలీదేవిలతో ఒక చిత్రం నిర్మించారు.

' లక్ష్మమ్మ కథ ' పేరుతో శోభనాచల స్టూడియో వారు గోపీచంద్ దర్శకత్వంలో  సి. హెచ్. నారాయణరావు, కృష్ణవేణిలతో మరో చిత్రం నిర్మించారు. ఘంటసాల గారిని సంగీత దర్శకుణ్ణి చేసిన చిత్రం కూడా ఇదే ! రెండు చిత్రాలలోనూ ఈ చిత్రమే విజయం సాధించింది. 

ఇవీ తెలుగు చిత్ర రంగ తొలినాళ్లలోని పోటీ చిత్రాల వివరాలు.

Vol. No. 02 Pub. No. 045