శాస్త్రీయ సంగీతమంటే టీవీ చానళ్ళకు అంటరానిదైపోయిన కాలంలో ధైర్యం చేసి శాస్త్రీయ సంగీత కార్యక్రమం ' నాదవినోదం ' ప్రారంభించి విజయవంతంగా నడుపుతోంది ' మా టీవీ ' . ఎందరో వర్థమాన కళాకారులకు వేదికనిస్తూ, లబ్దప్రతిష్టులైన కళాకారుల సంగీత విన్యాసాలను కూడా అందిస్తోంది. మన సంస్కృతి లోని కళల వైశిష్ట్యాన్ని ప్రపంచమంతటా చాటుతున్న 'మా టీవీ' కి జేజేలు. అసలు ఈ ధైర్యం చెయ్యడమే గొప్ప. సాంప్రదాయానికి కూడా కమర్షియల్ సొగసులు అద్దింది. దేన్నైనా కమర్షియలైజ్ చెయ్యడానికి సాంప్రదాయాన్ని కించపరచనక్కర్లేదని నిరూపించింది. అర్థం పర్థం లేని సంగీతం, నృత్యం పదే పదే ప్రసారం చేస్తూ ప్రేక్షకుల చెవుల్లో తుప్పునీ, కళ్ళల్లో కారాన్నీ నింపుతున్న టీవీ చానళ్ళను సవాల్ చేస్తూ మన చెవులు, కళ్ళూ ఆరోగ్యంగా వుండేటట్లు చేసే కార్యక్రమం చేపట్టినందుకు అభినందించాల్సిందే !
'నాదవినోదం' మహోత్సవం పేరిట ప్రసారం చేస్తున్న ఎపిసోడ్లలో ఒక కొత్త సాంప్రదాయానికి తెరతీసింది ' మా టీవీ ' . వేదిక మీద సంగీత కళాకారుల విన్యాసం సాగుతుండగా వారి పాట / కీర్తన / కంపోజిషన్ కు అనుగుణంగా అప్పటికప్పుడు ఆ వేదిక మీదే ఒక చిత్రకారుడు తైలవర్ణ చిత్రాన్ని రచించడమనే కొత్త ప్రక్రియకు శ్రీకారం పలికింది ' మా టీవీ '. నిన్న ( జూన్ 24 వ తేదీన ) జరిగిన ఎపిసోడ్ లో మాండలిన్ పై వాయించిన ' మహా గణపతిం ' కీర్తనకు గణపతి పెయింటింగ్, ప్రముఖ మృదంగ విద్వాంసులు యెల్లా వెంకటేశ్వర రావు గారు అద్భుతంగా స్వరపరచిన ప్రాక్పశ్చిమ వాయిద్య విన్యాసానికి, ప్రముఖ సంగీత దర్శకుడు కోటి తన బృందంతో ఆలపించిన రెండు పాశ్చాత్య గీతాలకు అనుగుణంగా ఆయా పాటలు / కంపోజిషన్ లు పూర్తయ్యే లోపు పెయింటింగ్ వేయడం జరిగింది.
ఈ రోజు ( జూన్ 25 వ తేదీన ) సాయింత్రం గం. 07-00 లకు ( భారత కాలమానం ప్రకారం ) ప్రసారం కానున్న 'నాదవినోదం ' ఎపిసోడ్ లో కూడా ఇదే ప్రక్రియ కొనసాగుతుంది. ఈ ఎపిసోడ్ ను మీరందరూ తిలకించి మీ అభిప్రాయాలను తెలియపరిస్తే ఆరోగ్య కరమైన కార్యక్రమాలు మన ఇళ్ళల్లో చూడడానికి ప్రోత్సహించినట్లవుతుంది.
ఈ కార్యక్రమంలో వేదికపైన సంగీత విన్యాసంతో బాటు అప్పటికప్పుడు తన కుంచె విలాసాన్ని ప్రదర్శించిన చిత్రకారుడు కూచి సాయిశంకర్. ఈ వైభవాన్ని మీరూ తిలకించండి.
ఈ రోజు సాయింత్రం గం.07-00 లకు ' మా టీవీ ' లో .........
Vol. No. 01 Pub. No. 331
