Saturday, May 8, 2010

అమ్మ అన్నది కమ్మని మాట


 ' అమ్మ ' అనేది ఒక కమ్మని మాట
అమ్మ అంటేనే కోటి వరహాల మూట
అమ్మంటేనే ఒక తీయని భావనన్నమాట




అమ్మంటే మనసున తేనెలూరు
అమ్మంటే ప్రేమకు మారుపేరు
అమ్మకెవరూ ఇలలో సాటి రారు







అమ్మను మించి దైవమున్నదా ?
అమ్మను కాదనే ధైర్యమున్నదా ?
అమ్మను లేదనే జాతి వున్నదా ?

 






అమ్మంటే కదిలే దేవత
అమ్మంటే కనిపించే దీపం
అమ్మంటే మన ప్రాణం  




అమ్మ కన్న మిన్న అయిన కావ్యం ఎవరు రాయగలరు ?
అమ్మ కన్న మిన్న అయిన మాట ఎవరు చెప్పగలరు ?
అమ్మ కన్న మిన్న అయిన పాట ఎవరు నేర్పగలరు ?







అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా మాతృమూర్తులందరికీ శుభాభినందనలు 

Vol. No. 01 Pub. No. 287

Friday, May 7, 2010

ఫలరాజు ' పనస '

మృగాలన్నిటికీ రాజు సింహం 
ఫలాలన్నిటికీ రాజు   పనస 

పనసపండు ఆకారంలోనే కాదు ఉపయోగంలో కూడా పెద్దదే ! పనసపండులో ఉపయోగపడని భాగమంటూ లేదు. తొనల సంగతి చెబితే అందరికీ నోరూరుతుంది కదా ! గింజలతో కూర చేస్తారు. దుంప కూరల రుచికి ఏమాత్రం తీసిపోదు. తొనలు తీసేసాక మిగిలిన భాగాన్ని కొంతమంది పారేస్తారు. కానీ కొన్ని ప్రాంతాలలో వాటిని శుభ్రం చేసుకొని పులుసు లాగ పెట్టుకుంటారు. అది ఎంత రుచిగా ఉంటుందని !

ఇక పనస ఆకులలో ఔషధ గుణాలుంటాయంటారు. అందుకేనేమో గోదావరి జిల్లాల్లో ముఖ్యంగా కోనసీమలో వాటిని బుట్టలుగా అల్లి ' పోట్టెంకలు '  అని చేసుకుంటారు. సుభద్ర గారు వాటిని చేసే విధానం గురించి, రుచి గురించి తన బ్లాగు వాలుకొబ్బరిచెట్టు లో  సచిత్రంగా వివరంగా రాసారు.

సరే పనస చెక్క ఫర్నిచర్ తయారీకి, గృహనిర్మాణ అవసరాలకు ఉపయోగపడుతుంది. ఆది చాలా నాణ్యత కలిగి ఉంటుందంటారు. ముఖ్యగా చెదలు లాంటివి పట్టవని చెబుతారు.

ఇన్ని చెప్పి పనస పొట్టు గురించి చెప్పకపోతే ఫలరాజుకు ద్రోహం చేసినట్లే ! పచ్చిగా వున్న పనసకాయను తీసుకొని దాన్ని పొట్టుగా కొట్టే విధానం నుంచి దాంతో కూర చేసే విధానం దాకా అన్ని దశలలోనూ దాని ప్రత్యేకత దానిదే ! ఇప్పుడంటే మిక్సీలు వగైరా వచ్చేసి పని సులువు చేసాయి గానీ గతంలో పనసపొట్టు కొట్టడమంటే అదొక బృహత్కార్యము. పదును మీద వున్న పనసకాయను కోసి దాన్ని పైన ఉండే తొక్కను వలుస్తారు. అప్పుడు జిగురులాంటి పదార్ధం వస్తుంది. ఆది చేతులకు అంటకుండా నూనె రాసుకుంటారు. పొట్టు కొట్టడానికి ప్రత్యేకమైన కత్తి వుంటుంది. కాయకు మధ్యన పట్టుకోవడానికి వీలుగా పెద్ద మేకు గానీ, అట్లకాడ గానీ గుచ్చుతారు. దాన్ని పట్టుకుని కత్తితో సున్నితంగా కొడ్తూ వుంటారు. అలా సుమారుగా వున్న ఒక కాయ కొట్టడానికి సుమారు ఏడు, ఎనిమిది గంటల వరకూ సమయం పడుతుంది. ఒక్కోసారి ఇద్దరు కలసి చెరోవైపు రెండు కత్తులతో కొడతారు. అలా ఓపిగ్గా, సున్నితంగా కొడితే వచ్చే పొట్టు చాలా సన్నగా వుంటుంది. ఆ పొట్టును ఆవ పెట్టి కూర వండితే... ఆహా( !......ఏమి రుచి !

ఇప్పుడు వేసవి కాలం. పనసపండ్లు విరివిగా వచ్చేకాలం. పనస ఒకప్పుడు మనదేశానికే ప్రత్యేకం. విదేశాల వారు ఈ పండు ఆకారానికి, రుచికి తన్మయులై ఈ చెట్టును ( విత్తనాన్ని ) ఇక్కడినుంచి తరలించుకు పోయారని చరిత్ర. మన దేశంలో తూర్పు, పశ్చిమ కనుమల్లో ఈ చెట్లు విస్తారంగా పెరుగుతాయి. మన రాష్ట్రంలో దాదాపుగా అన్ని ప్రాంతాలలోను ఈ చెట్లు కనబడతాయి. ఇది ఉష్ణమండల పంట అవడం వలన, దీని పెరుగుదలకు గాలిలో తేమ ఎక్కువగా వుండాలి కనుక మన రాష్ట్రంలో ఇవి ఎక్కువగా కోస్తా ప్రాంతంలో పెరుగుతాయి. ముఖ్యంగా గోదావరి జిల్లాలలో అందులోనూ డెల్టా ప్రాంతమైన కోనసీమ లోను మరీ ఎక్కువగా కనబడతాయి. సారవంతమైన నేల కావడం వలనో, గాలిలో తేమ బాగా వుండటం వలనో కోనసీమ పనస మరింత రుచిగా వుంటుంది.

పనసలో పోషక విలువలు అధికం. దీనిలో కెరోటిన్, కార్బోహైడ్రేట్లు, కాల్సియం, పొటాషియం, విటమిన్ ' సి ' అధికంగా వుంటాయి. కొన్ని రకాల రుగ్మతలకు పనస మేలు చేస్తుంది. పూజలు, వ్రతాలలో పనస ప్రాధాన్యం చాలా వుంది. పనసపళ్లు దానాలివ్వడం, పూజా ద్రవ్యాలలో మామిడితో బాటు పనస ఆకులను ఉపయోగించడం జరుగుతుంటుంది. దక్షిణాది దేవాలయాల్లో పనస చెట్టుని స్థలవృక్షంగా భావించి పెంచడం కనిపిస్తుంది. కేరళ ప్రాంతంలో హోమాలు, యజ్ఞాలు చేసేటపుడు అగ్ని రగల్చడానికి ఎండు పనస కొమ్మలను రాపాడిస్తారు.

" పనసపండులాంటి బిడ్డను కను " అనే పెద్దల దీవెన ఆ పండుకున్న విశిష్టతలను బట్టే వచ్చివుంటుంది. అందుకే పళ్ళన్నిటిలో పనస రారాజు లాంటిది. అందుకే రాజా ఫలం ' పనస ' . ఈ వేసవిలో విరివిగా దొరికే ఈ ఫలరాజును ఒకసారి గుర్తు చేసుకుందామనిపించి.........         

Vol. No. 01 Pub. No. 284

Thursday, May 6, 2010

మనసు కవి జ్ఞాపకాలు

జీవితంలో వచ్చే చిక్కులు మెదడుకు బలం కలిగించే టానిక్కులు
కీర్తిని తాకట్టు పెట్టుకునే మార్వాడీ వుంటే బాగుండును
బాగా బ్రతకడం ఎవరైనా బ్రతకొచ్చు. కానీ బాగా చావడం అదృష్టం.
- ఆచార్య ఆత్రేయ

 ఆయన అదృష్ట సంఖ్య - 7
ఆయన కొంతకాలం నివసించిన ఇంటి నెంబర్ - 124
ఆయన వాడిన కార్ నెంబర్ - 1510
ఆయన మాతృసంస్థలాంటి అన్నపూర్ణ ఆఫీసు ఇంటి నెంబర్ - 34
ఆయన పుట్టిన రోజు 7 వ తారీఖు

 1921 వ సంవత్సరం మే 7 వ తేదీన పుట్టిన కిళాంబి వెంకట నరసింహాచార్యులు.
ఆయనే మన కవి, మనసు కవి ఆచార్య ఆత్రేయ

 


" నవ్వినా, ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి
ఏ కన్నీటెనకాల ఏముందో తెలుసునా !


ఇదొక్కటే పది కావ్యాల పెట్టు. కాళిదాసు వింటే  కౌగలించుకునేవాడు "
ఈ మాటలన్నది ఆత్రేయ నాటకోత్సవాల్లో ఆయన పాటల విశిష్టత గురించి వివరిస్తూ మరో సుప్రసిద్ధ కవి డా. సి. నారాయణ రెడ్డి.

వినయశీలత : మహాకవి శ్రీశ్రీ కంటే ఆత్రేయ వయసులో పదేళ్ళు చిన్న. దానికాయన " కాదు. యాభైయేళ్ళు చిన్నవాణ్ణి. శ్రీశ్రీకి, నాకు ప్రతిభలో ఎన్నో అంతరువులు తేడా వున్నది " అంటారు.

దార్శనికత ఆత్రేయగారు " ఈనాడు " నాటకాన్ని మహాత్మాగాంధీ హత్యకు చాలా రోజుల ముందే రచించారు. అ నాటకంలోని సన్నివేశంలో ఒక మతోన్మాది విసిరిన కత్తి దెబ్బకు గాంధీజీ పటం పగిలి నేలమీద పడుతుంది.  

ఆత్రేయగారి రచనలకు ప్రేరణ : నాకేదో తెలుసుననే అజ్ఞానం. ఆది ఇతరులకు చెప్పాలనే ఆరాటం.

ఆత్రేయగారి దృష్టిలో సంతృప్తి : ఏ కళాకారుడికీ ఎందులోనూ సంతృప్తి అనేది కలుగకూడదు. కలిగితే ఆగిపోతాడు.

ఆత్రేయగారు తన భాష గురించి : బరువైన భావాన్ని తేలికైన పదాల్లో పొదగడానికి కారణం - అంతకంటే భాష రాదు కనుక.

ఆత్రేయ చమత్కారాలు :
* నేను కొన్ని మంచి సినీ గేయాలు రాశాను. కొన్ని మనీ గేయాలు రాశాను.
* నిర్మాత గురించి " వాళ్ళ సినిమా పూర్తయిందట.  అమ్మ  లేదట. అందుకే వాళ్ళను నిర్  మాత  అన్నారు.
* మీరు పాటలెలా రాస్తారని అడిగితే ఆత్రేయ గారి సమాధానం " నేనసలు పాటలుగానీ, మాటలుగానీ రాయను..................
రాయిస్తాను " అన్నారు. ఆయనకు డిక్టేట్ చెయ్యడం అలవాటు.
* ఒకసారి చక్రవర్తి గారి సంగీత దర్శకత్వంలో ఆత్రేయ గారు రాస్తున్న పాటకు పల్లవి పూర్తయింది.
" అను పల్లవి చెప్పండి " అన్నారు చక్రవర్తి
    " ముందు నువ్వు పల్లవి ' అను ' - నేను అనుపల్లవి అంటాను " అన్నారు ఆత్రేయ
    అదికూడా పూర్తయింది. " ఇక చరణాలు " అన్నారు చక్రవర్తి
    " అదే ! ఎవరి చరణాలు పట్టుకోవాలా అని ఆలోచిస్తున్నాను " అన్నారట ఆత్రేయ.

    ....... ఇవీ ఆత్రేయగారి గురించిన కొన్ని కమ్మని జ్ఞాపకాలు .

    ఆచార్య ఆత్రేయ మనసు పెట్టి రాసిన ' మనసు ' పాటల తునకలు -



    ఆత్రేయగారి మరికొన్ని మచ్చుతునకలు -





    తెలుగు చలన చిత్ర రంగంలో ఒక మైలు రాయి ఆచార్య ఆత్రేయ. ఆయన 79 వ జన్మదిన సందర్భంగా స్మృత్యంజలి.

    Vol. No. 01 Pub. No. 283

    Wednesday, May 5, 2010

    రక్తకన్నీరు

    రక్తకన్నీరు - ఒకప్పుడు ఆంధ్ర దేశాన్ని ఉర్రూతలూగించిన నాటకం
    నాటక రంగానికి గ్లామర్ తెచ్చి ఐదువేలకు పైగా ప్రదర్శనలిచ్చిన నాటకం
    ఆ ప్రదర్శన కోసం ప్రేక్షకుల ఎదురుచూపులు
    టికెట్ల కోసం సాధారణ జనం పడే పాట్లు
    ఫ్రీ పాసులకోసం నాయకులు, అధికార్ల వెంపర్లాట
    ఈ ఫ్రీ పాసు ప్రేక్షకులపై నాటక ప్రారంభంలోనే విసుర్లు
    ........ ఇదీ ఒకప్పుడు రక్తకన్నీరు రంగస్థల చిత్రం

    ఆ రంగస్థల కథానాయకుడు, నాటకానికి క్రేజు తెచ్చిపెట్టిన నటుడు
    విలక్షణమైన నటనతో , విభిన్నమైన సంభాషణా విధానంతో
    తెలుగు చలన చిత్ర రంగానికి కొత్త తరహా విలనీ నందించిన నాగభూషణం

    అందర్నీ మెప్పించి, ఒప్పించి తన చదువును కొనసాగించి
    ఉద్యోగంకోసం చెన్నై చేరిన నాగభూషణం నాటకాలవైపు నడిచి
    మిక్కిలినేని, జి. వరలక్ష్మి లాంటి నటుల సహచర్యం
    ఆత్రేయ కప్పలు, భయం లాంటి నాటకాలు
    కె.వెంకటేశ్వరరావు, అనిసెట్టి సుబ్బారావుల రసన సమాఖ్యకు చేర్చింది.
    రంగస్థలం నాగభూషణాన్ని ఆదరించింది
    నాగభూషణం రంగస్థలాన్ని నమ్ముకున్నాడు

    ' ఏది నిజం ' లో కథానాయకుడిగా
    1951 లో ' పల్లెటూరు ' నాగభూషణాన్ని వెండితెరకు పరిచయం చేసింది.
    1956 లో ' ఏది నిజం ' నాగభూషణాన్ని కథానాయకుణ్ణి చేసింది
    ఆ తర్వాత విలన్ గా, క్యారెక్టర్ నటునిగా రకరకాల పాత్రలు
    విలనీలో కామెడీని రంగరించిన ఆయన పధ్ధతి
    సంభాషణలు పలికే తీరులో ప్రదర్శించే విలక్షణత
    నాగభూషణాన్ని తెలుగు ప్రేక్షకుల మనస్సులలో పదిలపరిచాయి  

    1995 మే 6 వతేదీన ఆ రక్త కన్నీరు ఇంకిపోయింది.
    ఆ నటభూషణం పైలోకంలో తన విశ్వరూపాన్ని చూపడానికి వెళ్ళిపోయాడు.


    నాగభూషణం వర్థంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ..........

    మనవి : రక్తకన్నీరు - ఓ జ్ఞాపకం నా స్వ ' గతం ' పేజీలో .............




    Vol. No. 01 Pub. No. 282

    Tuesday, May 4, 2010

    తెలుగు జిప్సీ పాట

     కృష్ణ - ఆ పేరు చెబితే సాహసం గుర్తుకొస్తుంది. తెలుగు చలన చిత్ర చరిత్రలో ఆయన చేసినన్ని సాహసాలు ఇంకెవరూ చెయ్యలేదేమో ! తొలి పూర్తి నిడివి సినిమా స్కోప్ వర్ణ చిత్రం ' అల్లూరి సీతారామరాజు ', తొలి 70 mm చిత్రం ' సింహాసనం ' ......... ఇలా ఎన్నో !

    కృష్ణ 1971 లో నిర్మించిన ' మోసగాళ్ళకు మోసగాడు ' చిత్రం తెలుగు ప్రేక్షకులకు ఓ అద్భుతం. అప్పట్లో కేవలం పెద్ద నగరాల్లో మాత్రమే ఆంగ్ల చిత్రాలు విడుదలవుతూ వుండేవి. అక్కడి ప్రేక్షకులకు మాత్రమే ఆంగ్ల కౌబాయ్ చిత్రాలు పరిచయం. మిగిలిన ప్రాంతాల ప్రేక్షకులకు అంతగా పరిచయం వుండేవి కాదు. కొత్త రకం ఆహార్యాలు. కొత్త రకం సెట్టింగ్ లూ, కొత్త రకం దుస్తులు, కొత్త రకం సంగీతం, గుర్రాలు, ఎడారులు, చేజింగ్ లూ.....ఇలా ఎప్పుడూ తెలుగు తెర మీద చూసి వుండని  ఒక కొత్త తరహా చిత్రాన్ని చూసి ఆంధ్ర ప్రేక్షకులు విరగబడ్డారు.

    ' మోసగాళ్ళకు మోసగాడు ' చిత్ర కథా, కథనంలో అంతకుముందు ఆంగ్లంలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం  ' మెకన్నాస్ గోల్డ్ ' చిత్రంతో చాలా దగ్గర పోలికలున్నాయి. ఒక రకంగా తెలుగు చిత్రం కూడా ఏదో హాలీవుడ్ చిత్రం చూస్తున్నట్లుంటుంది. విచిత్రమేమిటంటే ' మోసగాళ్ళకు మోసగాడు ' చిత్రాన్ని ఆంగ్లంలో  ' ది ట్రెజర్ ' పేరుతో డబ్ చేసి విదేశాలలో విడుదల చేస్తే ఆది కూడా హిట్ అయింది. అప్పట్లో తెలుగు చిత్రాలకు విదేశాల్లో మార్కెట్ లేదు. సి. డి. లు, డి. వి. డి.లు అసలే లేవు. ఈ ఆంగ్ల చిత్రంలో పాటలుండవు. 

    ' ది ట్రెజర్ ' చిత్రం గ్రీక్ దేశంలో ప్రదర్శించే సమయంలో ఆ దేశానికి చెందిన ఓ పంపిణీదారునికి ఆ చిత్రం నచ్చి తమ భాషలోకి అనువాదం చేస్తే బాగుంటుందనిపించింది.  సంప్రదింపులు జరిగాయి. తెలుగు చిత్రంలో రాజసులోచన ఆహార్యం, ఆవిడపై చిత్రీకరించిన పాట కూడా అతనికి చాలా నచ్చాయి. ఆంగ్ల చిత్రంలో ఆ పాట లేకపోయినా గ్రీక్ లో ఆ పాటను కలుపుకుంటానన్నాడు. మరి పాట కూడా గ్రీక్ భాషలోకి అనువాదం చేస్తారా అంటే అవసరం లేదు తెలుగులోనే ఉంచేస్తానన్నాడట. మీ ప్రేక్షకులకు సాహిత్యం అర్థం కాక ఇబ్బంది అవుతుందేమోనంటే......

    " ఏం ఫర్వాలేదు. ఆ నటి ఈ చిత్రంలో వేసింది జిప్సీ వేషం కదా ! ఆ పాట జిప్సీ భాషలో వుంది అనుకుంటారు " అన్నాడట ఆ గ్రీకు పంపిణీదారుడు. అర్థం కాని భాషను ఆ రకంగా సరిపెట్టేసుకున్నాడన్న మాట. 
     



    Vol. No. 01 Pub. No. 281

    Monday, May 3, 2010

    సినారె మాటల చమక్కులు

    డాక్టర్ సి. నారాయణరెడ్డి గారి పాటలే కాదు మాటలు కూడా బహు పసందుగా వుంటాయి. తెలుగు భాష సొగసును ఆయన మాటల్లో చూడవచ్చు. ఆయన ముఖ్య అతిథిగా వస్తే ఆ సభ కళ కళ లాడుతుంది. మాటలతో చదరంగం ఆడుకుంటారు సినారె.

    * మన రాష్ట్రంలో పేరుపొందిన నాటక పరిషత్తులలో తూర్పుగోదావరి జిల్లా రామవరంలోని నల్లమిల్లి మూలారెడ్డి కళాపరిషత్ ఒకటి. ఒకసారి ఆ పరిషత్తు ఉత్సవాల్లో డా. సి. నారాయణ రెడ్డి గారికి సన్మానం ఏర్పాటు చేశారు. ఏర్పాట్లు బ్రహ్మాండంగా వున్నాయి. ఇసుక వేస్తే రాలనంత జనం. ఆ సందోహాన్ని చూసి ఒక వక్తకు ఉత్సాహం పెల్లుబుకింది. ఆ ఉత్సాహంలో ఆ సభను మయసభ తో పోల్చాడు.
    సినారె గారు దానికి ప్రతిస్పందిస్తూ " ఇంతకుముందు మాట్లాడిన మిత్రులు ఈ మహాసభను మయసభతో పోల్చారు. అయితే మయసభ అంటే ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా భ్రమ కల్పించడం. పైగా అపోహలూ, అవమానాలు. కనుక ఇది మయసభ అనడం సరైనది కాదు. దీన్ని మనం వాజ్ఞ్మయసభ అంటే బాగుంటుంది. " అన్నారు. ఇక సభంతా ఒకటే కేరింతలు ఆ గిలిగింతలకి. 

    * మార్కాపురం పలకలకి ప్రసిద్ధి అని మనకందరికీ తెలుసు. రాతి పొరలనుండి ఆ పలకలు తయారవుతాయి. కొంతకాలం క్రితం వరకూ మార్కాపురం పలక మీద ఓనమాలు దిద్దని తెలుగు వారుండేరేవారు కాదు. ఇప్పటి తరానికి పలకాలంటే తెలీదేమో !
    ఓసారి ఆ ఊరి కళాశాల వార్షికోత్సవానికి నారాయణ రెడ్డి గారు ముఖ్య అతిథిగా వచ్చారు. ఆ రోజు ఆయన తన ఉపన్యాసంలో " కొందరి గుండెల్లో పొరలు లాగే మార్కాపురం బండల్లో కూడా పొరలున్నాయి. అయితే మనుష్యుల గుండెల్లోవి పొరలు ఉండకూడని పొరలు. మార్కాపురం బండల్లో వున్న పొరలు ఉండాల్సిన పొరలు. ఎందుకంటే అవి అందరికీ పనికొచ్చేవి కనుక " అనడంతో మార్కాపురం వాసుల ఆనందం చెప్పాలా !

     ఇవి నారాయణ రెడ్డి పద విన్యాసానికి మచ్చు తునకలు మాత్రమే !

    Vol. No. 01 Pub. No. 280

    Saturday, May 1, 2010

    నవ్వే పరమౌషధం !

    నవ్వడం ఒకయోగం.
    నవ్వించడం ఒక భోగం.
    నవ్వకపోవడం ఒక రోగం.
    అన్నారు మన హాస్యబ్రహ్మ జంధ్యాల.

    నవ్వు ఆరోగ్యానికి దగ్గర దారి. హాయిగా ఆనందంగా నవ్వగలిగే వారి దగ్గరికి రోగాలు చేరడానికి భయపడతాయి. ఈ నవ్వు విశిష్టతను విశ్వవ్యాప్తం చెయ్యడంలో మన భారతీయునిదే ప్రధాన పాత్ర.

    1998 లో ముంబై కి చెందిన డా. మదన్ కటారియా అనే ఆయన నవ్వుల యోగా ప్రక్రియను విశ్వవ్యాప్తం చెయ్యాలనే సంకల్పంతో ప్రపంచ నవ్వుల దినోత్సవానికి అంకురార్పణ చేసాడు. అప్పటినుండి ప్రపంచవ్యాప్తంగా ప్రతీ సంవత్సరం మే నెల మొదటి ఆదివారం ఈ నవ్వుల దినోత్సవాన్ని పాటిస్తున్నారు. నవ్వు ద్వారా స్నేహం, సౌభ్రాతత్వం పెంపొందించి తద్వారా ప్రపంచశాంతికి కృషి చెయ్యాలని డా, కటారియా ఆశయం. ప్రపంచ ప్రజలందరినీ ఈ విషయంలో ఏకం చెయ్యడానికి ఈ ప్రపంచ నవ్వుల దినోత్సవాన్ని ప్రారంభించాడు. దీనికి దారి తీసిన పరిస్థితుల్ని ఒకసారి పరిశీలిద్దాం.

      ' రాత్రింబవళ్ళు వేధించే ఒత్తిళ్ళ మధ్య రోజూ కాసేపైనా నవ్వలేకపోతే నేను ఎప్పుడో మరణించి ఉండేవాణ్ణి ' అన్నారు అబ్రహాం లింకన్. 
    ఇది సత్యం. ఈ సత్యాన్ని వంటపట్టించుకున్న మనిషి డాక్టర్ మదన్ కటారియా. తానే కాదు తన నగర ప్రజలకు... కాదు.. రాష్ట్ర ప్రజలకు... కాదు.. కాదు.. ఈ దేశ ప్రజలకు... ఊహు! కాదు... కాదు... ప్రపంచానికే నవ్వుల టానిక్ ని పంచాడీ డాక్టర్. 1995 మార్చి 13 న తెల్లవారు ఝామునే లేచిన ఆయనకు ఎందుకో నవ్వు వచ్చింది. దాని గురించి ఆలోచిస్తుండగా ఆయనకు అమెరికాకు చెందిన నార్మన్ కజిన్స్ అనే ఆయన రాసిన 'అనాటమీ ఆఫ్ ఏన్ ఇల్ నెస్' అనే పుస్తకం గుర్తుకొచ్చింది. అందులో తన వెన్నుముకకు వచ్చిన వ్యాధి నవ్వుతో ఎలా నయమయిందో కజిన్స్ వివరంగా రాశాడు. కాలిఫోర్నియా లిండా యూనివర్శిటీకి చెందిన డాక్టర్ లీ.ఎస్.బెర్క్ శరీరానికి వత్తిడికి కలిగించే హార్మోన్లను కట్టడిచేసి వ్యాధి నిరోధకశక్తిని పెరగడానికి నవ్వు సరైన మందుగా తన పరిశోధనలలో వెల్లడయిందని పేర్కొంటూ ఒక పరిశోధన గ్రంథం రాశాడు.

    ఈ విషయాలన్నీ తన 'మేరా డాక్టర్' అన్న పత్రికలో రాస్తే పాఠకులు నవ్వు గొప్పదనాన్ని తెలుసుకుంటారనిపించింది డాక్టర్ మదన్ కి. కానీ ఆ వెంటనే తన పత్ర్రిక ఎంతమంది చదువుతారు? చదివినా తన వ్యాసం ఎవరు చదువుతారు? చదివినా ఎంతమంది దీన్ని ఆచరణలో పెడతారని... ఇలా చాలా సందేహాలొచ్చాయి. అలా ఆలోచిస్తూనే ఆయన రోజూ వెళ్ళే ఉదయపు వ్యాహ్యాళికి అదేనండి! మార్నింగ్ వాక్ కి బయిలుదేరాడు. అలవాటుగా వెళ్ళే లోఖండ్ వాలా కాంప్లెక్స్ లోని పబ్లిక్ గార్డెన్స్ కి వెళ్ళాడు. అక్కడ ఇంకా ఆయన లాంటి వాళ్ళు చాలామంది చేరారు. వాళ్ళందరినీ పిలిచి తనకొచ్చిన ఆలోచనలన్నీ వివరంగా చెప్పి రోజూ కొంతసేపైనా తనివి తీరా హాయిగా నవ్వుకుంటే ఆరోగ్యం దివ్యంగా ఉంటుందని మందులతో పని ఉండదని చెప్పాడు. ఇదంతా నవ్వులాటగా తీసుకున్న కొందరు వెళ్ళిపోగా, చెప్పేది డాక్టర్ కదా ఇదేమిటో చూద్దాం అని కొంతమందే మిగిలారు.

    వాళ్ళకు మదన్ ఒక జోక్ చెప్పాడు. అందరూ హాయిగా వవ్వారు. ఒకటి తర్వాత మరొకటిగా జోకులు పేల్చాడు. అందరికీ నవ్వనే ఔషధం పంచి, ఇక ఇంటికెళ్ళండి. ఈ రోజంతా మీ ఆరోగ్యం బేషుగ్గా ఉంటుందని పిస్క్రిప్షన్ రాసిచ్చినంత ధీమాగా హామీ ఇచ్చేశాడు. అందులోని నిజాన్ని అనుభవించిన వాళ్ళందరూ మర్నాటి నుంచి తాము కూడా జోకులు చెప్పి అందర్నీ నవ్వించడమే పనిగా పెట్టుకున్నారు. ఆరోగ్య ఫలితాలు అనుభవించారు.

    అలా ముంబయిలోని అంధేరీ ప్రాంతంలో 1995 మార్చి 13 న లాఫర్స్ క్లబ్ ఏర్పడింది. తరవాత్తరవాత కేవలం జోకులే కాకుండా నవ్వును ఒక యోగ ప్రక్రియలా సాధన చెయ్యడం ప్రారంభించారు. నెమ్మదిగా ఈ క్లబ్ కి ముంబయి నగరమంతా, రాష్ట్రమంతా, దేశమంతా శాఖలు ఏర్పడ్డాయి. మానసిక, శారీరిక రుగ్మతలకు దివ్యౌషధమైన నవ్వు విశిష్టతను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు ఈ లాఫర్స్ క్లబ్ సభ్యులు. ఇప్పుడది ప్రపంచ స్థాయికి చేరి నవ్వులకో రోజును ఏర్పాటు చేసుకుంది. 


    ఈ నవ్వుల దినోత్సవం రోజున మనం కూడా హాయిగా, మనసారా నవ్వుకుందాం! రోగాలను దూరం చేసుకుందాం ! 


    మనవి : ఈ సందర్భంగా హాస్య బ్రహ్మ జంధ్యాల అందించిన ఈ దండకం చూసి బ్లాగ్మిత్రులు ఈ రోజు  వీలైనన్ని ఎక్కువ నవ్వులు పంచండి. మీరు సృష్టించిన లేదా మీకు తెలిసిన జోకులను చెప్పండి.




    Vol. No. 01 Pub. No. 279