Wednesday, October 7, 2009

పెను ఉత్పాతాలు- నా అనుభవాలు

మన రాష్ట్రంలో పెను ఉత్పాతాలుగా చెప్పుకునే రెండు వైపరీత్యాల్లో నా అనుభవాలు.
1. 1977 నవంబర్ 19 తేదీన సంభవించిన దివిసీమ ఉప్పెన
అర్థరాత్రి
- కృష్ణ , గుంటూరు జిల్లాల ప్రజలకు కాళరాత్రి. అందరూ గాఢ నిద్రలో ఉండగా సముద్రం ఒక్కసారిగా విరుచుకుపడింది. అధికారిక లెక్కల ప్రకారం 10,౦౦౦ మంది శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయారు. అనధికారిక లెక్క లక్ష పై మాటే ! ఎక్కడచూసినా గుట్టలుగా మనుష్యుల, పశువుల శవాలు. ఎటు తిరిగినా కూలిపోయిన ఇళ్ళూ, చెట్లూ!! దృశ్యం వర్ణించలేను. తమ కళ్ళ ముందే మనుష్యుల్ని, పశువుల్ని తాడిచెట్టు పరిమాణానికి ఎగరవేస్తుంటే..... బాధితులు చెబుతుండగా వింటుంటేనే నాకు ఒళ్ళు జలదరించింది. మరి స్వయంగా చూసిన వాళ్ల పరిస్థితి..... ....? 20 తేదీన దివిసీమ చేరే దారిలేక గుంటూరు జిల్లాలో బాపట్ల ప్రాంతానికి అతి కష్టం మీద చేరుకోగలిగాను. బీభత్సకర దృశ్యాల్ని చూసి మనసు కకావికలమై పోయింది దివిసీమ వెళ్లాలనుకున్నా ధైర్యం చాలక వెనుదిరిగాను.
2. 1986 ఆగష్టు నెల లో గోదావరికి వచ్చిన వరద
ఆగష్టు
15 తేదీ స్వాతంత్ర్య దినోత్సవం. జెండా వందనం జరిగింది. అప్పుడే ఒక మిత్రుడు కబురు మోసుకొచ్చాడు. గోదావరి ఉప్పొంగి మా కోనసీమను చుట్టుముట్టిందని. ఉభయ గోదావరి జిల్లాల్లో మెట్ట ప్రాంతాలు తప్ప మిగిలిని ప్రాంతమంతా జలదిగ్భంధమైపోయింది . అప్పటికి వారం రోజులనుండి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ఆరోజే తెరిపిచ్చాయి. రెండురోజులుగా వరద హెచ్చరికలు వస్తూనే ఉన్నాయి. అయితే వర్షాలు, వరదలూ అలవాటైపోయిన ప్రజలు అది మామూలు విషయంగానే తీసుకున్నారు. అదీకాక ఇంతటి సమాచార వ్యవస్థ అప్పుడులేదు. రేడియోనే ఆధారం. అదికూడా చాలా తక్కువమందికే ఉండేది. వరద తీవ్రత సమాచారం ప్రజలకి చేరకముందే వరద చేరిపోయింది. లంక గ్రామాలన్నీ ముంచేసింది. అంతకంతకూ పెరుగుతున్న ప్రవాహం మధ్యనుంచి ఇళ్ళ పైకప్పులమీద బిక్కుబిక్కుమంటూ కూర్చున్న ప్రజల్ని ఒడ్డుకి చేర్చటం గగనమైపోయింది. అక్కడక్కడా పాక్షికంగా మునిగిపోయిన ఇళ్లలోని జనం తమ ఆస్తుల్ని వదిలి రావడానికి మొండికేసేవారు. వాళ్ళని బ్రతిమాలి, మొండికేస్తే బెదిరించి సురక్షిత ప్రదేశాలకు తీసుకురావలసి వచ్చేది. రహదారులన్నీ తెగిపోయాయి. రవాణా వ్యవస్థ, సమాచార వ్యవస్థ కుప్పకూలాయి. స్థంబాలు నేలకోరగటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గట్లు తెగిపోకుండా యువకులు, పోలీసులు, రెవిన్యూ సిబ్బంది కలిసికట్టుగా కాపలాకాసి కొన్ని గ్రామాలను కాపాడగలిగారు. అప్పటి అమలాపురం ఆర్డీవో శ్రీ సుబ్రహ్మణ్యం గారు యువకుడు. సాహసి. విపరీతమైన వేగంతో ప్రవహిస్తున్న గోదావరిలోకి అందుబాటులో ఉన్న మామూలు నాటు పడవలో వెళ్లి మునిగిపోతున్న ఊరిని, ప్రజల్ని రక్షించడం, స్ఫూర్తితో నాలాంటి యువకులు సహాయకార్యక్రమాల్లోకి స్వచ్చందంగా దిగిపోవడం నేనింకా మర్చిపోలేను. పోలీస్, రెవిన్యూ వైర్లెస్, ఇలాంటి వైపరీత్యాలు సంభవించినపుడు అత్యవసరంగా ఉపయోగించే టెలీ కమ్యూనికేషన్స్ వారి వైర్లెస్ తప్ప మరే ఇతర సమాచార వ్యవస్థ పనిచేయకపోయినా, ఎక్కడైనా సమస్య ఉందని ఏరకమైన సమాచారం అందినా వారి సిబ్బందితో బాటు మమ్మల్ని కూడా సిద్ధం చేసి తక్షణం అక్కడ ప్రత్యక్షమయ్యే వారు. రహదారులు వరద నీటితో నిండిపోయి, గండ్లు పడి వాహనాలు వెళ్ళే పరిస్థితి లేని చోట కాలినడకన నీటిలో వెళ్లి రక్షణ కార్యక్రమాలు చేపట్టేవాళ్ళం. ప్రభుత్వాధికారులు రాలేదనే మాట ఎక్కడా వినపడేది కాదు. ఆయన ఇప్పుడేక్కడున్నారో ? అలాంటి అధికారులుంటే ఉద్యోగులకే కాక, ప్రజలకు కూడా సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలనే ఉత్సాహం ఉంటుంది. గోదావరి చరిత్రలో అతి పెద్ద వరదలవి. గణాంకాలు సరిగా గుర్తులేదుగానీ ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ దగ్గర వచ్చిన కృష్ణానది నీటిమట్టం కంటే కాటన్ బ్యారేజీ దగ్గర కొంచెం ఎక్కువగానే వచ్చినట్లు గుర్తు. ఇప్పటిలా నీటి ప్రవాహాన్ని నియత్రించే పరిస్థితి లేకపోవడం దీనికి కారణం కావచ్చు. ప్రస్తుతం సుమారుగా స్థాయి వైపరీత్యాన్ని దగ్గరుండి చూస్తున్న నాకు అప్పటి అనుభవాలు గుర్తుకొచ్చాయి. అయితే ఒక్క విషయం అలా స్పూర్తినిచ్చే అధికారులు ఇప్పుడు అంతగా కనబడడంలేదు. యువకుల్లో యాంత్రికత పెరిగిందేమోననిపిస్తోంది. కృష్ణా వరదల్లో స్వచ్చందంగా సహాయ కార్యకమాల్లో పాల్గొన్న దాఖలాలు అంతగా కనబడలేదు. ఎవరో వచ్చి కాపాడుతారులే మనకెందుకు అనే నిర్లిప్త కనబడుతోంది. ప్రభుత్వోద్యోగులు కూడా మనుష్యులే ! ఇంతటి విపత్తు సంభవించినపుడు పరిమిత సంఖ్యలో వుండే ప్రభుత్వోద్యోగులు మీదనే ఆధారపడకుండా మనవంతు ప్రయత్నం మనం చెయ్యాలనే ఆలోచన ప్రజల్లో ముఖ్యంగా యువకుల్లో ఉండాలి. స్ఫూర్తి ఉంటే ఎలాంటి విపత్తునైనా ఎదుర్కోవచ్చు.

Tuesday, October 6, 2009

సర్వ మానవ సమానత్వం

తుఫాను వాతావరణం. ఒక పండితుడు అవతలి వడ్డుకు వెళ్లడానికి నది దగ్గరకు వచ్చాడు. పడవ మాట్లాడుకున్నాడు. ప్రయాణం సాగుతోంది. పండితుడు కాలక్షేపానికి పడవవాడి జ్ఞానాన్ని పరీక్షించాలనుకున్నాడు. " ఒరేయ్ అబ్బీ! నీకు వ్యాకరణ శాస్త్రం తెలుసా ? " అని అడిగాడు. "తెలీదు బాబయ్యా !" అన్నాడు పడవవాడు. " అయితే నీ జీవితంలో పావువంతు వృధా ! నేను చూడు వ్యాకరణ శాస్త్రాన్ని ఔపోసన పట్టేశాను. సరేగానీ వేదాలు తెలుసా ? " అడిగాడు పండితుడు. "వేదాలా ! అంటే ఏటి బాబయ్యా !" ఆశ్చర్యకరంగా అడిగాడు పడవ మనిషి. " వేదాలంటే కూడా తెలీదా ? పోనీ... తర్కం, మీమాంస లాంటి వాటిగురించేనా విన్నావా ? " అన్నాడా పండితుడు. అబ్బే లేదన్నాడు పడవవాడు. పండితుడికి అతడి మీద చాలా జాలి వేసింది. " నిన్ను చూస్తే చాలా భాద వేస్తోందిరా అబ్బీ ! నీ జీవితంలో మూడువంతులు వృధా చేసుకున్నావురా !!" అన్నాడా పండితుడు. ఇంతలొ పెద్ద గాలి. ఒక పెద్ద అల పడవను తాకింది. పండితుడు కంగారు పడ్డాడు. పడవవాడు అడిగాడు " తమరికి ఈత వచ్చా బాబయ్యా ? " అని. " రాదురా ! ఇప్పుడెలా ? " అన్నాడు భయం భయంగా. " అయితే మీ జీవితం మొత్తం వృధా !! " అంటూ నదిలోకి దూకేసాడు పడవవాడు.
ఇది అందరికీ తెలిసిన కథే ! అందులో విశేషం లేదు. కానీ కథలో భిన్న కోణాలున్నాయి. అందులో ఒకటి అహం పనికి రాదన్నదైతే మరొకటి ప్రకృతి దృష్టిలో పండితుడు పామరుడు అనే తేడాలేమీ లేవనేది. అలాగే ప్రకృతికి బీదా గొప్పా తేడాలు కూడా ఉండవు. దానికి ఉదాహరణ తాజా వరదలు. భేదాలేమీ లేకుండా అందర్నీ ముంచెత్తింది. డబ్బు, పలుకుబడి కల వాళ్లు సైతం వాటిని ఉపయోగించి వరదని ఆపలేకపోయారు. ఇవన్నీ శాశ్వతం కాదని హెచ్చరించింది. ప్రకృతిలో అందరూ సమానమే! సృష్టిలో తేడాలు లేవు అని చాటి చెప్పింది. మనిషి తన సృష్టేనని గుర్తుచేసింది. అహంకారం పోరలుకమ్మి తన ఉనికిని తాను మరచిపోతున్న మనిషికి నువ్వు నా ముందు చాలా అల్పుడివిరా అని నెత్తి మీద మొట్టినట్లు అప్పుడప్పుడూ ఇలా తన ప్రతాపం చూపిస్తోంది . ఎంత అభివృద్ది సాధించినా ప్రకృతిని శాసించలేకపోతున్నాం. వరదల్ని, తుఫానుల్ని ఆపలేకపోతున్నాం . ఆపలేం కూడా ! మానవ మనుగడకు ప్రకృతిని ఉపయోగించుకునే శాస్త్ర సాంకేతిక అభివృద్ది అవసరమే కానీ మానవాళికి ముప్పుగా పరిణమించే అభివృద్ది ఆత్మహత్యా సదృశ్యం కాదా ? మనుగడే ప్రశ్నార్థకమైనప్పుడు అభివృద్ది దేనికోసం ? ఎవరికోసం ? ప్రకృతిని జయించగలిగాననుకోవడం ఎంత అవివేకం ! ఉదాహరణకు ప్రకృతిలో సహజంగా పెరిగే వైరస్ ద్వారా వచ్చే జబ్బులేన్నిటికో విరుగుడు కనిపెట్టాననుకున్నాడు మానవుడు. కానీ వాటిని కూడా తట్టుకునే కొత్త వైరస్ లెన్నో పుట్టుకొస్తున్నాయి. ప్రకృతిని జయించడం కల్ల . మనలోని అహాన్ని జయించి ప్రకృతి సహజత్వానికి భంగం కలగకుండా,అత్యాశకు పోకుండా మన మనుగడకు ఎంతవరకూ అవసరమో అంతవరకూ అభివృద్ధిని పరిమితం చేస్తే ప్రకృతి కూడా తన సహజ పద్ధతిలో నడుచుకుంటుంది. బీదా గొప్పా , కుల మత జాతి ప్రాంతీయ, పండిత పామర భేదాలు ప్రకృతికి లేవు. పుట్టుకతో మనుషులందరూ సమానమే! వారి వారి కర్మలను బట్టి , గుణాలను బట్టి విభజనలుంటాయని ఆది శంకరుల మాట. ఇది అక్షర సత్యం.
కొస మెరుపు : ఇదంతా నిజమే! కానీ మేము కొంచం ఎక్కువ సమానం అని కర్నూల్ లో కొంతమంది బడాబాబులు నిరూపించారు. తమ డబ్బు, పలుకుబడి ఉపయోగించి నీటి గండం నుంచి తప్పించుకోవడమే కాక వరద నీరు మిగిల్చిన బురద శుభ్రం చెయ్యడానికి ప్రభుత్వం పంపించిన యంత్రాలను , సిబ్బందిని కూడా కొనేస్తున్నారు. మరి సామాన్యుల సంగతి, వారికి పంపుతున్న పరిహారం సంగతి..... దేవుడికే తెలుసు. అన్నట్లు ఆయన కూడా వాళ్ల పక్షమే కదా!



Monday, October 5, 2009

ఊరు పోమ్మంటోంది

"ఊరు పోమ్మంటోంది కాడు రమ్మంటోంది ". జవసత్వాలుడిగి వయసుమళ్ళిన వయోవృద్దుల్ని ఉద్దేశించిన సామెత ఇది. కానీ ప్రకృతి విలయతాండవంలో చిక్కుకున్న వారందరికీ ప్రస్తుతం ఇది వర్తిస్తుందేమో ! కృష్ణానది వరద భాధితులకు చేస్తున్న సహాయాన్ని కూడా వ్యాపారంగా మార్చిన కొంతమంది స్వార్థపరుల విశ్వరూపం చూస్తుంటే నిజంగానే వయోబేధం లేకుండా వారందర్నీ ఊరు పోమ్మంటోందేమోననే అనుమానం వస్తోంది. వరద భీభత్సంలో చిక్కుకుని ప్రాణాలని రక్షించుకోవాలనే ఆత్రుతలో ఉన్న అభాగ్యుల్ని బ్లాకు మెయిల్ చేసి డబ్బు వసూలుకి దిగే వాళ్ళని ఏమనాలి ? సమస్తం పోగొట్టుకుని కట్టుబట్టలతో మిగిలిన వాళ్ల దగ్గర బియ్యం వగైరా సరుకుల ధరల్ని భారీగా పెంచి వసూలుచేసేవారినేమనాలి ? ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా రాజకీయాలు మాట్లాడే వాళ్ళనేమనాలి ? శవాల్ని పీక్కుతినే రాబందులకైనా ఒక నీతి ఉంటుందేమో ! తమకి ఆకలి వేసినప్పుడు మాత్రమే అది కూడా ఆచేతనమైపోయిన శవాల్ని మాత్రమే తింటాయి ? కానీ వీళ్ళు బ్రతికుండగానే పీక్కు తింటున్నారు, అది కూడా నిస్సహాయ స్థితిలో ఉన్నపుడు !! సమాజంలో మానవత్వం చచ్సిపోయిందా ? దీనికి పరిష్కారం లేదా ? మళ్ళీ మానవత్వాన్ని పునరుద్ధిరించలేమా ? ఇది అర్థం లేని ఆలోచనేమో ? ఏమో ! తెలియదు.
మరో ప్రక్క ఆపన్నులను అన్నివిధాలుగా ఆదుకునేందుకు ముందుకొస్తున్న వాళ్ళను చూస్తుంటే మానవత్వం ఇంకా సజీవంగానే ఉందని అనిపిస్తోంది. అయితే ఇక్కడో కొత్త పరిణామం చోటుచేసుకోవడం విశేషం. గతంలో ఇలాంటి ఉపద్రవాలు జరిగినపుడు విరాళాలన్నీ ప్రభుత్వ సహాయ నిధికే పంపేవారు. కానీ ఇప్పుడు ప్రైవేటు టీవీ చానల్స్ కి అందించడమే కొత్త పరిణామం. దీనికి కారణాలేమిటి ? ప్రభుత్వం మీద, ప్రభుత్వ యంత్రాంగం మీద విశ్వాసం తగ్గిపోయిందా ? లేక పబ్లిసిటీ వస్తుందనా ? ఏదైనా కావచ్చు. కారణం ఏదైనా ప్రజల్లో మానవత్వాన్ని మేల్కొల్పడంలో మీడియా ప్రభావం బాగా కనిపిస్తోంది. విరాళాలకోసం పభుత్వ మిచ్చిన పిలుపుకంటే చానల్స్ పిలుపుకే ఎక్కువ స్పందన వచ్చినట్లు కనిపిస్తోంది. అలాగే చానల్స్ మధ్య పోటీలో అక్కడక్కడా అత్యుత్సాహం కనబడినా మొత్తం మీద భాధ్యతాయుతంగానే ప్రవర్తించినట్లు కనిపిస్తుంది. దీన్నిబట్టి చూస్తే మనలో మానవత్వానికి వచ్చిన లోటేమీ లేదనీ వ్యవస్థలోని లోపాలే అప్పుడప్పుడు దాన్ని తాత్కాలికంగా అణిచివేస్తాయని అనిపిస్తోంది. అడుగడునా పేరుకుపోయిన అవినీతి కబంధ హస్తాల్లోంచి మానవత్వం బయిటపడేటట్లు చెయ్యగలిగితే బాగుంటుంది. పిల్లి మెడలో గంట ఎవరు కడతారు ? ఇంకెవరు ? మనమే !! పని చెయ్యడానికి పైనుంచి ఎవరూ దిగి రారు. మనమే పని చెయ్యాలి. బహుశా ఇది పేరాశ కావచ్చు. ఎందుకంటే ఎవరైనా మొదలు పెట్టాక మనం కలవచ్చులే అనేది సహజంగా మానవనైజం. దేనికైనా మొదలు కావాలి. ఎవరో ఒకరు మొదలు పెట్టాలి. ఒకరు మనమే ఎందుకు కాకూడదు అని అందరూ ఆలోచించడం ప్రారంభించాలి అన్నిటికంటే ఇలాంటి అక్రమాలను, అవినీతిని ఎదిరించి ఎదుర్కొవాలనుకునే వారిని నిరాశపరచడం, ఎగతాళి చెయ్యడం లాంటివి చెయ్యకుండా ఉంటే చాలు. లేకపోతే వయసులో ఉన్నా అన్ని శక్తిసామర్త్యాలున్నా మనల్ని ఊరు పొమ్మంటుంది .

Sunday, October 4, 2009

జల ప్రళయ సుందర దృశ్యం

కృష్ణవేణి కరాళ నృత్యం చేస్తోంది. భారీగా ఆస్తి, ప్రాణ నష్టాలు చవిచూసిన కర్నూలు ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. గడగడలాడించిన శ్రీశైలం కొంత ఉపశమనాన్ని కలిగిస్తోంది. నాగార్జున సాగర్ దగ్గర ఉధృతి ఇంకా తగ్గలేదు. కృష్ణా, గుంటూరు జిల్లాల్ని ప్రకాశం బారేజి వణికిస్తోంది. అయిదు జిల్లాల ప్రజలు కృష్ణమ్మ ఆగ్రహాన్ని చవిచూస్తున్నారు. ఎప్పుడూ ప్రశాంతంగా, గంభీరంగా ప్రవహించే కృష్ణలో దాగునిఉన్న ఉగ్రరూపాన్ని ప్రాంత ప్రజలు ఇప్పుడు చూస్తున్నారు. దాని ఫలితాల్నివిషాదభరిత పరిస్థితుల్లో అనుభవిస్తున్నారు. రాష్ట్ర విద్యుత్తు అవసరాలలో సింహ భాగం తీరుస్తున్న విజయవాడ థెర్మల్ పవర్ స్టేషన్ నీట మునిగే ప్రమాదంలో ఉంది. ఇదే జరిగితే రాష్ట్రంలో చాలా భాగం అంధకారంలో మునిగిపోతుంది. తెల్లవారేలోగా ఏం జరుగుతుందో ఉహించలేని పరిస్థితి.
ప్రస్తుతం కృష్ణమ్మ పరవళ్ళలో విలయమే కనిపిస్తోంది. భయానక, భీభత్సాలే కానీ ఇందులో అందమైన, సుందరమైన దృశ్యం ఎలా కనబడుతుంది ?
కానీ ఒక తెలుగు టీవీ ఛానల్ కి నాగార్జున సాగర్ లో ఉప్పొంగుతున్న కృష్ణ లో సుందర దృశ్యమే కనబడుతోంది. కృష్ణ విలయ తాండవాన్ని చూడడానికి వచ్చిన సందర్శకులతో నాగార్జున సాగర్ కిక్కిరిసిపోయింది. అక్కడ రహదారుల్లో ట్రాఫిక్ జామ్ అయింది. ఇది సహజంగానే అక్కడ డ్యాము రక్షణ విధుల్లో తలమునకలైన సిబ్బందికి ఆటంకం కలిగిస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో వారి విధులకు ఆటంకం కలిగిస్తే జరిగే నష్టం గురించి మీడియాలో ఉన్నవారు ఉహించలేరా ? విషాదకర దృశ్యాన్ని సుందర దృశ్యంగా వర్ణించడం ప్రజల్ని ప్రభావితం చేయగలిగే శక్తి ఉన్న మీడియా వారికి సబబేనా ? వర్ణన వల్ల మరింతమందికి ఆసక్తి కలిగి సందర్శన కోసం బయిల్దేరి తాము ప్రమాదంలో చిక్కుకోవడమే కాక పరోక్షంగా భయంకరమైన విపత్తుకి కారణం కారా ? ఛానల్ వారు తమ పాండిత్య ప్రదర్శనలో చూపిస్తున్న ఉత్సాహం, బాధితులకు సహాయం అందించే దిశగా ప్రజల్ని ప్రేరేపించేదిగా ఉండాలిగానీ మరింతమంది బాధితుల్ని పెంచేదిగా మాత్రం ఉండకూడదు. నిజానికి విపత్కర పరిస్థితిలో మీడియా పోషిస్తున్న పాత్ర అభినందనీయంగానే ఉంది. అందులో సందేహం లేదు. అయితే అత్యుత్సాహం పనికిరాదు. ప్రజల్ని సరైన దిశకు మరల్చే ప్రయత్నం చెయ్యాలి. ఇలాంటివి చాలా చిన్న విషయాలుగా కనబడినా ప్రజల్లో మీడియా కలిగించే ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. అందుకే మీడియా సంయమనం పాటించాలి. తప్పదు. సమాజం పట్ల తమ బాధ్య గుర్తించి తమ ప్రతి రిపోర్ట్ ను జాగ్రత్తగా ఆలోచించి ఇవ్వవలసి వుంటుంది.