Friday, January 8, 2010

శ్రీశ్రీ శ్రవ్య నాటికలు

రంగస్థలం మీద ప్రదర్శించే దృశ్య ప్రధానమైన నాటికలకు భిన్నమైనవి శ్రవ్య నాటికలు. దృశ్య నాటికలు గానీ, నాటకాలు గానీ సంభాషణలకంటే నటుడి / నటి హావభావాల ద్వారా రచయిత / ప్రయోక్త చెప్పదలచుకున్న సందేశాన్ని ప్రేక్షకులకు అందిస్తాయి. కానీ శ్రవ్య నాటిక / నాటకానికి ఆ సౌలభ్యం లేదు. అక్కడ దృశ్యం ఉండదు. ప్రేక్షకులుండరు. కేవలం శ్రోతలు మాత్రమే ఉంటారు. రచయిత సంభాషణలలోనే దృశ్యాన్ని అందించగలగాలి. నటీనటులు తమ హావభావాలను సంభాషణలలోను, చిన్న చిన్న ఎక్స్ ప్రెషన్స్ ద్వారాను వ్యక్తం చెయ్యగలగాలి. అందుకే శ్రవ్య నాటిక రచన దృశ్య నాటిక రచన కంటే కష్టమైనది.

1980 దశకం వరకూ సామాన్యుడికి అందుబాటులో వున్న ఏకైక ప్రధాన ప్రసార మాధ్యమం ' రేడియో ' అదే 'ఆకాశవాణి '. మన దేశంలో స్వాతంత్ర్యానికి పూర్వమే ప్రాచుర్యంలోకి వచ్చిన రేడియో తర్వాత సామాన్య జనం జీవితాలలో విడదీయరాని భాగమైపోయింది. అప్పట్లో నాటకాలంటే దసరా, వినాయక చవితి మొదలైన ఉత్సవాల సమయంలోనో, అరుదుగా ఇతర సమయాలలోను ప్రదర్శించేవే ! రేడియో ప్రాచుర్యంలోకి వచ్చాక శ్రవ్య నాటక యుగం ప్రారంభమైంది. ప్రసిద్ధ నటుల రంగస్థల నాటకాలు గ్రామఫోన్ రికార్డులుగా వచ్చినా అప్పట్లో గ్రామఫోను కూడా లగ్జరీనే కావడం వలన అవి శ్రవ్య రూపంలో కన్న దృశ్య రూపంలోనే ఎక్కువ ఆదరణ పొందాయి. రేడియో శ్రవ్య నాటకాలను ప్రోత్సహించింది. ఎన్నో మంచి నాటకాలు వచ్చాయి. మరెన్నో మంచి నాటకాలు, కథలు, నవలలు శ్రవ్య నాటికలు, నాటకాలుగా రూపాంతరం చెందాయి. ప్రత్యేకంగా శ్రవ్య నాటకాలను రచించే రచయితలతో బాటు కొందరు ప్రసిద్ధ కవులు, రచయితలు అనేక రూపాల్లో శ్రవ్య నాటక రచన సాగించారు.

వారిలో మహాకవి శ్రీశ్రీ కూడా ఒకరు. ఆయన రేడియో కోసం రచించిన నాటికలు అప్పట్లో ప్రయోగాత్మకమైనవనే చెప్పాలి. వాటిల్లో కూడా ఆయన సామాన్య జనం తరఫునే నిలిచారు. వాటిల్లో కూడా ఆయనకే ప్రత్యేకమైన శైలి కనబడుతుంది. 1962 వరకూ రేడియోలో ( ఎక్కువగా మద్రాసు ఆకాశవాణి కేంద్రం నుండి ) ప్రసారమైన శ్రీశ్రీ నాటికల్ని' 1+1 = 1 మొదలైన రేడియో నాటికలు' అనే పేరుతో సంకలీకరించారు. ఆ నాటికలలో ఒకటి ఇంతకు ముందు టపాలో పరిచయం చేసిన ' గుమాస్తా కల ' . శ్రీశ్రీ రచనలు ' మహాప్రస్థానం ' 'సిరిసిరి మువ్వ ' ' ఖడ్గసృష్టి ' లాంటి కవితా ఖండికలు గుర్తున్నంతగా ఆయన నాటికలు గుర్తుండవు. మరోసారి ఆ మహాకవి రచించిన నాటికల్ని గుర్తు చేసే చిన్ని ప్రయత్నం ఈ పరిచయం.

Vol. No. 01 Pub. No. 154

Thursday, January 7, 2010

గుమాస్తా కల

ఆశ : అమెరికా దేశం కోనేటిరావును ఆహ్వానించింది.

భయం : అమెరికా ఎందు కాహ్వానించింది అతణ్ణి ?

ఆశ : ప్రపంచంలో ఈయన్ని మించిన ఇంజనీయరు లేడని.

ఆహ్వాన
పత్రం
ప్రపంచ ప్రథమ పౌరునికి అమెరికా స్వాగతం. మా ఆతిథ్యం మీరు స్వీకరించాలి. మా టేన్నేస్సీ లోయను తమరు తనిఖీ చెయ్యాలి. అమూల్యమైన మీ సలహాలను శిరసావహిస్తాము. సిఫారసులను తక్షణం అమలు చేస్తాము...(కరతాళ ధ్వనులు )

కోనేటి
: అబ్బే ! అదెంతమాట ! అల్పజ్ఞుణ్ణి. నన్నేదో పెద్దవాణ్ణి చేసి పొగుడుతున్నారు. నా మాత్రం తెలివైనవాళ్ళు మీ అమెరికాలో లేకపోయారా ? ఆంధ్రదేశం నుంచి ప్రత్యేకం నన్నిక్కడ కాహ్వానించడం మీ ఔదార్యాన్నే చాటుతోంది. అయినా సన్మానం నాదికాదు. ఆంధ్రదేశానిదీ గౌరవం.

(
చంటి పిల్ల ఏడ్చిన చప్పుడు. కోనేటిరావుకు మెలుకువ వస్తుంది. )

***********


భయం : ఈమారేమిటి ? సముద్రంలో ఏం చేస్తున్నాడు ?

ఆశ
: ప్రపంచ మహాయుద్ధాన్ని భావిస్తున్నాడు.

భయం : ఓహో ఎంత దివ్యంగా ఉంది. యుద్ధంలో కోనేటిరావు ప్రధాన పాత్రధారి కాబోలు.

ఆశ : ఔను. ఈసారి ఈయన జర్మన్ సబ్మేరిన్ కమాండర్ జటాఫట్ కొనేట్.

భయం : అయితే ?

ఆశ : అట్లాంటిక్ మహాసముద్ర గర్భంలో అతని జలాంతర్గామి తిమింగలంలాగ విహరిస్తోంది.

-----

కోనేటి : వేల్దాన్ షాంగ్ డెర్ ఉంటార్ డెన్ లిండెన్ ! గేస్తాల్ట్ డెర్ డాయిష్లాండ్ ఊబర్ ఆల్స్ .

ఆశ : మంచినీళ్ళ ప్రాయంగా జర్మన్ భాష మాట్లాడేస్తున్నాడు.

భయం : మాటకి అర్థం ఏమిటి ?

ఆశ : మాటలేమైనా ఫలితం ప్రధానం. తునా తునియలై పోయింది శతృనౌక.

--------

ఆశ : శతృ నావికులమీద మెషీన్ గన్లు పేల్చమని తన తరఫువారికి ఆర్డర్లు ఇస్తున్నాడు.

కోనేటి : ఫోల్కిషేర్ బియో బాక్టర్ ! గెహన్నా, ఆఖ్ టుంగ్, జైట్ గైన్ట్ ! మైన్ క్యాంప్.

( పిల్లి పాలగిన్నెను పడతోసిన చప్పుడు, తుళ్ళిపడిలేస్తాడు కోనేటి రావు )

***********

ఆశ : కోనేటిరావు కథానాయకుడుగా సినిమాలో నటిస్తున్నాడు.

భయం : యాభై యేళ్ళ కోనేటిరావు.

ఆశ : కలలో కోనేటిరావు వయస్సు పాతికేళ్ళే. బహుశా ఇంకాతక్కువ. కలలో కోనేటిరావు స్థూలకాయుడు కాదు. ఆజానుబాహువు. సౌందర్యాపరమత్స్య లాంచనుడు. కళా సర్వజ్ఞుడు కూడాను.

భయం : కథానాయిక ఎవరు ?

ఆశ : అతని స్వప్నసుందరి.

------

ఆశ : కథానాయిక అనేకమైన ఇబ్బందులలో, అరణ్యాలలో - భయంకర మృగాల మధ్య, నగరాలలో భయంకర పరిస్థితుల మధ్య చిక్కుకుంటుంది. ఆమెను కథానాయకుడు రక్షిస్తాడు. వారు పరస్పరం ప్రేమించుకుంటారు.

------

ఆశ : సౌందర్యం సమక్షంలో కోనేటిరావు నిలుచున్నాడు. అతని హృదయంలో ప్రేమ సంగీత రూపంలో ప్రవహిస్తోంది. కథానాయిక అతని ప్రేమని గానంతో అంగీకరించింది. కథలో అతడే సత్యవంతుడు. ఆమె సావిత్రి. అతడు రోమియో. ఆమె జూలియట్. అతడు కోనేటిరావు. ఆమె కోనేటిరాణి.

**********

భయం : అసలీ కోనేటి రావెవరు ?

ఆశ : అనంతకోటి కచేరీలలో ఒక గుమాస్తా.

భయం : అనధికారరీత్యా అతనికేమీ హోదా లేదా ?

ఆశ : కోనేటిరావు అందరిలోనూ,అందరిలాగే ఒక మానవుడు, సంసారి. పెళ్ళాన్నీ, పిల్లల్నీ ప్రేమిస్తాడు. కానీ తరచూ వాళ్ళ మీదా, తన మీదా విసుక్కుంటాడు. అతని జీవితంలో స్మరించదగ్గ సంఘటన లేవీ లేవు. సాహిత్య రంగంలో అతనికి నాయకత్వంలేదు. పత్రికలలో అతని పేరు కనబడదు. ప్రపంచంలో అతని పేరు వినబడదు. అతని నిజమైన జీవితం ఒక స్వప్నం. అతని స్వప్నం సాధ్యంకాని అబద్ధం.

() ******** ()

ఇదీ ఓ సగటు గుమాస్తా కలల ప్రపంచం. మహాకవి శ్రీశ్రీ రాసిన ' గుమాస్తా కల ' అనే రేడియో నాటికలోని కొన్ని ముఖ్యమైన ఘట్టాలు. సామాన్య మధ్య తరగతి మానవుని అంతరంగాన్ని ఇంతకంటే బాగా ఆవిష్కరించడం ఇంకెవరికైనా సాధ్యమా ? శ్రీశ్రీ కి మాత్రమే ఆ అథారిటీ ఉంది. సామాన్యుడు కలలు మాత్రమే కనగలడు. అవి తీర్చుకునే మార్గాలు లేవనుకోవడం నిరాశావాదం. కానీ శ్రీశ్రీ ఆశావాది. అందుకే ఆయన ఈ నాటికలో .......

మానవుడు కలలు కనడం మానలేడు. కోనేటిరావు జీవితంలో అవి ఫలింపక పోవచ్చును. మరో జీవితంలో, ఇంకో కాలంలో మానవజాతి తన స్వప్నాలను సాధించగలుగుతుంది.

......... అంటారు.

సామాన్యుడిలోని ఆశ, భయం ల మధ్య జరుగుతున్న సంభాషణ రూపంలో ఈ నాటిక సాగుతుంది. కోనేటిరావు లాంటి ఒక మామూలు గుమాస్తా తన ఆశల్ని, తన భయాల్ని నిద్రలో, కలల్లో సాక్షాత్కారించుకుంటాడు. ఆ కలల్లో అతని ఆశలు తీరుతాయి. అతని భయాలు పారిపోతాయి. ఆ కలల్లో అతను ఒక మేధావి. ఒక యోధుడు. ఒక హీరో. ఒకటేమిటి. నిజ జీవితంలో అతనేం కాలేడో....కలల్లో అవన్నీ కాగలడు !

సామాన్య మానవుడి తరఫున వకాల్తా పుచ్చుకున్న శ్రీశ్రీ గురించి, ఆయన రచనల గురించి సమీక్షించడం సూర్యుడి ముందు దివిటీ వెలిగించడమే ! అందుకే ఇది సమీక్ష కాదు. కేవలం ఆయన నాటిక పరిచయం మాత్రమే !

Vol. No. 01 Pub. No. 153

Wednesday, January 6, 2010

కనుక్కోండి చూద్దాం - 7

ఈ పాట ఏ చిత్రంలోదో తెలుసుకోవడం సుళువే !
గాయకుడెవరో కూడా చెప్పగలరనుకుంటాను.
ఇప్పుడు గాయని ఎవరో కనుక్కోండి చూద్దాం !



Vol. No. 01 Pub. No. 152

Tuesday, January 5, 2010

మునిమాణిక్యం ' పిల్లసాకులు '


సున్నితమైన హాస్యానికి పెట్టింది పేరు మునిమాణిక్యం నరసింహారావు గారు. ఆయన కాంతం కథలు తెలియని తెలుగు పాఠకులుండరేమో !
అనుకోకుండా ఏదైనా తప్పిదం జరిగి, అది తన ప్రమేయం లేకుండా జరిగిపోయిందని నమ్మించడానికి కొన్ని అసందర్భ కారణాలను ఆసరాగా తీసుకుంటాం. అవి నిజం కాదని వినేవారికి తెలుసని మనకూ తెలుసు. అయినా మనల్ని సమర్థించుకోవడానికి అంతకంటే దారి కనబడక అసంబద్ధ కారణాలను చూపిస్తాం. ఈ విషయంలో పిల్లలు మనకాదర్శం. ఆటల్లో తగవులు, బడిలో మంచి మార్కులు తెచ్చుకోలేకపోవడం వగైరా సందర్భాల్ని సమర్థించుకోవడానికి వాళ్ళుపయోగించే కారణాలే పిల్ల సాకులు. వీటిని మునిమాణిక్యం గారు ఎలా వర్ణిస్తున్నారో చూడండి.

" మా ఆవిడ బల్ల మీద పెట్టిన మంచి నీళ్ళ గ్లాసు ఆదంతట అదే మొగ్గేసి బోర్ల పడుతుంది. పుస్తకాలన్నీ తడిసి పాడైపోతవి.
లాంతరు అదంతట అదే క్రింద పడుతుంది. నూనె అంతా వలకపోసుకుంటుంది.
పుస్తకంలోని పేజీ వాటంతట అవే చినిగి ముక్కలైపోతవి.
మరీ విచిత్రమైన విషయం ఏమిటీ అంటే మా ఆవిడ పులుసు రాచ్చిప్ప పొయ్యి మీద పెట్టి దొడ్లోకి వెళ్లి వచ్చేసరికి స్నానాల గదిలో డబ్బాలో వున్నా బొగ్గులు అవంతట అవే నడిచి వచ్చి పులుసు రాచ్చిప్పలో పడతాయి "

ఇలా సాగుతాయి మునిమాణిక్యం గారి పిల్ల సాకులు......

Vol. No. 01 Pub. No. 151

Monday, January 4, 2010

తెలుగు పాటల హిందీ చిత్రం

వి. శాంతారాం గురించి భారత చలన చిత్ర ప్రేక్షకులకు పరిచయం చెయ్యాల్సిన అవసరం పెద్దగా ఉండదనుకుంటాను. టాకీలు ప్రారంభమైన తొలినాళ్ళలోనే చిత్ర నిర్మాణం ఆరంభించి అద్భుతమైన చిత్రాలను అందించారు. ఆయన నిర్మించిన కళాఖండాలు ' ఝనక్ ఝనక్ పాయల్ బాజే ', 'జల బిన్ మచిలీ నృత్య బిన్ బిజిలీ ', 'దో ఆంఖే బారః హాత్ ', ' నవరంగ్ ' ఇలా ఎన్నో....

శాంతారాం 1950 ప్రాంతంలో ' అప్నా దేశ్ ' అనే పేరుతో హిందీలో ఒక చిత్రాన్ని నిర్మించారు. అదే చిత్రాన్ని తమిళంలో ' నమ్ నాడు ' పేరుతో నిర్మించారు. తెలుగులో కూడా నిర్మించాలనే ఉద్దేశ్యంతో కొన్ని పాటలు కూడా రికార్డు చేశారు. తర్వాత ఎందుకో తెలుగు చిత్ర నిర్మాణం విరమించుకున్నారు. అయితే ' అప్నా దేశ్ ' హిందీ చిత్రం ఆంధ్రలో విడుదలయినప్పుడు ఇక్కడి ప్రింట్లలో మాత్రం తెలుగు పాటల్ని ఉంచేశారు. ఆ పాటల్ని ఆ చిత్ర కథానాయిక పుష్ప హన్స్ మొదలైన వారితో బాటు మన తెలుగు గాయని టంగుటూరి సూర్యకుమారి కూడా పాడారు. ఆ చిత్రంలో సూర్యకుమారి పాడిన పాటను వినండి........



Vol. No. 01 Pub. No. 150

Sunday, January 3, 2010

విజయవాడలో e-తెలుగు


విజయవాడకు, తెలుగు పుస్తకానికి అవినాభావ సంబంధముంది. పుస్తక ప్రియులకు ఎంతో ఇష్టమైన ప్రదేశం విజయవాడ. తెలుగు ప్రచురణల రాజధాని. తెలుగు భాషలో ఎన్నో పుస్తకాలు ఇక్కడ ప్రచురించబడ్డాయి. ఎందరో రచయితల్ని పాఠకులకు పరిచయంచేసిన, దగ్గర చేసిన నగరం విజయవాడ.





అలాగే అనేక విషయాల మీద, అనేక అంశాల మీద దేశ విదేశీ ప్రచురణలను పరిచయం చేసే ఉద్దేశ్యంతో ఇరవై సంవత్సరాల క్రితం విజయవాడలో పుస్తక ప్రదర్శన ప్రారంభమైంది.








21 వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన ఈ పుస్తక ప్రదర్శనలోని ప్రతిభా వేదికపై 03-01-2010 ఆదివారం రోజున 'e- తెలుగు ' ఆధ్వర్యంలో కంప్యూటర్లో తెలుగు వాడకం గురించిన అవగాహనా సదస్సు నిర్వహించింది.







e- తెలుగు నిర్వాహకులు శ్రీ కశ్యప్ ( కబుర్లు ) కంప్యూటర్లో తెలుగు ఆవశ్యకతను వివరించారు. శ్రీ చక్రవర్తి ( భవదీయుడు ), శ్రీ సతీష్ కుమార్ ( సనాతన సారధి ) తెలుగు ఉపకరణాలు, వాటి వినియోగం, తెలుగులో బ్లాగ్ నిర్వహించడం గురించి సోదాహరణంగా వివరించారు.







ఈ సందర్భంగా ఇప్పటివరకూ ఆంగ్లంలో బ్లాగు నిర్వహిస్తున్న శివ అనే బ్లాగర్ తెలుగు రాయటం మీద తన సందేహాలను తీర్చుకుని తెలుగులో బ్లాగ్ ప్రారంభించడానికి చాలా ఆసక్తి కనబరిచారు.







ఆయ
నలాగే కంప్యూటర్ తెలుగుపై తమ సందేహాలను తీర్చుకున్న అనేకమంది ఆ వివరాలను పొందుబరచిన సి.డీ.లను, కరపత్రాలను అడిగి మరీ తీసుకోవడం కనిపించింది. అలాగే ఈ అంశంపైన ఇచ్చిన పవర్ పాయింట్ ప్రదర్శన ప్రేక్షకులను ఆకట్టుకుంది.










ఈ కార్యక్రమములో e- తెలుగు నిర్వాహకులు శ్రీ కాశ్యప్, శ్రీ చక్రవర్తి, శ్రీ సతీష్, ఇంకా కొందరు e- తెలుగు సభ్యులతో బాటు విజయవాడ నుంచి నవ్వులాట శ్రీకాంత్, శిరాకదంబం, తెలుగుకళ పద్మకళ, జాగృతి ప్రసాద్ మొదలైన బ్లాగర్లు కూడా పాల్గొన్నారు.

కొస మెరుపు : ఈ అవగాహనా సదస్సు విజయవంతం అయిందనడానికి ఋజువు -
ఈ సభలో పాల్గొన్న వారిలో ఇంతకు ముందు బ్లాగ్ ల గురించి, కంప్యూటర్లో తెలుగు గురించి తెలియని సుమారు 12 మంది వరకు తెలుగులో బ్లాగ్ లను ప్రారంభించడానికి నిర్ణయం తీసుకోవడమే !

Vol. No. 01 Pub. No. 149

Friday, January 1, 2010

'సాక్షి' పానుగంటి


పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారి పేరు చెబితే ముందుగా గుర్తుకొచ్చేవి ' సాక్షి ' ప్రసంగ వ్యాసాలు. వ్యంగ్య రచనలో ఆయనది అంది వేసిన చెయ్యి.
ఆయనోసారి ఆంధ్ర సాహిత్య పరిషత్ సభకు అధ్యక్షత వహించారు. ఆనాటి ఉపన్యాసంలో తన మీద తనే వేసుకున్న కొన్ని వ్యంగ్య బాణాలు....
" నేను పండితుడిని గానని ఈ ఉరివారెరుగుదురు. పై గ్రామం వారెరుగుదురు. సాహిత్య హీనతలో జగమెరిగినవాడను గానీ, సాధారుణుడనుగాను.
ఇట్టి నన్ను పరిషత్తువారేల ఎన్నుకొనిరో నాకు తెలియదు. వెనుక జరిగిన పది పరిషత్సభలకు పండితుల నెన్నుకుంటిమికదా ! ఈసారి ఆపండితుడి నెన్నుకుందము, ఇంతలో చెడిపోవునదేమున్నదని ఊహించి మార్పు కొరకై నన్నెన్నుకొని వుందురేమో ? ఎటులైననేమి ? అనిలంఘ్యమైన మహాజనులయాజ్ఞ తులశీ దళముల వలె శిరమున ధరించి యిట నిలవబడితిని " ...... అంటూ సాగిందట ఆ చమత్కార ప్రసంగ ప్రవాహం.

Vol. No. 01 Pub. No. 148