Thursday, August 20, 2009

తెలుగు భాషను మనం పరిరక్షించుకోగలమా ?


ఇటీవలికాలంలో మనలో భాషాభిమానం బాగా పెరిగింది. ముఖ్యంగా అంతర్జాలంలో తెలుగు భాషాభిమానులు బాగా పాల్గోవటం ఆనందదాయకం. అయితే తెలుగు భాషను మనం మాత్రమే మాట్లాడడం, చదవడం, రాయడం కాదు. ఇప్పుడు ఇంగ్లీష్ ప్రపంచ భాష ఎలా అయిందో, ప్రపంచమంతా తెలుగు భాషావ్యాప్తికి తెలుగువాళ్ళందరూ చిత్తశుద్ధితో కృషి చెయ్యాలి. బహుశా ఇది అత్యాశేమో కదా ! అయినా ఫర్వాలేదు. ప్రయత్నం చేద్దాం !! తెలుగు సాహిత్యాన్నీ , సంస్కృతిని , మహానీయులగురించి ..... ఇలా భాషకు సంబంధించిన అన్ని విషయాల గురించి ప్రపంచ భాషలన్నిటిలో ముఖ్యంగా ఇంగ్లీషులో అనువాదాలు, రచనలు వచ్చేటట్లు కృషి చెయ్యాలి. సర్ సి.పి. బ్రౌన్ తెలుగుభాషావ్యాప్తికి చేసిన కృషిని స్పూర్తిగా తీసుకుంటే ఇది అత్యాశ కాదేమో ! మరి దీనికి, రక్షించుకోవటానికి సంబంధం ఏమిటంటారా ? బ్రౌన్ రచనలు, పరిష్కరణలే దీనికి సమాధానం. మన భాష నాలుగుగోడల మధ్య మిగిలిపోకుండా చూసుకోగలిగితే దాన్ని రక్షించడం సులువు అవుతుంది. దీనికి రాష్ట్రేతర, దేశేతర తెలుగువాళ్ళందరూ నడుం బిగించాలి. ఆయా రాష్ట్రాల్లో, దేశాల్లో మన పండగలకు, ఉత్సవాలకు అక్కడివారిని పాల్గొనేటట్లు చెయ్యడంతోబాటు మన సంస్కృతిని వారికి అర్థమయ్యేటట్లు చేస్తే వారి ద్వారా ఆయా ప్రాంతాల్లో తెలుగు వైభవం వ్యాప్తి చెందుతుంది. దీనికి ప్రత్యెక కార్యక్రమాలు రూపొందించాలి. దశాబ్దాలుగా భాషోద్యమాలు నడుస్తున్నాయి. ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడుతూనే ఉన్నాయి. కానీ ఫలితం శూన్యం. ఇకనైనా ప్రభుత్వాలమీద, రాజకీయనాయకులమీద ఆధారపడడం మానేసి భాషాభిమానులందరూ క్రియాశీలక కార్యక్రమాలతో ముందుకు వెళ్ళడమే దీనికి సరైన పరిష్కారం. రాష్ట్రాన్ని వాళ్లకు వదిలేసి ముందు రచ్చ గెలుద్దాం. ఆలోచించండి.

3 comments:

  1. నాకూ ఇవే కాదుగానీ, ఇలాంటి భావాలున్నాయి. అంతర్జాలంలో ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు.నేనూ ఈ విషయం గురించి ఆలోచిస్తున్నాను.బోళ్డు రాశాను. నా బ్లాగులో తెలుగు ట్యాగు కొట్టి, ఓపికుంటే చదవండి.

    ఒక్క విషయంలో ఆసక్తిగా ఉంది :
    >>మన సంస్కృతిని వారికి అర్థమయ్యేటట్లు చేస్తే వారి ద్వారా ఆయా ప్రాంతాల్లో తెలుగు వైభవం వ్యాప్తి చెందుతుంది.

    ఈ మనదైన తెలుగు సంస్కృతి ఏమిటో నాకు తెలీదు.చెప్పగలరా? అంటే వేటిని "తెలుగు సంస్కృతి"గా ఆయా ప్రాంతాల్లో తెలుగు వైభవం వ్యాప్తికి ప్రచారించాలి? (అదే ప్రచారం చెయ్యాలి? :) )

    ReplyDelete
  2. మన తెలుగు కవులు వ్రాసిన రామాయణ, మహాభారత, భాగవత గ్రంథాలను బ్లాగుల ద్వారా అందరికీ అర్థం అయ్యేరీతిలో వివరణలిస్తూ వ్రాస్తూ పోతుంటే కాలక్రమేణా వాటిద్వారా అందరికి మన తెలుగు భాషా, సంస్కృతి, సంప్రదాయాలు అవగత మవుతాయనేది నా అభిప్రాయం. ఇతర మార్గాలను కూడా సూచించండి.

    ReplyDelete
  3. మన పండగలు లో ఇక్కడి వారు పాల్గొనే టట్లు చేస్తే (ఇక్కడి వారంటే బయటి దేశాలలో తెలుగు వాళ్ళనేనా మీ అర్ధం ??) లేదా రామాయణం చెపితే తెలుగు భాష ఎలా బాగుంటుంది అండి...? దానికి దీనికి లింక్ అర్ధం కాలా నాకు మన భాష అంటే ఇష్టం.. అందుకే అడుగుతున్నా.

    ReplyDelete